30, నవంబర్ 2021, మంగళవారం

130. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ సర్వాధారా, సుప్రతిష్ఠా, సదసద్రూప ధారిణీ

  

ఇచ్ఛాశక్తి  జ్ఞానశక్తి  క్రియాశక్తి స్వరూపిణీ 
సర్వాధారా, సుప్రతిష్ఠా, సదసద్రూపధారిణీ ॥ 130 ॥

658. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ

అమ్మవారిని ఈ నామంలో శక్తిత్రయ స్వరూపముగా చెప్పుకుంటున్నాం. 
ఆ మూడు శక్తులే, ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తులు. సంకేతపద్ధతిలో ఇచ్ఛాశక్తి  అంటే,శిరోభాగం,
వాగ్భవకూటమనీ, జ్ఞానశక్తి అంటే కంఠము నుండి కటి వరకూ కల ప్రదేశం, కామరాజకూటమనీ, 
క్రియాశక్తి అంటే, కటి నుండి పాదముల వరకూ గల భాగం, శక్తి కూటం అనీ  చెప్తారు. 
ఈ మూడు శక్తుల కలయికే దేవీస్వరూపం అని వర్ణిస్తూ వుంటారు. 
వరాహపురాణంలో, "దేవి త్రిశక్తి రూపమైన ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తిగా వున్నది", అని చెప్పారు. 
వామకేశ్వరతంత్రంలో, వాణీ హిరణ్యగర్భుల మిధునం ఇచ్ఛాశక్తి అనీ, 
లక్ష్మీనారాయణ మిధునం జ్ఞానశక్తి అనీ, శివపార్వతుల మిధునం క్రియాశక్తి అనీ చెప్పారు. 
లింగపురాణంలో, "పరమాత్మ ఆజ్ఞ వలన ఆతని ధృతిశక్తి, ఇచ్చా, జ్ఞాన, కృతి శక్తులనే  మూడు 
రూపములను ధరించింది. ఆ పై జ్ఞానశక్తి పరా విద్య, అపరా విద్య అనే రెండు రూపాలు 
ధరించింది" అని వున్నది. ఇక్కడ క్రియాశక్తిని కృతి అన్నారు. కృతి అంటే యత్నము, 
అంటే క్రియయే, చలనములే. చలనములన్నీ ఆ దేవీ స్వరూపమే అని అర్ధము. 
మాలినీవిజయతంత్రంలో, "పరమాత్మ సృష్టి చేయడానికి సంకల్పించినపుడు, ఆతని పరాశక్తి 
మొదట ఇచ్ఛాశక్తిగా ఏర్పడి, తరువాత సృష్టి చేయాలనే జ్ఞానశక్తిగా మార్పుచెంది, 
ఆపై క్రియాశక్తిగా మారి సృష్టి చేస్తున్నది" అని వుంది. 
వాసిష్ఠ రామాయణంలో, "శివమే శాంతమైన బ్రహ్మ, ఆ పరమాత్మ యొక్క స్పందనే ఇచ్ఛాశక్తి. 
ఆ ఇచ్ఛాశక్తియే, పూర్వ విషయజ్ఞానాన్ని పొంది జ్ఞానశక్తిగా, ఆ విషయాలను తిరిగి సృష్టించటానికి 
క్రియాశక్తిగా మారినది" అని వుంది. పరమేశ్వరియే త్రిశక్తి స్వరూపిణి. 
త్రివిధముగా తనను తాను విభజించుకున్న త్రిపురసుందరి, 
ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః  


659. సర్వాధారా

సర్వ జగత్తులకూ ఆధారభూతమైనది, కనుక అమ్మను ఈ నామంలో సర్వాధారా అంటున్నాం. 

జగత్తులను సృష్టించిన ఆ జగజ్జననియే జగదాధారా. జన్యమూ, జనకమూ రెండూ ఆ జగన్మాతయే. 

మార్కండేయ పురాణంలో, సర్వమూ, అంటే, నిత్యములూ, అనిత్యములూ, స్థూలములూ, 

సూక్ష్మములూ, అతి సూక్ష్మములూ, మూర్తములూ, అమూర్తములూ, భూమ్యంతరిక్షము లలో 

వున్నా, మరే ప్రదేశములో వున్నా, అన్నీ ఆ దేవి వలననే ఏర్పడుతున్నాయి కనుక, 

ఆ శ్రీదేవి సర్వాధార అని చెప్పబడింది. బ్రహ్మాండాలన్నింటికీ ఆధారభూతమైనది ఆ పరమేశ్వరి. 

సర్వమునకూ ఆధారమైన, ఆ సర్వాధార కు వందనం.  

ఓం శ్రీ సర్వాధారాయై నమః  

660. సుప్రతిష్ఠా

సుప్రతిష్టా అంటే జగత్తు నందు చక్కగా అధివసించి వున్నది అని అర్ధం. 

ఇరవై అక్షరముల ఒక ఛందస్సుకు సుప్రతిష్టా అనే నామమున్నది. ఆ ఛందో స్వరూపురాలు. 

చక్కగా ప్రతిష్టింపబడినది సుప్రతిష్టా. అన్ని యుగముల యందూ, అన్ని లోకముల యందూ,   

అందరు దేవతలచే, భక్తులచే ప్రతిష్టింపబడినది అని అర్ధం. 

హృదయపద్మమందు చక్కగా ప్రతిష్టింపబడి పూజలందుకుంటున్నది శ్రీరాజరాజేశ్వరి.    

భక్తితో ప్రతిష్టింపబడి సేవలందుకుంటున్న, ఆ సుప్రతిష్ఠ కు వందనం. 

ఓం శ్రీ సుప్రతిష్ఠాయై నమః  

661. సదసద్రూపధారిణీ

సత్తు, అసత్తు అను రెండు రూపములనూ ధరించిన మహామాయ. 

సత్ అంటే బ్రహ్మము, అసత్ అంటే అందుకు భిన్నమైనది అని అర్ధం. 

వ్యావహారికము, పారమార్థికము రెండూ ఆ తల్లియే. సత్ అనే సత్యమూ, అసత్ అనే మాయా రెండూ 

కూడా ఆ తల్లియే. మేధస్సుకు గోచరించేది సత్, బుద్ధికి గోచరించేది అసత్. 

బుద్ధికి గోచరించలేదు కనుక, ఆ వస్తువు లేదు అని చెప్పలేము కదా. 

అమ్మ సదసద్రూపములు రెండూ ధరించి, తెలిసినదీ నేనే, తెలియనిదీ నేనే అని చెపుతోంది. 

స్కాందపురాణంలో,"వున్నదీ, లేనిదీ రెండూ ఆ మహాదేవుని మాయచే ఏర్పడినవే" అని చెప్పారు.

గోచరమూ, అగోచరమూ అయిన రెండు రూపాలూ ధరించిన, ఆ సదసద్రూపధారిణి కి వందనం. 

ఓం శ్రీ సదసద్రూపధారిణ్యై నమః   



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి