18, నవంబర్ 2021, గురువారం

118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా

  

ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా 
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥

583. ఆత్మవిద్యా

విద్య అంటే జ్ఞానము, ప్రకాశము, మంత్రము అనే అర్ధాలున్నాయి. ఆత్మవిద్యా అంటే ఆత్మను 

గురించిన జ్ఞానం పొందటం. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను అనే

ప్రశ్నలకు సమాధానం దొరకడమే ఆత్మ జ్ఞానం పొందటం. ఆ జ్ఞానస్వరూపమే శ్రీలలిత. 

శ్రీలలితను ధ్యానిస్తే, ఆత్మకు, శరీరానికి మధ్య గల భేదమేమిటో తెలుస్తుంది. 

ఆ భేదాన్ని తెలుసుకోవటమే జ్ఞానము, అదే ఆత్మవిద్య. అన్ని ఉపనిషత్తులలో చెప్పేది ఒక్కటే. 

"ఆత్మ అన్నింటికన్నా ప్రియమైనది. సమస్తమూ ఆత్మ వలననే పొందుతున్నాడు. 

ఆత్మయే సర్వ భూతములకు ఆధారము.  శరీరానికి శక్తిని ఇస్తున్నది ఆత్మయే. 

దేహం ఆత్మకు తొడుగు. దేహానికి ఉన్నది ఒకే ఆత్మ, అది నిశ్చలం. 

మనోనాశనం అయ్యాక మిగిలేదే ఆత్మ. ఆత్మజ్ఞానికి ఆత్మజ్యోతి అతనిలోనే దర్శనమిస్తుంది. 

ఆత్మానందాన్ని కలిగిస్తుంది. సర్వభూతాలూ ఆత్మ రూపాలే."
 

బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞ్యవల్క్య, మైత్రేయి సంవాదంలో యాజ్ఞ్యవల్క్యుడిలా అంటాడు. 

"మైత్రేయీ, ఆత్మనే దర్శించవలెను, వినవలెను, ఆలోచించవలెను, ధ్యానించవలెను,

దీని వలననే సర్వమూ తెలియుచున్నది. ఆత్మ అవినాశము, అవిచ్ఛేద్యము."

ఈశలో, " హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం, తత్త్వం పూషన్నపావృణు, సత్య

ధర్మాయ దృష్టయే." అన్నారు. "బంగారు పాత్ర  సత్యము యొక్క ముఖమును కప్పివుంచింది. 

హే, పూషన్, ఆ మూతను తొలగించు, సత్య, ధర్మాలను దర్శించుకోవాలి" అని వుంది. 

సత్యమును, ధర్మమును బయటకు రానీయకుండా, నేటికీ బంగారము, ధనము వాటిని కప్పి 

వుంచుతూనే వున్నాయి. పూష అంటే సూర్యుడు. సూర్యుడిని ఆ మూసిన బంగారు పాత్ర 

మూతను తీసి, సత్య ధర్మ దర్శనం చేయించమని కోరే ప్రార్ధన ఇది. ఆ దర్శనమే సత్యం. 

అదే ఆత్మవిద్య. మిగిలినవన్నీ అవిద్యలే. ఆత్మజ్ఞాన స్వరూపురాలు ఆత్మవిద్య. 

పరబ్రహ్మను గురించిన జ్ఞానమే ఆత్మవిద్య. అన్ని విద్యలలో ఉత్తమమైన విద్య ఆత్మవిద్య. 

ఆత్మాష్టాక్షరీ అయిన, 'సోహంహంసశ్శివస్సోహం' అను మంత్రస్వరూపురాలు ఆత్మవిద్య.   

ఆత్మ జ్ఞానస్వరూపమై, ఆత్మ సాక్షాత్కారాన్ని ఇస్తున్న, ఆ ఆత్మవిద్య కు వందనం. 

ఓం శ్రీ ఆత్మవిద్యాయై నమః  


584. మహావిద్యా

ఆత్మవిద్యే మహావిద్య, అదే బ్రహ్మ విద్య. ఆ లలితాపరమేశ్వరి బ్రహ్మవిద్యా స్వరూపిణి కనుక, 

ఆ లలితాదేవికి  మహావిద్యా అనే నామం వచ్చింది. విద్యలో కెల్లా మహత్తైనది మహావిద్య. 

ఆత్మవిద్య నేర్చినవాడికి మహావిద్య బోధపడుతుంది. సమస్త అనర్ధ నివారకము మహావిద్య. 

ఈ మహావిద్యా జ్ఞానము కలిగిన వెంటనే అనర్ధములు నశించి ఆనందము కలుగుతుంది. 

గొప్ప జ్ఞానస్వరూపురాలు మహావిద్య. నవదుర్గా మంత్రస్వరూపురాలు మహావిద్య.

ఈ మహావిద్యకే వనదుర్గా విద్య అని కూడా పేరు వుంది. కనుక వనదుర్గా మంత్రస్వరూపురాలు 

ఈ మహావిద్య. వనదుర్గా పంచశతీ విద్యకు మహావిద్యా అనే పేరుంది. 

ఉపనిషత్తులలో చెప్పిన ఆత్మ విద్య అంతా మహావిద్యయే. 

దేవీ భాగవతంలో దశమహావిద్యల ప్రస్తావన వున్నది. ఈ పది మహావిద్యలూ సిద్ధవిద్యలే. 

ఆ దశ మహావిద్యలే వరుసగా, కాళీ, తారా, షోడశీ, భువనేశ్వరీ, భైరవీ, చిన్నమస్తా, ధూమావతీ,

బగళాముఖీ, మాతంగీ, కమలాత్మికా. ఈ దశ మహా విద్యల శక్తి ముందు మహాశివుని శక్తి కూడా 

సరిపోలేదు. ఈ విద్యలను ఉపాసిస్తే పొందలేనిది ఏదీ లేదు. అందుకే ఇవి మహావిద్యలు.     

బ్రహ్మవిద్యా, సిద్ధవిద్యా స్వరూపిణి యైన, ఆ మహావిద్య కు వందనం.  

ఓం శ్రీ మహావిద్యాయై నమః  

585. శ్రీవిద్యా

శ్రీ అంటే లలితాపరమేశ్వరి. ఆ శ్రీమాతను గురించిన జ్ఞానమును ఇచ్చు విద్య శ్రీవిద్య. 

అమ్మ స్వయంగా మూర్తీభవించిన శ్రీవిద్య కనుక, ఈ నామంలో ఆ పరమేశ్వరిని శ్రీవిద్యా

అంటున్నాం. పంచదశీ మంత్రమే శ్రీవిద్య, కనుక శ్రీవిద్య అంటే పంచదశీ మంత్రస్వరూపురాలు. 

వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటముల కలయికే పంచదశీ మంత్రం అని 

ముందు నామాల్లో చెప్పుకున్నాం. కనుక శ్రీవిద్యా అంటే, లలితాదేవి యొక్క 

సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ రూపమే.  

విష్ణుపురాణంలో యజ్ఞవిద్య, మహావిద్య, గుహ్యవిద్య, ఆత్మవిద్య అని నాలుగు విద్యల గురించి 

చెప్పారు. అందులో యజ్ఞవిద్య అంటే కర్మవిద్య, మహావిద్య అంటే విశ్వరూపాద్యుపాసన,

గుహ్యవిద్య అంటే మంత్రవిద్య, ఆత్మవిద్య అంటే బ్రహ్మవిద్య అని చెప్పారు.  

గుహ్యవిద్యయే మంత్రవిద్య, మంత్రములు రహస్యములు కనుక రహస్యమైన శ్రీవిద్యయే  

గుహ్యవిద్య అని చెప్పబడినది. పరశురాముడు కూడా శ్రీవిద్యను గుహ్యవిద్య అన్నాడు. 

కనుక పంచదశాక్షరీ మంత్రమే శ్రీవిద్య. విష్ణుపురాణంలో తర్కవిద్య, వేదవిద్య, రాజనీతి, 

దండనీతి, శిల్పశాస్త్రం, ఆయుర్వేదం వంటి విద్యలన్నీ శ్రీదేవియే అని కూడా చెప్పారు. 

పంచదశీమంత్రాక్షర దేవత అయిన, ఆ శ్రీవిద్య కు వందనం. 

ఓం శ్రీ శ్రీవిద్యాయై నమః  


586. కామసేవితా 

కాముని చేత సేవింపబడునది కనుక కామసేవితా అని పిలువబడుతున్నది. 

మహాశివుడి మూడవకంటి నుంచి వచ్చిన అగ్నిచే దహింపబడి దేహం కోల్పోయి, 

అనంగుడయినాడు కాముడు. లలితాదేవి ఆవిర్భావం తరువాత దేవతలంతా, పునఃసృష్టి 

జరగాలని, తారకాసురుని చంపే కుమారుడు కలగాలని ఆ తల్లిని ప్రార్ధించారు. సృష్టికార్యానికి 

కావలసింది కాముడు, మన్మధుడు కదా. భండాసురుడు సృష్టించిన కామ ప్రళయం ఆపడానికి, 

అప్పుడు లలితాదేవి మన్మధునికి ప్రాణం పోసింది. మన్మధుడు అమ్మ భక్తుడయ్యాడు. 

శ్రీవిద్యను ఉపాసించాడు. దేహం లేకపోయినా కానీ, మన్మధుడు అమ్మను సేవించాడు. 

అంతరంగములో అమ్మను దర్శించి ఆ మాతను పూజించాడు. 

దేహముంటే ఇతర ప్రాపంచిక బంధాలుండేవేమో, దేహము లేనందు వలన, 

మనసుతోనే అమ్మను పూజించాడు. దీనినే మన్మథవిద్య అంటారు. 

మనస్సుని మథించి అంతరంగంలో చేసే మానస పూజ. 

నిజానికి మనసు లేనిదే ఏ పనీ, ఏ పూజా చేయలేము కదా. 

మన్మధుడు శివ శక్తుల సామరస్య రూపమైన, మిధునాన్ని మనసులో తలచి సేవించాడు. 

ఇక అంతా మానసపూజే, బాహ్యపూజాడంబరములు అవసరము లేదు. 

దీనినే మన్మధ రహస్య వ్రతం అని కూడా అంటారు. 

ఈ రకంగా కామదేవునిచే సేవింపబడినది కనుక, కామసేవితా అనే నామం వచ్చింది. 

మహాకామేశ్వరునిచే కూడా పూజలందుకున్నది శ్రీలలిత. చిదగ్నికుండము నుంచి 

ఉద్భవిస్తున్న లలితాదేవిని మహా కామేశ్వరుడు పూజించాడు. 

అందువలన కూడా కామసేవితా అనే నామం వచ్చిందని ఒక వాదం. 

కామదేవుడు, కామేశ్వరుడు సేవించిన, ఆ కామసేవిత కు వందనం. 

ఓం శ్రీ కామసేవితాయై నమః 

  

587. శ్రీషోడశాక్షరీవిద్యా

షోడశాక్షరీ అంటే పదహారు అక్షరముల సముదాయం. పదహారు అక్షరములతో ఏర్పడిన 

మంత్రమే శ్రీ షోడశాక్షరీ. విద్య అంటే మంత్రము కనుక, పదహారు అక్షరముల కూర్పుతో ఏర్పడ్డ 

మహామంత్రమే శ్రీ షోడశాక్షరీవిద్యా. పంచదశీ మంత్రంలో పదిహేను అక్షరాలు వున్నాయి. 

ఈ పంచదశీ మంత్రానికి చివర శ్రీమ్ చేరిస్తే పదహారు అక్షరాల మహా మంత్రమవుతుంది. 

అదే శ్రీ షోడశాక్షరీ మంత్రం. షోడశాక్షరీ విద్య. ఇది మన్మధుడు ఉపాసించిన మంత్రం. 

"క ఏ ఈ ల హ్రీమ్, హ స క హ ల హ్రీమ్, స క ల హ్రీమ్, శ్రీమ్." 

దీనినే భాస్కరరాయలు కూడా సమర్ధించాడు. కానీ గౌడపాదసూత్రంలో ఈ మంత్రం వేరుగా 

చెప్పారు. ఆ మంత్రములో ఇరవై ఎనిమిది వర్ణాలుంటాయి. పంచదశి లోని పదిహేను, ప్రణవం, 

శక్తి ప్రణవాలు కలిపి మొత్తం ఎనిమిది అక్షరముల మంత్రాన్ని మహాషోడశీ మంత్రం అన్నారు. 

షోడశీ విద్య అధిదేవత అయిన, ఆ శ్రీషోడశాక్షరీవిద్య కు వందనం.    

ఓం శ్రీ శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః 


588. త్రికూటా

వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము అనే మూడు కూటముల స్వరూపము, కనుక

అమ్మకు త్రికూటా అనే నామం వచ్చింది. అంటే పంచదశీ విద్యా స్వరూపురాలు అని అర్ధం. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన, త్రిమూర్తుల సముదాయము కనుక త్రికూటా. 

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థల యందూ ఉండునది కనుక త్రికూటా. 

కామగిరిపీఠం, పూర్ణగిరిపీఠం, జాలంధరపీఠం అనే పీఠత్రయమందు ఉండునది కనుక త్రికూటా. 

భూలోక, భువర్లోక, సువర్లోక మనే మూడు లోకాలకూ ఈశ్వరి కనుక త్రికూటా. 

సత్వ, రజో, తమో గుణాలనే త్రిగుణాలను సృష్టించింది కనుక త్రికూటా. 

సూర్య, చంద్ర, అగ్ని మండలము లందు ఉండునది కనుక త్రికూటా. 

జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయము లనే త్రిపుటి యందు ఉండునది కనుక త్రికూటా. 

త్రినాడులైన ఇడా, పింగళా, సుషుమ్నా నాడులలో తిరుగుతూ ఉంటుంది కనుక త్రికూటా. 

ఈ విధముగా అమ్మ త్రయీమయి కనుక, త్రికూటా అని పిలువబడుతోంది.  

భృకుటి వద్ద ఇడా, పింగళా, సుషుమ్నా నాడులు మూడూ సంగమించే స్థలాన్ని కూడా

త్రికూటము అని అంటారు. 

మూడు కూటముల స్వరూపమైన, ఆ త్రికూట కు వందనం. 

ఓం శ్రీ త్రికూటాయై నమః 


589. కామకోటికా 

కోటి అంటే గొప్పది, ప్రశస్తమైనది అని భావం. కామము అంటే కోరిక. 

కామ కోటికా అంటే కోరికలన్నింటి లోకెల్లా గొప్ప కోరిక అని అర్ధం. 

చతుర్విధ పురుషార్దాలైన ధర్మ, అర్ధ, కామ, మోక్షములలో ఉన్నతమైనది మోక్షము. 

ఆ మోక్షస్వరూపమైన దేవత కామకోటికా. 

కామకోటి పీఠమును అధిష్ఠించి వున్నది అని మరి ఒక అర్ధం. 

కాముడు అంటే పరమశివుడు, అతనితో ఏక దేహములో ఉండునది కామకోటికా. 

అర్ధనారీశ్వరరూపములో శివునితో కలసి వున్న, ఆ కామకోటిక కు వందనం. 

ఓం శ్రీ కామకోటికాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి