సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా ॥ 123 ॥
611. కళాత్మికా
నక్షత్రములు ఇరవై ఏడు, ప్రతి దానికీ నాలుగు పాదములు, మొత్తము నక్షత్రాల కళలు నూట ఎనిమిది.
జాగ్రత్, స్వప్న, సుషుప్త, తురీయ అవస్థలు నాలుగు. మళ్ళీ ప్రతి అవస్థకూ నాలుగు కళలు.
ఈ కళలన్నీ కాక, విద్యలు అరవై నాలుగు, వీటినే చతుష్షష్టి కళలు అని కూడా అంటాము.
ఈ విధముగా సృష్టిలో వున్న ప్రతి విషయానికీ కళలు వున్నాయి. ఆ కళలనన్నీ సృష్టించినది
కళాత్మిక అయిన లలితాపరమేశ్వరి. ఈ సమస్తమైన కళలన్నీ ఆ లలితా పరమేశ్వరి స్వరూపాలే. కనుకనే ఈ నామంలో అమ్మను అనేకానేక కళలను సృష్టించిన కళానిధి కనుక, కళాత్మికా అంటున్నాం.
కళలనే ఆత్మగా, తన స్వరూపముగా కల, ఆ కళాత్మిక కు వందనం.
ఓం శ్రీ కళాత్మికాయై నమః
612. కళానాథా
కనుక అన్ని కళలకూ ఆ పరమేశ్వరియే స్వామిని. కనుక ఈ నామంలో ఆ తల్లిని కళానాథా
అంటున్నాం. శ్రీలలిత చంద్రస్వరూపురాలు, చంద్రమండలం నుంచే కళలన్నీ పుడుతున్నాయి.
కనుక అమ్మ చంద్రస్వరూపము, కళానాథ అని చెప్పబడింది.
ప్రశ్న ఉపనిషత్ లోని ఆరవప్రశ్నలో " షోడశ కళలూ శరీరంలోనే వున్నాయి. ఒకసారి ఆ కళలు
పురుషునిలో లీనం అయినప్పుడు, వాటికి నామరూపాలు నశిస్తాయి. ఈ విషయం గ్రహించినవాడు
కళా విముక్తుడై, అమృతుడు అవుతున్నాడు" అని పిప్పలాదుడు సుకేతుడికి చెప్పాడు.
ఈ కళలన్నింటికీ పరమేశ్వరియే అధినేత్రి. అందుకే ఆ తల్లి కళానాథా అని పిలువబడుతోంది.
కళలన్నింటికీ స్వామిని అయిన, ఆ కళానాథ కు వందనం.
ఓం శ్రీ కళానాథాయై నమః
613. కావ్యాలాప వినోదినీ
కావ్యములు ఆలపిస్తుంటే వినోదించే రసజ్ఞురాలు కనుక అమ్మను ఈ నామంలో కావ్యాలాపవినోదినీ
అన్నారు. వాల్మీకి, వ్యాసుడు మొదలైన ద్రష్టలు వ్రాసే కావ్యములలో అష్టాదశ వర్ణనలుంటాయి.
ఆ వర్ణనలన్నీ వింటూ అమ్మ వినోదిస్తుంది. ఆనందం పొందుతుంది. కావ్యాలలో కొన్ని భాగాలు
పారాయణ చేస్తే, అమ్మ ఆనందించి, అవి ఆలపించినవారికి, ఆ పారాయణ ఫలితాలను ఇస్తుంది.
నేటికీ సుందరకాండ పారాయణము, భగవద్గీతా పారాయణము, శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర
స్తోత్ర పారాయణలు వంటివి చాలామంది శ్రద్ధాభక్తులతో, చేస్తూనే వుంటారు.
గానాలాపనలు, రాగాలాపనలు అమ్మకు ఇష్టం. అందుకే కొందరు ఏకాహాలు, సప్తాహాలు,
నవాహాలు, దశాహాలు పెట్టుకుని మరీ కావ్యాలను చెప్పిస్తూ ఉంటారు.
హరికథాగానాలు మొదలైనవన్నీ ఆ పరమేశ్వరి ప్రీత్యర్ధం చేస్తూ, చేయిస్తూ వుంటారు.
కావ్యములను భక్తి శ్రద్ధలతో ఆలపిస్తుంటే ఆనందించే, ఆ కావ్యాలాప వినోదిని కి వందనం.
ఓం శ్రీ కావ్యాలాపవినోదిన్యై నమః
ఓం శ్రీ సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి