తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥
559. తాంబూలపూరితముఖీ
ఓం శ్రీ తాంబూలపూరితముఖ్యై నమః
560. దాడిమీకుసుమప్రభా
దాడిమీ అంటే దానిమ్మ. దాడిమీ పువ్వులు ఎర్రగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
ఈ నామంలో అమ్మవారిని దానిమ్మ పూల వంటి కాంతితో ప్రకాశిస్తున్నది అని చెప్పుకుంటున్నాం.
అమ్మ అరుణారుణ, చక్కని ఎరుపు. కొన్ని దానిమ్మ చెట్లకు కేవలము పువ్వులు మాత్రమే పూస్తాయి.
మరి కొన్ని పువ్వులూ, కాయలూ కూడా ఇస్తాయి. కేవలం పువ్వులు మాత్రమే ఇచ్చే దానిమ్మ చెట్టు
పూసే పువ్వులు మంచి శోభాయమానంగా ఎరుపురంగులో ఆకర్షణీయంగా మెరుస్తూ ఉంటాయి.
అమ్మవారి మేనిచాయ అటువంటి దాడిమీ కుసుమాల అరుణిమ అని ఈ నామార్దం.
దానిమ్మ పూల వలె ఎర్రని కాంతితో ప్రకాశించే, ఆ దాడిమీకుసుమప్రభ కు వందనం.
ఓం శ్రీ దాడిమీకుసుమప్రభాయై నమః
561. మృగాక్షీ
ఈ నామంలో అమ్మవారివి లేడి కన్నులు అని చెప్పుకుంటున్నాం.
జింక కళ్ళు బెదరు చూపులు చూస్తూ ఉంటాయి, చంచలంగా ఉంటాయి. పెద్ద పెద్ద కళ్ళు.
ఎప్పుడూ ఏమరుపాటుగా ఉండనిది మృగము, అంటే లేడి.
అమ్మవారు కూడా ఎప్పుడూ ఏమరుపాటుగా ఉండదు. ఈ జగత్తులనన్నింటినీ పోషించాలి కదా.
తన సహస్ర నేత్రాలతో ఎల్లప్పుడూ అందరినీ చూస్తూనే ఉంటుంది. గమనిస్తూనే ఉంటుంది.
అందుకే ఆ తల్లి సర్వ సాక్షి. పరమేశ్వరి విశాలాక్షి, చంచలాక్షి, హరిణాక్షి.
లేడి కన్నుల వంటి కన్నులు కల, ఆ మృగాక్షి కి వందనం.
ఓం శ్రీ మృగాక్ష్యై నమః
ఓం శ్రీ మోహిన్యై నమః
563. ముఖ్యా
ముఖ్యా అంటే ముఖ్యమైనది అని అర్ధం. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆ శ్రీమాత.
ఆ శ్రీమాత పూజ ముఖ్యం, నామం ముఖ్యం, జపం ముఖ్యం, దర్శనం ముఖ్యం, ధ్యానం ముఖ్యం.
ఏ పని యైనా ఆ శ్రీమాత తరువాతే. అందుకే ఆ శ్రీమాతను ఈ నామంలో ముఖ్యా అంటున్నాం.
ఏ పని యైనా, శ్రీకారం కానీ, ఓంకారము కానీ, వ్రాసి మొదలుపెడతాము. అందుకే ఆమె ముఖ్యా.
ఆ జగన్మాత 'సత్యం కన్నా ముందు నుంచే నేను వున్నాను' అని వేదంలో కూడా చెప్పింది.
ఆమె సనాతని, అందుకే ముఖ్యా. ఇంతకన్నా వేరొకటి ముఖ్యమైనది కాదు, లేదు.
ఓం శ్రీ ముఖ్యాయై నమః
564. మృడానీ
మృడుడు అంటే శివుడు. మృడానీ అంటే శివపత్ని శాంకరి.
సుఖము నిచ్చువాడు శివుడు. సుఖము నిచ్చునది మృడానీ.
శివుడు అత్యంత దయామయుడు, వరముల నిచ్చుటలో ఎంత మాత్రమూ ఆలస్యము చేయడు.
అందుకే బోళాశంకరుడనే పేరు కూడా వచ్చింది. భక్తులకి అనుగ్రహం చూపటంలో,
వారికి శుభములను కలుగచేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. అదే ఈ మృడుని లక్షణం.
అటువంటి మృడుని పత్నిగా అమ్మవారు భక్తుల పట్ల కరుణార్ద్ర హృదయంతో ఉంటుంది.
అందుకే మృడానీ అనే నామం వచ్చింది.
దయామృత తరంగిణి యైన, ఆ మృడాని కి వందనం.
ఓం శ్రీ మృడాన్యై నమః
565. మిత్రరూపిణీ
మిత్రుడంటే సూర్యుడు. కమలాలకు మిత్రుడు. జగత్తుకు మిత్రుడు సూర్యుడు.
అమ్మవారిని ఈ నామంలో మిత్రరూపిణీ అంటున్నాం. అంటే సూర్యుని వంటిదానా అని అర్ధం.
ఆ రాజరాజేశ్వరి కోటి సూర్య ప్రభలతో తేజరిల్లుతూ ఉంటుంది.
సూర్యుడు అమ్మకు ఒక కన్నైతే, చంద్రుడు మరొక కన్ను.
కుడి చెవి తాటంకము సూర్యుడైతే, ఎడమ చెవి తాటంకము చంద్రుడు.
జీవుడిలో పింగళానాడి సూర్యుడైతే, ఇడానాడి చంద్రుడు.
సూర్య చంద్రులిద్దరూ దివారాత్రాలలో అమ్మ నుంచి తేజస్సుని గ్రహించి లోకానికి పంచుతూ
వుంటారు. అమ్మ సూర్యుని వలె వున్నది అని ఈ నామంలో చెప్పుకుంటున్నాం.
సూర్య చంద్రులను సృష్టించింది ఆ జగదంబ.
వారికి తన తేజస్సు నిచ్చి, వారి ద్వారా జగత్తుని పోషిస్తున్నది ఈ శ్రీమాత.
శ్రీమాత తేజస్సు లేనిదే సూర్యచంద్రాగ్నులు ముగ్గురూ తేజస్సుని పొందలేరు.
ఎక్కడైనా తల్లి రూపం పిల్లలకు వస్తుంది కానీ, పిల్లల రూపం తల్లికి వస్తుందా, కనుక
మనం ఈ నామంలో సూర్యుడు తల్లి పోలిక, అందుకే ఇద్దరిదీ ఒకే రూపం అని చెప్పుకుందాం.
రాకేందువదనా నామంలో చంద్రుడు తల్లి పోలిక అని చెప్పుకున్నాం కదా.
ఆ జగదంబ సూర్యుని ద్వారా, మిత్ర రూపములో అందరికీ పుష్టి నిచ్చి పోషిస్తూ ఉంటుంది.
జన జీవన ప్రదాత అయి జీవులను పోషిస్తున్న, ఆ మిత్రరూపిణి కి వందనం.
ఓం శ్రీ మిత్రరూపిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి