అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా ॥ 124 ॥
615. ఆదిశక్తిః
ఓం శ్రీ ఆదిశక్త్యై నమః
616. అమేయా
అమేయా అంటే కొలవలేనిది అని అర్ధం. అమ్మను కొలవగలమా, అమ్మ శక్తిని కొలవగలమా.
కొలిచేందుకు ఏ పరిమాణమూ లేనిది కనుక, ఈ నామంలో ఆ తల్లిని అమేయా అంటున్నాం.
మహాత్రిపురసుందరీ నామంలో కూడా మాతృ, మాన, మేయములు మూడూ కూడా ఆ
త్రిపురసుందరీదేవియే అని చెప్పుకున్నాం. లింగపురాణంలో "స్వర్గ, పాతాళాది లోకము లందు
కల బ్రహ్మాండములన్నీ ఎనిమిది ఆవరణములనీ, తొమ్మిదవ ఆవరణ స్వయముగా ఆ ఉమాదేవి
అనీ, మహేశ్వరుడే స్వయముగా మాత" అనీ చెప్పారు.
మాతృ, మాన, మేయములు తానే అయి, ఏ కొలమానమునకూ అందని, ఆ అమేయ కు వందనం.
ఓం శ్రీ అమేయాయై నమః
617. ఆత్మా
ఆత్మ అంటే శరీరము, ఆత్మ అంటే బుద్ధి. ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే బ్రహ్మము.
సకల జీవుల శరీరముల లోనూ శ్రీలలిత వివిధ ధాతువుల రూపంలో ఉంటోంది.
అమ్మ నుంచి వచ్చిన జీవులందరూ అమ్మ స్వరూపమే. శరీరములన్నీ శివుడైతే, వాటి ఆత్మ గౌరి.
శరీరము లోని శక్తి ఆత్మ. కళ్ళల్లో చూచే శక్తి ఆత్మ. కాళ్లల్లో నడిచే శక్తి ఆత్మ. చెవుల్లో వినే శక్తి ఆత్మ.
ఆత్మ లేని చోటు లేదు. ఆత్మ లేకపోతే జీవము లేదు. జీవమున్నంత వరకూ శరీరము శివము.
జీవము లేనప్పుడు ఆ శరీరమే శవము. ఈ ఆత్మే పరబ్రహ్మము. ఈ ఆత్మే జ్ఞానస్వరూపము.
దీనిని తెలుసుకొనుటయే పరమార్ధము.
జీవులందరిలోనూ ఆత్మ తేజమై వెలుగుతున్న, ఆ ఆత్మ కు వందనం.
ఓం శ్రీ ఆత్మనే నమః
ఓం శ్రీ పరమాయై నమః
619. పావనాకృతిః
పవిత్రమైన స్వరూపము అని అర్ధము. పావనమైన ఆకారము కలది. నఖ, శిఖ పర్యంతమూ
పవిత్రమైన ఆకారము కలది కనుక అమ్మను ఈ నామంలో పావనాకృతీ అని చెప్పుకుంటున్నాం.
ఆకృతి అంటే శరీరము, చరిత్ర, జ్ఞానము అనే అర్ధాలున్నాయి. శ్రీదేవిని ధ్యానిస్తే, ఆ తల్లి
కరుణించి భక్తుల శరీరము, జ్ఞానము, చరిత్రను శుద్ధి చేస్తుంది, అని యాజ్ఞ్యవల్క్య స్మృతిలో
వుంది. తపస్సు, విద్య శరీరాన్ని శుద్ధి చేస్తే, జ్ఞానం బుద్ధిని శుద్ధి చేస్తుంది.
జీవుడే ఈశ్వరుడని తెలుసుకున్నప్పుడు, అన్నింటికన్నా ఉత్కృష్టమైన శుద్ధి కలుగుతుంది.
బ్రహ్మము వ్యక్తమై వ్యాప్తి చెందిన రూపమే పావనాకృతి అయిన శ్రీమాత.
పరమున పరమశివుడితో తాదాత్మ్యము చెందిన పరమేశ్వరియే పరమా.
తన భక్తులను జ్ఞానముతో పవిత్రము చేసే, ఆ పావనాకృతి కి వందనం.
ఓం శ్రీ పావనాకృతయే నమః
620. అనేకకోటిబ్రహ్మాండజననీ
బ్రహ్మాండములు అనేకం. ఆ బ్రహ్మాండాల కన్నింటికీ జనని శ్రీమాత.
అండ, పిండ, బ్రహ్మాండము లన్నీ అమ్మ సృష్టే.
ప్రతి బ్రహ్మాండములోనూ, లోకాలు, లోకేశులు, లోకస్థులు వున్నారు.
ప్రతి బ్రహ్మాండము లోనూ త్రిమూర్తులు, త్రిమాతలు, దేవేంద్రాది దేవతలు వున్నారు.
పిపీలికాది సమస్త జీవులూ వున్నాయి. స్థావర జంగమాలన్నీ కూడా వున్నాయి.
అన్ని బ్రహ్మాండాలూ అమ్మ చేత పంచీకరణం చేయబడే ఉంటాయి.
స్థూల బ్రహ్మాండము నందు అభిమానము కలవాడు విరాట్ అయిన పురుషుడైతే,
సూక్ష్మ బ్రహ్మాండము నందు అభిమానము కలవాడు స్వరాట్ అయిన బ్రహ్మము.
ఈ రెండింటికీ కారణభూతమైన అవ్యాకృత శరీరము పట్ల అభిమానము కలవాడు సమ్రాట్.
ఈ విశేషము వేదములో చెప్పబడింది. ఈ విరాట్, స్వరాట్, సమ్రాట్ ముగ్గురికీ జనని శ్రీమాత.
రోదసిలో తేలియాడుతున్న ఎన్నో కోట్ల బ్రహ్మాండాలలో మన బ్రహ్మాండము కూడా ఒకటి.
దానిలో వున్న పదునాలుగు లోకాల్లో, మన భూలోకము ఒకటి. ఆ భూలోకంలోని చరాచర
రూపములలో మనం కూడా వున్నాం. మన పైన ఆరు లోకాలు, మన కింద ఏడు లోకాలూ
వున్నాయి. కంటికి కనపడేది కొంచెమే, కనపడనిది ఎంతో.
ఈ లోకాలోకాలనన్నీ సృష్టించింది ఆ పరమా, పావనాకృతి అయిన ఆదిశక్తి.
ఇవి అన్నీ సృష్టి చేసినది, ఆ అనేక కోటి బ్రహ్మాండజనని అయిన, ఆ జగజ్జనని.
కోటానుకోట్ల బ్రహ్మాండములను సృష్టించిన, ఆ అనేకకోటిబ్రహ్మాండజనని కి వందనం.
ఓం శ్రీ అనేకకోటిబ్రహ్మాండజనన్యై నమః
621. దివ్యవిగ్రహా
దివ్యము అంటే దివికి సంబంధించినది అని అర్ధము. దివ్యమైనది అంటే అంతరిక్షము నుంచి
వచ్చినది. దివ్యవిగ్రహా అంటే దివ్యమైన ఆకాశము నుంచి దిగి వచ్చిన అందమైన మూర్తి.
దివ్యాకాశము నుండి ఆవిర్భవించిన రమణీయ సుందర విగ్రహం అమ్మది, అని ఈ నామంలో
చెప్పుకుంటున్నాం. అమ్మను మించిన దివ్యత్వము లేదు. అమ్మను మించిన రమణీయ రూపము
లేదు. మేదినీ నిఘంటువులో విగ్రహము అంటే శరీరము, విభాగము, విస్తారము, యుద్ధము అనే
అర్ధాలు చెప్పారు. మార్కండేయపురాణంలో చండిక ఆకాశంలో నిరాధారంగా నిలబడి రాక్షసులతో
యుద్ధం చేసిందని చెప్పారు. దేవకార్యం కోసం దివి నుండి దిగి వచ్చిన దివ్య మంగళ
విగ్రహం ఆ లలితాపరమేశ్వరి. అందుకే ఈ నామంలో ఆ తల్లిని దివ్యవిగ్రహా అంటున్నాం.
దివి నుంచి దిగి వచ్చిన దివ్య సుందర స్వరూపమైన, ఆ దివ్యవిగ్రహ కు వందనం.
ఓం శ్రీ దివ్యవిగ్రహాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి