17, నవంబర్ 2021, బుధవారం

117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా మహనీయా, దయామూర్తిః, మహాసామ్రాజ్యశాలినీ

   

మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా 
మహనీయా, దయామూర్తిః, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥

578. మహాకైలాస నిలయా

ఆ లలితా పరా భట్టారిక మహాకైలాసము నందు నివసిస్తున్నది అని ఈ నామం చెప్తున్నది. 

మహాకైలాసం అంటే కైలాసము కంటే పరమైనది అని భావం. దూరంగా వున్నది అని భావం. 

శివపురాణంలో శివ శక్తులిద్దరూ కలిసి ఉండేది, ఇద్దరూ నృత్య, లాస్యాలలో మునిగి ఉండేది 

మహా కైలాసం అని వుంది. మాతృకావర్ణములన్నీ శ్రీచక్రానికి అనుసంధానించబడ్డాయని

చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మాతృకా వర్ణములచే ఏర్పడిన దానిని కైలాసప్రస్తారమని

అంటారనీ చెప్పుకున్నాం. ఆ కైలాసప్రస్తారము లోని బిందువు నందున్నదే మహాకైలాసం. 

కైలాసాలన్నింటికీ కైలాసం మహాకైలాసం. కైలాసాలు చాలా వున్నాయి. 

ఉత్తరాన కల త్రివిష్టపంలో ఒక కైలాస పర్వతముంది. అది శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది.

ఈ పర్వతంపై శివ పార్వతులు కూడి ఉంటారని ఒక విశ్వాసం. అది శివ శక్తుల సంగమ స్థానం  

అని చెప్తారు. అందుకే ఆ పర్వతం పైకి కూడా ఎవరూ ఎక్కరు. ఎక్కనివ్వరు. పర్వతం కింద నుంచే చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. 

ఆ పర్వత శిఖరం ప్రపంచం మొత్తం లోకీ ఎత్తైన శ్రీచక్రస్వరూపం. పృధ్వికి అదే కైలాసం. 

మానవ దేహంలో బ్రహ్మరంధ్రస్థ సహస్రారమే కైలాసమని, అక్కడి బిందుస్థానంలోనే

పరమశివుడు, పరమేశ్వరితో కూడి ఉంటాడని,  త్రిపురాసారములో వుంది. 

వశిన్యాదిప్రస్తారము, తాదాత్మ్యప్రస్తారము, నిత్యతాదాత్మ్యప్రస్తారము వంటి ప్రస్తారాలు చాలా 

వున్నాయి. అన్ని ప్రస్తారములలోనూ మాతృకావర్ణ కైలాసప్రస్తారము ఉత్తమమైనది కనుక, 

దానినే మహాకైలాసం అన్నారు. బ్రహ్మరంధ్రమందున్న సహస్రారము మహాకైలాసమనే భావన 

కూడా వుంది. అట్టి మహాకైలాసమందు ఉండునది మహాకైలాసనిలయా.  

కైలాసాల లోకెల్లా ఉత్తమమైన మహాకైలాసమందు వుండు, ఆ మహాకైలాసనిలయ కు వందనం. 

ఓం శ్రీ మహాకైలాసనిలయాయై నమః   


579. మృణాల మృదుదోర్లతా 

మృణాళమంటే తామరతూడు. తామర తూడులు చాలా మృదువుగా ఉంటాయి. 

దేహము నుంచి సున్నితమైన, మృదువైన తామరతూడుల వలె వున్న, రెండు లతలు చేతులుగా 

వస్తే ఎలా వుంటాయో ఒక్కసారి ఊహించండి. దోర్లతా అంటే దేహలతా అని అర్ధం. 

అటువంటి మృదువైన లతా సమానమైన చేతులు కలది అమ్మ అని ఈ నామం చెబుతోంది. 

ఆ లలితాపరమేశ్వరి ఎంత దృఢంగా వుంటుందో, అంత సున్నితంగా కూడా వుంటుంది, 

అని ఇప్పటికే చాలా నామాల్లో తెలుసుకున్నాం. 

మృదువైన తామరతూడుల వంటి హస్తములు కలిగినది ఆ పరమేశ్వరి అని ఈ నామ భావం. 

సున్నితమైన తామరతూడుల వంటి చేతులు కల, ఆ మృణాలమృదుదోర్లత కు వందనం.  

ఓం శ్రీ మృణాలమృదుదోర్లతాయై నమః  


580. మహనీయా

మహనీయా అంటే గొప్ప పూజనీయురాలు అని అర్ధం. అమ్మవారి కన్నా పూజనీయులెవరు, 

నిఖిలేశ్వరి కదా ఆ శ్రీమాత. ఆ తల్లిని పూజించే కరములే కరములు, ఆ అమ్మ మాహాత్మ్యాన్ని

వర్ణించే జిహ్వయే జిహ్వ, ఆ శ్రీమాతను చూచే చూపులే చూపులు, ఆ జగన్మాతకి మొక్కే

శిరస్సే శిరస్సు, ఆ జగదంబ మహిమలు వినే చెవులే చెవులు. ఆ జగజ్జననికి తప్ప అన్యులకు ఈ 

మహనీయా అనే నామం ఎలా వస్తుందీ. దేవేంద్రాది దేవతలు, త్రిమూర్తులు, త్రిమాతలు, 

యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, నాగ జాతుల వారందరికీ ఆ శ్రీమాతే కదా నిత్య పూజ్య. 

కనుకనే ఆమె మహనీయా అని చెప్పతగినది. సర్వ లోకాలకూ ఆరాధనీయ. 

లోకేశులు, లోకస్థులు అందరిచే, అన్నివేళలా  పూజింపబడు, ఆ మహనీయ కు వందనం. 

ఓం శ్రీ మహనీయాయై నమః  


581. దయామూర్తిః

దయాస్వరూపిణి కనుక అమ్మను ఈ నామంలో దయామూర్తీ అని చెప్పుకుంటున్నాం. 

దయయే ఒక మూర్తిగా ఏర్పడితే ఎలా వుంటుందో, అమ్మవారి స్వరూపం  అలా ఉంటుంది. 

"రామో విగ్రహవాన్ ధర్మః" అన్నాడు వాల్మీకి. ధర్మానికి విగ్రహరూపమే శ్రీరాముడు అని అర్ధం. 

ఇక్కడ ఆ మాహేశ్వరిని, " శ్రీమాతా విగ్రహవాన్ దయః" అని అంటున్నాం. 

ఆమె చూపు దయగా ఉంటుంది. ఆమె చేత దయతో నిండి ఉంటుంది. ఆమె దయార్ద్రహృదయ. 

సాంద్రకరుణా స్వరూపము. అందుకే ఈ నామంలో ఆ జగజ్జననిని దయామూర్తీ అని అంటున్నాం. 

భక్తుల పట్ల దయార్ద్ర హృదయముతో వుండే, ఆ దయామూర్తి కి వందనం. 

ఓం శ్రీ దయామూర్త్యై నమః 

  

582. మహాసామ్రాజ్యశాలినీ

అమ్మను రాజ్ఞీ, మహారాజ్ఞీ, శ్రీమత్ సింహాసనేశ్వరీ, భువనేశ్వరీ, నిఖిలేశ్వరీ, రాజరాజేశ్వరీ, 

రాజ్యలక్ష్మీ, సామ్రాజ్యదాయినీ, మాహేశ్వరీ, పరమేశ్వరీ అనే నామాలతో పిలుచుకుంటూ

ఉంటాం. ఈ అన్ని నామాలనూ మించి, ఈ నామంలో ఆ మహాదేవిని మహాసామ్రాజ్యశాలినీ 

అంటున్నాం. మహాకైలాసానికి ఈమెయే అధీశ్వరి. మహాకైలాసము వంటి గొప్ప, ఉన్నతమైన 

సామ్రాజ్యంలో ఈ జగన్మాత తన భర్త అయిన పరమశివునితో చేరి నివసిస్తూ ఉంటుంది. 

మహాకైలాసం కన్నా గొప్ప సామ్రాజ్యం వేరొకటి లేదు. అటువంటి గొప్ప సామ్రాజ్యానికి అధీశ్వరి, 

కనుక, ఈ తల్లి కాక మరెవ్వరు మహాసామ్రాజ్యశాలినీ అనే నామానికి అర్హులు. 

మహాకైలాసమనే గొప్ప సామ్రాజ్యానికి మహారాజ్ఞి అయిన, ఆ మహాసామ్రాజ్యశాలిని కి వందనం. 

ఓం శ్రీ మహాసామ్రాజ్యశాలిన్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి