6, నవంబర్ 2021, శనివారం

106. మూలాధారాంబుజారూఢా, పంచవక్త్రా, అస్థిసంస్థితా అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా

 

మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా, స్థిసంస్థితా 
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106 ॥

514. మూలాధారాంబుజారూఢా

మూలాధారాంబుజారూఢా అంటే, మూలాధార పద్మములో ఉండునది అని అర్ధం. 

రాబోయే ఆరు నామాలలో, మూలాధారములో వున్న ఆ భగవతి విశేషణముల గురించి 

తెలుసుకుందాం. గుదస్థానము వద్ద మూలాధార చక్రమున్నది. 

ఈ చక్రమే ఆది చక్రము, ఆధారచక్రము. అధిపతి గణపతి. అందుకే గణపతి ఆది పూజ్యుడు. 

ఆ చక్రములో వున్న పద్మముపై వున్న దేవతయే మూలాధారాంబుజారూఢా. 

 చక్రపద్మమునకు నాలుగు దళములు. ఆ పద్మకర్ణికపై వున్నదే మూలాధారాంబుజారూఢా. 

మూలాధార చక్రానిది భూలోకం, పృధ్వీతత్వము, ఎరుపు రంగు, గంధ ప్రధానము. 

గుదస్థానము వద్ద, మూలాధారచక్రములో వున్న, ఆ మూలాధారాంబుజారూఢ కు వందనం. 
 

ఓం శ్రీ మూలాధారాంబుజారూఢాయై నమః  


515. పంచవక్త్రా

వక్త్రము అంటే ముఖము. ఈ దేవత అయిదు ముఖములు కలిగివుంటుంది. 

మూలాధారాంబుజారూఢ ధూమ్రవర్ణములో ఉంటుంది. 

అయిదు ముఖములు అయిదు తన్మాత్రలైన, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు ప్రతీకలు. 

సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాలకు కూడా ఈ అయిదు ముఖాలూ 

ప్రతీకలు. పంచభూతాలు ఆ పంచ వక్త్రాలుగా చెప్పబడ్డాయి.  

అయిదు ముఖములచే మనోజ్ఞంగా వున్న,  ఆ పంచవక్త్ర కు వందనం.  

ఓం శ్రీ పంచవక్త్రాయై నమః  


516. అస్థిసంస్థితా

డాకినీ చర్మములోనూ, రాకినీ రక్తములోనూ, లాకినీ మాంసములోనూ, 

కాకినీ మేదస్సులోనూ ఉంటే, ఈ మూలాధార స్థిత ముకలలో వున్నది.  

ప్రతిజీవికీ ఎముకలలో ఉంటూ, రూపాన్నీ, ఎముక పుష్టినీ కలుగచేస్తున్న దేవత. 

ఎముకలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే, ఈ నామం జపిస్తే, స్వస్థత లభిస్తుంది. 

అస్థులలో ఉంటూ, జీవుని భౌతిక దేహానికి దృఢత్వాన్ని ఇస్తున్న, ఆ అస్థిసంస్థిత కు వందనం. 

ఓం శ్రీ అస్థిసంస్థితాయై నమః  


517. అంకుశాదిప్రహరణా 

మూలాధారాంబుజారూఢ కు అంకుశము ఆయుధము. దానిని చేత ధరించి ఉంటుంది. 

నాలుగు చేతుల లోనూ అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర ఉంటాయి. 

అంకుశమును ధరించి వున్న, ఆ అంకుశాదిప్రహరణ కు వందనం. 

ఓం శ్రీ అంకుశాదిప్రహరణాయై నమః 

  

518. వరదాది నిషేవితా 

వరద మొదలైన నాలుగు శక్తులచే సేవింపబడు తల్లి అని ఈ నామానికి అర్ధం. 

మూలాధార చక్రానికి నాలుగు దళములు. ఆ నాలుగు దళములలోనూ నాలుగు దేవతా శక్తులు 

వుండి, ఆ మూలాధారాంబుజారూఢను కొలుస్తూ వుంటారు. 

ఆ దేవతలే మాతృకా వర్ణమాలలోని వ, శ, ష, స అనే హల్లు అక్షరములు. 

వారే వరుసగా, వరద, శ్రీ, షండ, సరస్వతి అని పిలువబడే దేవతా శక్తులు. 

వ, శ, ష, స అనే హల్లు అక్షర దేవతా శక్తులచే సేవింపబడే, ఆ వరదాది నిషేవిత కు వందనం. 

ఓం శ్రీ వరదాది నిషేవితాయై  నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి