21, డిసెంబర్ 2021, మంగళవారం

151. సత్యజ్ఞానానందరూపా, సామరస్య పరాయణా కపర్దినీ, కలామాలా, కామధుక్, కామరూపిణీ

 

సత్యజ్ఞానానందరూపా, సామరస్య పరాయణా 
కపర్దినీ, కలామాలా, కామధుక్,కామరూపిణీ ॥ 151 ॥


791. సత్యజ్ఞానానందరూపా

లలితాపరమేశ్వరి సత్యము, జ్ఞానము, ఆనందము కలబోసిన స్వరూపము కనుక, అమ్మను ఈ 

నామంలో సత్యజ్ఞానానందరూపా అంటున్నాం. సత్యజ్ఞానాలనే విద్యా సంపదను పొందినవారికి 

ఆనందాన్ని, ఇతరులకు దుఃఖాన్నీ ఇచ్చునది అని భావం. 

వేదములో సత్యంజ్ఞానమనంతంబ్రహ్మ అనీ, ప్రజ్ఞానం బ్రహ్మ అనీ, విజ్ఞానమానందం బ్రహ్మ అనీ 

చెప్పారు. సత్యము, జ్ఞానము, ప్రజ్ఞానము, ఆనందము ఇవి పరబ్రహ్మ తత్త్వము. 

'సత్య విద్యను ఉపాసించనివారికి దుఃఖమును ఇచ్చునది', అని బృహదారణ్యకంలోనూ, 

'అవిద్యోపాసన చేసినవారిని అంధతామిస్రములో పడేస్తుంది', అని ఈశ లోనూ చెప్పబడింది. 

బృహదారణ్యకంలోనే  "అంధతామిస్రము అనే లోకంలో ఆనందమనే పేరుతో కొన్ని లోకాలు

వున్నాయి, అవిద్యోపాసకులకు అమ్మ ఆ లోకములను ఇస్తుంది. ఆత్మజ్ఞానము లేనివారు ఆ 

అంధతామిస్ర ఆనంద లోకాలను పొందుతారు", అని వుంది.  

సత్యమైన జ్ఞానము లేనివారిని గాఢాంధకార లోకాల లోనూ, సత్యజ్ఞానాన్ని పొందినవారికి 

బ్రహ్మానందాన్నీ ఇచ్చునది అని ఈ నామ భావం.  

శుద్ధ పరబ్రహ్మ తత్త్వమైన, ఆ సత్యజ్ఞానానందరూప కు వందనం. 

ఓం శ్రీ  సత్యజ్ఞానానందరూపాయై నమః  


792. సామరస్యపరాయణా

శివునితో సామరస్యముతో ఉండునది సామరస్యపరాయణా. శివుడు, శక్తి ఎల్లప్పుడూ సమభావంతో  

వుంటారు. అన్నిటా సమానత్వం కలిగి వుంటారు. హెచ్చుతగ్గులు వుండవు. 

శివపార్వతులిద్దరూ ఒకరి గురించి ఒకరు తపస్సు చేశారు. ఆ తపఃఫలితంగా ఇద్దరూ ఒకరినొకరు 

పొందారు. ఈ సామరస్యత అందరూ, అన్నిటా పాటించాలనేది కూడా ఈ నామం చెపుతోంది.  

సాధకులు స్త్రీ, పురుష భావము  పట్లా, ప్రజ్ఞ, పదార్ధము పట్లా, సమభావమును సాధించాలి. 

ఇహము, పరము రెండింటినీ సాధించాలి. 

శ్రీదేవిని ఉపాసించేవారికి భోగము, మోక్షము రెండూ దక్కుతాయి. 

స, అమరస్య, పరాయణా అని పదవిభజన చేసుకుంటే, అమరలోకానికి 

ఆశ్రయమిచ్చేది అని అర్ధం. 

సామ, రస్య, పరాయణా అని పదవిభజన చేసుకుంటే, సామవేద గానమంటే 

ఇష్టపడునది అని అర్ధం. 

శివపార్వతుల సామరస్యము వలన బ్రహ్మానందం ఆవిష్కరింపబడుతుంది అని ఈ నామార్ధం. 

శివునితో సామరస్యమును పొందిన, ఆ సామరస్యపరాయణ కు వందనం.  

ఓం శ్రీ సామరస్యపరాయణాయై నమః  


793.  కపర్దినీ 

కపర్దము అంటే జటాజూటము, జడముడి, గవ్వ అనే అర్ధాలున్నాయి. 

ఊర్ధ్వరేతస్కులగు యోగులు దట్టంగా వున్నతమ జటాజూటమును పైకి గోపురము వలె 

చుట్టి ఉంచుతారు. వారిని కపర్దులు అంటారు. 

శివుడు తన జటాజూటములో గంగను బంధించాడు. అందువలన శివుడు కపర్ది అయ్యాడు. 

క అంటే గంగ, పర్ అంటే ప్రవాహమును, ద అంటే శుద్ధి చేయునది, అంటే గంగాప్రవాహమును 

శుద్ధి చేయునది కపర్దము అని ఒక అర్ధము. ఆ శివుని జటాజూటము గంగనే శుద్ధి చేసే శక్తి కలది. 

కపర్ది భార్యగా ఆ పరమేశ్వరి కపర్ధినీ అనే నామం ధరించింది. 

కపర్దినీ అంటే గవ్వలదండలతో అలంకరింపబడినది అని మరియొక అర్ధము. 

లఘుస్తవములో, చంద్రఖండములతో అలంకరింపబడిన జుట్టు కలది కనుక, కపర్దినీ అని వుంది.

దేవీపురాణములో, 'భగలాండమనే శివక్షేత్రంలో కపర్ది అనే పేరుతో శంకరుడు కొలువై వున్నాడు. 

ఆ కపర్ది అను శంకర పత్ని కనుక, అమ్మ కపర్దినీ అయింది', అని వుంది.  

పైకి బంధించిన జటాజూటము కల శివుని పత్ని, ఆ  కపర్దిని కి వందనం. 

ఓం శ్రీ  కపర్దిన్యై నమః  


794. కలామాలా

చతుష్షష్టి కళలూ మాలగా ధరించినది కలామాలా. 

అమ్మను చతుష్షష్టి కళామయీ అని ముందే చెప్పుకున్నాం. 

ఆ అరవైనాలుగు కళలని మాలగా ధరించిన పరమేశ్వరి అని ఈ నామ భావం. 

కళ అంటే లావణ్యము అని కూడా అర్థముంది. 

కనుక కళామాలా అంటే, లావణ్య లతిక అని అర్ధం. 

ఆ పరమేశ్వరిని మహాలావణ్యశేవధీ అనుకున్నాం కదా. కనుక అమ్మ కళామాలా. 

ఈ నామంలో ఆ పరమేశ్వరిని లావణ్యశోభతో భాసిస్తోందని అంటున్నాం. 

చతుష్షష్టి కళలను మాలగా ధరించి శోభిల్లుతున్న, ఆ కలామాల కు వందనం. 

ఓం శ్రీ కలామాలాయై నమః 

  

795. కామధుక్

కామధుక్ అంటే కామధేనువు. కామ అంటే కోరికలను, ధుక్ అంటే పితుకునది అని అర్ధం. 

ఆ జగన్మాత కోరిన కోరికలు తీర్చే కరుణామయి. కామధేనుస్వరూపురాలు అని ఈ నామార్ధం. 

కామధేనువు కోరిన కోరికలు తీరుస్తుంది. కామధేనువు పాలు పితికినట్లు, లలితాపరమేశ్వరి తన 

భక్తుల కోరికలను కామధేనువు వలె తీరుస్తుంది అని అర్ధం.  

కోరిన కోరికలు తీర్చు, ఆ కామధుక్ కు వందనం. 

ఓం శ్రీ కామదుఘే నమః 


796. కామరూపిణీ

కాముడు అంటే కామేశ్వరుడు. అమ్మవారు కామేశ్వరి. కామేశ్వరుని పత్ని కనుక, కామరూపిణీ అనే 

నామం వచ్చింది. కామ రూపిణీ అంటే, కోరిన రూపం ధరించునది అని అర్ధం. 

వేదములో, 'సృష్టి చేయవలెనని కోరిక కలిగి ఒక్క పరమాత్మయే యధేచ్ఛగా అనేక రూపములు 

దాల్చి, కామేశ్వర, కామేశ్వరీ రూపాలతో సృష్టి చేశాడు', అని చెప్పారు. 

కాణ్వశాఖలో, 'ఎవడు జగత్తులను సృష్టించటానికి కామరూపుడు అయ్యాడో, ఆతని స్త్రీ కామేశ్వరి' 

అని చెప్పారు.  

కామేశ్వరి కోరిన రూపం ధరించగల పరమ శివుని ఇల్లాలు, కనుక కామరూపిణీ అయింది. 

కోరిన రూపమును పొందగల, ఆ కామరూపిణి కి వందనం. 

ఓం శ్రీ కామరూపిణ్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి