2, నవంబర్ 2021, మంగళవారం

102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా వజ్రాదికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా

  

మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా 
వజ్రాదికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥

495. మణిపూరాబ్జ నిలయా

మణిపూరాబ్జనిలయా అంటే, మణిపూర పద్మములో ఉండునది అని అర్ధం. 

ఈ రెండు శ్లోకాలలో మణిపూరములో వున్న భగవతి విశేషణముల గురించి చెప్పుకుందాం. 

నాభి వద్ద మణిపూర చక్రమున్నది. ఈ మణిపూర చక్రము నకు అధిపతి విష్ణువు. 

ఆ చక్రములో వున్న పద్మముపై వున్న దేవి మణిపూరాబ్జనిలయా. 

 చక్ర పద్మమునకు పది దళములు. ఆ పద్మము కర్ణిక పై కొలువున్నదే మణిపూరాబ్జనిలయ. 

మణిపూర చక్రానిది సువర్లోకం, అగ్ని తత్వము, పసుపురంగు, రూప ప్రధానము. 

నాభి వద్ద మణిపూర చక్రములో వున్న, ఆ మణిపూరాబ్జ నిలయ కు వందనం. 

ఓం శ్రీ మణిపూరాబ్జనిలయాయై నమః  


496. వదనత్రయ సంయుతా

మణిపూరాబ్జనిలయకు మూడు వదనములు, అంటే మూడు ముఖములు. 

ఈ మూడు ముఖములు శబ్ద, స్పర్శ, రూప తత్వాలకు ప్రతీక. త్రిగుణములకూ ప్రతీక. 

మూడు ముఖములతో శోభిల్లుతున్న, ఆ వదనత్రయ సంయుత కు వందనం.  

ఓం శ్రీ వదనత్రయసంయుతాయై నమః  


497. వజ్రాదికాయుధోపేతా 

వజ్రము మొదలైన ఆయుధములను ధరించిన దేవత అని ఈ నామానికి అర్ధం. 

ఈ మణిపూరాబ్జనిలయ తన మూడు చేతులతో ఆయుధాల్ని ధరించి ఉంటుంది. 

అవి శక్తి, దండము, దంభోళి. ఈ దంభోళినే వజ్రము అని అంటారు. 

నాలుగవచేతితో అభయముద్రను చూపిస్తూ ఉంటుంది. వజ్రము వంటి 

ఆయుధములను ధరించిన దేవత కనుక వజ్రాదికాయుధోపేతా అనే నామం వచ్చింది. 

వజ్రము వంటి దంభోళిని చేతిలో పట్టుకున్న, ఆ వజ్రాదికాయుధోపేత కు వందనం. 

ఓం శ్రీ వజ్రాదికాయుధోపేతాయై నమః  


498. డామర్యాదిభిరావృతా 

ఈ మణిపూరచక్ర పద్మానికి పది దళములు అని చెప్పుకున్నాం కదా. 

ఆ పది దళములలోనూ పది శక్తులు, మధ్యలో నున్న మణిపూరాబ్జనిలయను పరివేష్టించి 

ఉంటాయి. ఆ పది దేవతా శక్తులే, మాతృకావర్ణమాలలో డ నుంచి ఫ వరకూ గల హల్లు అక్షరాలు. 

ఆ దేవతాశక్తులు వరుసగా,  డామరి, ఢంకారిణి, ణామిరి, తామసి, స్థాణ్వి, దాక్షాయణి, ధాత్రి, 

నందా, పార్వతి, ఫట్కారిణి. ఈ శక్తులు మణిపూరాబ్జనిలయను చుట్టూ చేరి సేవిస్తూ ఉంటాయి. 

డ నుంచి ఫ వరకూ కల హల్లు అక్షరరూప దేవతా శక్తులచే పరివృతమై వున్న, 

ఆ డామర్యాదిభిరావృత కు వందనం.  

ఓం శ్రీ డామర్యాదిభిరావృతాయై నమః 

  

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి