ఓం శ్రీ ధరాయై నమః
956. ధరసుతా
ధరము అంటే పర్వతము. పర్వతరాజపుత్రి కనుక పార్వతిని ఈ నామంలో ధరసుతా
అంటున్నాం. హిమవంతుని కూతురు ధరసుతా.
సీతగా, గోదాదేవిగా, పద్మావతిగా అయోనిజగా భూమి నుంచి ఉద్భవించినది కనుక ధరసుతా.
భూమిపై జనించిన అన్ని వస్తువులందునూ వున్న శక్తి కనుక ధరసుతా.
ఈ భూమిపై జనించినవన్నీ ధరణిజలే. వాటన్నింటి యందూ ఉండునది, కనుక ధరసుతా.
ధరాదేవీ స్వరూపమైన, యశోద కడుపున పుట్టిన యోగమాయ ధరసుతా.
హిమధరమైన హిమవంతుని పుత్రిక, ఆ ధరసుత కు వందనం.
957. ధన్యా
ధన్య అంటే ధనము కలది, కృతార్థురాలు అని అర్ధము.
అమ్మ ఐశ్వర్యము గురించి శాశ్వతైశ్వర్యా నామంలో కూడా చెప్పుకున్నాం.
అంతటి మహదైశ్వర్యమును కలిగినది కనుక ఈ నామంలో ధన్యా అంటున్నాం.
శ్రీమహాలక్ష్మీ స్వరూపురాలు కనుక ధన్యా. ధనమును కలిగినది, ధనమును ఇచ్చునది ధన్యా.
ఏ కార్యమైనా సిద్ధిస్తే, కృతార్థులమయ్యాము, ధన్యులమయ్యాము అని భావిస్తూ ఉంటాం.
ధన్యులమైనాము అంటే, ధన్యకు చెందినవారం అయ్యాము అని అర్ధం.
ధన్యులమైన అంటే, ధన్యమైన, అంటే భక్తులే ధన్యులు అయిపోయారు అని భావం.
భక్తుడే భగవంతుడైన స్థితి ధన్య స్థితి.
జ్యోతిశ్శాస్త్రములో ప్రసిద్ధి చెందిన మంగళ, పింగళ, ధన్య అనే యోగినులు వున్నారు.
ఆ ధన్యా అనే యోగినీ స్వరూపురాలు అని కూడా అర్ధం.
భవిష్యోత్తరపురాణంలో, "ప్రతి జీవుడూ మరణకాలంలో నాలుగు రకాలైన చింతలకు లోనవుతాడు.
అవి ఆర్తచింత, రౌద్రచింత, ధన్యచింత, శుక్లచింత. భౌతికమైన వస్తువుల పట్ల కోరిక కలవారికి
ఆర్తచింత, చివరికాలములో కూడా శత్రుభావము కలిగివుండే వారికి రౌద్రచింత, భగవదాలోచనలో
ఉండేవారికి ధన్యచింత, ఇంద్రియాలను జయించిన వారికి శుక్లచింతా కలుగుతాయి", అని
చెప్పారు. ఆ ధన్యచింతా స్వరూపురాలు అని అర్ధం.
కృతార్ధత నిచ్చే, ఆ ధన్య కు వందనం.
958. ధర్మిణీ
సహజమైన ధర్మస్వభావము కలది ధర్మిణీ.
ధర్మములను ఆచరించునది, ధర్మములను ధరించునది ధర్మిణీ.
వేదాలలో, పరమేశ్వరిని సకల ధర్మ స్వరూపిణీ అని కీర్తించారు. కనుక ధర్మిణీ అనే నామం
వచ్చింది. నిత్యమూ, సత్యము, ఆనందము అనే ధర్మములను పోషించునది, కనుక ధర్మిణీ.
సచ్చిదానంద స్వరూపురాలు అని అర్ధం.
ధర్మమును విశేషంగా ఆచరించే వారి పట్ల అనుగ్రహము చూపునది ధర్మిణీ.
ధర్మమును విశేషముగా పోషించు, ఆ ధర్మిణి కి వందనం.
ఓం శ్రీ ధర్మిణ్యై నమః
959. ధర్మవర్ధినీ
ధర్మమును వర్ధిల్ల చేయునది ధర్మవర్ధినీ. ఆచరణ చేత ధర్మము సదా వర్ధిల్లునట్లు చేయునది.
ధర్మమును వృద్ధి చేయునది అని అర్ధం.
వామనపురాణంలో, "శంకరుని పట్లా, సూర్యుని పట్లా, దేవి పట్లా జితేంద్రియత్వం, శౌచం,
మాంగళ్యం, భక్తి, అనే నాలుగు మనుష్యధర్మములూ పాటించాలి. సాంబుణ్ణి ధ్యానిస్తే, ఈ నాలుగు
ధర్మములూ వృద్ధి చెందుతాయి", అని వుంది.
ధర్మమునకు సత్యము, శౌచము, దయ, తపస్సు అనేవి నాలుగు పాదములు.
ఈ నాలుగు ఆచరిస్తే, ధర్మమును ఆచరించినట్లు అవుతుంది. కనుక సత్య, శౌచ, కృప
తపములను సదా నిష్కామముగా ఆచరించాలి.
ఆ ధర్మమును రక్షించే వారిని రక్షిస్తుంది కనుక ధర్మవర్ధినీ అంటున్నాం.
ధర్మ సంస్థాపన కోసం యుగ యుగములలోనూ ఆవిర్భవిస్తాను అని పరమాత్మ చెప్పాడు.
ధర్మమునకు గ్లాని కలిగినప్పుడు అవతారము ధరించి, ధర్మమును వృద్ధి చేయునది ధర్మవర్ధినీ.
ధర్మమును ఆచరించు వారిని రక్షించి ధర్మమును వర్ధిల్ల చేయు, ఆ ధర్మవర్ధిని కి వందనం.
ఓం శ్రీ ధర్మవర్ధిన్యై నమః
960. లోకాతీతా
పదునాలుగు లోకాలకూ అతీతమైన, పరమశివపురి యైన కైలాసము నందు ఉండునది కనుక
లోకాతీతా అని అంటున్నాం. ఈ విషయం శివధర్మోత్తరంలో వుంది.
"కర్మఠులకు పొందదగినది శివపురం. వీరికి పునర్జన్మ వున్నది. ఈ శివపురం కన్నా పైన
స్థానత్రయం వుంది. అవి స్కంద, దేవీ, శంకర పురాలు. ఈ స్థానత్రయమునకే పరమశివపురమని
పేరు. ఆ పరమశివ పురమందు ఉండునది లోకాతీతా. ఈ పరమశివ పురాన్ని పొందాలంటే,
ధ్యానయోగములో నిమగ్నులై ఉండాలి. అటువంటి వారికి సర్వజ్ఞత, పరిపూర్ణత, పరమశుద్ధత
కలిగి శివతుల్యులవుతారు", అని శివ ధర్మోత్తరం చెప్తోంది.
లోకములన్నింటికీ అతీతమైన, పరమశివపురములో వుండు, ఆ లోకాతీతా కు వందనం.
ఓం శ్రీ లోకాతీతాయై నమః
961. గుణాతీతా
గుణములను అతిక్రమించినది గుణాతీతా. అమ్మ నిర్గుణ అని ముందే చెప్పుకున్నాం.
సత్వ, రజస్, తమో గుణాలను అతిక్రమించినది పరమేశ్వరి.
గుణములను తానే సృష్టించి, తాను మాత్రమూ ఏ గుణమునకూ బద్ధురాలు కాక ఉండునది
శ్రీమాత. సకలగుణములకూ అతీతురాలు లలితాపరమేశ్వరి.
ఏ గుణమునకూ లొంగక, అన్ని గుణములకూ అతీతురాలైన, ఆ గుణాతీతా కు వందనం.
ఓం శ్రీ గుణాతీతాయై నమః
962. సర్వాతీతా
సర్వమూ అతిక్రమించి వున్నది కనుక సర్వాతీతా అంటున్నాం.
జ్ఞానార్ణవంలో, "అన్నింటినీ అతిక్రమించినది, సర్వశబ్దములనూ మించినది", అని చెప్పారు.
పరబ్రహ్మ శబ్దాతీతము, అదియే ఆత్మ అని చెప్పారు.
అన్ని తత్త్వములకూ అతీతమయినది, అన్ని గుణములకూ అతీతమయినది, అన్ని
భూతములకూ అతీతమయినది, అన్ని శబ్దములకూ అతీతమయినది, అన్ని కాలములకూ
అతీతమయినది, అన్ని అవస్ధలకూ అతీతమయినది, ఈ సమస్త సృష్టికీ అతీతమయినది కనుక,
అమ్మను ఈ నామంలో సర్వాతీతా అంటున్నాం.
అన్నింటికీ అతీతమయిన, ఆ సర్వాతీతా కు వందనం.
ఓం శ్రీ సర్వాతీతాయై నమః
963. శమాత్మికా
శమమును కలిగి వున్నది శమాత్మికా. శమము అంటే శాంతి, సుఖము, నిశ్చింత.
శాంతినే ఆత్మ తత్త్వముగా కలిగివున్నది వున్నది కనుక శమాత్మికా అంటున్నాం.
సకల ప్రపంచోపశమమే తన స్వరూపముగా కలది శమాత్మికా.
ప్రపంచోపశమము అంటే, ప్రపంచములు ఉపశమించుట, అంటే ప్రపంచములు అమ్మలో
లయము పొందుట అని అర్ధము.
శాంతి నిచ్చునది శమాత్మికా, సుఖము నిచ్చునది శమాత్మికా.
అమ్మను ఈ నామంలో శాంతి స్వరూపురాలు, సుఖ స్వరూపురాలు అంటున్నాం.
తనను నమ్మినవారికి ఉపశమనము కలుగచేయు, ఆ శమాత్మికా కు వందనం.
ఓం శ్రీ శమాత్మికాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి