7, నవంబర్ 2021, ఆదివారం

107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా

 

ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ 
ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥

519. ముద్గౌదనాసక్తచిత్తా

ముద్గలంటే పెసలు. ముద్గౌదనం అంటే పెసరపప్పు కలిపి వండిన పొంగలి అన్నం. 

మూలాధారంలో వున్న దేవతకు ఈ పొంగలి అంటే ఆసక్తి హెచ్చు. 

చిత్తమంతా పెసరపప్పుతో కలిపి వండిన పొంగలి మీద కల ఈ దేవతకు, ఈ ముద్గౌదనం  

నైవేద్యంగా పెడితే, చాలా తృప్తి చెందుతుంది. 

పెసరపప్పుతో చేసిన పొంగలి అంటే ఆసక్తి చూపిస్తున్న, ఆ ముద్గౌదనాసక్తచిత్త కు వందనం. 

ఓం శ్రీ ముద్గౌదనాసక్తచిత్తాయై నమః  


520. సాకిన్యంబాస్వరూపిణీ 

మూలాధారాంబుజారూఢ అయిన ఈ దేవతకే సాకిన్యంబాస్వరూపిణి అని పేరు. 

ఈ సాకినీ అనే దేవత మూలాధార చక్ర పద్మంలో ఉంటుంది. 

అయిదు ముఖములు కలిగి పంచ భూతాలలో, పంచ తన్మాత్రలతో ప్రకాశిస్తూ ఉంటుంది. 

అంకుశము వంటి ఆయుధాలను కలిగి వున్నది. ధూమ్రవర్ణంలో ఉంటుంది.

జీవులలో ఎముకల రూపంలో ఉంటూ వారి భౌతికదేహ పుష్టికీ, స్వరూపానికి కారణమవుతోంది.

వ నుంచి స వరకూ కల నాలుగు హల్లు అక్షరశక్తి దేవతలచే సేవింపబడుతూ వున్నది. 

ముద్గౌదనం అంటే మక్కువ ఎక్కువ. ఈ లక్షణములన్నీ కల సాకినీ అనే దేవత

మూలాధారచక్రపద్మమును అధిష్టించి వున్నది. 

మూలాధార చక్రాధిష్టానదేవత అయిన, ఆ సాకిన్యంబాస్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ సాకిన్యంబాస్వరూపిణ్యై నమః  


521. ఆజ్ఞాచక్రాబ్జనిలయా

ఆజ్ఞాచక్రాబ్జనిలయా అంటే, ఆజ్ఞేయ చక్ర పద్మములో ఉండునది అని అర్ధం. 

రాబోయే నామాలలో ఆజ్ఞాచక్రములో వున్న శ్రీదేవి విశేషణముల గురించి చెప్పుకుందాం. 

భ్రూమధ్యములో ఆజ్ఞాచక్రమున్నది. ఈ ఆజ్ఞాచక్రమునకు అధిపతి ఈశ్వరుడు. 

ఆ చక్రములో వున్న పద్మముపై కొలువున్న దేవి ఆజ్ఞాచక్రాబ్జనిలయా. 

 చక్ర పద్మమునకు రెండే దళములు. ఆ పద్మము కర్ణిక పై కొలువున్నదే ఆజ్ఞాచక్రాబ్జనిలయా. 

ఆజ్ఞాచక్రానిది తపోలోకం, జీవాత్మ స్థానం, ఊదా లేదా లేత నీలి రంగు, మనస్సు ప్రధానము. 

భృకుటి వద్ద ఆజ్ఞాచక్రములో వున్న, ఆ ఆజ్ఞాచక్రాబ్జ నిలయ కు వందనం. 

ఓం శ్రీ ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః  


522. శుక్లవర్ణా 

శుక్లవర్ణా అంటే తెల్లని వజ్రము వంటి కాంతితో ప్రకాశించు దేహచ్ఛాయ కలది అని అర్ధం. 

ఆజ్ఞాచక్రములో కొలువై వున్న దేవత తెల్లగా ఉంటుంది. స్వచ్ఛతకు చిహ్నం. 

ధవళ కాంతులీనుతూ వుండే, ఆ శుక్లవర్ణ కు వందనం. 

ఓం శ్రీ శుక్లవర్ణాయై నమః 

  

523.  షడాననా

షడాననా అంటే షట్---ఆరు, ఆననా---ముఖములు కలదానా అని అర్ధం. 

ఆరు ముఖములు కల మహేశ్వరియే ఆజ్ఞాచక్రాబ్జనిలయ. 

ఈ ఆరు ముఖములూ షణ్ముఖునికి ప్రతీక. కుమారస్వామి యొక్క శక్తి జనకము ఈ దేవత. 

ఈ ఆరు ముఖములూ ఆరు ఋతువులకు సంకేతం . 

ఆరు ముఖములతో, శక్తితో తేజరిల్లుతున్న, ఆ  షడానన కు వందనం. 

ఓం శ్రీ  షడాననాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి