హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥
595. హృదయస్థా
ఓం శ్రీ హృదయస్థాయై నమః
596. రవిప్రఖ్యా
రవి ప్రఖ్యా అంటే సూర్య సమానురాలని పేరు బడినది అని భావం. సూర్య కాంతి వంటి కాంతితో
ప్రకాశించునది అని ఒక అర్ధం. ముందు శ్లోకంలో చంద్ర నిభా అని చెప్పుకున్నట్లే, ఈ నామంలో
రవిప్రఖ్యా అని చెప్పుకుంటున్నాం. ద్వితీయ కూటము అయిన కామరాజకూటములో వుండే
హృదయంలో సూర్యమండలం వుంది. ఆ సూర్యమండల దేవత శ్రీలలిత.
పగటి వేళ సూర్యుని వలెనూ, రాత్రి సమయాల్లో చంద్రుని వలెనూ,
సంధ్యాకాలాల్లో అగ్ని వలెనూ ప్రకాశించునది శ్రీలలిత.
ఆ జగజ్జనని సూర్య, చంద్ర, అగ్ని మండలాల ద్వారా ఈ జగత్తుని పోషిస్తున్నది.
హృదయములో సూర్యుని వలె తేజస్సుతో ప్రకాశిస్తున్న, ఆ రవిప్రఖ్య కు వందనం.
ఓం శ్రీ రవిప్రఖ్యాయై నమః
597. త్రికోణాంతరదీపికా
మూలాధార పద్మ కర్ణిక మధ్యలో ఒక త్రిభుజమున్నది. ఆ త్రిభుజం మధ్యలో బిందువు వద్ద,
అగ్ని మండలమున్నది. దీనినే ప్రధమ కూటము అని కూడా అంటారు.
ఆ త్రికోణము అంతర్భాగాన, దీపిక వలె వెలుగుచున్నది లలితాదేవి అని అర్ధం.
తంత్రరాజములో, "ఉదయించుచున్న మూలాధారం నందు పావకుడి అగ్ని మండలమున్నది.
వికసిస్తున్న హృదయము నందు ప్రభాకర మండలమున్నది. శిరస్సు నందు వికసించుతున్న
బ్రహ్మరంధ్రమునకు కొద్దిగా కిందుగా చంద్ర మండలమున్నది" అని చెప్పారు.
చంద్రనిభా నామంలో చంద్ర సమాన కాంతి కలది అని చెప్పుకున్నాం.
సూర్యునితో సమాన కాంతి కలది అని రవిప్రఖ్యా నామంలో చెప్పుకున్నాం.
ఈ నామంలో అమ్మను అగ్ని కాంతితో దీపంలా వెలుగుతున్నది అని చెప్పుకుంటున్నాం.
ఈ మూడు భాగాలూ, శ్రీవిద్య లోని మూడు ఖండాలు.
ప్రతి చక్రము వద్దా త్రిభుజాలు ఉంటాయి. ఆ త్రిభుజాల మధ్యలో బిందువులూ ఉంటాయి.
హృదయము వద్ద గల త్రిభుజములోని, త్రికోణములో గల బిందువు వద్ద దీపములా వెలుగుతూ,
ఆ వెలుగును అన్ని దిక్కులకూ ప్రసరింపచేస్తూ, తన చుట్టూ కాంతులను వెదజల్లుతోంది అమ్మ.
హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతరదీపికా అనే ఈ మూడు నామాలలో హృదయం లోని
ఆ శ్రీలలితను గురించే చెప్పుకుంటున్నాం. అమ్మవారు హృదయంలో సూర్య కాంతితో
విరాజిల్లుతూ, అక్కడ గల త్రికోణములో అగ్నిశిఖ వలె ప్రకాశిస్తున్నది అని చెప్పుకుంటున్నాం.
మూలాధార మండలములోని త్రికోణములో దీపములా ప్రజ్వరిల్లుతున్న,
ఆ త్రికోణాంతరదీపిక కు వందనం.
ఓం శ్రీ త్రికోణాంతరదీపికాయై నమః
ఓం శ్రీ దాక్షాయణ్యై నమః
599. దైత్యహంత్రీ
దైత్య హంత్రీ అంటే దైత్యులను సంహరించిన శక్తి అని అర్ధం.
దైత్య భావనలు ఎక్కడ వున్నా, వాటిని దునుమాడి, ధర్మాన్ని సంరక్షించటం ఈ తల్లి లక్షణం.
ఆదిత్యులు అంటే సూర్యమండలలో నివసించేవారు. వెలుగునిచ్చేవారు. జ్ఞానాన్నిచ్చేవారు.
అదితీ మాత సంతానం. సత్వగుణ ప్రధానులు. దేవతలు.
విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, మొదలైన వారు ఆదిత్యులు.
దైత్యులు అంటే దితీ మాత సంతానం. అజ్ఞానానికి, అధర్మానికి సంకేతం. రాక్షసులు. అసురులు.
రజో, తమో గుణ ప్రధానులు. భండాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్యాక్ష,
హిరణ్యకశిపులు మొదలైనవారు దైత్యులు. దైత్యులు అధర్మ వర్తనంలో ఉంటే వారిని సంహరించి
ఉద్ధరించేది దాక్షాయణీ స్వరూపం. అందుకే దాక్షాయణికి దైత్యహంత్రీ అనే నామం వచ్చింది.
ఓం శ్రీ దైత్యహంత్ర్యై నమః
600. దక్షయజ్ఞవినాశినీ
దక్ష యజ్ఞము దాక్షాయణి వలననే నాశనము అయింది.
దక్ష యజ్ఞ వినాశనానికి కారణము దక్షుడి గర్వం, ఆ యజ్ఞాన్ని నాశనము చేసినది భైరవుడు,
అయినా ఈ మొత్తం కార్యం సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అవటం వలన జరిగింది కనుక,
అమ్మకు దక్షయఙ్ఞవినాశినీ అనే నామం వచ్చింది.
దక్షప్రజాపతి తన కూతురైన సతీదేవిని శివునకు ఇచ్చి వివాహం చేసాడు. దక్షుడంటే సమర్ధుడు
అనుకున్నాం కదా. తాను సమర్ధుణ్ణి అనుకునే సరికి దక్షుడికి గర్వం హెచ్చింది.
శివుడు తనకు తగినంత గౌరవం ఇవ్వలేదని కోపించి, తాను చేసే యజ్ఞాన్ని నిరీశ్వర యాగం
అని ప్రకటించి, శివుడినీ, సతీదేవినీ ఆ యజ్ఞానికి పిలువలేదు.
శివుడిని ఆవాహన చేయకుండా, తండ్రి యజ్ఞం చేయటం సతీదేవికి నచ్చలేదు.
శివాపచారాన్నిచూడలేక, యజ్ఞగుండ మధ్యంలో యోగాగ్నిని సృష్టించుకుని కాలిపోయింది
సతీదేవి. పరమశివుడు రుద్రుడయ్యాడు. భైరవుడు అయ్యాడు. వీరభద్రునీ, భద్రకాళినీ,
ప్రమథగణాలనీ పంపించి యజ్ఞభూమిని రుద్రభూమి చేసాడు. దక్షునికి శిరః ఖండనం చేసాడు.
ఆ తరువాత దేవతల కోరిక మేరకు దక్షునికి మేక తల తెచ్చి, అతికి, యజ్ఞం పూర్తి చేయించారు.
పరమేశ్వరిని పుత్రికగా, పరమశివుని అల్లునిగా పొందినా కూడా, సమర్థుడైనప్పటికీ, గర్వం వలన,
తన తలకు చేటు తెచ్చుకున్నాడు దక్షుడు. పుణ్య గర్వంతో నహుషుడు సర్పంగా మారితే,
సమర్థుడననే అహంభావంతో దక్షుడు తలను పోగొట్టుకుని, మేక తలతో మిగిలాడు.
గర్వం అనర్ధహేతువు అని ఈ రెండు సంఘటనలూ చెప్తున్నాయి.
దక్షుడు చేసే నిరీశ్వర యాగ నాశనానికి కారణమైన, ఆ దక్షయజ్ఞవినాశిని కి వందనం.
ఓం శ్రీ దక్షయజ్ఞవినాశిన్యై నమః
ఒక చిన్న మాట:
మన పురాణాల్లో, హయగ్రీవుడి కథలో విష్ణువుకి గుర్రం తల అతకటం,
దక్షయజ్ఞం కథలో దక్షుడికి మేక తల పెట్టడం, గణేశోత్పత్తి కథలో
గణేశుడికి ఏనుగు తల రావడం వంటి కథలు చాలా వున్నాయి.
మన సనాతన భారతీయ శాస్త్రాల్లో వైద్యవిద్య, అందునా శస్త్ర వైద్యం ఎంత
ఉత్కృష్టమైన స్థాయిలో వున్నదో గమనించండి.
ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని
శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల
ఆరవ వంద నామాల వివరణ
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి