విజ్ఞాన కలనా, కల్యా, విదగ్ధా, బైందవాసనా ॥ 167 ॥
898. వీరగోష్ఠీప్రియా
ఓం శ్రీ వీరగోష్ఠీప్రియాయై నమః
899. వీరా
వీరా అంటే వీరురాలు అని అర్ధం. లలితాపరమేశ్వరి కన్నా వీరులెవరు.
దేవాది దేవులందరినీ విశ్రాంతి తీసుకోమని, తన నుంచే కోట్లాది చతురంగ సేనను సృష్టించి
అనేక రూపాలతో, అనేక దుష్ట శక్తులతో పోరాడి, వారిని వధించింది ఒక్క శ్రీలలితే కదా.
మహిషుడు, భండుడు, శుంభుడు, నిశుంభుడు, చండుడు, ముండుడు, రక్తబీజుడు వంటి
అసురులను చంపినది వీరురాలైన చండికయే కదా.
వీరుడైన పతిని కలిగినది వీరపత్ని. వీరుడైన పుత్రుణ్ణి కలిగినది వీరమాత.
కనుక వీరా అనే నామం తల్లులకు, భార్యలకు కూడా వర్తిస్తుంది.
శిష్టుల రక్షణకై, దుష్టులను వీరత్వంతో చెండాడే, ఆ వీరా కు వందనం.
ఓం శ్రీ వీరాయై నమః
900. నైష్కర్మ్యా
నైష్కర్మ్యా అంటే ఏ కర్మా లేనిది, అంటనిది అని భావం.
పాప, పుణ్య కర్మము లేవీ లేనిది పరమేశ్వరి అని భావం.
వేద విహితములైన కర్మ సంబంధములు లేనిది మహేశ్వరి.
యోగసూత్రములలో, "క్లేశములు, కర్మవిపాకములు, ఆశయములు ఏవీ అంటని పురుషుడే
ఈశ్వరుడు", అని చెప్పారు. కనుక ఈశ్వరునికి ఎటువంటి కర్మ సంబంధమూ లేదు.
అందుకే ఈ నామంలో ఆ లలితాపరమేశ్వరిని నైష్కర్మ్యా అంటున్నాం.
ఏ దుఃఖములూ, పాప, పుణ్యములూ లేని, ఆ నైష్కర్మ్య కు వందనం.
ఓం శ్రీ నైష్కర్మ్యాయై నమః
ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని
శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల
తొమ్మిదవ వంద నామాల వివరణ
ఓం శ్రీ నాదరూపిణ్యై నమః
902. విజ్ఞాన కలనా
విజ్ఞానమంటే బ్రహ్మ సాక్షాత్కారము. పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు.
జ్ఞానము నిచ్చే వేదములు, ఉపనిషత్తులు ఆ తల్లి నుంచే వచ్చాయి.
బ్రహ్మ ద్వారా వేదాలను అందించింది శ్రీమాత. వేదవిజ్ఞానాన్ని ఇచ్చిన శ్రీమాత విజ్ఞానస్వరూపం.
కలన అంటే స్వాత్మ సాక్షాత్కారము. వేదవిజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి, స్వాత్మ సాక్షాత్కారం
ఇస్తున్నది కనుక, అమ్మను ఈ నామంలో విజ్ఞానకలనా అంటున్నాం.
విజ్ఞానకలనా అంటే, సకల విద్యా ధారణ స్వరూపురాలు అని అర్ధం.
ఆత్మ సాక్షా త్కారాన్నిచ్చే బ్రహ్మజ్ఞానస్వరూపిణి అయిన, ఆ విజ్ఞాన కలన కు వందనం.
ఓం శ్రీ విజ్ఞాన కలనాయై నమః
903. కల్యా
కళను సృష్టించునది కల్యా. కళ లందు నేర్పు కలది కల్యా.
నిఘంటువులో కల్యా అంటే, విగతరోగి, దక్షుడు, వేకువజాము, కళ్యాణము, కాదంబరి అనే అర్ధాలు
చెప్పారు. అమ్మ దక్షురాలు, కళ్యాణకారిణి. నిరామయా నామంలో విగతరోగి అనే అర్ధం కూడా
చెప్పుకున్నాం.
ఇక్కడ అమ్మను వేకువజాము అంటే ప్రాతఃకాల స్వరూపురాలు అని చెప్పుకుంటున్నాం.
కదంబ పుష్పాల నుంచి సేకరించిన, కాదంబరి అనే మద్యం స్వరూపురాలు అని ఇంకొక అర్ధం.
సకల శుభములూ, మంగళములూ మూర్తీభవించిన, ఆ కల్యా కు వందనం.
ఓం శ్రీ కల్యాయై నమః
904. విదగ్ధా
విదగ్ధా అంటే జ్ఞానముతో ప్రకాశించునది, అత్యంత చాతుర్యము, నైపుణ్యము కలది అని అర్ధం.
దగ్ధమైనది అంటే జీర్ణమైనది అని భావం. విదగ్ధా అంటే దగ్ధము కానిది, జీర్ణము కానిది.
కొరుకుడు పడని నిపుణత, చాతుర్యము కలది శ్రీమాత అని ఈ నామార్ధం.
అమ్మ చాతుర్యత అర్ధం చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఏది, ఎందుకు చేస్తుందో తెలియదు.
ధర్మమూర్తులైన శ్రీరాముణ్ణి, ధర్మరాజాదులను అరణ్యానికి ఎందుకు పంపించిందో, సామాన్యులకు
అర్ధం కాదు. అమ్మ లీలలు జీర్ణం చేసుకోవటం అసాధ్యం.
ఆ కార్యనిర్వహణా చాకచక్యం ఆ లోకేశ్వరికే చెల్లు.
ఒంటి చేత్తో అవలీలగా అనేకానేక కార్యములు, ఏక కాలంలో సహజసిద్ధమైన
రీతిలో నిర్వహిస్తుంది. అంత గొప్ప చాతుర్యం కల అమ్మను, ఈ నామంలో విదగ్ధా అంటున్నాం.
అనూహ్యమైన చాకచక్యంతో జగత్తులనన్నీ నిర్వహిస్తున్న, ఆ విదగ్ధ కు వందనం.
ఓం శ్రీ విదగ్ధాయై నమః
905. బైందవాసనా
బైందవము అంటే బిందువుల సమూహం.
ఆ బైందవముపై ఆసీనురాలైనది బైందవాసనా అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి.
స్వచ్ఛందతంత్రములో, "హాకినీ మండలానికి (భ్రూమధ్యభాగం) పైన వర్తులాకారములో వున్నది
బిందురూపము. అక్కడ పద్మములో, శివుని వామభాగంలో, శాంత్యతీత స్వరూపురాలు, మనోన్మనీ
అవస్థ స్వరూపురాలు అయిన శక్తి కూర్చుని ఉంటుంది", అని వుంది.
శ్రీచక్ర నవావరణములో అగ్రస్థానాన వున్నది సర్వానందమయ చక్రం. అదే బిందువు.
ఆ సర్వానందమయచక్రమే ఆసనంగా కలది బైందవాసనా అనబడే శ్రీలలితాత్రిపురసుందరీదేవి.
జ్ఞానార్ణవతంత్రంలో పార్వతితో ,"బిందువుతో కూడిన హకారము, హం, బ్రహ్మ. బిందువుతో కూడిన
సకారము, సం, విష్ణువు. విసర్గతో కూడిన సకారము, సః, శివుడు. హంసం లేదా హంసః అంటే
బ్రహ్మవిష్ణుమహేశ్వరులని అర్ధం. హరికీ హరునకూ అవినాభావ సంబంధం వుంది", అని అంటాడు
పరమేశ్వరుడు.
ఈ నామాన్ని అబైందవాసనా అని పదవిభజన చేసుకుంటే, అప్ అంటే నీటిలో, ఐందవ అంటే,
(ఇందు సంబంధమైన) చంద్రబింబము వలె వున్నది అని అర్ధం.
బింబ ప్రతిబింబములకు అబేధము కదా.
ఒక్క చంద్రుడే ప్రతి నీటి బిందువు లోనూ ప్రతిబింబముగా కనబడుతున్నట్టు,
ఒక్క శ్రీలలితే, జీవులందరి హాకినీ మండలముల లోనూ అధివసించి వున్నది అని భావం.
బిందుసమూహమైన, సర్వానందమయచక్రమే ఆసనంగా కల, ఆ బైందవాసనా కు వందనం.
ఓం శ్రీ బైందవాసనాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి