22, జనవరి 2022, శనివారం

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు

 


సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు

శ్రీలలిత కృప వలన ఈ బృహత్తర యజ్ఞం ఆరునెలల పాటు నిర్విఘ్నంగా, దిగ్విజయంగా, నిరాఘాటంగా సాగింది. ఈ రచనా క్రమంలో, సహకరించిన ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు చెప్పుకుందామని ఇది రాస్తున్నాను. 

మా చిన్నప్పుడు మేము తెనాలిలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు, శ్రీ శ్రీరామకృష్ణశర్మ గారు,  అక్కడ తాలూకా జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉండేవారు. ఆరోజుల్లో, మా కాలేజీకి, దాదాపుగా ప్రతి సంవత్సరం కంచి పీఠం, శృంగేరి పీఠం, కుర్తాళం పీఠం, గాయత్రీపీఠం వారు వచ్చేవారు. ఆ స్వామివార్లు పీఠం పెట్టి, పూజాదికాలు నిర్వహించి రోజూ సాయంత్రాలు, స్కూల్లో ప్రవచనాలు చెప్పేవారు. చిన్నప్పుడు నేను ఏడు, ఎనిమిది క్లాసుల్లో చదువుకునే రోజులనుంచీ కూడా, ఈ ప్రవచనాలు దాదాపు రోజూ వినేదాన్ని. మానాన్న ఒక నోట్ బుక్ లో 'నచ్చిన పాయింట్లన్నీ రాసుకో' అని చెప్పేవాడు. నేను ఒక నోట్ బుక్, పెన్ను తీసుకెళ్లి రోజూ రాసుకునేదాన్ని. ఆ బుక్ ఇప్పుడు ఏమయ్యిందో తెలియదు. బహుశా, మా నాన్నగారి ట్రాన్సఫర్లలో ఎక్కడో, ఏ వూళ్ళోనో, వదిలేసి ఉంటాం. 

ఆ రోజుల్లో శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి చెప్పే విషయాలన్నీ మైండ్ లో దూరిపోయాయి. కాకపోతే, ఆ చిన్న వయసులో, వాటి విలువ అంతగా తెలియలేదు నాకు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞాపకశక్తి వలన, అవి అన్నీ మొదట్లో పాసివ్ మెమోరీలో ఉండిపోయినా, రానురానూ యాక్టీవ్ మెమోరీలోకి వచ్చేశాయి. ఆ విధంగా నాకు లలితాదేవిని పరిచయం చేసిన తొలిగురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు. స్వామివారికి భక్తి శ్రద్దలతో పాదాభివందనాలు. అప్పుడు వారికి ప్రత్యక్షంగా పాదనమస్కారం చేసినా దాని విలువ నాకు తెలియదు, అందరూ పెడుతున్నారు, నేనూ పెట్టాను, అంతే. ఇప్పుడు పరోక్షంగా చేస్తున్నప్పటికీ, దీని విలువ తెలుసు. అదీ తేడా. 

ఆ రోజుల్లోనే మా స్కూల్లో ఒక సంవత్సరం సాధు పరిషత్ వారి అఖిల భారతీయ సదస్సు జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచీ వందలాది సాధువులు వచ్చారు. వారిలో ఒకరు శ్రీ సచ్చిదానంద సరస్వతి. వీరికి తెనాలి నచ్చి, చాలకాలం పాటు తెనాలిలో, మాఇంట్లోనే ఉండిపోయారు. మా అమ్మ, లీలాకుమారి, ఉత్తమ గృహిణి, వీరికీ, వీరి అనుయాయులకీ కూడా మడి కట్టుకుని, భోజనాలు వండి పెడుతూ ఉండేది. సచ్చిదానందసరస్వతీస్వామి కేరళీయులు. ఇంగ్లీష్ భాష మాత్రమే మాకూ వారికీ అనుసంధాన భాష. ఆయనను ఇంగ్లీష్ స్వాములవారు అనేవాళ్ళం. మా పిల్లలందరినీ కూర్చోపెట్టి, సరస్వతీ మంత్రం చెప్పి, 'రోజూ చెప్పుకోండి, చదువు బాగా వస్తుంది' అనేవారు. నాకు ప్రత్యేకంగా పిల్లలందరికీ చెప్పిన మంత్రం కాకుండా బీజాక్షరాలతో వుండే సరస్వతీ మంత్రం, రామమంత్రం చెప్పారు. అవి ఇప్పటికీ చెప్పుకుంటూనే వుంటాను. ఆ సరస్వతీదేవి కటాక్షం వలననే, నేను ఈరోజు ఈ శ్రీలలితావిజయం రాయగలిగాను అనుకుంటాను. పైగా ఈ ఇంగ్లీష్ స్వామీజీ, రోజూ నాకు విధిగా పది భగవద్గీత శ్లోకాలు తాత్పర్యంతో అప్పచెప్పాలని కండిషన్ పెట్టారు. దాంతో రోజూ  తప్పనిసరిగా ఆ వయసులోనే శ్రీమద్భగవద్గీత అలవాటయింది. అప్పట్లో 'రోజూ ఇదేం బాధ' అనుకునేదాన్ని. ఇప్పుడు వాటి విలువ తెలుస్తోంది. ఆ ఇంగ్లీష్ స్వామీజీకి మనసారా వందనాలు.

తెనాలిలో ఆ స్కూల్లో మాకు సిలబస్ లో, సంస్కృతం కూడా ఉండేది. పదవ తరగతి వరకూ, నేను, నా పెద్దచెల్లెలు భారతలక్ష్మి సంస్కృతం చదువుకున్నాం. ఇది కాక, సాయంత్రాలు స్కూల్ మూసేసాక, సంస్కృతంలో, ఓ ఎక్సట్రా క్లాస్ ఉండేది. దాన్లో రఘువంశం వంటి కావ్యాలు చెప్పించేవారు. ఈ ఎక్సట్రా క్లాస్ మాత్రం ఆసక్తి వున్నవారికి మాత్రమే. నాకూ, మా భారతికీ 
ప్రిన్సిపాల్ గారి పిల్లలమవటం చేత ఆ ఆప్షన్ ఉండేది కాదు. రోజూ ఇంకో గంట ఎక్కువ వుండి మరీ నేర్చుకునే వాళ్ళం. కంచి స్వామీ, ఆయన ప్రవచనాలు, ఇతర పీఠాధిపతుల ప్రవచనాలూ అవీ వేరే, అవి అదనం. ఆరోజుల్లోనే మా సంస్కృతం టీచర్ మారారు. రెండో ఆయన మొదటి టీచర్ కన్నా ఘటికుడు, కఠినుడు. క్లాస్ లో అంతా సంస్కృతం లోనే రాయాలనీ, చెప్పాలనీ, మాట్లాడాలనీ నిబంధనలు కూడా పెట్టాడు. ఏం చేస్తాం, అలాగే మాట్లాడేవాళ్ళం, 'వినేవాళ్లకు కదా ఇబ్బంది, మనదేం పోయిందీ', అని. అప్పుడు ఏం అనుకున్నా, ఈ నాటికీ, నా సంస్కృత భాషా జ్ఞానానికి పునాదిరాళ్ళు వాళ్ళే. వాళ్లందరికీ శత సహస్ర వందనాలు. 

ఇది కాక తెలుగు క్లాస్ వేరే. చిన్నక్లాసుల్లో తెలియలేదు కానీ, ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి తెలుగుపై ఇష్టం, ఆసక్తీ పెరిగాయి. దొరికిన ప్రతి పుస్తకం చదివేదాన్ని. లైబ్రరీలో, స్టూడెంట్లకి సాధారణంగా అన్ని రిఫరెన్స్ పుస్తకాలూ ఇవ్వరు. నేను మా నాన్న పేరుతో తీసుకుని మరీ  చదువుకునేదాన్ని. అసలు చదువులో ఎబోవ్ యావరేజ్, ఇటువంటి చదువులో నెంబర్ 1. అందరూ కోప్పడేవాళ్లు, తిట్టేవాళ్ళు. 'అబ్బే, నాకేం తగలలా', తోసేసుకుని తిరిగేదాన్ని. మొత్తానికి ఈ సంస్కృతం, తెలుగు టీచర్ల పుణ్యమా అని కాస్త ఉభయభాషాజ్ఞానం అంటింది. ఆ టీచర్లందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. 

ఈ మధ్యకాలంలో, అంటే 2011లో, కుర్తాళం పీఠాధిపతి, శ్రీసిద్ధేశ్వరానందభారతి గారి వద్దకు నా అవసరం కొద్దీ, మా పెదనాన్నగారి కొడుకు, కోడలు, చిన్నన్నయ్య, చిన్న వదినలతో వెళ్ళటం జరిగింది. మా వదిన, సుశీలాదేవి స్వామివారి శిష్యురాలు. కానీ నా అదృష్టం కొద్దీ, వారు నాకు మంత్రం ఇచ్చి, నన్ను కూడా శిష్యురాలిని చేసుకున్నారు. అప్పటినుంచీ వారి ప్రసంగాలు వినటం బాగా అలవాటు అయింది. అలాగని నేనేదో స్వామివారి వెన్నంటి తిరిగానని కాదు. వారి గ్రంధాలు చదవటం, వారి ప్రసంగాలు యు ట్యూబ్ లో వినడం, కొన్నేళ్ల పాటు చేసాను. ఆయన మహా జ్ఞాని, సిద్ధుడు, ఉపాసకుడు, యంత్ర, మంత్ర, తంత్ర శాస్త్రాల్లో మహా పండితుడు. భూమ్మీద నడయాడే మహాత్ముడు. వారి పరిచయం కలగటం కూడా నాలో ఒక మార్పుకి దారి తీసింది. గురువుగారికి శతకోటి ప్రణామాలు. 

ఒకసారి మా పెద్ద మామయ్యగారు, శ్రీ దాలిపర్తి సత్యనారాయణగారు నాకు గీతామకరందం ఇచ్చి చదవమన్నారు. అది చదువుతూ అలవాటుగా, నచ్చిన శ్లోకాలని ఒక డైరీలో రాసుకునేదాన్ని. 
భగవద్గీతతో నా మలి ప్రయాణం అది. హైదరాబాద్ వచ్చాక, మా ఇంకో మామయ్యగారు శ్రీ ముళ్ళపూడి సుబ్బారావు గారు, నాకు లలితాసహస్రనామస్తోత్రం పుస్తకం ఇచ్చి రోజూ పారాయణ చేసుకోమన్నారు. అప్పటికే, నాకు విష్ణుసహస్రనామస్తోత్రం పారాయణం చేయటం అలవాటుగా వుండేది. దీనితో, బస్సులో రోజూ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక స్తోత్రం, తిరిగి వచ్చేటప్పుడు ఒక స్తోత్రం చదవడం నిత్యం అలవాటయిపోయింది. సెలవల్లో పారాయణలు లేవు. వీరిద్దరికీ నా  నమస్సుమాంజలులు. 

ఉద్యోగాల నుంచి మావారు, నేను రిటైర్ అయిన తరువాత, కొన్నేళ్లపాటు వరుసగా ప్రతినెలా ఏదో ఓ ప్రాంతానికి టూర్లు చేసేవాళ్ళం. దాదాపుగా భారతదేశం మొత్తం తిరిగాం. నేపాల్, టిబెట్, శ్రీలంక కూడా వెళ్ళాం. ఈ సందర్భంగా అన్ని శక్తి క్షేత్రాలు, శివక్షేత్రాలు, విష్ణుక్షేత్రాలు, సూర్య, కార్తికేయ, గణపతి, హనుమ క్షేత్రాలు, చారిత్రాత్మక ప్రధాన క్షేత్రాలు, సరదాగా తిరిగే విహారయాత్రా ప్రదేశాలూ, ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ, ప్రధాన పర్యాటక ప్రాంత్రాలన్నీ దర్శించుకున్నాం. ఎప్పుడూ లోపల ఇంకా ఏదో చేయాలని ఆరాటంగా ఉండేది. ప్రయాణోపనిషత్ అని పేరు పెట్టి, మేము తిరిగిన కొన్ని క్షేత్రాల పర్యటనా విశేషాలు రాసాను. అవి ఇంకా చాలా రాయాలి. సుమారు మేము తిరిగిన వాటిలో ఓ ఇరవై శాతం వరకు ఇప్పటికి రాసి ఉంటా. మిగిలిన ఎనభైశాతం ఎప్పుడు రాస్తానో నాకే తెలియదు. కానీ రాయాలని మాత్రం మనసులో వుంది. ఇంతవరకూ రాసిన క్షేత్రాల గురించి చదవాలనే ఆసక్తి వున్నవారు 
www.moddeep2.blogspot.com లో అవి చదువుకోవచ్చు. 

సుమారు మూడు నాలుగేళ్ల క్రితం చాలా యాదృచ్చికంగా భాస్కరరాయలవారు రాసిన సౌభాగ్య భాస్కర భాష్యం పుస్తకం దొరికింది. నేను ఈ పుస్తకం అంతకు ముందే మా సువర్చల అత్తయ్య దగ్గర చూసాను, చదివాను. కానీ ఆ ప్రతి చాలా జీర్ణావస్థలో వుంది. మంచి కాపీ దొరకలేదు. చివరకు డా. నోరి భోగీశ్వరశర్మ సోమయాజి గారు ఆ పుస్తకాన్ని పునః ప్రచురించి మాలాంటి వారికి ఎంతో 
ఆనందాన్నిచ్చారు. ఆ పుస్తకం కొనుక్కుని భాస్కరరాయ భాష్యం తీరికగా చదివాను. అయినా నేనే రాయాలని లోపల్లోపల అనిపించినా, బద్ధకం వలన రచన మొదలుపెట్టలేదు. తిరిగి భాస్కరరాయ భాష్యం నాలాంటి వారికి అందుబాటు లోకి తెచ్చిన బ్రహ్మశ్రీ నోరి భోగీశ్వరశర్మ సోమయాజి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.  

నేను రాస్తున్న శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం లోని సహస్రనామాలకూ సరళమైన భాషలో 
రాస్తున్న ఈ  వ్యాఖ్యానం అనే భగవత్ కార్యంలో నాతో పాటు పయనించినవారు ప్రధానంగా 
ముగ్గురు. ఆ ముగ్గురికీ నా కృతజ్ఞతలు.  

ఒకరు నిరంతరం నాతో  ఉంటూ, అన్నింటా సహకరిస్తూ, నేను రాసిన దానిని ప్రధమ శ్రోతగా వింటూ, నా లాప్ టాప్ ఇబ్బంది పెట్టినప్పుడు, దానిని సరిచేయిస్తూ, నన్ను రాయమని నిరంతరం ప్రోత్సహిస్తూ వుండే, మావారు శ్రీ భట్టిప్రోలు రమేష్ కుమార్ గారు. వారికి నా పాద నమస్కారాలు. వీరి సహకారం లేనిదే ఈ పని అయ్యేదే కాదు. 

ఇంకొకరు, 'నీకే ఉడుత సాయం కావాలన్నా చెప్పు, నేనున్నా',  అంటూ, నాకు అవసరమైనప్పుడల్లా టెక్నికల్ హెల్ప్ వెంటనే చేసే, మా సరోజినీ అత్తయ్య కూతురు. నేను నా 'బంగారు ఉడుత' అని ముద్దుపేరు పెట్టుకున్న, నా టెక్నికల్ హెల్ప్, సౌభాగ్యవతి లక్ష్మీరాధిక. నా చిన్నారి చెల్లి, 
రాధికకు కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు.  

మూడవవారు, మా సువర్చల అత్తయ్య. ఈ అత్తయ్య మా మేనమామ శ్రీ నండూరి పార్థసారథి గారి భార్య. మాకు చిన్నప్పటి నుంచీ బాగా అలవాటు. తాను ఈ విషయాలన్నింటిలో తన చిన్నప్పటి నుంచీ ఎంతో విశేషంగా కృషి చేసి, సాధన చేసిన పండితురాలు. అత్తయ్య పాండిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. మావారు నా ప్రధమ శ్రోత అయితే, అత్తయ్య నా ద్వితీయ శ్రోత. నేను రాసినదంతా ఓపిగ్గా వినేది. ఈ ఆరు నెలల్లో మామధ్య ఎన్ని కాల్స్ నడిచాయో, అవి ఎన్ని గంటలు సాగాయో. ఇంతకూ ముందు కూడా ఏదైనా సందేహం వస్తే, అత్తయ్య తో టెలిఫోన్ సంభాషణలు సాగించటం అలవాటే. ఇద్దరిలో ఎవరిదో ఒకరి ఫోన్ డెడ్ అయ్యేదాకా మాట్లాడుకునే వాళ్ళం. మా మామయ్య కూడా మీరు మాట్లాడుకుంటే అవి గంటలు గంటలు సాగుతాయి 
అనేవాడు. ఆ మా చర్చలన్నీ నేడు ఈ పుస్తకం రావడానికి ఏంటో దోహదం చేశాయి.  అత్తయ్యకి నాలోని మథన తెలుసు, నాకు అత్తయ్య విద్వత్తూ, ఉపాసనా తెలుసు. నేను రాసిన ప్రతిదీ అత్తయ్య విని ఓకే అన్నాకే పోస్ట్ చేసేదాన్ని. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టు, అత్తయ్య విని ఓకే అంటే, అదో తృప్తి, అత్తయ్య ఊ అన్నది కదా అని. నాకు ఎంతో ప్రేరణా, ప్రోత్సాహం, ధైర్యం  ఇచ్చిన అత్తయ్యకి నా కోటి కోటి ప్రణామాలు. లలితాదేవే అత్తయ్య రూపంలో నా వెనుక వుండి ఈ రచన చేయించి ఉంటుంది. 

ఇలా సాగింది ఈ లలితా సహస్ర నామ స్తోత్ర సరళ వ్యాఖ్యానం ప్రయాణం. మధ్యలో ఎందరో, చదివి చాలా బాగుందని అభినందించి ప్రోత్సహించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. 
వారం రోజులనుంచీ తమ అమూల్యమైన అనుభవాలు, అభిప్రాయాలు వెలిబుచ్చుతూ అభిమానం ప్రకటించిన వారందరికీ నా మనఃపూర్వక నమస్సులు. 
ఇందరి దీవెనలు, సహకారం నాతో ఉన్నందుకే నేను ఈ శ్రీలలితావిజయం రాయగలిగాను. 
ఇది ముమ్మాటికీ సత్యం. అందుకే, వారందరికీ మనసారా ...  



ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 

🙏🙏🙏



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

          

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి