631. దివ్యగంధాఢ్యా
దివి నుంచి వచ్చినవన్నీ దివ్యములు. ఈ నామానికి, అమ్మవారికి దివ్యమైన గంధము
పూయబడి వున్నది అని అర్ధం.
దివ్యులైన దేవతలచే దివ్య గంధముతో సేవింపబడినది ఆ శ్రీమాత.
అందుకే ఈ నామంలో అమ్మను దివ్యగంధాఢ్యా అని అంటున్నాం.
దివ్య హరి చందన సేవ చేత సంతోషించునది శ్రీమాత.
శ్రీసూక్తములో దివ్యగంధములకు అమ్మ అధిపతి అని వుంది.
పతంజలి యోగసూత్రాలలో ఆకాశమునకు, శ్రోత్రేంద్రియానికీ కల సంబంధం చెప్పబడింది.
ఆకాశము నుండే కదా శబ్దము పుట్టింది. అమ్మను దివ్యమైన వస్తువులతో పూజించే యోగులకు
అమ్మ దివ్యశ్రోత్రం అంటే దివ్యశబ్దశ్రవణం కలిగిస్తుంది అని వుంది.
అంటే వీరికి అమ్మకృప వలన ఆకాశవాణి శబ్దాలు తెలుస్తాయి.
అదేవిధంగా దివ్యగంధముతో అమ్మను సేవించిన యోగులకు దివ్య ఘ్రాణ శక్తి కలుగుతుంది.
ఆ విధముగా సేవించు ఉపాసకులు శ్రీదేవీ అనుగ్రహము వలన దివ్యమైన వాసనలను
తెలుసుకోగలుగుతారు. దివ్య సుగంధములతో సుసంపన్నులు అవుతారు.
దివ్యులచే, దివ్యగంధములచే పూజింపబడు, ఆ దివ్యగంధాఢ్య కు వందనం.
ఓం శ్రీ దివ్యగంధాఢ్యాయై నమః
632. సిందూరతిలకాంచితా
సిందూర తిలకమును ధరించి శోభిస్తున్న పరమేశ్వరి అని ఈ నామానికి అర్ధం.
నుదుటన సిందూరం, కుంకుమ, గంధము, భస్మము వంటి చూర్ణములను ధరించటం
సనాతన సంప్రదాయమని చెప్పుకున్నాం కదా.
అమ్మ నుదుటన, సీమంతము లోనూ సిందూరం ధరించి ఎంతో అందంగా వుంది.
నిఘంటువులో సిందూరం అంటే ఎర్రని చూర్ణము, గోరోచనము, వావిలిచెట్టు,
ఏనుగు, స్త్రీ అనే అర్ధాలున్నాయి.
ఎర్రని చూర్ణమును పాపట, నుదుట ధరించి, గజగమనముతో నడచునది అని ఒక అర్ధం.
గజగామినులైన స్త్రీలచే పూజింపబడునది అని ఇంకొక అర్ధం.
భాగవతంలో సిందూరం ధరించి ఆకర్షణీయంగా శోభిల్లుతున్న గౌరీదేవిని గోపికలు
కాత్యాయనీ వ్రతంలో భాగంగా పూజించారని చెప్పారు.
రుక్మిణీ దేవి వివాహసమయంలో గౌరీ పూజ చేసి, శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందినది అని వున్నది.
ఎర్రని సిందూరముతో అందముగా, ప్రసన్నముగా ఉన్న, ఆ సిందూరతిలకాంచిత కు వందనం.
ఓం శ్రీ సిందూరతిలకాంచితాయై నమః
633. ఉమా
ఉమ అంటే శంకర పత్ని. పర్వతరాజు పుత్రిక పార్వతిగా పుట్టి శివుని కొరకు తపస్సు చేస్తుంటే,
తల్లి పార్వతిని 'ఉ-మా' అని పిలిచింది. ఉమా అంటే 'ఓ పార్వతీ వద్దు' అని అర్ధం.
అప్పటినుంచీ పార్వతికి ఉమా అనే నామం వచ్చింది. ఉమ పసుపువర్ణంతో ఉంటుంది.
బ్రహ్మ పురాణంలో, "ఉమ శివుని ప్రసన్నం చేసుకోవటానికి, ఆకులను కూడా తినకుండా,
అపర్ణయై, నిరాహారంగా తపస్సు చేసింది", అని వుంది.
అ కార, ఉ కార, మ కార శబ్దములు కలిస్తే ఓంకారము పుట్టింది. ఇది ప్రణవాక్షరం.
ఉ కార, మ కార, అ కార శబ్దములు కలిస్తే పుట్టిన 'ఉమా' శబ్దం దేవీ ప్రణవాక్షరమని శివుడు
పార్వతికి చెప్పాడు. మార్కండేయ పురాణంలో ఉమను కీర్తికాంతి స్వరూపిణి అని చెప్పారు.
సూతసంహితలో ఉమా అంటే, ఉత్తమమైన చిత్తవృత్తి కలది అని వుంది.
మహావాశిష్టంలో, ' ఓంకారసారమే ఉమ అని, ప్రాణులందరూ జాగ్రదవస్థలో వున్నా, నిద్రావస్థలో
వున్నా, వారి హృదయములలో, శబ్దబ్రహ్మము అనే ప్రణవనాద రూపములో ఉమ ఉంటుంది'
అని వుంది. హంసోపనిషత్తులో ఉమ హృదయపద్మములోని దళములలో తిరుగుతూ వివిధ
సంకల్పాలకు కారణమవుతోంది అని చెప్పారు.
శివసూత్రాలలో ఉమా అంటే 'ఇచ్ఛాశక్తి కుమారి' అని వుంది.
ధౌమ్యుడు ఆరు సంవత్సరముల బాలికను ఉమా అంటారని చెప్పాడు.
దేవీ ప్రణవమై, ఇచ్ఛాశక్తిగా సంచరించే, ఆ ఉమ కు వందనం.
ఓం శ్రీ ఉమాయై నమః
634. శైలేంద్రతనయా
దాక్షాయణిగా యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి, తరువాత హిమవంతుడు కోరిక మేరకు అతని
పుత్రికగా జన్మించింది. హిమవంతుడు దక్షుని వలె కాకుండా, కూతురుగా పుట్టినా,
ఆ పరమేశ్వరిని దేవత వలె పెంచాడు. దేవత వలె గౌరవించాడు.
పరమేశ్వరి కోరుకున్నట్లే, పరమశివునకు ఇచ్చి వివాహం జరిపించాడు.
తన హిమవత్ శిఖరాల వలె, మహోన్నత వ్యక్తిత్వం హిమవంతుడిది.
పర్వతాలన్నింటిలోకీ ఎత్తైనదీ, గొప్పదీ హిమవత్పర్వతం.
అంత గొప్ప హిమవంతుడికి పుత్రికయై జన్మించినది హైమావతి.
పార్వతి, గిరిజ, శైలజ, శైలరాజసుతా వంటి నామాలు అందువలననే అమ్మకు ఏర్పడ్డాయి.
హిమవంతుడు జగత్తులోని పర్వతములన్నింటి కన్నా గొప్పదైన పర్వతస్వరూపుడు,
కనుక శైలేంద్రుడు అని పిలవబడ్డాడు.
ఆ శైలేంద్రుని పుత్రిక కనుక అమ్మను శైలేంద్రతనయా అన్నారు.
గిరిరాజపుత్రి, ఆ శైలేంద్రతనయ కు వందనం.
ఓం శ్రీ శైలేంద్రతనయాయై నమః
635. గౌరీ
గౌరవర్ణము కలది కనుక గౌరీ అనే పేరు వచ్చింది. గౌరవర్ణము అంటే చక్కని మెరుపు గల
పసుపు, తెలుపు, ఎరుపు వర్ణాల మేలు కలయిక. దేవీపురాణంలో, హిమవంతుని పుత్రిక,
శంఖము, మొల్లపువ్వు, చంద్రుడు వలె తెల్లగా ఉండుటచే గౌరీ అనే పేరు వచ్చిందని వుంది.
పద్మపురాణంలో కన్యాకుబ్జమందు కల దేవత పేరు గౌరీ అనీ, వరుణుని భార్య పేరు గౌరీ అని,
ఆమె నదీ స్వరూపురాలనీ వుంది. పది సంవత్సరముల కన్యను గౌరీ అంటారు.
వివాహాది శుభకార్యములు వధువు చేసే గౌరీపూజతో ప్రారంభిస్తారు.
సువాసినులు గౌరీ ప్రీతికై వ్రతములు చేయటం ఒక సంప్రదాయం.
చక్కని తరళమైన శరీరవర్ణంతో భాసించే, ఆ గౌరి కి వందనం.
ఓం శ్రీ గౌర్యై నమః
636. గంధర్వసేవితా
గంధర్వులైన విశ్వావసు వంటి వారిచే సేవింపబడునది అని ఈ నామార్ధం.
గాంధార దేశపు ఉత్తమాశ్వములచే సేవింపబడునది అని మరియొక అర్ధం.
అశ్వారూఢ అనే దేవిచే సేవలందుకొన్న తల్లి. అశ్వారూఢ అనే శక్తి తన కోటానుకోట్ల
అశ్వసైన్యంతో భండాసుర యుద్ధంలో పాల్గొని, లలితా పరమేశ్వరికి సేవలందించింది.
గంధర్వులు గానకళాప్రవీణులు. తమ గంధర్వగానంతో అమ్మను కీర్తిస్తూ వుంటారు.
వారి దివ్యగానముతో సంతోషించునది శ్రీమాత.
గంధర్వులచే సేవలందుకుంటున్న, ఆ గంధర్వసేవిత కు వందనం.
ఓం శ్రీ గంధర్వసేవితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి