19, జనవరి 2022, బుధవారం

శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి గారి అభిప్రాయం

శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి గారి అభిప్రాయం

శ్రీ మాత్రే నమః 

శ్రీలలితా పరమేశ్వరి వశిన్యాది వాగ్దేవతలకు - తన సహస్రనామ స్తోత్ర వైభవాన్ని భక్తులకు వర్ణించి, వివరించి చెప్పమని ఆదేశించింది. వశ్యవాక్కులైన వాగ్దేవతలు వర్ణించిన తన వైభవాన్ని దేవి మెచ్చి ఆమోదించింది.

పరదేవత అనుమతి, అనుగ్రహం లేనిదే ఎంతవారికయినా వాక్సిద్ధి లభించదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టలేనట్లు! అమ్మ అనుమతితో వాగ్దేవతలు విజయలక్ష్మిని ఆవహించి, తాము దర్శించిన లలితావైభవాన్ని ప్రత్యక్షం చేసి, ఆ తల్లి నామ రూప గుణ విశేషాలను భక్తులకు, జిజ్ఞాసువులకు వివరించమని ఆదేశించారని నా కనిపిస్తోంది. 

సామాన్యభక్తులకు కూడా వారి స్థాయిలో అర్ధమయ్యే రీతిలో దేవీ నామ వైశిష్ట్యాన్ని వివరించింది విజయలక్ష్మి. ఆ నామానికి, ఆపదానికి నిఘంటువులో ఎన్ని అర్ధాలున్నాయో చెప్పి, ఆ అర్ధాలన్నిటినీ అమ్మ నామాలకు అన్వయించి, ఆ నామభావం అర్థమయ్యేటట్లు చెప్పింది విజయలక్ష్మి. నారాయణ తత్త్వమూ, నారాయణీ తత్త్వమూ ఒకటేనని ఎన్నో సందర్భాలలో కథల రూపంలో నిరూపించింది. 

శ్రీ లలితాసహస్రనామస్తోత్రం పారాయణం ఒక అద్భుతమైన అనుభవం. అనుష్టుప్ ఛందంలోని ఆ శ్లోకాలు సంగీతాత్మకంగా ఉంటాయి. ఎవరికి వారు ఏకాంతంలో నిదానంగా, చిన్నగొంతుతో చెప్పుకున్నా, సామూహికంగా, ఏకకంఠంతో పారాయణ చేసినా ఆ తృప్తి, సంతోషం అనుభవైకవేద్యం. లలితాదేవిని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. అమ్మతత్త్వం బోధపడినట్లే, సాంద్రమైన ఆనందాన్ని అనుభవిస్తాము. 

"యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః 
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే"
అని విష్ణు సహస్ర నామాలను గురించి భీష్మాచార్యుడు చెప్పినట్లు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పరదేవత గుణవైభవాన్ని ప్రత్యక్షంగా ప్రకటిస్తూ, మహిమాన్వితమైన ఈ మహామాలా మంత్రమై భాసిస్తోంది. ప్రతి ఒక్క నామమూ స్థూల, సూక్ష్మ, విశేషార్థాలతో దేవి గుణ, కర్మ, స్వభావాలను విశ్లేషిస్తుంది. 

దేవతలు,  ఋషులు,  భక్తులు అమ్మతత్త్వాన్ని భావాతీత స్థితిలో దర్శించి, ఆ తత్త్వాన్ని పురాణాలుగా, ఉపనిషత్తులుగా, స్మృతులుగా, భాష్యాలుగా ఉపాసకులకు వెల్లడి చేశారు. 

శ్రీ భాస్కరరాయల వారు ఆ భాష్యాలద్వారా అమ్మతత్త్వాన్ని తనలో ఆవాహన చేసుకుని భక్తిప్రపత్తులతో తనదైన ప్రత్యేక మార్గంలో భక్తలోకానికి అందించారు. 

భాస్కరరాయల వారి  మార్గాన్ని అనుసరించి విజయలక్ష్మి శ్రీ లలితా విజయాన్ని మహోన్నతంగా, సోదాహరణంగా మనకి ప్రత్యక్షం చేసింది. 

 ఈ వ్యాఖ్యానం మొదలుపెట్టిన దగ్గరనుంచి విజయలక్ష్మి ప్రహ్లాదుడు లాగా - "పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలానిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్", సర్వకాల సర్వావస్థల్లోనూ లలితా పరదేవత చింతనామృతాస్వాదనంతో మరొక 
ధ్యాస లేకుండా గడిపింది. ఆ తృప్తి, సంతోషం తలమునకలుగా అనుభవించింది. అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా పొందింది. భాష్యరచనా యజ్ఞంలో పూర్తిగా కృతకృత్యురాలయింది. 

విజయలక్ష్మీ! శ్రీలలితాదేవి అనుగ్రహంతో నువ్వూ, నీ భర్తా, నీ పిల్లలూ, నీకుటుంబమూ అందరూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో, సుదీర్ఘమైన ఆయుస్సుతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో చల్లగా సంతోషంగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఇలాంటివి చేయవలసినవి, చెప్పవలసినవి చాలా ఉన్నాయి. త్వరగా మొదలుపెట్టు. 



----------ముళ్ళపూడి శ్రీదేవి





2 కామెంట్‌లు:

  1. పిన్నీ, ఎంత చక్కగా చెప్పావో,శుద్ధ తెలుగు భాష అంటే ఇదీ, అని చూపించినట్టుంది.
    నీ ఆశీస్సులు నాకు చాలా విలువైనవి.
    🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  2. శ్రీరామ జయం! శ్రీమతి శ్రీదేవి ముళ్ళపూడి గారికి నమస్కారం,మీ అభిప్రాయం వ్యాసం మీ సహృదయతకు దర్పణం... చాలా సంతోషం ఈ మాట ను ఉదహరిస్తూ విషయం తెలుపడం... కాకపోతే భీష్మ పితామహుడు ద్వారా వ్యాసుడు పలికించినట్లు అంటే గ్రంథ కర్త స్ఫురించే అవకాశం... చాలా సంతోషం అండీ, ధన్యవాదములు ... శుభమస్తు!!

    రిప్లయితొలగించండి