22, నవంబర్ 2021, సోమవారం

122. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా

  

దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ 
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥ 122 ॥

607. దేవేశీ

దేవతలకు ఈశ్వరి కనుక ఈ నామంలో ఆ పరమేశ్వరిని దేవేశీ అన్నారు. 

దివిలో ఉండేవారు దేవతలు. ఆ దేవతలందరూ కూడా శ్రీమాతనే నిత్యమూ పూజిస్తూ వుంటారు. 

బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులకు కూడా ఈ జగన్మాతే ఈశ్వరి. ఈశ్వరుడు కూడా ఈ ఈశ్వరినే

ధ్యానిస్తూ ఉంటాడు. తారకాసురుడు, మహిషాసురుడు, భండాసురుడు, చండముండులు, 

శుంభనిశుంభులు మొదలైన దానవులు దేవతలను బాధిస్తూ ఉంటే, ప్రతిసారీ దేవతలను 

రక్షించినది ఈ దేవేశి పరమేశ్వరియే. అందుకే అమ్మను ఈ నామంలో దేవేశీ అంటున్నాం. 

దేవతల పాలిట, రక్షాకవచమై భాసిల్లుతున్న, ఆ దేవేశీ కి వందనం. 

ఓం శ్రీ దేవేశ్యై నమః  


608. దండనీతిస్థా

దండనీతి అర్ధశాస్త్రములో ఒక విభాగము. దండనీతి శాస్త్రములో చెప్పబడినది కనుక,

అమ్మను ఈ నామంలో దండనీతిస్థా అన్నారు. విష్ణుపురాణంలో తర్కవిద్య, వేదవిద్య, రాజనీతి, 

దండనీతి, శిల్పశాస్త్రం, ఆయుర్వేదం వంటి విద్యలన్నీ శ్రీదేవియే అని చెప్పారని చెప్పుకున్నాం. 

ఆ పరమేశ్వరి స్వయంగా నీతిశాస్త్ర స్వరూపం. నీతి మార్గములో లేనివారిని, దారి తప్పిన వారిని, 

అమ్మ తొలుత సామ, దాన, భేద, ఉపాయములతో, తిరిగి నీతిమార్గములో పెట్టటానికి చూస్తుంది. 

వారికి సన్మార్గమును బోధించీ, సహాయ సహకారములను అందించీ, దైవారాధనకూ, ఉపాసనకూ 

తోడ్పడే మార్గములను సూచించీ, ఎన్నో ఉపాయములను ప్రయోగిస్తుంది. 

అప్పటికీ సరియైన దారిలోకి రాని వారిని, దండనీతితో దండిస్తుంది. 

దైత్యుల పట్ల చూపినది దండనీతియే. ఆ దైత్యులకు కూడా, వధించే ముందు, తమ తప్పును 

సరిదిద్దుకునే అన్ని అవకాశాలనూ ఇస్తుంది. చివరగా దండనీతిని ఉపయోగించి, వారిని తప్పు 

దారి నుంచి ఉద్ధరిస్తుంది. దేవీపురాణంలో అన్యాయమార్గంలో చరించేవారిని శిక్షించుట చేత 

ఆ శ్రీదేవికి దండనీతిస్థా అనే నామం వచ్చిందని ఉన్నది. 

దుష్టశిక్షణకై, శిష్టరక్షణకై దండనీతిని ఉపయోగించే, ఆ దండనీతిస్థ కు వందనం.  

ఓం శ్రీ దండనీతిస్థాయై నమః  


609. దహరాకాశ రూపిణీ

దహరము అంటే హృదయము, దహరములో వుండే సూక్ష్మ ఆకాశమే దహరాకాశము. 

ఆ దహరాకాశరూపంలో ప్రాణుల హృదయంలో వుండే పరమేశ్వరియే దహరాకాశరూపిణి. 

ప్రతి ప్రాణి హృదయపద్మంలో ఒక అత్యంత సూక్ష్మ గుహ వుంది. అదే దహరము. 

దానిలో వుండే ఆకాశమే అమ్మ. ప్రతి ప్రాణి హృదయాకాశములో ఉంటూ, వారికి హృదయ 

స్పందన యైనది శ్రీమాత. హృదయానికీ, కంఠానికీ మధ్యలో గలదే హృదయపద్మం. 

ఆ పద్మం మధ్యలోనే నారాయణుడి సంకల్పం మేరకు బ్రహ్మ ఆవిర్భవించాడు. 

కనుక ఈ శరీరమే బ్రహ్మపురం. ఆ బ్రహ్మపురంలో ఉన్న దహరాకాశంలో వున్నదే పరబ్రహ్మ. 

ఆ పరబ్రహ్మ స్వరూపమే దహరాకాశ స్వరూపమైన జగన్మాత. 

ప్రాణులందరి లోనూ గల హృత్పద్మములో దహరాకాశరూపములో ఉన్న,

ఆ దహరాకాశ రూపిణి కి వందనం. 

ఓం శ్రీ దహరాకాశరూపిణ్యై నమః  


610. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా

పాడ్యమి మొదలు పూర్ణిమ వరకూ వుండే అన్ని తిథుల యందూ పూజింపబడునది అని ఈ నామ 

భావం. తిథులు పాడ్యమి నుంచి, అమావాస్య, పూర్ణిమలతో కలుపుకుని మొత్తం పదహారు. 

ప్రతి తిథికీ ఒక తిథినిత్యాదేవత వుంది. వీరు త్రికోణము వలె ఏర్పడి, రేఖాత్రయ స్వరూపములో 

అమ్మను చుట్టూ ఆవరించుకుని వుంటారు. ఈ తిథినిత్యా దేవతలైన కామేశ్వరి మొదలు చిత్ర, 

మహానిత్యల వరకూ వున్న శ్రీచక్ర ప్రథమావరణ దేవతలను గురించి ముందే చెప్పుకున్నాం. 

ఈ తిథి నిత్యాదేవతల చేత పూజింపబడునది అని ఒక అర్ధం. వీరు కాక, ప్రతి తిథికీ 

దేవతలున్నారు. వరాహపురాణంలో ఈ విషయం చాలా వివరంగా చెప్పబడింది. 

మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి లేదా ప్రతిపత్ తిథి అగ్నిదేవుడికి ప్రీతి. 

విదియ అశ్వినీదేవతలకు, తదియ గౌరీదేవికి, చతుర్థి గణపతికి, పంచమి నాగదేవతలకు,  

షష్టి స్కందుడికి, సప్తమి సూర్యుడికి, అష్టమి అష్టమాతృకలకు, నవమి దుర్గకు, 

దశమి దశ దిశాపాలకులకు, ఏకాదశి కుబేరుడికి, ద్వాదశి విష్ణువుకు, త్రయోదశి ధర్మపురుషుడికి, 

చతుర్దశి రుద్రుడికి, అమావాస్య పితృదేవతలకు, పౌర్ణమి రాకాచంద్రుడికి ప్రీతికరమైన తిథులు. 

గమనించి చూస్తే ఆయా తిథుల నాడే ఆయా దేవతల ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. 

ఉదాహరణకు, గణేశచతుర్థి, నాగపంచమి, స్కందషష్టి, రథసప్తమి వంటివి.  

తిథి మండలమైన ప్రతిపద అంటే పాడ్యమి నుంచీ, రాకాంతము అంటే పౌర్ణమితో ముగిసి 

తిరిగి పాడ్యమి వచ్చేవరకూ, అన్ని తిథులలోనూ, ప్రతి తిథిలోనూ చేసే ప్రత్యేక పూజలున్నాయి. 

అటువంటి ప్రత్యేక పూజలు అన్ని తిథులలోనూ అందుకుంటున్న ఆ మాహేశ్వరిని 

ఈ నామంలో ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజితా అని చెప్పుకుంటున్నాం. 

పాడ్యమి నుంచి వచ్చే పదహారు తిథులలో,  ప్రతి తిథిలోనూ ప్రత్యేక పూజలందుకునే, 

ఆ ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత కు వందనం. 

ఓం శ్రీ ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయై నమః 

  

 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి