5, నవంబర్ 2021, శుక్రవారం

105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ

 

మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా 
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥

509. మేదోనిష్ఠా

మేదోనిష్టా అంటే, మేదస్సు అను ధాతువులో ఉండునది. 

ఈ మేదస్సు, మెదడులో కొవ్వు రూపములో ఉంటుంది. దీనినే మేధస్సు అని కూడా అంటాం. 

ఈ మేదస్సు లోనే ప్రజ్ఞ ఉంటుంది. జీవుల మస్తిష్కపు కొవ్వులో వుండు దేవత మేదోనిష్టా. 

శ్రీలలిత ప్రతి జీవి మెదడులో వుండే మేదస్సనే తెల్లని మాంస రూపములో ఉంటుంది. 

జీవుల మెదడులో వుండి, వారి ఎదుగుదలకు కారణమైన, ఆ మేదోనిష్ఠ కు వందనం. 

ఓం శ్రీ మేదోనిష్ఠాయై నమః  


510. మధుప్రీతా 

మధుప్రీతా అంటే మధువు నందు ఆసక్తి కలది అని అర్ధం. మధువు అంటే మద్యము, తేనె. 

వేదములో, 'మధువుతో హోమము  చేస్తే, ఆ పరమేశ్వరి ఎంతో సంతోషిస్తుంది' అని చెప్పారు. 

అందుకే సమయాచారాన్ని పాటించే భక్తులు అభిషేకములలో వాడే పంచామృతములలో 

తేనె కూడా ముఖ్యం. తేనెతో అభిషేకము చేస్తే ఈ దేవత ప్రీతి చెందుతుంది అని ఈ నామార్ధం. 

వామాచారాన్ని పాటించే వామాచారులు నేటికీ, మద్యముతో హోమాలు, అభిషేకాలు చేస్తూనే 

వున్నారు. వామాచారము లోని మత్స్య, మద్య, మాంస, ముద్రా, మైథునము లైన పంచమకారము  

లలో మద్యము కూడా ఒకటి. మద్యమును ప్రీతితో సేవిస్తుంది కనుక, ఆ తల్లి మధుప్రీతా. 

మధువుతో తనను సేవిస్తున్న వారిని చూసి సంతోషిస్తున్న, ఆ మధుప్రీత కు వందనం.  

ఓం శ్రీ మధుప్రీతాయై నమః  


511. బందిన్యాదిసమన్వితా

స్వాధిష్టానాంబుజగత, బందిని మొదలగు ఆరు శక్తులచే సమన్వితమైనది అని భావం. 

స్వాధిష్ఠాన చక్ర పద్మానికి ఆరు దళములు అని చెప్పుకున్నాం కదా. 

ఈ బందిన్యాది ఆరు శక్తులూ ఒక్కక్క శక్తి, ఒక్కొక్క దళములో వుంటాయి. 

ఈ శక్తులు పద్మ కర్ణికలో కూర్చుని వున్న, ఆ స్వాధిష్టానాంబుజగతను పరివేష్టించి ఉంటాయి. 

ఆ ఆరు దేవతా శక్తులు, బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠితా. 

ఇవి మాతృకావర్ణమాలలో వున్న బ నుంచి ల వరకూ వున్న హల్లు అక్షరములను సూచిస్తాయి. 

ఆరు హల్లు అక్షరదేవతా శక్తులచే పరివేష్టింపబడిన, ఆ బందిన్యాదిసమన్విత కు వందనం. 

ఓం శ్రీ బందిన్యాదిసమన్వితాయై నమః  


512. దధ్యన్నాసక్తహృదయా

స్వాధిష్ఠానములో వున్న దేవతకి దధి అన్నమంటే ఇష్టం. దధ్యన్నమంటే పెరుగన్నం. 

పెరుగు కలిపిన అన్నము పట్ల ఆసక్తి కలది కనుక, ఆ తల్లి దధ్యన్నాసక్తహృదయా. 

ఆ తల్లి మనసంతా ఈ దధ్యన్నం మీదనే ఉంటుందని ఈ నామం చెపుతోంది. 

పెరుగన్నం అంటే మనసు పడే, ఆ దధ్యన్నాసక్తహృదయ కు వందనం. 

ఓం శ్రీ దధ్యన్నాసక్తహృదయాయై నమః 

  

513. కాకినీరూపధారిణీ 

కాకినీ రూపధారిణీ అన్నది ఆ  స్వాధిష్టానాంబుజగత పేరు. 

కాకినీ దేవత స్వాధిష్ఠాన చక్ర పద్మములో ఉంటుంది. నాలుగు ముఖములు కలిగి, 

నాలుగు తన్మాత్రల లోనూ ఉంటుంది. శూలము వంటి ఆయుధాలను కలిగి వున్నది. 

పచ్చని పసిమి వర్ణంలో ఉంటూ, సౌందర్యాతిశయము వలన అతిగర్వముతో, సంతోషముగా 

ఉంటుంది. జీవులందరి మెదడులో కల కొవ్వులో ఉంటూ వారి ప్రజ్ఞకు కారణమవుతోంది. 

బందిని నుంచి లంబోష్ఠితా వరకూ కల ఆరు హల్లు అక్షర శక్తి దేవతలచే సేవింపబడుతూ 

వున్నది. తేనె, మద్యమంటే బహు ప్రీతి. పెరుగన్నం అంటే మనసు పడుతుంది. 

ఈ లక్షణములన్నీ కల కాకినీ అనే దేవత స్వాధిష్ఠాన చక్రములో ప్రసన్నంగా కూర్చుని వున్నది. 

స్వాధిష్ఠాన చక్రాధిదేవత అయిన, ఆ కాకినీరూపధారిణి కి వందనం. 

ఓం శ్రీ కాకినీరూపధారిణ్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి