728. చిత్కళా
ఓం శ్రీ చిత్కళాయై నమః
729. ఆనందకలికా
అఖండచైతన్యము లో కొంతభాగమును చిత్కళ అన్నట్లే, బ్రహ్మానందములో కొంతభాగాన్ని
ఆనందకళ అంటారు. ఆనందకళ అంటే, జీవులలో ఆనందస్వరూపురాలు.
పరమాత్మ యొక్క అఖండ ఆనందంలో ఒక అంశను పొంది జీవుడు ఆనందపడుతున్నాడు,
అని వేదములో వున్నది. కళిక అంటే మొగ్గ. ఆనందమనే మొగ్గను జీవుడు పొందియున్నాడు.
మొగ్గనే 'కోరక' అని కూడా అంటారు. ఆనందకళికా అంటే, ఆనందమనే కోరక రూపములో
జీవులందరిలో గల, ఆ ఆనందాంశ స్వరూపమే అమ్మ.
ఆ బ్రహ్మానందంలో నుంచి వచ్చి, ప్రతి జీవిలో చేరిన మొగ్గ వంటి కళే, ఆనందకళికా రూపంలో
వున్న అమ్మవారి ఆనందాంశము.
బ్రహ్మానందంలో భాగమయిన ఆనందపు మొగ్గల వంటి, ఆ ఆనందకళిక కు వందనం.
ఓం శ్రీ ఆనందకలికాయై నమః
730. ప్రేమరూపా
ప్రేమయే తన స్వరూపముగా కలది ప్రేమరూపా. ప్రేమ అంటే స్నేహము, భక్తి.
అమ్మ పట్ల భక్తుడు చూపుతున్న భక్తే, చూపుతున్న స్నేహమే, అమ్మ స్వరూపంగా కనిపిస్తుంది.
అందుకే ఏ రూపంతో అమ్మను చూడాలనుకుంటామో, ఆ రూపంలోనే అమ్మను చూస్తూ ఉంటాం.
కొందరికి బాల వలె, కొందరికి రాధ వలె, కొందరికి లక్ష్మి వలె, మరి కొందరికి సరస్వతి వలె,
కొందరికి కాళి వలె కనపడుతూ ఉంటుంది అమ్మ.
అది వారు తమ భక్తితో, తమ ప్రేమతో మనసులో అమ్మను గురించి ఊహించుకున్న రూపం.
అందుకే "ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన, అంతమాత్రమే నీవూ" అంటాడు అన్నమయ్య.
ప్రేమ, భక్తి, స్నేహం అంటే ఆనందమే. కనుక అమ్మ ప్రేమ అనే ఆనందస్వరూపిణి.
ఆనందము నిండిన ప్రేమ అనే అనుభూతికి అందుతున్న, ఆ ప్రేమరూప కు వందనం.
ఓం శ్రీ ప్రేమరూపాయై నమః
ఓం శ్రీ ప్రియంకర్యై నమః
732. నామపారాయణప్రీతా
తన నామాన్నిపారాయణం చేసేవారి పట్ల ప్రీతిని చూపేది అని ఈ నామ భావం.
తన భక్తులను ఉద్ధరించడానికి, ఈ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని, వాగ్దేవతలైన వశిని
మొదలైన ఎనిమిది మంది శ్రీచక్ర సప్తమావరణ దేవతల చేత, అమ్మ ఇష్టపడి, ముచ్చటగా
రచింపచేసింది. శ్రద్ధా భక్తులతో, ఈ స్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి, కోరిన కోరికలు
తీరుస్తుంది అమ్మ. నామ పారాయణమంటే ఆ శ్రీలలితకు మహా ప్రీతి అని ఈ నామం
చెప్తోంది. ఈ సహస్ర నామాలే కాదు, పరమాత్మకు సంబంధించిన ఏ నామాలు పారాయణ చేసినా
అమ్మ తృప్తి చెందుతుంది. కేవలము మాతృకావర్ణాలలో కల అక్షరములను పారాయణ చేసినా
చాలు. ఎందుకంటే, ప్రతి అక్షరమూ ఒక బీజాక్షరమే, ఒక మంత్రమే.
ఒక్క అక్షరం జపించినా అది అమ్మ నామమే.
లలితాత్రిశతి కూడా 'క కార రూపా కల్యాణీ' అనే నామంతో మొదలవుతుంది.
ఖడ్గమాలా స్తోత్రంలో కూడా శ్రీచక్ర నవావరణ దేవతల గురించి చెప్పబడింది.
ఖడ్గమాల పారాయణం చేసినా, బాల, పంచదశి, చాముండా వంటి దేవతల మంత్రములు
పారాయణ చేసినా, షోడశీ వంటి దశమహావిద్యల మంత్రములు పారాయణ చేసినా,
అమ్మకు ప్రీతికరం.
దేవీ భాగవతంలో, "అకారము నుంచి క్షకారము వరకు అన్ని అక్షరములనూ రకరకాలుగా
కూర్చితే, అసంఖ్యాకములైన నామములు ఏర్పడతాయి" అని చెప్పారు.
ఈ నామాల పారాయణము కానీ, సహస్రనామాల పారాయణము కానీ, ఏది చేసినా అమ్మ ప్రీతి
చెందుతుంది కనుక, అమ్మను ఈ నామంలో నామ పారాయణప్రీతా అని చెప్పుకుంటున్నాం.
నామాన్ని పారాయణ చేస్తే, ప్రీతి చెందే, ఆ నామపారాయణప్రీత కు వందనం.
ఓం శ్రీ నామపారాయణప్రీతాయై నమః
733. నందివిద్యా
నందికేశ్వరుడు ఉపాసించిన విద్య శ్రీవిద్య. అమ్మవారు శ్రీవిద్యాస్వరూపము.
నంది ఉపాసించిన విద్య కనుక, అమ్మను ఈ నామంలో నందివిద్యా అంటున్నాం.
నందీశ్వరుడు ప్రమథగణములలో ప్రధముడు. శివుడెక్కడ ఉంటే, అక్కడ నంది ఉంటుంది.
శివుని యొక్క ఆనందస్వరూపమే నంది. శివానందమూర్తియే నంది.
ఆ నంది ఉపాసించిన విద్య నందివిద్య. నంది ఉపాసించిన పంచదశీమంత్ర స్వరూపమే శ్రీమాత.
కనుక ఈ నామంలో అమ్మను నందివిద్యా అంటున్నాం.
ఆనందరూపంలో శివుడిని, శక్తిని ధ్యానించాలంటే నంది సహాయపడతాడు.
నందీశ్వరుని ఉపాస్యదేవత, ఆ నందివిద్య కు వందనం.
ఓం శ్రీ నందివిద్యాయై నమః
734. నటేశ్వరీ
చిదంబరంలో కొలువై వున్న శివుడికి నటరాజు అని పేరు. ఆ నటరాజుకి ఈశ్వరి, కనుక ఈ
నామంలో అమ్మను నటేశ్వరీ అంటున్నాం. ఆ నటరాజు నృత్యం చేసేటప్పుడు,
అతనితో పాటు నృత్యము చేయునది అని అర్ధం.
శివపార్వతులిద్దరూ జంటగా నృత్యం చేసేటప్పుడు అమ్మ తన ఒక పాదాన్ని మోకాలి
వరకూ ఎత్తిందట. అప్పుడు ఆ పాదాన్ని పద్మంగానూ, పిక్క వరకూ వున్న కాలిని తామరతూడు
తోనూ, కాలిగోళ్ళ వెలుగును నాగకేసర పుష్పాల పుప్పొడితోనూ, మెరుస్తున్న పారాణిని
చిగురాకులతోనూ, కాలిఅందెలను తుమ్మెదలు గానూ పోల్చారు భాస్కరరాయలు.
నటరాజు లోని నాట్యశక్తే నటేశ్వరి. నటరాజుతో కలిసి నృత్యం చేసేదీ,
నటరాజులో శక్తిరూపంలో వుండి నృత్యం చేయించేదీ నటేశ్వరి.
నటరాజు నృత్యాన్ని అనుకరిస్తూ, నటరాజుతో కలిసి నాట్యం చేస్తున్న, ఆ నటేశ్వరి కి వందనం.
ఓం శ్రీ నటేశ్వర్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి