15, నవంబర్ 2021, సోమవారం

115. నిత్యతృప్తా, భక్తనిధిః, నియంత్రీ, నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ

  

 నిత్యతృప్తా, భక్తనిధిః, నియంత్రీ, నిఖిలేశ్వరీ 
మైత్ర్యాదివాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ॥ 115 ॥

566. నిత్యతృప్తా

నిత్యతృప్తా అంటే నిత్యమూ తృప్తిగా ఉండునది అని అర్ధం. ఈ నామంలో పరమేశ్వరీదేవి 

ఎప్పుడూ తృప్తిగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అమ్మ సర్వకాల, సర్వ అవస్థల యందు 

తృప్తిగా ఉంటుంది. ఎప్పుడైనా, దేనికైనా చాలు అనే భావన కలిగితే దాన్ని తృప్తి అంటాం. 

తృప్తి వలన సుఖము, దాని వలన ఆనందము, అందువలన శాంతము, ఆ పై శుభములు
 
కలుగుతాయి.  వీటన్నింటికీ మించి తృప్తి వలన సత్వగుణము పెరుగుతుంది. 

ఆ పరమేశ్వరిని సేవించినవారికి తృప్తితో పాటు పైవన్నీ కూడా లభిస్తాయి.  

నిత్యల వలన తృప్తి చెందునది అని మరో అర్ధం. నిత్యా స్వరూపము వలన నిత్యానందమును 

పొందునది పరమేశ్వరి. నిత్యాదేవతల చేత ఆరాధింపబడి, వారి సేవచే తృప్తి చెందినది అని

భావం. సర్వ జగత్తూ తన ఆదేశం మేరకు నడుస్తూ వున్నప్పుడు, తృప్తి కలుగుతుంది. 

ఆ తృప్తి వలన సుఖము కలిగి, ఆనందం వస్తుంది. ఆ విధంగా అమ్మ ఎప్పుడూ నిత్యానందములో 

ఉంటుంది. ఈ నిత్యతృప్తను సేవించినవారికీ తృప్తి నిస్తుంది. 

నిత్యమూ తృప్తితో  ఉంటూ, తనను సేవించినవారికి తృప్తిని ఇస్తున్న, ఆ నిత్యతృప్త కు వందనం. 

ఓం శ్రీ నిత్యతృప్తాయై నమః  


567. భక్తనిధిః

భక్తులకు నిధి వంటింది ఆ జగన్మాత. భక్తులకు అపారమైన, ఎన్నటికీ తరగని గని వంటి నిధి 

అమ్మ. నిధులు తొమ్మిది అని చెప్పుకున్నాం. ఆ తొమ్మిది నవ నిధులనూ తన ఆధీనంలోనే

ఉంచుకుని, ఎప్పుడు, ఎవరికి, ఏమి, కావాలో చూసి, వారి యోగ్యతను బట్టీ, అమ్మ  నిధులను 

ఇస్తూ ఉంటుంది. నవనిధులనీ భక్తుల కోరికలు తీర్చడానికే అమ్మ తన అధీనంలో 

వుంచుకున్నది. నవనిధులు వరుసగా మహాపద్మం, పద్మం, శంఖం, మకరం, కచ్చపం,

ముకుందం, నీలం, కుందం, ఖర్వం. ఈ నిధులన్నింటిలో పద్మనిధి, శంఖనిధి గొప్ప నిధులు.

ఈ నిధులన్నీ భక్తుల పట్ల కామధేనువు, కల్పవృక్షముల వంటివి.

లలితాపరమేశ్వరి చుట్టూ ఈ నవనిధులూ వుండి, అమ్మను సేవించి తృప్తి పడుతూ ఉంటాయి.

ఏనాటికీ తరగని నిధులను నియంత్రిస్తున్న, ఆ భక్తనిధి కి వందనం.   

ఓం శ్రీ భక్తనిధయే నమః  

568. నియంత్రీ 

సర్వ లోకములనూ నియమించినదీ లలితాదేవియే, వాటిని నియంత్రించునదీ ఆ లలితాదేవియే. 

ఏ పదార్ధము ఎక్కడ ఉండాలో, ఏ జీవి ఎలా ఉండాలో నిర్ణయించి, నియంత్రించే శక్తి కనుక, 

ఈ నామంలో ఆ లలితాపరమేశ్వరిని నియంత్రీ అంటున్నాం. 

త్రిమూర్తులను, త్రిమాతలను, దిక్పాలకులను, మొదలైన వారందరినీ నియమించి, వారిచేత 

సమస్త జగత్కార్యములన్నీ నిర్వహింప చేస్తోంది. ఎవరి కర్మఫలములు వారికిచ్చే నియంత్రణ

చూస్తోంది. లోకాలోకాలన్నింటి నియంత్రణా ఆ జగదీశ్వరిదే. నియంత ఒకరే ఉంటారు. 

ఆ నియంత ఈ లోకేశ్వరియే. ఆ మాత నియంత్రణలో, అందరూ ఆ తల్లి రక్షణలో, రక్షణతో వుంటారు. 

నియంతయై జగములనన్నింటినీ నడిపిస్తున్న, ఆ నియంత్రి కి వందనం. 

ఓం శ్రీ నియంత్ర్యై నమః  

569. నిఖిలేశ్వరీ

నిఖిల లోకాలకూ ఈశ్వరి కనుక ఈ నామం వచ్చింది. సమస్త ప్రపంచమునకూ ఈ మహారాజ్ఞి 

స్వామిని. నిఖిలమూ అంటే సర్వమూ, సమస్తమూ. ఈ నిఖిలానికి చెందనిది అంటూ ఏదీ లేదు, ఉండదు. 

పదునాలుగు లోకాలూ, భువనాలూ, చరాచర ప్రపంచమూ, స్థావర జంగమాలూ అన్నీ 

ఈ నిఖిలేశ్వరి పాలన లోనే ఉంటాయి. "నా విష్ణుః పృథివీ పతిః" అని చెప్పుకున్నాం కదా. 

ఈ నారాయణిలో వున్న విష్ణ్వంశ చేత సర్వ లోకాలనూ పాలిస్తూ నిఖిలేశ్వరి అనే నామం 

ధరించింది. విష్ణువును సృష్టించింది కూడా నారాయణియే కదా. 

సర్వ ప్రపంచాన్నీ తన కనుసైగలతో పాలిస్తున్న, ఆ నిఖిలేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ నిఖిలేశ్వర్యై నమః 

  

570. మైత్ర్యాదివాసనాలభ్యా
మైత్ర్యాదివాసనాలభ్యా అంటే మైత్రి మొదలైన వాసనలను కలిగివున్న వారికి లభ్యమయే తల్లి అని అర్ధం. నాలుగు రకాల వాసనలను ప్రధానంగా చెప్పుకుంటాం. అవి మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. 

వాసనలంటే అనుభూతులు. గంధాలు. ఈ నాలుగు రకాల వాసనలనీ కలిగివుండటం 

వలన లభ్యమయే తల్లి ఈ జగదీశ్వరి. ప్రపంచంలో జనులు ఏరకంగా వుంటారో, 

వారిపట్ల ఇతరులు ఏ రకంగా ఉండాలో, ఈ నామం చెప్తోంది. 

మొదటి రకం వారు సుఖులు, వీరు పూర్వ పుణ్యము వలన సుఖములు పొందుతూ వుంటారు.

వీరి పట్ల మైత్రిని చూపాలి. సుఖమును పొందుతున్నారంటే, వారిని ఆ సుఖమును 

పొందటానికి యోగ్యులుగా భావించి, వారితో స్నేహమును నెరపాలి. మైత్రితో ఉండాలి. 

రెండవరకం వారు దుఃఖితులు. వీరు దుఃఖంలో వుంటారు. ఏ ప్రారబ్ధము వలననో

దుఃఖపడుతున్న వారి పట్ల కరుణను చూపాలి. దుఃఖితులు, ఏ జన్మలో ఏమి చేశారో, పాపం 

ఇప్పుడు కష్టపడుతున్నారని దయచూపి వారితో కరుణతో మెలగాలి. వారిని దయగా చూడాలి. 

మూడవరకం వారు పుణ్యాత్ములు. వీరి పట్ల ముదితను అంటే మోదమును చూపాలి.

పుణ్యాత్ములను చూసి మోదము అంటే సంతోషమును తెలపాలి. వారి పుణ్యఫలమును చూసి 

ఆనందించాలి. ఏమి పుణ్యము చేసుకున్నారో కదా అని సంతోషించాలి. 

నాలుగవ రకం వారు పాపాత్ములు. పాపాత్ముల పట్ల ఉపేక్షను చూపాలి. 

వీరిపట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వుండాలి. అంటే అశ్రద్ధగా ఉండాలి. 

పాపాత్ములను చూసి ఎంత మాత్రమూ జాలి పడరాదు. వీరికి దూరంగా ఉండాలి. 

ఆ పరమేశ్వరి లోకంలో వుండే జీవులను ఇలా నాలుగు భాగాలుగా విభజించి, ఎవరి పట్ల ఎలా

ఉండాలో నిర్దేశిస్తోంది. ఈ రకంగా ఆ నలుగురి పట్లా, ఈ నాలుగు వాసనలనూ కలిగి వున్నవారిని 

చూసి, ఆ తల్లి సంతోషించి వారికి లభ్యమవుతుంది అని ఈ నామం చెప్తోంది. 

ఎవరి పట్ల ఎలా ఉండాలో, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో  చెప్తున్నఆ  మైత్ర్యాదివాసనాలభ్య కు వందనం. 

ఓం శ్రీ  మైత్ర్యాదివాసనాలభ్యాయై నమః 


571. మహాప్రళయ సాక్షిణీ 

కల్పాంతమందు జరిగే మహా ప్రళయాన్ని చూస్తూ పరమశివుడు మహా తాండవం చేస్తూ ఉంటాడని 

చెప్పుకున్నాం. అప్పుడు ఆ తాండవాన్ని చూస్తూ వున్న ఏకైక సాక్షి మహాప్రళయసాక్షిణీ అయిన

మాహేశ్వరి. మహా ప్రళయ కాలంలో సృష్టి అంతా, త్రిమూర్తులతో సహా, ఆ జగత్ప్రసూతి 

అయిన జగన్మాతలో లయించి పోతున్నప్పుడు, తాండవం చేస్తూ శివుడు, ఆ తాండవాన్ని చూస్తూ 

చిత్కళా రూపమైన శివానీ మాత్రమే వుంటారు. వారే నిత్యముక్తలు. ఈ శివానీ మాత్రమే నిత్య 

సుమంగళి. పరమశివుడు తప్ప, తక్కిన అందరూ ఈ మహా ప్రళయంలో లయించిపోయే వారే, 

కనుక వారి భార్యలు నిత్య సుమంగళులు కారు. 

ఈ మహాప్రళయంలో అమ్మ తనకు పునః సృష్టికి కావలసినవి మాత్రము, సుప్తావస్థలో ఉంచుకుని 

మిగిలిన సమస్తమూ లయం చేస్తుంది. ప్రళయము ముగిశాక తిరిగి మిగిలిన వాటితో తన సృష్టిని 

మొదలుపెడుతుంది. ఆ సమయంలో అమ్మవారు మహా శాంతంగా, మందహాసముతో, పాశాంకుశ, 

ఇక్షుకోదండ, పుష్పబాణములు హస్తములలో ధరించి ఉంటుంది. 

ఆ మహాప్రళయానికీ, ఈ మహాతాండవానికీ ఈ తల్లి మాత్రమే సాక్షి. అందుకే ఈ జగదాంబ మహాప్రళయసాక్షిణీ అయినది. 

కల్పాంతమందు జరిగే మహాప్రళయానికి ఏకైక సాక్షి అయిన, ఆ మహాప్రళయ సాక్షిణి కి వందనం. 

ఓం శ్రీ మహాప్రళయసాక్షిణ్యై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి