సర్వవేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ
లోపాముద్రార్చితా, లీలా క్లప్తబ్రహ్మాండమండలా ॥ 128 ॥
లోపాముద్రార్చితా, లీలా క్లప్తబ్రహ్మాండమండలా ॥ 128 ॥
645. సర్వవేదాంత సంవేద్యా
వేదాంతము అంటే వేదముల అంతములో చెప్పబడిన ఉపనిషత్తులు.
వేదము సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అని నాలుగు భాగాలు.
వేదముల చివరిభాగములో చెప్పబడినవే ఉపనిషత్తులు, వాటినే వేదాంతము అంటారు.
ఆ శ్రీలలితాపరమేశ్వరి ఉపనిషత్తులను పొంది వున్నది, కనుక జ్ఞానాత్మకగా చెప్పబడింది.
అన్ని వేదాంతముల చేతా తెలుసుకోబడునది కనుక అమ్మను ఈ నామంలో,
సర్వవేదాంత సంవేద్యా అని పిలుస్తున్నాం.
అమ్మను మరచి, ఏ పని చేసినా, ఏ శాస్త్రములు చదివినా, అవి జ్ఞానాన్నివ్వవు.
జ్ఞానాన్నిచ్చేది కేవలం ఆ సర్వజ్ఞానమయి అయిన ఆ శ్రీరాజరాజేశ్వరీదేవి.
అన్ని ఉపనిషత్తుల సారమే తానయిన, ఆ సర్వవేదాంతసంవేద్య కు వందనం.
ఓం శ్రీ సర్వవేదాంతసంవేద్యాయై నమః
646. సత్యానంద స్వరూపిణీ
సత్యమైన ఆనంద స్వరూపమే శ్రీలలితాపరమేశ్వరి అని ఈ నామం చెప్తోంది.
ఎప్పుడూ సత్యము మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది.
ఆనందం పంచకోశాలలో గుప్తమై వుంది. అన్ని ఆనందాలకన్నా, పంచకోశాతీతమైన
బ్రహ్మానందం అత్యుత్తమైనది. ఆ బ్రహ్మానందం సత్యము, శాశ్వతము.
"స అంటే ప్రాణము, తి అంటే అన్నము, యః అంటే ఆదిత్యుడు. కనుక సత్యమంటే
ప్రాణాన్నాదిత్యస్వరూపము" అని వేదములో చెప్పబడింది.
ఈ నామానికి సత్పురుషుల పట్ల సాధువుగా ఉండునది అని ఒక అర్ధం.
సత్యభామా స్వరూపురాలు అని మరొక అర్ధం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది ఉపనిషత్.
ఆ ప్రజ్ఞానాన్ని తెలుసుకుంటే, బ్రహ్మము తెలుస్తుంది. బ్రహ్మానందం లభిస్తుంది.
ఉత్తరమీమాంసలో ఆనందమంటే పరమాత్మ స్వరూపమే అని చెప్పారు.
తైత్తిరీయోపనిషత్తులో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. సత్యము, జ్ఞానము, బ్రహ్మము
ఇవి అనంతమైనవి, శాశ్వతమైనవి. ఆ సత్యం ఇచ్చే ఆనందమే సత్యానందం.
ఈ నామంలో అమ్మను ఆనందస్వరూపిణి అని చెప్పుకుంటున్నాం.
శాంతమైన ఆనంద స్వరూపము గల, ఆ సత్యానందస్వరూపిణి కి వందనం.
ఓం శ్రీ సత్యానందస్వరూపిణ్యై నమః
647. లోపాముద్రార్చితా
శ్రీవిద్యను ఉపాసన చేసిన పన్నెండుమంది ప్రధములలో అగస్త్యుడు, లోపాముద్ర వున్నారు.
అగస్త్యుడు తన పితృదేవతల తృప్తి కోసం తప్పనిసరిగా వివాహమాడాల్సి వచ్చింది.
అగస్త్యుడు తన పితృదేవతల తృప్తి కోసం తప్పనిసరిగా వివాహమాడాల్సి వచ్చింది.
అప్పుడు శ్రీవిద్యను ఉపాసించిన అగస్త్యుడు, లోకం లోని అన్ని ప్రాణుల అవయవములలో
చక్కటి వాటిని ఏర్చి కూర్చి, శ్రీమాత ప్రజ్ఞతో, ఒక శిశువును సృష్టించాడు.
ఆ శిశువుకు లోపములు లేని ముద్రలతో ఏర్పడిన శిశువు కనుక, లోపాముద్రా అనే నామం
వచ్చింది. ఆ శిశువును సంతానానికై ప్రార్థిస్తున్న, విదర్భరాజుకు ఇచ్చి పెంచుకోమన్నాడు.
శ్రీమాత ప్రజ్ఞా విశేషములతో ప్రకాశిస్తున్న లోపాముద్రను, పెరిగి పెద్దదయిన తరువాత, అగస్త్యుడే
వచ్చి వివాహం చేసుకున్నాడు. ఆ లోపాముద్ర శ్రీమాత అంశ స్వరూపురాలు కనుక, లోపాముద్రను
అర్చించినా, శ్రీమాతను అర్చించినట్లే అని ఒక విశ్వాసం.
అటువంటి లోపాముద్రచే ఉపాసింపబడినది కనుక, ఆ లలితాపరమేశ్వరిని ఈ నామంలో
లోపాముద్రార్చితా అంటున్నాం. హయగ్రీవుడి ద్వారా లలితాసహస్రనామస్తోత్రాన్ని తెలుసుకుని,
దానిని ఈ లోకంలో ప్రచారానికి తెచ్చినవాడు అగస్త్యుడు. ఆ అగస్త్య పత్ని లోపాముద్ర.
లోపాముద్రచే అర్చింపబడుతున్న, ఆ లోపాముద్రార్చిత కు వందనం.
ఓం శ్రీ లోపాముద్రార్చితాయై నమః
648. లీలా క్లప్తబ్రహ్మాండమండలా
అలవోకగా, అనాయాసంగా బ్రహ్మాండాలన్నింటినీ సృష్టిస్తున్న ఆదిపరాశక్తి అని ఈ నామార్ధం.
అనేకానేక బ్రహ్మాండాలను అవలీలగా సృష్టించడం ఆ తల్లికి ఒక కేళీ విలాసం.
అమ్మకు అది ఒక లీల, ఆట. త్రిమూర్తులు కూడా చేయలేని ఈ బ్రహ్మాండ సృష్టి అమ్మ క్షణ కాల
సంకల్పంతో చేస్తున్నది. అందుకే ఈ నామంలో అమ్మను లీలా క్లప్తబ్రహ్మాండమండలా అన్నారు.
శక్తిసూత్రములో "అమ్మ స్వేచ్ఛగా తన భిత్తిక (గోడ) పై ఈ విశ్వాన్నిసృష్టించింది" అని వున్నది.
సునాయాసంగా బ్రహ్మాండ మండలాలన్నీ కేళీ లీల వలే కల్పిస్తున్న,
ఆ లీలాక్లప్తబ్రహ్మాండమండల కు వందనం.
ఓం శ్రీ లీలాక్లప్తబ్రహ్మాండమండలాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి