19, నవంబర్ 2021, శుక్రవారం

119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థా, ఇంద్రధనుఃప్రభా

  

కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా 
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థా, ఇంద్రధనుఃప్రభా ॥ 119 ॥

590. కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా

కటాక్షము అంటే క్రీగంటి చూపులు. అమ్మవారి క్రీగంటి చూపులకు ఆకర్షించబడి కోటానుకోట్ల

లక్ష్మీ శక్తులు అమ్మవారికి కింకరులై సేవిస్తూ ఉన్నాయని ఈ నామార్ధం. 

అమ్మవారిని ఈ నామంలో క్రీగంటి చూపులకు సేవకురాళ్లయిన, కోట్ల కొలది లక్ష్మీదేవులచే 

సేవింపబడుతున్నది అని చెప్పుకుంటున్నాం. కమల అంటే లక్ష్మి. లక్ష్మీ రూపాలు అనేకం. 

అష్టలక్ష్ములని, రాజ్యలక్ష్ములని చెప్పుకుంటూనే ఉంటాం. 

ఇంటింటా వున్న గృహాలక్ష్ములు కూడా అమ్మ సేవికలే. ఇన్ని కోట్ల మంది 

లక్ష్ముల చేత సేవలందుకుంటున్న ఆ మహామహాశక్తి, ఆ శ్రీరాజరాజేశ్వరిని ఏమని వర్ణించగలం.  

కడగంటి కృపావీక్షణం కోసం, కోటానుకోట్ల లక్ష్మీ దేవులచే  సేవలందుకుంటున్న,  

ఆ కటాక్షకింకరీభూతకమలాకోటిసేవిత కు వందనం. 

ఓం శ్రీ కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితాయై నమః  


591. శిరఃస్థితా

శిరస్సు నందు ఉండునది అని అర్ధం. ఆ లలితా పరమేశ్వరి సహస్రారంలో ఉంటుంది. 

బ్రహ్మరంధ్రంలో గురురూపంలో ఉంటుంది. 

మానవ శరీరమే శ్రీచక్రము కనుక, ఆ శ్రీచక్ర మేరు బిందువుని శిరస్సుపై భావించి ఉపాసించండి.  

శిరస్సు నందు ఉండేది కనుక శిరఃస్థితా. 'సర్వాణ్యంగాని శిరః ప్రధానం' అంటారు. 

ప్రధానాంగమైన శిరస్సు నందు వుండే ప్రధాన దేవత, ఆ శ్రీ మహారాజ్ఞి. 

నమ్మినవారికి తలమాణికమై భాసిస్తున్న, ఆ శిరఃస్థిత కు వందనం.  

ఓం శ్రీ శిరఃస్థితాయై నమః  


592. చంద్రనిభా 

చంద్రుని వంటి సమాన కాంతి, శాంతులను కలిగిన దేవి అని ఈ నామార్ధం. 

చంద్రుడు షోడశకళాప్రపూర్ణుడు. సహస్రారంలో చేరి అక్కడ సుధాధారాలను కురిపిస్తూ

ఉంటాడు. సహస్రారం దేహాని కన్నా పైన, బాహ్యంగా, జ్యోతిశ్చక్రములో  ఉంటుంది కనుక, 

ఆ సహస్రార చంద్రునికి వృద్ధి, క్షయములు లేవు. చంద్రుడిని సోముడు అంటాం.  

సహస్రారపద్మంలో కామేశ్వరుడు, కామేశ్వరితో కూడి ఉంటాడు. అక్కడ అమ్మవారు అయ్యవారి 

ఎడమతొడ పైన కూర్చుని ప్రసన్నంగా ఉంటుంది. ఉమ తో కూడిన శివుడిని సోముడు అంటాం. 

శివుడు సోముడు, ఉమ సోమిని, వారిద్దరూ సోమము అనబడే సోమలతకు అధిపతులు. 

సహస్రారములో ఒకరితో ఒకరు కూడి ఆ సోమరసమును సేవిస్తూ వుంటారు.  

చంద్రుడు సోముడు, సహస్రారములో సోమ సుధారసమును వర్షిస్తూ ఉంటాడు. 

చంద్ర సమాన కాంతితో చల్లగా ప్రకాశిస్తున్న, ఆ చంద్రనిభ కు వందనం. 

ఓం శ్రీ చంద్రనిభాయై నమః 

593. ఫాలస్థా 

ఫాలస్థా అంటే ఫాలము నందు ఉండునది. ఫాలము అంటే లలాటము, నుదురు. 

శ్రీదేవీ స్థానం కనుకనే ఫాలభాగాన్ని ఎప్పుడూ అలంకరించి, దేవీ మండపంలా పవిత్రంగా 

ఉంచుకోవాలి. అక్కడున్న శ్రీదేవిని గంధ కుంకుమాదులతో అర్చించి ధ్యానించాలి. 

ఉపాసించాలి. స్త్రీలే బొట్టు పెట్టుకోవాలి, పురుషులు తిలకము ధరించే అవసరం లేదు, అనే 

భావన తప్పు. అందరికీ ఫాల భాగంలో ఆ లలితాపరమేశ్వరి కొలువై ఉంటుంది. 

అక్కడ వున్న శ్రీదేవిని అష్టలక్ష్ములు కూడా సేవిస్తున్నాయి, త్రిమూర్తులు సేవిస్తున్నారు, 

దేవేంద్రాదులు సేవిస్తున్నారు. యతులూ, యోగులూ, సిద్ధులూ, ఋషులూ, అవధూతలూ 

అందరూ సేవిస్తున్నారు. ఎవరైనా, ఒకరిని చూసి ఒకరు నమస్కరించుకునేది, ఆ ముఖమండలంలో 

ప్రకాశిస్తున్న తేజోకళ అయిన ఆ శ్రీలలితకే అని గ్రహించండి.  

ఒకరు మనకు పెట్టే నమస్కారం, మనం వేరొకరికి పెట్టే నమస్కారం, రెండూ కూడా 

ఆ ఫాలభాగంలో ప్రకాశిస్తున్న, ఆ శ్రీదేవికి పెడుతున్న వందనమే.

ముఖమండలాన్ని, అందులోని ఫాలభాగాన్ని ఆ శ్రీమాతకు అమర్చిన పవిత్రమైన 

మందిరంలా భావించి, దానిని అలంకరించి సేవించుకోండి.

ఫాలభాగములో ఉంటూ అందరినీ కటాక్షిస్తున్న, ఆ ఫాలస్థ కు వందనం. 

ఓం శ్రీ ఫాలస్థాయై నమః 

  594. ఇంద్రధనుఃప్రభా

ఆ పరమేశ్వరి ఇంద్రధనస్సు వంటి కాంతి కలది అని ఈ నామంలో కీర్తిస్తున్నాం.

మూలాధారం నుంచి, సహస్రారం వరకు వున్న చక్రపద్మముల రంగులు గమనించండి. 

మూలాధారం ఎరుపు, స్వాధిష్ఠానము సిందూరం, మణిపూరము పసుపు, అనాహతము ఆకుపచ్చ,   

విశుద్ధి నీలము, ఆజ్ఞ లేత నీలి, లేదా ఊదా, సహస్రారము ముదురు వూదా రంగులు. 

గమనించి చూస్తే ఇవి మనం వరుసగా చెప్పుకునే ఇంద్రధనుస్సు రంగులనీ, ఇదే మన శరీరంలో 

వున్న హరివిల్లనీ కూడా చెప్పుకున్నాం. ఇంద్రధనుస్సులో వుండే రంగులు అన్నీ 

మన దేహం లోని పద్మాల పటలాలలోనే వున్నాయి. ఇవే మనలోని ఇంద్రధనుస్సుకి సంజ్ఞలు. 

డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ, సాకినీ, హాకినీ, యాకీనీ దేవతా రూపాలలో వుండి, 

మన దేహమంతా ఆక్రమించి వున్నది ఆ శ్రీలలితాపరమేశ్వరి. 

లలాటము అష్టమీ చంద్రుని వలే, హరివిల్లు వలే వున్నదని చెప్పుకున్నాం కదా . 

కనుక ఆ ఇంద్రధనస్సు మన ఫాలములోనే వుంది. అమ్మ ఫాలస్థా కదా. 

ఇంద్రధనుష్కాంతులతో మనలోనే వున్న, ఆ ఇంద్రధనుఃప్రభ కు వందనం. 

ఓం శ్రీ ఇంద్రధనుఃప్రభాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి