21, నవంబర్ 2021, ఆదివారం

121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ గురుమూర్తిః, గుణనిధిః, గోమాతా, గుహజన్మభూః

  

దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ 

గురుమూర్తిః, గుణనిధిః, గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥

601. దరాందోళిత దీర్ఘాక్షీ

కొద్దిపాటి ఆందోళనతో కూడిన, విప్పారిన కన్నులు కలది అని ఈ నామార్ధం. 

ఆందోళనకు కొద్దిగా చలించి, కన్నులను ఆకర్ణాంతమూ విప్పార్చి చూస్తున్నది ఈ దీర్ఘాక్షి. 

ఆందోళన ఎందుకూ అంటే, తన పిల్లలందరూ క్షేమమే కదా అని ఒక తల్లి పడే ఉలికిపాటు అది. 

అందరినీ అన్నివేళలా, అన్ని వైపులా విప్పార్చి చూస్తోంది ఆ జగజ్జనని. 

ఆ తల్లి కృపా కటాక్షము కనుక మన మీద పడిందా, ఇక ఆందోళనలు లేనట్లే. 

ఆందోళనలను పరిహరించే చూపు అది. కటాక్షించే కరుణ అది. 

ఆ చూపే, ఆ దర ఆందోళిత దీర్ఘాక్షి ప్రసన్న వీక్షణం. 

ఆ చూపు పడితే చాలు భయాలు నశిస్తాయి, ఆనందము, ధైర్యము, స్థిమితము కలుగుతాయి. 

విప్పార్చిన తన కంటి చూపులతో భక్తుల ఆందోళనలు తొలగించి, స్వస్థపరచే,  

ఆ దరాందోళిత దీర్ఘాక్షి కి వందనం. 

ఓం శ్రీ దరాందోళితదీర్ఘాక్ష్యై నమః  


602. దరహాసోజ్జ్వలన్ముఖీ

దరహాసంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ముఖము కల పరమేశ్వరి అని ఈ నామానికి అర్ధం. 

దరహాసమంటే చిరునగవు. చక్కని ఆహ్లాదకరమైన చిరునవ్వుతో, దేదీప్యమానంగా వెలిగే ముఖం 

కల ఆ తల్లి, తన చిరు మందహాసం తోనే భక్తుల ఇక్కట్లు సగం తీరిపోయేలా చేస్తోంది. 

ఆ నగుమోము చూస్తుంటే కలిగే హాయిని ఏ తుల లోనూ తూచలేము. 

ఎవరు ఎంతగా, ఏమని భావిస్తే, ఆ విధంగా దర్శనము, సాంత్వన ఇచ్చే తల్లి ఈ పరమేశ్వరి. 

శ్రీలలిత నగుమోము చూస్తే కలిగే ఆనందము వర్ణనాతీతము. 

తన చక్కని చిరు మందహాసముతో భక్తులను భయముల నుండి ఉద్ధరించే,

ఆ దరహాసోజ్జ్వలన్ముఖి కి వందనం.  

ఓం శ్రీ దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః  


603. గురుమూర్తిః 

గురుమూర్తి అంటే గురుత్వమే తన మూర్తిత్వముగా గల మూర్తి అని అర్ధం. 

గురువు అంటే అన్నిటికన్నా పెద్దది, గొప్పది, ఉత్కృష్టమైనది అని అర్ధం. 

గ్రహాలన్నింటిలోకీ పెద్దది కనుకే బృహస్పతికి గురువు అని పేరు. 

విద్యార్థులందరికీ మార్గదర్శనం చేసే గొప్పదైన జ్ఞానస్వరూపము కనుక ఉపాధ్యాయునికి ఆ పేరు. 

గురుత్వము అంటే గొప్పదనము, పెద్దరికము, మార్గదర్శకత్వము వహించగల శక్తిసామర్ధ్యము. 

"అజ్ఞానతిమిరాంధస్య, జ్ఞానాంజన శలాకయా" అని చెప్పుకుకున్నాం కదా. 

అజ్ఞానమనే చీకటిలో నుంచి వెలికితీసి, జ్ఞానమనే వెలుగు చూపించేవాడు గురువు. 

ఎలా అయితే, ఘటము, కలశము, కుంభము అనే పదాలన్నింటి అర్ధమూ ఒక్కటేనో,  

అదే విధంగా, గురువు, దేవత, మంత్రము అనే పదాల భావము కూడా ఒక్కటే. 

గురువే దేవత, గురువే మంత్రము. ఈ విషయము సుందరీతాపినీయోపనిషత్తు నందు వున్నది. 

శక్తి రహస్యంలో, గు అంటే చీకటి, రు అంటే దానిని నివారించేది అని, మరియొక చోట, 

గు అంటే బ్రహ్మ, రు అంటే జ్ఞానము, వెరసి ఆ బ్రహ్మజ్ఞానస్వరూపమే గురువు అని చెప్పారు. 

నిత్యాహృదయము నందు మాత్రం, దేవి యొక్క ఇచ్ఛావిగ్రహమే గురువు అని వున్నది. 

అంటే, అమ్మవారు తనను తాను, తన ఇచ్ఛ మేరకు గురు రూపములో ప్రకటించుకొనుచున్నది 

అని అర్ధం. జ్ఞానార్థులైన భక్తులకు గురువిగ్రహరూపంలో జ్ఞానోపదేశమును చేయునది అని భావం. 

ఉపాసకులకు స్వయంగా తానే గురువై, జ్ఞానాన్ని అందిస్తున్న, ఆ గురుమూర్తి కి వందనం. 

ఓం శ్రీ గురుమూర్త్యై నమః  


604. గుణనిధిః 

గుణములకు నిధి వంటిది అమ్మ అని ఈ నామానికి అర్ధం. గుణాలకు పుట్టినిల్లు. 

మరి త్రిగుణములను సృజించినది ఈ జగన్మాతే కదా. చెప్పుకోవటానికి గుణములు మూడే 

అయినా, వాటిలోని హెచ్చుతగ్గులను బట్టీ గుణముల సంఖ్య అనంతము. 

షాడ్గుణ్యపరిపూరితా నామంలో కూడా ఆరుగుణముల గురించి చెప్పుకున్నాం. 

ఆ గుణములన్నింటికీ నిధి ఈ తల్లి. వేరొక అర్ధంలో గుణములు అంటే నవవ్యూహాలు. 

అందువలన, గుణనిధి అంటే నవ వ్యూహ స్వరూపము అని అర్ధం. 

ఆ నవ వ్యూహాలే, కాలవ్యూహము, కులవ్యూహము, నామవ్యూహము,  జ్ఞానవ్యూహము,

చిత్తవ్యూహము, నాదవ్యూహము, బిందువ్యూహము, కల్పవ్యూహము(కళావ్యూహము), జీవవ్యూహము. 

ఈ నవవ్యూహాత్మకులే ఆనందభైరవుడైన పరమేశ్వరుడు, ఆనందభైరవి అయిన పరమేశ్వరి. 

వీరిద్దరి సామరస్య రూపమే గుణనిధి. గుణములకు పెన్నిధి ఆ పరమేశ్వరి. 

గుణము అంటే రజ్జువు, తాడు అని కూడా ఒక అర్ధం వుంది.  

కృత యుగాంతము జరిగే ముందు, శ్రీహరి మత్స్య రూపములో మనువుకు దర్శనమిస్తాడు. 

ఇంతలింతలుగా పెరిగి, మొదట దోసిట్లో  దొరికి, తరువాత కమండలములో ఈదులాడిన చిన్నారి 

చేప, అఖండమైన సముద్రమంతగా పెరిగి, తానే శ్రీమన్నారాయణుడనని 

ప్రకటించుకుంటుంది. "ప్రళయకాలంలో, ఈ తీరానికి ఒక పెద్ద ఓడ వస్తుంది. 

దానిలో పునఃసృష్టికి అవసరమైన సకల జీవులనూ, బీజములనూ, ఋషులనూ, వస్తువులనూ 

చేర్చు. నీవు కూడా పత్నీ సమేతంగా ఎక్కు. నవయోజనాల పొడవుతో, మూడు మాయల 

వెడల్పుతో చర్మంతో ఒక తాడు సిద్ధం చేయి. ఆ ఓడను ఆ రజ్జువుతో నా కొమ్ముకు కట్టు. 

ఆ తాడే వటీరిక. జగద్ధాత్రి, మహామాయా, లోకమాతా, జగన్మయీ, యోగనిద్రా అయిన శ్రీమాత 

ఆ వటీరికను దృఢంగా ఆవహించి ఉంటుంది. ఆ ఓడలో వున్న వారందరినీ, ఆ వటీరిక అయిన 

జగన్మాతా, ఈ మహామత్స్యమైన నేనూ, ఆ మహా ప్రళయం నుంచి ఉద్ధరిస్తాము" అని మనువుకు 

చెప్తాడు మత్స్యరూప నారాయణుడు. ఆ రజ్జురూప నారాయణినే గుణనిధి అంటాము. 

ఈ విశేషం మత్స్యపురాణంలోనూ, కాళీ పురాణంలోనూ కూడా వుంది. 

వటీరిక రూపంలో మనలను దృఢంగా పట్టుకునే గుణాన్ని ప్రదర్శించిన, ఆ గుణనిధి కి వందనం. 

ఓం శ్రీ గుణనిధయే నమః 

  

605. గోమాతా

గోమాతా అంటే, గోవులకు మాత అని అర్ధం. గోవులకు మాత కామధేనువు సురభి. 

దేవలోక ధేనువు సురభి. గోవులన్నింటికీ తల్లి వంటిది. ఈ నామంలో ఆ జగన్మాతను గోమాతా 

అంటున్నాం. గోమాతను పూజించటం మన భారతదేశపు సంప్రదాయం. గోవులకు ఇంటిలో 

ప్రధాన స్థానం ఇచ్చి పూజించే సంప్రదాయాన్ని నేటికీ కొన్ని ప్రాంతాల్లో పాటిస్తున్నారు. 

గోవుకు, పశుసంపదకు ఇంటి ముందు భాగంలోని వసారాల్లో స్థానం ఇచ్చి, 

తాము వాటి తరువాత గదుల్లో ఉంటూ, వస్తూ పోతున్న ప్రతిసారీ ఆ ఆవులను చూసుకుంటూ 

వుంటారు. పశుసంపదే అసలైన సంపదగా భావిస్తారు వారు. దానికే ప్రధమ  స్ధానం. 

గోవులు అంటే పశువులు. పశుపతి పత్నిగా, ఆ పశువులకు మాత అయింది శ్రీమాత. 

గోవులకు మాతయై, కామధేనువు వలె కామితాలను తీరుస్తున్న, ఆ గోమాత కు వందనం. 

ఓం శ్రీ గోమాత్రే నమః 


606. గుహజన్మభూః

గుహుడు అంటే కుమారస్వామి. శివుడికి స్కందుడు పుట్టటానికి కారణం అయిన 

ఆ జగన్మాతను, ఈ నామంలో గుహజన్మభూ అంటున్నాం. 

శివుని వీర్యమును తాను ధరించకపోయినా, ఆ వీర్యస్ఖలనానికి కారణమైనది పార్వతి. 

అందుకే  ఈ నామంలో ఆ తల్లిని గుహజన్మభూ అంటున్నాం. 

ఈ ఆది దంపతులు, జగత్పితరులు. లోక కళ్యాణార్ధం, శివ స్పర్శ లేకుండా గణేశుడు, 

పార్వతీ గర్భంలో పెరగకుండా స్కందుడు జన్మించారు. 

గుహులు అంటే అజ్ఞానముచే ఆవరింపబడినవారని కూడా ఒక అర్ధమున్నది. అంటే జీవులు అని 

అర్ధం. ఆ గుహులకు తల్లియై జ్ఞానమనే వెలుగును వారికి అందిస్తున్నది శ్రీమాత అని ఒక అర్ధం. 

వేదములోనూ, యాజ్ఞ్యవల్క్యస్మృతిలోనూ, అగ్ని నుంచి విస్ఫులింగములు బయటికి వచ్చినట్టు, 

పరమేశ్వరి నుంచి జీవులు బయటకు వస్తున్నారని  చెప్పారు.  

జ్ఞానాన్నిచ్చే స్కందమాత, ఆ గుహజన్మభూ కు వందనం. 

ఓం శ్రీ గుహజన్మభువే నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి