కల్పనారహితా, కాష్ఠా, అకాంతా, కాంతార్ధవిగ్రహా ॥ 160 ॥
854. గంభీరా
ఓం శ్రీ గంభీరాయై నమః
855. గగనాంతఃస్థా
లలితాపరాభట్టారిక గగన మధ్యంలో వున్నది అని ఈ నామానికి అర్ధం.
అనాహత చక్రం వద్ద గల దహరాకాశము మధ్యలో ఉన్నది. పరాకాశము మధ్యలో వున్నదీ శ్రీమాతే.
పంచభూతాలలోని ఆకాశభూతము మధ్యలో ఉన్నది కనుక, అమ్మను పంచ మహాభూత బీజ
స్వరూపురాలుగా కూడా కొలుస్తున్నాం. ఈ ఆకాశభూతము ప్రళయకాలంలో నశించిపోతుంది.
అయినప్పటికీ ఆ పరమేశ్వరి మాత్రం స్థిరంగా ఉంటుంది.
భూతాకాశమైనా, దహరాకాశమైనా, పరాకాశమైనా, అన్ని ఆకాశాలకూ మధ్యలో ఉంటుంది శ్రీదేవి.
య, ర, ల, వ అక్షరములని అంతస్థములు అంటాం. హ అనేది ఆకాశబీజం.
ఈ "హ య ర ల వ" అనే గగన, అంతస్థముల మధ్యలో ఉండునది శ్రీమాత అని భావం .
అంటే ఈ "హ య ర ల వ" అనే పంచభూత బీజాక్షరముల స్వరూపురాలు అని భావం.
దహరాకాశము, పరాకాశము అనే గగనాల మధ్యలో వుండే, ఆ గగనాంతఃస్థ కు వందనం.
ఓం శ్రీ గగనాంతఃస్థాయై నమః
856. గర్వితా
స్వాధిష్ఠానాంబుజగతా అయిన జగన్మాత సౌందర్యాతిశయము, స్వాభిమానము చేత
అతిగర్వితయై వున్నది అని చెప్పుకున్నాం.
శ్రీదేవి సకల సంపదలూ కలిగి గర్వాతిశయంతో వున్నది.
విశ్వనిర్మాణం పరాహంతగా చక్కగా నిర్వహిస్తున్నాననే గర్వంతో వుంది.
ఒక ఇల్లాలు తన చిన్న ఇంటిని చక్కదిద్దుకుంటేనే ఎంతో దర్పాన్ని ప్రదర్శిస్తుంది.
అటువంటిది శ్రీమాత ఈ విశ్వాన్నే చక్కదిద్దుతోంది.
తానొక్కర్తే మొత్తం భారాన్ని వహిస్తున్నానన్న అతిశయాన్ని కలిగివుంది.
జగత్తులన్నీ తన అధీనంలో ఉన్నాయన్న గర్వంతో వున్నది.
అందుకే అమ్మను ఈ నామంలో గర్వితా అంటున్నాం.
జగన్నిర్వహణను అద్భుతంగా జరుపుతున్న, ఆ గర్విత కు వందనం.
ఓం శ్రీ గర్వితాయై నమః
ఓం శ్రీ గానలోలుపాయై నమః
858. కల్పనారహితా
ఏ కల్పనలూ లేనిది కల్పనారహితా అనబడుతుంది.
ఏ ప్రాపంచిక విషయవాసనాత్మక మయిన కల్పనలు లేనిది శ్రీమాత అని ఈ నామానికి అర్ధం.
ప్రళయకాలంలో, సృష్టి, స్థితి కాలములలో కూడా, నరులకు హితము చేకూర్చుటకు, ఏ విషయ
వాసనా లేకుండా, వారిని తన యందు దాచుకుని సంరక్షిస్తుంది ఆ జగదీశ్వరి.
అష్టావక్రగీతలో, " నేను అనంతమైన చైతన్య స్వరూపమును. జీవులన్నీ నా నుంచే
ఉద్భవిస్తున్నాయి, నా లోనే తిరుగాడుతున్నాయి, నా లోనే కేళిస్తున్నాయి, రమిస్తున్నాయి,
నశిస్తున్నాయి, నా లోనే తిరిగి ప్రవేశిస్తున్నాయి. ఈ కర్మలన్నీ స్వభావసహజంగా జరుగుతూ
వున్నాయి", అని వున్నది.
కల్పిత ప్రాపంచిక వాసనల నుంచి జీవులను రక్షించు, ఆ కల్పనారహిత కు వందనం.
ఓం శ్రీ కల్పనారహితాయై నమః
859. కాష్ఠా
కాష్ఠ అంటే కాలానికి ఒక కొలమానం. కాష్ఠ అంటే పద్దెనిమిది నిమేషములు.
పసుపు మొక్క యొక్క మాను స్వరూపురాలు కాష్ఠా.
మైలారతంత్రంలో, కుమారస్వామి బొడ్డుతాడే, పసుపు మొక్క యొక్క కాండము అని,
అందుకే ఆ పసుపు దారువు శివశక్త్మ్యాత్మకమనీ చెప్పారు.
సూతసంహితలో, "ప్రతీతము, అప్రతీతము, సత్, అసత్ అన్నీ సదాశివుడే, వేదాంతము బోధించే
తత్త్వమే కాష్ఠ", అని వుంది.
శివుని అష్టమూర్తులలో, ఆకాశమూర్తి యైన భీముని భార్య దిక్స్వరూపురాలు, ఆమె పేరు కాష్ఠ.
కాలస్వరూపముగా జగత్తంతా వ్యాపించి వున్నది కాష్ఠ.
పురుషసూక్తంలో అత్యతిష్ఠద్దశాంగుళం అంటాడు. అంటే కాలస్వరూపుడైన ఆ పరమాత్మను
కొలవాలంటే, పదివేళ్ళూ చాలవు అని అర్ధం. అంతగా జగత్తంతా వ్యాపించి వున్న తత్త్వమే కాష్ఠా.
శివశక్త్మ్యాత్మకమైన కాల స్వరూపురాలు, ఆ కాష్ఠా కు వందనం.
ఓం శ్రీ కాష్ఠాయై నమః
860. అకాంతా
అకము అంటే పాపము, దుఃఖము అని అర్ధాలు. అకమును అంతం చేసేది అకాంతా.
తనను ఉపాసించేవారి పాపాలను, కష్టాలను నాశనం చేసేది ఆ పరమేశ్వరి అని అర్ధం.
అమ్మ తనను సేవించే వారి పాపములను దగ్ధము చేస్తుంది. వారి దుఃఖములను తీరుస్తుంది.
అకము తొలగించి న, అకము, నాకమును, అంటే స్వర్గమును ఇస్తుంది.
అందుకే ఈ నామంలో ఆ లలితాదేవిని అకాంతా అంటున్నాం.
భక్తుల పాపాలను, దుఃఖాలను అంతం చేసే, ఆ అకాంతా కు వందనం.
ఓం శ్రీ అకాంతాయై నమః
861. కాంతార్ధవిగ్రహా
కాంతుడు అంటే భర్త. కాంతుడిలో సగం అర్ధాంగి అయిన భార్య. విగ్రహమంటే శరీరం, స్వరూపం.
కాంతార్ధవిగ్రహా అంటే, కాంతుని శరీరములో అర్ధభాగాన్ని ఆక్రమించింది అని అర్ధం.
విష్ణువు లక్ష్మికి హృదయంలో స్థానం ఇచ్చాడు. బ్రహ్మ వాణిని నాలుకపై ఉంచుకున్నాడు.
శివుడు తన శరీరంలో వామభాగం శివానీకి ఇచ్చాడు.
శరీరంలో అర్ధ భాగమిచ్చినది పరమశివుడు. ఆ అర్ధభాగాన్ని పూరించింది పరమేశ్వరి.
ఈ నామంలో అమ్మను, భర్త అయిన పరమశివుని విగ్రహంలో సగం వున్న దేవి అని అంటున్నాం.
ఆకాశమును తనలో ఇముడ్చుకున్న శక్తి అనే అర్ధం కూడా ఈ నామానికి వుంది.
కాంతుని శరీరములో అర్ధ భాగంగా ప్రకాశిస్తున్న, ఆ కాంతార్ధవిగ్రహ కువందనం.
ఓం శ్రీ కాంతార్ధ విగ్రహాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి