త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తిః, త్రిదశేశ్వరీ ॥ 125 ॥
622. క్లీంకారీ
క్లీంకారం కామబీజం. కనుక ఈ నామంలో అమ్మవారిని కామబీజస్వరూపురాలు అని
తెలుసుకుంటున్నాం. సర్వజగత్తులనూ వశము చేసుకునేది కామబీజం, వశీకరణబీజం.
ఎటువంటి కామమైనా, ఆ కామము తీరితే ఆనందము కలుగుతుంది. అందరూ ఆ ఆనందము
కోసమే ఎల్లప్పుడూ పరిశ్రమిస్తూ వుంటారు. ఆ పరిశ్రమ వలన కామము, అంటే కోరిక తీరి
ఆనందము పొందుతారు. అమ్మను ధ్యానిస్తే, ఆ కామ్యములు తీరి ఆనందములు లభిస్తాయి.
దేవీభాగవతంలో సుదర్శనుడు కేవలం "క్లీ" అని అనవరతం జపిస్తూ అమ్మ కృపను పొంది,
పోగొట్టుకున్న రాజ్యం సంపాదించుకోగలిగాడు. శివాంశను పొంది, కాశీరాజ పుత్రిక చంద్రకళను
వివాహమాడాడు. అమ్మ కృప ఉంటే, తన భక్తులను శివుడంతటి వాళ్ళను చేస్తుందని
చెప్పుకున్నాం. క్లీం బీజం శక్తి అది. క్లీం అంటే శివకాముడు అనే అర్ధం కూడా వుంది.
శివకాముని భార్య కనుక అమ్మ శివకామసుందరి. అందుకే అమ్మను క్లీంకారీ అంటున్నాం.
కామబీజస్వరూపమై, అందరినీ వశీకరణముతో సమ్మోహితులను చేస్తున్న, ఆ క్లీంకారీ కి వందనం.
ఓం శ్రీ క్లీంకార్యై నమః
623. కేవలా
అమ్మ వంటివారు ఎవరూ లేరు. అమ్మ సమానాధికవర్జితా. అమ్మ కేవలా, అంటే ఒంటరి.
ధర్మాలనన్నీ ఏర్పరచేది ఆ శ్రీమాతే. కానీ ఆ తల్లికి ఆ ధర్మాలేవీ అంటవు. అన్ని ధర్మాలకూ
అతీతురాలు, ఏ ధర్మానికీ కట్టుబడనిది. సంపూర్ణ జ్ఞానస్వరూపురాలు. ఈ విషయం శివసూత్రాలలో
చెప్పబడింది. కనుక ఏ విధమైన ధర్మములూ లేని, అంటని, విముక్త ఆ లలితాపరమేశ్వరి.
అందువలన అమ్మను ఈ నామంలో కేవలా అంటున్నాం. క్లీం అనే బీజాక్షరములో 'క్' 'ల్'
అనే హల్లు శబ్దాలను తొలగిస్తే, మిగిలేది ఈం. ఈ ఈంకారమును కామకళ అంటారు.
వేదములో 'కకార, లకారములు లేని కామబీజమును ఎవడు వింటాడో, అట్టివానికి సత్యలోకం
లభిస్తుంది' అని చెప్పారు. క్లీం లో కకార, లకారములు లేనప్పుడు అది ఈం అవుతుంది.
క్లీం జపము వలన ధర్మ, అర్ధ, కామములు సిద్ధిస్తే, ఈం జపము వలన మోక్షము సిద్ధిస్తుంది.
ఏ ధర్మములూ లేని స్థితికి కేవలమని పేరు. అందుకే అమ్మకు కేవలా అనే నామం వచ్చింది.
క్లీంకార జపంతో ధర్మార్ధకామాలను, ఈంకార జపముతో మోక్షాన్ని ఇచ్చే, ఆ కేవల కు వందనం.
ఓం శ్రీ కేవలాయై నమః
624. గుహ్యా
గుహ్యము అంటే అతి రహస్యము అని ఒక అర్ధం. గుహ్యా అంటే గుహలో వున్నది అని ఇంకొక
అర్ధం. బుద్ధి అనే గుహలో ప్రవేశించినది కనుక అమ్మను గుహ్యా అన్నాం.
శ్రీవిద్య గుహ్యమైన విద్య అని చెప్పుకున్నాం. అమ్మ శ్రీవిద్యా స్వరూపము కనుక, అమ్మ గుహ్యా.
ధన ధాన్యాలయినా ఇవ్వవచ్చు కానీ, శ్రీవిద్యను మాత్రం ఎవరికీ చెప్పకూడదు అని శాస్త్రవచనం.
ఇవ్వకూడదు అంటే, అనర్హులకు ఇవ్వకూడదు అని భావం.
అర్హులకు అందే విధంగా, అర్హులకు మాత్రమే అర్ధం అయ్యే విధంగా, అనర్హులకు అందనంత
దూరం లోనూ ఉండేదే షోడశి. అందుకే అమ్మను ఈ నామంలో గుహ్యా అంటున్నాం.
పంచకోశాల లోపల గుహ్యంగా వుండే శక్తి గుహ్యా.
అతి రహస్యంగా హృదయకుహరమనే గుహలో దాగున్న, ఆ గుహ్య కు వందనం.
ఓం శ్రీ గుహ్యాయై నమః
ఓం శ్రీ కైవల్యపదదాయిన్యై నమః
626. త్రిపురా
త్రిపురములలోనూ వుండే అమ్మను ఈ నామంలో త్రిపురా అంటున్నాం.
త్రిపురాలు కూడా అమ్మ సృష్టించినవే. శరీరంలో ఎన్ని నాడులున్నా ముఖ్యనాడులు మూడు.
అవే ఇడా, పింగళా, సుషుమ్నా నాడులు. ఈ మూడునాడులనూ త్రిపురాలంటారు.
ఆ నాడులలో ఉంటుంది కనుక, అమ్మకు త్రిపుర అనే పేరు వచ్చింది.
త్రిమూర్తుల కంటే సనాతనమైనది కనుక త్రిపుర.
త్రిగుణములను సృష్టించింది కనుక త్రిపుర. పీఠత్రయములలో ఉండునది కనుక త్రిపుర.
మనస్సు, బుద్ధి, చిత్తము లను కూడా త్రిపురాలంటారు. అందులో నివసించేది కనుక త్రిపుర.
అగ్నిత్రయమైన గార్హపత్య, ఆవాహనీయ, దక్షిణాగ్నులలో ఉండునది కనుక త్రిపుర.
త్రిశక్తులైన ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తుల రూపంలో ఉంటుంది కనుక త్రిపుర.
అ, ఉ, మ అనే మూడు అక్షరములతోనూ ఉండు ఉమ కనుక త్రిపుర.
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలలోనూ ఉండునది కనుక త్రిపుర.
త్రికూటాధీశ్వరి కనుక త్రిపుర. మూడు వేదములనూ చెప్పినది కనుక త్రిపుర.
త్రికోణమును మండలత్రయముగా కలిగినది కనుక త్రిపుర.
సృష్టిలో ఎక్కడెక్కడ త్రిపుటి ఉంటుందో, అక్కడక్కడ త్రయీమయిగా అమ్మ ఉంటుంది.
పరమా శక్తి అయిన, ఆ త్రిపుర కు వందనం.
ఓం శ్రీ త్రిపురాయై నమః
627. త్రిజగద్వంద్యా
మూడు జగత్తులలోనూ శ్రీదేవి వందనీయురాలు కనుక త్రిజగద్వంద్యా అని పిలువబడుతోంది.
జగద్వంద్యులగు త్రిమాతలతోనూ, త్రిమూర్తులతోనూ పూజింపబడునది కనుక త్రిజగద్వంద్యా.
స్వర్గ, మర్త్య, పాతాళములనే ముల్లోకాల లోనూ ఆరాధ్యదేవత.
భూ, భువ, సువర్లోకాలలో వందనీయురాలు. దేవ, మానవ, దానవ లోకాలలో అందరి చేతా
పూజలందుకుంటోంది కనుక అమ్మను త్రిజగద్వంద్యా అంటున్నాం.
త్రిలోక ఆరాధ్యదేవత, ఆ త్రిజగద్వంద్య కు వందనం.
ఓం శ్రీ త్రిజగద్వంద్యాయై నమః
628. త్రిమూర్తిః
ఒక్క శ్రీమాతే సందర్భాన్ని బట్టీ, అవసరాన్ని బట్టీ, వివిధ రూపాలు ధరిస్తూ ఉంటుంది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆ తల్లి రూపాలే. లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురూ ఆ తల్లి
రూపాలే. సూర్య, చంద్ర, అగ్ని ముగ్గురూ ఆ తల్లి రూపాలే.
ధౌమ్యుడు మూడు సంవత్సరముల బాలికను త్రిమూర్తీ అన్నాడు.
రక్తవర్ణమైన ఎరుపు, శుక్లవర్ణమైన తెలుపు, ఈ రెండూ కలసిన మిశ్రవర్ణమైన నలుపు రంగులు కల
మూడు మూర్తులూ అమ్మే. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి రూపాలు ధరిస్తుంది కనుక అమ్మ త్రిమూర్తీ.
వరాహపురాణంలో ఒక గాథ వుంది. బ్రహ్మ శంకరుని చూస్తూ విష్ణువును స్మరించాడు.
అప్పుడు విష్ణువు వారిద్దరి మధ్యలోకి వచ్చి నిలిచాడు. మువ్వురూ ఒకరినొకరు సూక్ష్మదృష్టితో
చూచుకొన్నారు. ఈ ముగ్గురి దృష్టీ కలసిన చోట దివ్య స్వరూపముతో ఒక కుమారి పుట్టింది.
ఆ కుమారిని చూచి త్రిమూర్తులు, 'నీవెవరు, ఏ కార్యార్థమై వచ్చావు' అని
అడిగారు. అప్పుడు నలుపు, తెలుపు, పసుపు వర్ణాలతో శోభిస్తున్న ఆ కుమారి, 'భగవదృష్టి వలన
నేను జన్మించాను. నన్ను మీరెరుగరా, నేను ఆత్మశక్తిని, పరమేశ్వరిని' అని సమాధానం ఇచ్చింది.
అప్పుడు త్రిమూర్తులు, 'తల్లీ, నీవు త్రిపుర అనే పేరుతో ఈ జగత్తులను పాలింపుము. మూడు
వర్ణములతో మూడు స్వరూపములను పొందుము, అని వరం ఇచ్చారు. అప్పుడు ఆ కుమారి
బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి అనే నామాలతో మూడు మూర్తులుగా ప్రసిద్ధి చెందింది.
దేవీ భాగవతంలో మాత్రం, శుక్లవర్ణముతో శాంభవి, రక్తవర్ణముతో శ్రీవిద్య, శ్యామలవర్ణముతో శ్యామా
అనే నామాలతో త్రిమూర్తి అయింది అని వుంది.
తన త్రిమూర్తి రూపంతో జగత్తులను పాలిస్తున్న, ఆ త్రిమూర్తి కి వందనం.
ఓం శ్రీ త్రిమూర్త్యై నమః
629. త్రిదశేశ్వరీ
బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలలో ఎప్పుడూ మూడవదశలోనే వుండేవారు దేవతలు.
వారికి ఈశ్వరి కనుక త్రిదశేశ్వరీ అనే నామం కలిగింది.
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకు అధిపతి. అందువలన త్రిదశేశ్వరీ అన్నాం.
ధర్ముడనే మనువుకు, విశ్వ అనే భార్య యందు కలిగిన పదముగ్గురు సంతానాన్ని విశ్వేదేవతలు
అంటారు. ఆ విశ్వేదేవతలకు ఈశ్వరి త్రిదశేశ్వరీ. సృష్టి, స్థితి, లయములనే మూడు దశలకూ
ఈశ్వరి కనుక త్రిదశేశ్వరీ. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఇంద్రుడు,
ప్రజాపతి ఈ ముప్పయి మూడు దేవతలకూ స్వామిని ఈ త్రిదశేశ్వరీ.
ఈ త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తిః, త్రిదశేశ్వరీ నామాల్లో అమ్మవారి యొక్క త్రయీమయీ
తత్వాన్ని గురించి చెప్పుకుంటున్నాం.
మూడు దశలలోనూ, ముజ్జగాలనూ రక్షిస్తున్న, ఆ త్రిదశేశ్వరీ కి వందనం.
ఓం శ్రీ త్రిదశేశ్వర్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి