13, నవంబర్ 2021, శనివారం

113. అగ్రగణ్యా, అచింత్యరూపా, కలికల్మష నాశినీ కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా

   

అగ్రగణ్యా, అచింత్యరూపా, కలికల్మష నాశినీ 
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥

553. అగ్రగణ్యా

సృష్ట్యాది నుంచీ వున్న పరదేవత కనుక, మొట్టమొదటగా లెక్కించతగినది అని అర్ధం. 

అంటే శ్రీమాత ప్రధమ దేవతగా గణించతగినది. ఆ తల్లి కన్నా ముందు లెక్కించుటకు

వేరెవ్వరూ లేరు. కనుక ప్రధమగణ్యా, అంటే అగ్రగణ్యా అని ఒక అర్ధం. 

గణములన్నింటికీ అగ్రస్థానంలో వున్నది, కనుక అగ్రగణ్యా అని మరొక అర్ధం. 

అన్ని గణాలూ, దేవతాగణాలూ, ప్రమథగణాలూ, విష్ణుగణాలూ, శక్తిగణాలూ, మొదలైనవి అన్నీ 

ఆ శ్రీదేవి సృష్టించినవే. ఆ గణాలన్నింటికీ ఆద్యురాలు కనుక అగ్రగణ్యా అనే నామం వచ్చింది. 

గణము, అంటే లెక్క పొందినది కనుక గణ్య అయినది. మొట్టమొదటగా గణించబడినది, 

లెక్కించబడినది కనుక అగ్రగణ్యా అని పేరు పొందింది. 

జగములన్నింటిలో కెల్లా అగ్రస్థానములో వున్న, ఆ అగ్రగణ్య కు వందనం. 

ఓం శ్రీ అగ్రగణ్యాయై నమః  


554. అచింత్యరూపా

చింతించటానికి రూపము లేనిది అని అర్ధం. అమ్మను ధ్యానిద్దామంటే, అమ్మ గురించి

ఆలోచిద్దామంటే, ఆ తల్లికి ఒక ప్రత్యేక రూపము లేకపోవుట చేత, అమ్మను అచింత్యరూపా

అన్నారు. ఊహింప శక్యము కాని రూపము కలది అని అర్ధం. ఏ గుణమునకూ చెందనిది కనుక, 

ఆ జగజ్జనని స్వరూప స్వభావ విశేషాల గురించి ఏమీ తెలియదు. 

ఏమీ తెలియని ఒక అవ్యక్త శక్తిని ఏ విధంగా భావించగలము. ఏమని భావించగలం. 

త్రిమూర్తులకైనా దొరకనిది అమ్మ రూపము. అటువంటి దుర్లభమైన రూపమును పట్టుకోవటానికి, 

వూహించడానికి, భావించడానికి, చింతించడానికి ఎవరికి శక్యము. 

అందుకే అమ్మను అచింత్యరూపా అన్నారు. నిర్దుష్టంగా చెప్పటానికి ఒక రూపము లేనిది శ్రీమాత. 

భావనకు, ఊహకు అందని అవ్యక్త రూపము కల, ఆ అచింత్యరూప కు వందనం.  

ఓం శ్రీ అచింత్యరూపాయై నమః  


555. కలికల్మషనాశినీ

ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం, కలికాలం. కల్మషములే ఎక్కువగా వున్న కాలం.  

ధర్మదేవత కృత యుగంలో నాలుగు పాదాలపై, త్రేతాయుగంలో మూడు పాదాలపై,

ద్వాపరయుగంలో రెండు పాదాలపై నిలబడితే, కలియుగంలో ఒక్క పాదం పైనే ఆధారపడి 

వున్నది అంటారు. అందుకే కలిలో మలినములు, పాపములు ఎక్కువ. 

మానవులందరూ కల్మషములతో, కుట్రలతో, కుతంత్రాలతో కుళ్లిపోయి ఉంటారు.  

మరి ఈ పాప విముక్తి ఎలా జరుగుతుంది, ఎప్పటికి జరుగుతుంది అనే ప్రశ్నలు వస్తే 

మాత్రం సమాధానం తిరిగి ఆ లలితాపరమేశ్వరియే. 

కూర్మ పురాణంలో, నిప్పుని చల్లార్చటానికి నీరు, చీకటిని చీల్చటానికి సూర్యుడు వున్నట్టే,

కలికాలంలో పాపాలు పోగొట్టటానికి శ్రీదేవి నామాలే శరణ్యం అని చెప్పారు. 

బ్రహ్మాండపురాణంలో కూడా, తెలిసి చేసినా, తెలియక చేసినా, చేసిన పాపం పోవాలంటే, 

ఆ దేవీ పాద పద్మాలను ధ్యానించటం ఒక్కటే మార్గం అని చెప్పబడింది. కనుక ఈ కలికాలంలో 

పాపాలు పోగొట్టే శక్తి కలది కేవలం ఆ శ్రీమాతయే అని నిర్ద్వంద్వంగా చెప్పబడింది. 

కలికాలంలో తనను సేవించిన వారి పాపాలు నాశనం చేసే, ఆ కలికల్మషనాశిని కి వందనం. 

ఓం శ్రీ కలికల్మషనాశిన్యై నమః  


556. కాత్యాయనీ 

కాత్యాయనుడనే మహర్షి కూతురు కనుక కాత్యాయనీ అని పిలువబడుతోంది. 

కతుడనే మహర్షి కుమారుడు కత్యుడు. ఈ కత్యుడికే కాత్యాయనుడని పేరు. 

ఈ కత్యుడు తపస్సు చేసి ఆ పరమేశ్వరిని తనకి కూతురుగా పుట్టమని వరం కోరాడు. 

ఆ తపఃఫలితంగా ఆ పరమేశ్వరి కత్యుడికి కుమార్తెయై కాత్యాయనీ రూపం ధరించింది. 

మహిషాసురవధ కోసం దేవతలందరూ తమ శక్తిని ధారపోసి ఒక అజేయ శక్తిని సృష్టించారు. 

ఆ సర్వదేవతాతేజస్స్వరూపిణి  మహిషాసురుణ్ణి చంపిన తరువాత కూడా శాంతించక, 

ఉగ్ర రూపంలో ఉంటే, కాత్యాయన మహర్షి అమ్మవారి నుంచి వెలువడిన ఆ ఉగ్రకిరణాలను 

క్రమబద్ధీకరించి, ఆ అమ్మను ప్రసన్నం చేసుకుంటాడు. 

ఆనాటి నుంచీ దేవి కాత్యాయనుని పుత్రికయై కాత్యాయనీ అనే నామం ధరించింది అని చెప్తారు. 

వివాహం కాని గోపకన్యలు ధనుర్మాసంలో కాత్యాయనీ వ్రతం చేసి, ఆ దేవతను ఆరాధించి

శ్రీకృష్ణుడిని పతిగా పొందారని భాగవతంలో వుంది. కాత్యాయనిని ఆరాధిస్తే కృష్ణుడు లభిస్తాడు. 

తిరుప్పావై పాటలు ఈ కాత్యాయనీ వ్రతంలో భాగమే. 

కాత్యాయనీదేవిని అర్చిస్తే, ఆ దేవత అనుగ్రహం వలన పెళ్లి కాని ఆడపిల్లలకు తగిన వరునితో వివాహం అవుతుందని నేటికీ ఒక విశ్వాసం. 

ఓఢ్రదేశం జగన్నాథుడికీ, కాత్యాయనికీ పీఠము అని చెప్తారు. 

ఓఢ్యాణపీఠంలో వుండే దేవతను కాత్యాయనిగా కొలుస్తారు. 

దేవీపురాణంలో మాత్రం, ' క అంటే బ్రహ్మ, బ్రహ్మ శిరస్సు నందు వసించునది కనుక కాత్యాయనీ' 

అని చెప్పారు. దేవీ నవరాత్రులలో అయిదవనాడు పూజలందుకునేది ఈ కాత్యాయనియే. 

ఓఢ్యాణపీఠాభిమానిని అయిన, ఆ కాత్యాయని కి వందనం. 

ఓం శ్రీ కాత్యాయన్యై నమః 

  

557. కాలహంత్రీ

కాలుడికే కాలుడు అంటే మృత్యువుకే మృత్యువు పరమేశ్వరి. అందుకే ఈ నామంలో కాలహంత్రీ 

అంటున్నాం. కాలుడు కూడా అమ్మ ఆజ్ఞను అనుసరించే జీవుల ప్రాణాలు తీస్తూ ఉంటాడు. 

కానీ ఆ కాలుడిని కూడా హననం చేయగల శక్తి కనుక అమ్మకు కాలహంత్రీ అనే నామం వచ్చింది. 

ఆ లలితాపరమేశ్వరికి మృత్యువు లేదు. ఆదీ లేదు, అంతమూ లేదు అని చెప్పుకున్నాం. 

అమ్మ ఆజ్ఞను ధిక్కరించి కాలుడు కూడా ఏమీ చేయలేడు. అమ్మ సర్వమృత్యునివారిణీ కదా. 

'కాలో దురతిక్రమః' అంటారు. కానీ శుద్ధజ్ఞానస్వరూపమైన అమ్మకు మాత్రం ఆ కాలుడు లోబడే ఉంటాడు. 

మృత్యువును తప్పించగల ఏకైక శక్తి ఆ కాలహంత్రీ యైన లలితాదేవియే. 

కాలుడికే కాలస్వరూపమును నిర్దేశిస్తున్న, ఆ కాలహంత్రి కి వందనం. 

ఓం శ్రీ కాలహంత్ర్యై నమః 


558. కమలాక్షనిషేవితా

కమలాక్షుడంటే శ్రీమహావిష్ణువు. శ్రీమహావిష్ణువు చేత పూజింపబడునది కనుక ఈ నామం వచ్చింది. 

నారాయణుడు ఎల్లప్పుడూ ఇంద్రనీలమణుల సమాన కాంతితో  ప్రకాశిస్తున్న ఆ నారాయణీ 

రూపాన్ని సేవిస్తాడు. కనుక అమ్మవారికి ఈ నామం ఏర్పడింది. 

అనునిత్యమూ నారాయణిని సేవించి నారాయణుడు ఆ శ్రీమాతతో సారూప్యం పొందాడు. 

అందుకే నారాయణి, నారాయణులిద్దరూ ఒకటే. 

శ్రీమన్నారాయణునిచే నిత్యమూ పూజింపబడే, ఆ కమలాక్షనిషేవిత కు వందనం. 

ఓం శ్రీ కమలాక్షనిషేవితాయై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి