16, నవంబర్ 2021, మంగళవారం

116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ

  

 పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ 

మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥

572. పరాశక్తిః

పరాశక్తి అంటే, మహోత్కృష్టమైన శక్తి స్వరూపురాలు అని అర్ధం. 

కామికాగమములో శరీరమందు కల పదవ ధాతువుకు పరాశక్తి అని పేరు అని చెప్పారు. 

చర్మము, రక్తము, మాంసము, మేదస్సు, ఎముక ఈ ఐదూ శక్తి మూలక ధాతువులు, 

కనుక శక్త్యాత్మకాలు. మజ్జ, శుక్లము, ప్రాణము, జీవుడు ఈ నాలుగు శివ మూలక ధాతువులు, కనుక 

శివాత్మకాలు. ఈ తొమ్మిదింటికీ శివచక్రములు, శక్తి చక్రములని పేరు. 

ఈ తొమ్మిది ధాతువుల వలననే నవయోని సముద్భవమైన దేహము ఏర్పడుతోంది. 

కనుక ఈ తొమ్మిదీ సకల జగత్తుకూ మూలకారణం. వీటిని నియంత్రించే, లేదా నిర్వహించే 

ఉత్కృష్టమైన పదవ ధాతువే పరాశక్తి. లోకములో ఎక్కడ, ఏ శక్తి కనిపించినా అది ఈ పరాశక్తియే. 

లింగపురాణంలో వస్తువులన్నీ శివస్వరూపాలు, వాటిలో వున్న శక్తి దేవీ స్వరూపము అని చెప్పారు. 

పరామంత్రము యొక్క శక్తి స్వరూపురాలు ఈ పరాశక్తియే. పరా మార్గాన్ని ఉపదేశించేది పరాశక్తి. 

శరీరములో పదవ ధాతువు రూపములో వుండి, శక్తిని కలుగచేస్తున్న, ఆ పరాశక్తి కి వందనం. 

ఓం శ్రీ  పరాశక్త్యై నమః  


573. పరానిష్ఠా

పరము పట్ల నిష్ఠ కలిగిన దేవి పరానిష్ఠా. ఆ శక్తి నిచ్చేది పరాశక్తి. 

నిష్ఠా అంటే ముగింపు, సమాప్తి. పరానిష్ఠా అంటే, ఉత్కృష్ఠమైన ముగింపు అని అర్ధం. 

సమాప్తి అంటే జ్ఞాన విశేషము. సర్వకర్మలు, అన్ని జగత్తులు ఈ జ్ఞానములోనే సమాప్తమవుతాయి. 

అంటే, జ్ఞానం కలిగిన తరువాత కర్మలు సమాప్తమవుతాయి, కర్మలు అంటవు, అని అర్ధం. 

భగవద్గీతలో, "ఓ పార్థా, అఖిల కర్మలు జ్ఞానంతో పరిసమాప్తి అవుతాయి" అని చెప్పబడింది. 

సూతగీతలో కూడా, పరానిష్ఠా అంటే, కర్మలు నశించిన తరువాత కలిగే జిజ్ఞాస అని చెప్పబడింది. 

శాస్త్రములు చదివి, ఆచార్యోపదేశములు పొంది, తర్కజ్ఞానము కలిగి, 

ఉపాసకుడు అద్వైత జ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్నీ పొందుతాడు. ఈ ప్రక్రియే పరానిష్ఠా. 

పరతత్వము పట్ల నిష్ఠ కలిగి వుండే, ఆ పరానిష్ఠ కు వందనం.  

ఓం శ్రీ పరానిష్ఠాయై నమః  


574. ప్రజ్ఞాన ఘనరూపిణీ 

ప్రజ్ఞానము అంటే విస్తృతమైన జ్ఞానము. ఘనీభవించిన ప్రజ్ఞానము కలది ప్రజ్ఞానఘనరూపిణీ. 

ఈ నామంలో అమ్మవారి ఉత్కృష్టమైన జ్ఞానస్వరూపాన్ని గురించి చెప్పుకుంటున్నాం. 

ప్రజ్ఞానము అంటే, చిక్కని జ్ఞానము, అందునా ఆ జ్ఞానము పొరల మధ్య ఎటువంటి శూన్యమూ, 

బీటలు లేకుండా ఘనీభవించిన స్థితిలో ఉన్నది. స్వయంగా ఆ తల్లే శుద్ధజ్ఞాన స్వరూపము కదా, 

మరి ఆ సాంద్ర జ్ఞానరూపములో బీటలు, రంధ్రాలు ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి. 

లేశమైనా  అజ్ఞాన స్పర్శ లేనటువంటి దట్టమైన, ఘన జ్ఞాన స్వరూపిణి అమ్మ. 

అందుకే ఆ తల్లి ప్రజ్ఞాన ఘన రూపిణీ అనే నామం ధరించింది. 

భూమిలో దొరికే సైంధవలవణంలో లవణరసము సంపూర్ణంగా ఘనీభవించి, చిక్కని రాయిలా 

కనబడుతుంది. కొద్దిగా అయినా దానిలో తేమ కనిపించదు, కానీ దానిని రుచి చూస్తే, లవణరసము 

ఊరి రుచి, రసము తెలుస్తాయి. అదే విధంగా ఆ శ్రీలలిత జ్ఞానము కూడా ఘనీభవించి పైకి 

ఘనము వలే తోచినా, లోలోన దాగి వున్న ఆ జ్ఞానామృతపు రుచి ఉపాసకులకు తెలుస్తుంది. 

ఎట్టి లోపములూ లేని సంపూర్ణ జ్ఞానస్వరూపిణి అయిన, ఆ ప్రజ్ఞాన ఘనరూపిణి కి వందనం. 

ఓం శ్రీ ప్రజ్ఞానఘనరూపిణ్యై నమః  


575. మాధ్వీపానాలసా 

మధుపానము వలన అలసత్వమును పొందినది అని అర్ధం. మాధ్వీ అంటే మధువు. 

ద్రాక్షతో చేసిన మద్యము. ఆ మద్యమును సేవించి పరమేశ్వరి పరవశురాలై వున్నది, 

అని ఈ నామానికి అర్ధం. సాధారణంగా, మద్యమును సేవించిన వారికి ఇతర స్ఫురణ ఉండదు. 

ఆ పరమేశ్వరి మాత్రం ద్రాక్షాసవమును కానీ, మరి ఏ ఇతర పదార్ధముతో చేయబడిన మద్యమును 

కానీ, పానము చేసిన తరువాత కూడా, నిర్వికారంగా, సంపూర్ణమైన బ్రహ్మానందంలో ఉంటుంది. 

సహస్రారం చేరి, అక్కడ వర్షించే సుధాధారాలలో తడిసిన ఉపాసకులు కూడా ఇటువంటి 

బ్రహ్మానంద స్థితినే పొంది, మైకంలో వుంటారు. 

భక్తులలో మధురభక్తి ఒక రకం. గోపికలు, మీరాబాయి, చైతన్యప్రభు మొదలైనవారిది మధురభక్తి. 

ఆ మధురభక్తి పరాయణులు, మధుర భక్తి అనే మధురరసం వంటి మధువును గ్రోలి, నిరంతరం, 

మరో ధ్యాస లేకుండా ఆ కృష్ణధ్యాస లోనే మత్తులై  వుంటారు. 

పరమేశ్వరి కూడా మధుపానం చేసి, ఆ బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. 

మధుపానం చేసి, అలసురాలైన, ఆ మాధ్వీపానాలస కు వందనం. 

ఓం శ్రీ మాధ్వీపానాలసాయై నమః 

  

576. మత్తా

ప్రజ్ఞానఘనరూపిణి అయిన, ఆ పరమేశ్వరి, మాధ్వీపానాలసయై, మత్తెక్కి  వున్నది. 

అందుకే ఈ నామంలో అమ్మవారిని మత్తా అని అంటున్నాం. మదించిన ఆనందముతో 

వున్నది అని అర్ధం. మామూలుగా మధుపానం చేస్తే, బాహ్య జ్ఞానము లేని స్థితి ఉంటుంది. 

ఆ పరమేశ్వరిపై ఘనమైన ఆసక్తి వున్న ఉపాసకులు, 'అమ్మ భక్తి'  అనే మధువును త్రాగి,

ఆ మత్తులో మునిగి ఇంద్రియ స్పృహను కోల్పోతారు. ఏ వృత్తినీ లెక్కచేయక, 

భక్తి మత్తు లోనే మునిగి వుంటారు. నిర్వికార సమాధి స్థితి లోకి చేరిన అటువంటి భక్తులకు 

ఆ పరిస్థితిలో, అమ్మ స్పృహ తప్ప మరేదీ లేక, అప్రమత్తత లేక, మత్తులై వుంటారు. 

మదిరా పానముచే మత్తెక్కి వుండి, భక్తులకు, భక్తి మత్తును అందిస్తున్న, ఆ మత్త కు వందనం. 

ఓం శ్రీ మత్తాయై నమః 


577. మాతృకా వర్ణ రూపిణీ

'అ' కారము నుంచి 'క్ష' కారము వరకూ కల అక్షరములకు మాతృకా వర్ణములని పేరు. 

యాభైఒక్క అక్షరముల స్వరూపము, అక్షమాలా స్వరూపురాలు, ఈ మాతృకావర్ణరూపిణీ. 

అక్షరము లన్నింటికీ వర్ణములు ఇచ్చినది ఈ మాతృకావర్ణరూపిణీ. 

ఆ రంగులన్నింటి స్వరూపమే మాతృకావర్ణరూపిణీ. యాభైఒక్క అక్షరములకూ 

రంగులున్నాయి, రూపములున్నాయి. ఈ వివరాలు స్కందసంహితలో చెప్పబడ్డాయి. 

ప్రతి అక్షరమునకూ దేవతలున్నారు, వారికి గుణములున్నాయి, శక్తులున్నాయి,

శబ్దములున్నాయి, ఆ నాదాలకు పరిధులున్నాయి. ఈ మాతృకా వర్ణములే శ్రీచక్రములని 

కూడా చెప్పబడ్డాయి. ఈ విశేషాలు అన్నీ మాతృకా వివేకములో వున్నాయి. 

మాతృకా వర్ణములను శ్రీచక్రముతో అనుసంధానించటమే కైలాసప్రస్తారమని సనందన 

సంహితలో చెప్పారు. ప్రతి  అక్షరమూ మహత్తరమైన శక్తి కల బీజాక్షరమే. అక్షర మంత్రమే. 

ఉపాసకులు, ఏ అక్షరమును తీసుకుని ఉపాసించినా, ఈ బీజాక్షరాలు ఫలితాన్నిస్తాయి . 

కొన్ని యోగ శాఖలలో, ఏదో ఒక అక్షరమును ఎంచుకుని, దానినే సాధకులకు మంత్రము వలె 

ఉపదేశము చేసే పద్ధతి కూడా వుంది. అన్ని అక్షరములూ మాతృకావర్ణరూపములే. 

ప్రతి అక్షరమునూ శ్రీచక్రముతో సరిపోలుస్తున్న, ఆ మాతృకా వర్ణ రూపిణి కి వందనం. 

ఓం శ్రీ మాతృకావర్ణ రూపిణ్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి