15, డిసెంబర్ 2021, బుధవారం

145. మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాశనా అపర్ణా, చండికా, చండముండాసుర నిషూదినీ

 

మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాశనా 
అపర్ణా, చండికా, చండముండాసుర నిషూదినీ ॥ 145 ॥


750. మహేశ్వరీ

ఈశ్వరి ఎంతో మహత్తైనది, చాలా గొప్పదైనది, కనుక ఈ నామంలో అమ్మను మహేశ్వరీ 

అంటున్నాం. 208 వ నామంలో అమ్మను "మాహేశ్వరీ" అన్నాం. ఇక్కడ 750 వ నామంలో 

మహేశ్వరీ అంటున్నాం. మహత్తత్త్వమును అంతటా వ్యాపింపచేసినది కనుక మహేశ్వరీ అన్నారు. 

ఇంద్రియాతీత తత్త్వమైన, ఈ మహత్తత్త్వమును చూడటానికి, అర్ధం చేసుకోవటానికి, 

ఇంద్రియములు ఏవీ సహాయపడలేవు. ఈశ్వరీ అంటే యజమాని అని భావం. కానీ యజమాని 

కన్నా ఈశ్వరుడు గొప్పవాడు. యజమాని తన ఆస్తులను చూచుకోగలడు. కానీ ఈశ్వరి తన 

జీవులను తానే సృష్టించి, ఆ జీవులన్నిటిలో తాను కూడా ఉంటూ, తన నుంచి వచ్చిన 

ప్రతి జీవినీ తిరిగి తనలో లయింప చేసుకోగలదు కనుక ఈ దేవిని మహేశ్వరీ అన్నారు. 

మహత్తైన అన్నిటిలో కెల్లా మహత్తైన, ఆ మహేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ  మహేశ్వర్యై నమః  


751. మహాకాళీ

మహాకాళీ ఉజ్జయినిలో కొలువైన మహాకాలుని ఇల్లాలు. కాలమునకు లొంగదు. 

కాలునికే కాళీస్వరూపము. కాలుడు అయిన యమునికి కూడా కాలుడి వంటిది. 

సకల ప్రాణుల ప్రాణములూ, తన పాశానికి బద్ధులను చేసే యముడు కూడా అమ్మ ఆజ్ఞకై 

ఎదురుచూస్తాడు. కాలమును తన చెప్పుచేతలలో ఉంచుకొనునది. నల్లని వర్ణంతో భాసించేది. 

కాళిదాసుని కరుణించిన మహాకాళి ఈ తల్లి. 

భద్రకాళి భక్తులను ప్రసన్న దృష్టితో భద్రంగా చూస్తుంది. 

ఉగ్రకాళి, తృప్తి చెందకపోతే తన ఉపాసకులను కూడా శిక్షిస్తుంది. 

దక్షిణేశ్వరకాళి దక్షిణ కాళి.  శ్రీరామకృష్ణపరమహంసకు కన్నతల్లి వంటిది. 

వరంగల్లు భద్రకాళి, భక్తుల పట్ల ప్రసన్న వీక్షణంతో వుండి, కాపాడుతూ ఉంటుంది. 

కాకతీయులకు ఉపాస్యదేవత. రాజ్య రక్షణ దేవత ఈ భద్రకాళి.  

మహాకాళుని ఇల్లాలు అయిన, ఆ మహాకాళి కి వందనం.  

ఓం శ్రీ మహాకాళ్యై నమః  


752.  మహాగ్రాసా

అమ్మ అన్నపాన స్వరూపురాలు అని ముందు నామాల్లో చెప్పుకున్నాం. 

అన్నము అంటే అమ్మే. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. 

అన్నమంటే భుజించతగిన అన్ని పదార్ధాలూ. అపరిమితమైన తిండి కలది మహాగ్రాసా. 

ఎవరు తినే గ్రాసము అయినా ఆ అమ్మకు గ్రాసమే. ప్రతిజీవిలో ఉంటూ, వారి గ్రాసాన్ని 

స్వీకరించేది కనుక అమ్మను మహా గ్రాసా అంటున్నాం. 

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మొదలైన ఏ వర్ణము వారి గ్రాసమైనా అమ్మవారికి భోజనమే, 

అని వేదములో చెప్పబడింది. 

అందరి రూపములో, తానే ఆ గ్రాసమును తినుచున్నది కనుక, ఆ పరమేశ్వరి గొప్ప కబళము కలది 

అని ఈ నామార్ధం. 

అపరిమితమైన, అమితమైన ఆహారాన్ని తింటున్న, ఆ  మహాగ్రాసా కు వందనం. 

ఓం శ్రీ  మహాగ్రాసాయై నమః  


753. మహాశనా

అశనము అంటే అన్నము, భోజనము అని అర్ధం. 

మహా కబళాన్ని తింటోంది కనుక, అమ్మను ఈ నామంలో మహాశనా అంటున్నాం. 

చరాచర జగత్తునంతటినీ ఆహారముగా కలది కనుక మహాశనా. 

జగత్తులే తన భోజనంగా గలది కనుక మహాశనా. 

ప్రళయకాలంలో, జగత్తుల నన్నింటినీ తన కడుపు లోనికి లయం చేసుకుంటోంది కనుక, 

అమ్మను మహాశనా అంటున్నాం. తన సృష్టి అంతా తానే లయించునది అని అర్ధం. 

జగత్తులనన్నిటినీ ఆహారముగా తీసుకుంటున్న, ఆ మహాశన కు వందనం. 

ఓం శ్రీ మహాశనాయై నమః 

  

754. అపర్ణా

పార్వతీదేవి హిమాలయాలలో, మేనా హిమవంతుల కూతురుగా పుట్టి, ఆ మహాదేవుని భర్తగా 

పొందటానికి పట్టుదలతో చిరకాలం తీవ్రమైన తపస్సు చేసింది. 

ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య నిలబడి, చలికాలంలో పీకల్లోతు నీళ్ళల్లో నిలబడి 

పార్వతీదేవి శివునికై కఠోరతపస్సు చేసింది. 

నేటికీ హిమాలయాల్లో మానససరోవరం వద్ద, పార్వతీదేవి  తపస్సు చేసిన ప్రాంతంలో, 

గౌరీ కుండ్ అనే సరస్సు కనిపిస్తుంది. 

హైమావతి కొంతకాలం కేవలం నామ మాత్రపు ఆహారం తీసుకుని తపస్సు చేసింది. 

తల్లి ఉ-మా అని వారిస్తున్నా వినలేదు. అందుకే అమ్మకు ఉమా అనే నామం వచ్చింది. 

తరువాత గిరిజ ఆ ఆహారం కూడా మానేసి ఫలాలు, కందమూలాలూ తిని తపించింది. 

మరి కొన్నాళ్ళ తరువాత, అది కూడా మానేసి నీరు తాగి తపస్సు కొనసాగించింది.  

ఇంకొన్నాళ్ళు ఎండిన ఆకులు తిని తపస్సు చేసింది. 

చివరకు ఆ పర్ణాలని కూడా తినడం మానేసి అపర్ణయై తపస్సు చేసింది. 

అప్పుడు సదాశివుడు కరుణించాడు. అందుకే అమ్మకు అపర్ణా అనే నామం వచ్చింది. 

అపర్ణ అంటే ఋణము లేనిది, ఋణశేషము లేనిది అనే అర్ధం కూడా వున్నది. 

మహాదేవునికై ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిన, ఆ అపర్ణ కు వందనం. 

ఓం శ్రీ అపర్ణాయై నమః 


755. చండికా

భక్తి లేనివారి పట్ల కోపము కలది అని భావం. చడి అంటే కోపము కలది  అని అర్ధం. 

అమ్మకు భక్తి లేని వారి పట్ల కోపం వుంది అని ఈ నామం చెప్తోంది. 

దుర్మార్గుల పట్ల కోపముగా ఉండునది చండిక. రాక్షసుల గుండెల్లో భయాన్ని కలగచేసేది చండిక. 

దేవీ భాగవతంలో ఏడు సంవత్సరాల బాలికను చండికా అన్నారు. 

భక్తి లేని వారి పట్ల కోపమును కలిగి వున్న, ఆ చండిక కు వందనం. 

ఓం శ్రీ చండికాయై నమః 


756. చండముండాసుర నిషూదినీ

చండ ముండులనే రాక్షసులని వధించింది కనుక, అమ్మకు ఈ నామం వచ్చింది. 

నిషూదనము అంటే చంపటం. 

మార్కండేయ పురాణంలో, 'చండముండాసురులను తలలు కోసి చంపావు కనుక, 

నువ్వు చాముండా అనే నామం పొందావు', అని వుంది. 

వరాహ పురాణంలో, 'రురుడు అనే రాక్షసుణ్ణి త్రిశూలంతో వధిస్తే, అతడి శిరస్సు నుంచి చర్మము, 

ముండము(తల) వేరైపోయాయి. ఆ చర్మము, ముండమును గ్రహించి అమ్మ వెళ్ళిపోయింది, 

కనుక చాముండా అనే నామం కలిగింది' అని వుంది. 

భయంకరులైన రాక్షసుల ముండములు త్రెంచినది, కనుక చాముండా నామం వచ్చిందని కూడా 

వున్నది. ఆ ముండమాలను ధరించి కాళికా రూపం దాల్చినదని కూడా చెపుతారు.  

హిమాచల్ ప్రదేశ్ లోని చాముండా గ్రామంలో ఆది పరాశక్తి యైన చాముండా ఆలయం వుంది. 

అక్కడ వున్న విగ్రహం చాలా పురాతనమైనది. ఆదిమ కాలం నాటి శిలాజం. 

"ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే" అనేది చాముండా మంత్రం. 

ఈ మంత్రాన్ని జపిస్తే దుష్టుల నుంచి అమ్మ రక్షిస్తుందని విశ్వాసం. 

చండుడు ముండుడు అనే రాక్షసుల తలలు ద్రుంచిన, 

ఆ చండముండాసురనిషూదిని కి వందనం. 

ఓం శ్రీ చండముండాసురనిషూదిన్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి