3, నవంబర్ 2021, బుధవారం

103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ

 

రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా 

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥

499. రక్తవర్ణా

రక్త వర్ణములో అంటే రక్తము వలె ఎర్రగా వుండు శరీరచాయ కలిగినది అని అర్ధం. 

మణిపూర చక్ర పద్మములో వుండే దేవత ఎర్రగా రక్తవర్ణములో వున్నది అని ఈ నామార్ధం. 

రక్త దోషములు వున్నా, రక్తము తక్కువైనా, పలుచగా వున్నా, ఈ నామాన్ని జపిస్తే ఆ దోషము 

పోయి తిరిగి మంచి రక్తము వస్తుంది. స్వస్థత కలుగుతుంది. 

ఎర్రని ఎరుపు రంగులో వుండే, ఆ రక్తవర్ణ కు వందనం. 

ఓం శ్రీ రక్తవర్ణాయై నమః  


500. మాంసనిష్ఠా

ఈ దేవత మాంస ధాతువులో ఉంటుంది. మాంసము నందు అభిమానము కలది అని అర్ధం. 

జీవులందరి శరీరాలలో కల మాంసము నందు స్థిరముగా వుండు దేవత. 

మనందరిలో మాంసములో ఉంటూ, మనకు కండపుష్టిని కలిగించే దేవత మణిపూరాబ్జనిలయ. 

లలితాదేవి మన చర్మములో వుంది, రక్తములో వుంది, మాంసములో వుంది. 

మనలో ఉంటూ మనలను కాపాడుతున్నది ఆ లలితాపరమేశ్వరి.   

శరీరములో మాంసము తక్కువగా వుండి, డొక్కలు ఎండిపోయి వున్నట్లైతే, 

ఈ నామం జపిస్తే, మేలు జరుగుతుంది. కండ పడుతుంది. 

మాంస రూపములో ప్రతిజీవిలో ఉంటూ పుష్టినిస్తున్న, ఆ మాంసనిష్ఠ కు వందనం.  

ఓం శ్రీ మాంసనిష్ఠాయై నమః  


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

అయిదవ వంద నామాల వివరణ


501. గుడాన్నప్రీతమానసా

ఈ నామంలో అమ్మకు గుడాన్నం అంటే ఇష్టం అని చెప్తున్నారు. గుడము అంటే బెల్లము. 

బెల్లముతో వండిన అన్నమంటే ఈ దేవతకు ఎంతో ప్రీతి. 

బెల్లము, బియ్యము, నెయ్యి వేసి బెల్లపన్నం వండి అమ్మవారికి నివేదిస్తే, అమ్మ సంతోషిస్తుంది. 

ఈ ప్రసాదము తిన్నవారికి పుష్టి కలిగి కండ పడుతుంది. 

బెల్లంతో వండిన అన్నాన్ని ఇష్టంగా స్వీకరించే, ఆ గుడాన్నప్రీతమానస కు వందనం. 

ఓం శ్రీ గుడాన్నప్రీతమానసాయై నమః  


502. సమస్తభక్తసుఖదా

భక్తులందరికీ సుఖములు ఇచ్చేది అని అర్ధం. లేదా భక్తులకు అన్ని సుఖములూ ఇచ్చేది 

అని కూడా భావించవచ్చు. 'సు' 'ఖ' అంటే మంచి ఆకాశం అని కూడా అర్ధం, ఖ అంటే ఆకాశం 

కదా. ఆకాశమును కాలుష్యము తొలగించి నిర్మలముగా చేసి ఇచ్చునది అని కూడా అర్ధం. 

తనను నమ్మి కొలిచే భక్తులకు సకల సుఖములూ కలిగించే దయా స్వరూపిణి. 

భక్తులందరి సుఖమూ ఇష్టముగా చూచుకుంటున్న, ఆ సమస్తభక్తసుఖద కు వందనం. 

ఓం శ్రీ సమస్తభక్తసుఖదాయై నమః 

  

503. లాకిన్యంబాస్వరూపిణీ 

లాకినీ అనే పేరు కల తల్లి అని ఈ నామానికి అర్ధం. పై రెండు శ్లోకాలలో చెప్పుకున్న 

అన్ని లక్షణములూ కలిగిన దేవి ఈ లాకిన్యంబాస్వరూపిణీ. 

ఈ లాకిన్యంబాస్వరూపిణియే మణిపూర చక్ర పద్మములో వున్న దేవత. 

మణిపూర చక్రాధిష్ఠాన దేవత. ఈ తల్లి మూడు ముఖములు కలిగి, వజ్రము వంటి 

ఆయుధములను ధరించి, డామరి నుంచి ఫట్కారిణి వరకు కల పది దేవతాశక్తులచే 

సేవింపబడుతూ వున్నది. ఎర్రని రక్త వర్ణముతో ప్రకాశిస్తూ, మాంసధాతువు నందు ఉంటూ, 

భక్తులందరికీ సుఖమును కలిగించే కరుణామయి. గుడాన్నమంటే ఇష్టము కలిగి వున్నది. 

మాంస ధాతువులో ఉంటూ జీవులకు పరిపుష్టి నిచ్చే, ఆ లాకిన్యంబాస్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ లాకిన్యంబాస్వరూపిణ్యై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి