662. అష్టమూర్తిః
ఓం శ్రీ అష్టమూర్త్యై నమః
663. అజాజైత్రీ
అజ అంటే నిఘంటువులో అజ్ఞానము, అవిద్య, మాయ, పుట్టుక లేని తనము అని అర్ధాలున్నాయి.
అమ్మవారికి పుట్టుక లేదు కదా, ఆమె పుట్టుకను రహితము చేసినది కనుక, అజాజైత్రీ అన్నారు.
అవిద్యను జయించి అజాజైత్రీ అయింది శ్రీమాత.
మాయకు లొంగక, మాయను గెలిచింది కనుక, అజాజైత్రీ అని పిలువబడుతోంది.
అజ్ఞానంతో వున్న ఆసురీశక్తులని నిర్జించి, దైత్యహంత్రీ అనిపించుకున్నది ఈ అజాజైత్రీ.
అజ అంటే గొఱ్ఱె, మేక అనే అర్ధాలు కూడా వున్నాయి.
గొఱ్ఱె దూకుడుకు, అహంకారమునకు సంకేతం. మేక మమకారానికి సంకేతం.
అహంకారంతో, తలతో ఎదుటివారిని విచక్షణ లేకుండా ఢీ కొట్టటం గొఱ్ఱె లక్షణం.
అటువంటి అహంకారంతో శివుడిని ఢీకొట్టే దక్షుడు శిరస్సును కోల్పోయాడు.
దానితో అహంకార, మమకారాలు రెండూ కూడా నశించాయి.
శిరస్సు కోల్పోయిన దక్షుడిని పునర్జీవితుడిని చేయటానికి తిరిగి యజ్ఞం చేసి,
మేక తలను అతికించి ప్రాణం పోయవలసి వచ్చింది.
దక్షుడికి అహంకారం నశించి మమకారం మిగిలింది.
అటువంటి అహంకార దర్పాలను నిర్జించింది కనుక, ఆ పరమేశ్వరిని అజాజైత్రీ అంటున్నాం.
అవిద్యా, అహంకారములను ఖండించే, ఆ అజాజైత్రి కి వందనం.
ఓం శ్రీ అజాజైత్ర్యై నమః
664. లోకయాత్రా విధాయినీ
పధ్నాలుగు లోకాలలోనూ సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనే
పంచకృత్యములనూ నిర్వహించునది అని అర్ధం.
లోకాలన్నింటిలో పాటించు విధి విధానములను ముందుగానే నిర్దేశించునది అని కూడా భావము.
లోకాలను సంరక్షించటం కోసం లోకయాత్ర చేయునది ఆ లలితాపరమేశ్వరి.
లోకాలను ప్రళయకాలంలో, తన స్వర్ణగర్భంలో దాచి కాచి కాపాడుతోంది ఈ లోకయాత్రావిధాయినీ.
పధ్నాలుగు భువనభాండాలనీ సంరక్షిస్తున్న, ఆ లోకయాత్రా విధాయిని కి వందనం.
ఓం శ్రీ లోకయాత్రావిధాయిన్యై నమః
ఓం శ్రీ ఏకాకిన్యై నమః
666. భూమరూపా
భూమా అంటే, బహుత్వం, మహత్వం, బ్రహ్మత్వం. ఇప్పటివరకూ అమ్మను ఏకాకినీ అన్నాం.
ఈ నామంలో దానికి భిన్నంగా అమ్మకే బహుత్వాన్ని ఆపాదిస్తున్నాం.
నిజమే కదా, అమ్మ ఏకాకిని అయినప్పటికీ, త్రిమూర్తులూ, త్రిశక్తులూ, దేవతలూ, మానవులూ,
దానవులూ, ఋషులూ, మునులూ, అందరి రూపాలూ అమ్మవే కదా.
ఇంటింటా వున్న గృహాలక్ష్మి కూడా ఆ పరమేశ్వరి స్వరూపమే అని చెప్పుకున్నాం కదా.
ఛాందోగ్యోపనిషత్తులో, "ఎక్కడ పరమాత్మ కన్నా, వేరొకటి కనపడదో, వినపడదో
అదే భూమా రూపం, అదే అత్యంత సుఖాన్నినిచ్చే అవస్థ" అని చెప్పబడింది.
దేవీ భాగవతంలో, "ఏ విధంగా మేఘము ఒక్కటే అయిననూ, రంగు మార్పు వలన, తెల్లగా, నల్లగా
ఎర్రగా, సువర్ణముగా వివిధములుగా కనబడుతోందో, అదే విధంగా, దేవి తాను ఒకర్తుక అయినా,
అనేక ఉపాధులు ధరించి బహురూపములలో కనుపడుతోంది" అని చెప్పారు.
కూర్మపురాణంలో కూడా, "ఒక్క దేవియే పరమాత్మ సన్నిధిలో అనేక రూపాలను ధరించి
క్రీడిస్తున్నది" అని వున్నది.
ఏకాకిని అయినా, బహురూపాలలో వ్యక్తమవుతున్న, ఆ భూమరూపా కు వందనం.
ఓం శ్రీ భూమరూపాయై నమః
667. నిర్ద్వైతా
బ్రహ్మమొక్కటే. బ్రహ్మమును తెలుసుకున్నవాడూ బ్రహ్మమే.
భగవంతుడూ, భక్తుడూ ఒక్కటే, వేరొకటి లేదు, అనే అద్వైత సిద్ధాంతమును అనుసరించి,
అమ్మను ఈ నామంలో నిర్ద్వైతా అంటున్నాం.
ద్వైతము అంటే జీవాత్మ, పరమాత్మ వేరు వేరు అని చెప్పే సిద్ధాంతము.
కానీ అమ్మ జీవాత్మా, పరమాత్మా, రెండూ ఒకటే అనే అద్వైతమును బోధిస్తోంది కనుక,
అమ్మను ఈ నామంలో ద్వైతభావము లేనిది, కనుక నిర్ద్వైతా అంటున్నాం.
ఛాందోగ్యోపనిషత్తులో, "విశ్వమంతా వ్యాపించి వున్న శక్తియే అందరిలోనూ వున్నది. అదే ఆత్మ,
అదే సత్యం, అదే నిత్యం. దానికన్నా భిన్నమైనది వేరెక్కడా లేదు" అని చెప్పబడింది.
ఉన్నది ఆత్మశక్తి ఒక్కటే కనుక, ద్వైతము లేని, ఆ నిర్ద్వైత కు వందనం.
ఓం శ్రీ నిర్ద్వైతాయై నమః
668. ద్వైతవర్జితా
ద్వైతభావనను వర్జించినది అని ఈ నామార్ధం. అమ్మ ఎల్లప్పుడూ జీవేశ్వరులిరువురూ
ఒక్కటే అన్న అద్వైతభావనను కలిగివున్నది కనుక, అమ్మ ద్వైతమును వదిలివేసింది.
కనుక ఆ తల్లి ద్వైతవర్జితా. తాను తప్ప మరియొకటి లేని తల్లికి, ద్వైతము ఎలా వర్తిస్తుందీ.
ఏకాకినీ నామం నుంచీ ద్వైతవర్జితా అనే నామం వరకూ, బ్రహ్మము ఒక్కటే అని
చెప్పుకుంటున్నాం.
జీవేశ్వరులిరువురూ ఒక్కటే అనే అద్వైత భావనా స్వరూపమైన, ఆ ద్వైతవర్జిత కు వందనం.
ఓం శ్రీ ద్వైతవర్జితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి