
భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా
రోగపర్వత దంభోళిః, మృత్యుదారు కుఠారికా ॥ 144 ॥
746. భాగ్యాబ్ధిచంద్రికా
భాగ్య, అబ్ధి, చంద్రికా అంటే భాగ్యమనే సముద్రమునకు వెన్నెల వంటిది అని అర్ధం.
సముద్రం ఆటుపోట్లు చంద్రుణ్ణి అనుసరిస్తూ ఉంటాయి.
వెన్నెలను బట్టీ సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది.
భక్తుల భాగ్యమనే సముద్రం కూడా అదే విధంగా, అమ్మ కరుణను బట్టీ పొంగిపొర్లుతూ ఉంటాయి.
భాగ్యవంతుల పట్ల అమ్మ అనుగ్రహం వున్నది, అని ఈ నామం స్పష్టం చేస్తోంది.
భాగ్యవంతులవటం అంటే, అది ఖచ్చితంగా వారు చేసుకున్న పుణ్యవిశేషము యొక్క ఫలమే.
ఆ భాగ్యవంతులే అహంకరించి, ఇది అంతా నా వల్లే అనుకుంటే,
అమ్మ కృప, అనుగ్రహము తగ్గి, ఆ సిరిసంపదలను పోగొట్టుకుంటారు.
శ్రీదేవి కరుణ, కటాక్షం ఉంటే, భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయి.
ఆ కటాక్షమే లేకపోతే, ఎంతటి భాగ్యవంతుడైనా, అనామకుడైపోతాడు.
పున్నమినాటి చంద్రుణ్ణి చూసి, సముద్రం ఉప్పొంగినట్లుగా, తన కరుణాకటాక్షాల వలన,
తన భక్తుల సిరి సంపదలు వృద్ధి చేసే, ఆ భాగ్యాబ్ధిచంద్రిక కు వందనం.
ఓం శ్రీ భాగ్యాబ్ధిచంద్రికాయై నమః
747. భక్తచిత్తకేకిఘనాఘనా
ఘనాఘనము అంటే వాన కారు మేఘము. ఆ కారు మేఘాలను చూసి కేకి అంటే నెమళ్ళు
పరవశించి, పురివిప్పి ఆడతాయి. పరమేశ్వరి భక్తుల చిత్తాలను నెమళ్ల వలె పరవశింపచేసే,
వర్షించబోయే కారుమేఘము వంటిది.
అమ్మను తలచినంత మాత్రాన, భక్తుల చిత్తాలు కూడా, ఆ నెమళ్ళ వలె పరవశించి ఆడతాయి
అని ఈ నామంలో చెప్తున్నారు.
అమ్మను భజించే, భక్తులు మైమరచి మయూరాల వలె ఆనందడోలికల్లో ఊగిపోతారు.
అమ్మ పట్ల భక్తి, ప్రేమ ఉప్పొంగిన నెమళ్ళ వంటి భక్తులకు, అమ్మ దట్టమైన వర్షించటానికి
సిద్ధంగా వున్న మేఘము.
మేఘం వర్షించటానికి ఎలా సిద్ధంగా ఉంటుందో, అలా అమ్మ తన కారుణ్య, కృపా వర్షాన్ని
సుధాధారల వలె తన భక్తులపై వర్షిస్తుంది.
అమ్మను చూచిన భక్తులు మైమరచి అమ్మను ఆనందపరచటానికి
తమ చిత్తాలలో నెమళ్ళ వలే నృత్యం చేస్తూ వుంటారు.
నెమళ్ళ పాలిట కారుమేఘము వలే, భక్తుల చిత్తాలను పరవశంలో ముంచెత్తుతున్న,
ఆ భక్త చిత్త కేకి ఘనా ఘన కు వందనం.
ఓం శ్రీ భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః
748. రోగపర్వతదంభోళిః
దంభోళి అంటే వజ్రాయుధం. అమ్మవారు పర్వతమంత రోగాలనయినా, వజ్రాయుధము వలే,
తుత్తునియలు చేస్తుంది అని ఈ నామ భావం.
తన మహిమ వలన పెద్ద పెద్ద వ్యాధులను సైతం, నయం చేసే ఆ పరమేశ్వరి, మహా ధన్వంతరి.
వేదములో, వైద్యులందరిలోనూ గొప్ప వైద్యురాలుగా, అమ్మను కీర్తించారు.
పూర్వము పర్వతాలకు కూడా, పక్షులకున్నట్టు రెక్కలు ఉండేవి. పర్వతాలు ఎగురుతూ ఉంటే,
ఎంతో జన నష్టం, ఆస్తి నష్టం జరిగేది.
అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు కోసేశాడు.
ఆ తరువాత పర్వతాలు ఎగరలేకపోయాయి. మైనాకుడనే పర్వతం మాత్రం వాయుదేవుని
సహాయంతో, సముద్రంలోకి విసిరివేయబడి, తన రెక్కలు కాపాడుకున్నాడు.
ఈ కథ మనకు శ్రీమద్రామాయణంలో వినిపిస్తుంది.
వజ్రాయుధం పర్వతాలను కూడా కోయగలిగే పదునైన శక్తి కలది.
ఈ నామంలో అమ్మను తన భక్తుల ఆధివ్యాధులను దునుమాడే వజ్రాయుధం అని అంటున్నాం.
అమ్మ కృప ఉంటే, వజ్రాయుధం పర్వతాల రెక్కలు కత్తిరించినట్లు,
శారీరక బాధలను ఔషధఖడ్గంతో, మానసిక వ్యాధులను జ్ఞానఖడ్గంతో, తుంచి పారేస్తుంది.
రోగాల పాలిట వజ్రాయుధమైన, ఆ రోగపర్వతదంభోళి కి వందనం.
ఓం శ్రీ రోగపర్వతదంభోళ్యై నమః
749. మృత్యుదారుకుఠారికా
మృత్యువు అనే కట్టెలకు గొడ్డలి వంటిది అమ్మ అని ఈ నామార్ధం.
మృత్యువుకు గొడ్డలిపెట్టు ఆ లలితా పరమేశ్వరి.
అమ్మను సర్వమృత్యునివారిణీ అని ముందటి నామాల్లో చెప్పుకున్నాం.
లలితా పరమేశ్వరి తన భక్తులకు అకాలమృత్యువు రానివ్వదు.
మృత్యువు వచ్చినా అమ్మ ఒక్క గొడ్డలిపెట్టుతో దాన్ని తెగ్గొట్టేస్తుంది.
అపమృత్యువు ఇరవై ఎనిమిది విధములుగా వస్తుంది.
కానీ అమ్మ అటువంటి ఏ అపమృత్యువునూ తన భక్తుల దరి చేరనివ్వదు.
మరొక అర్ధంలో అమ్మ తన భక్తులకు శుద్ధ జ్ఞానాన్నిస్తుంది.
ఆ జ్ఞానం పొందిన వారికి పునర్జన్మ కలుగదు. వారిని మరణం వేధించదు.
జన్మే లేకపోతే మరణం ఎక్కడిదీ, కనుక, వారికి మృత్యువు లేదు, రాదు అని భావం.
జ్ఞానఖడ్గంతో జననమరణాలనే శృంఖలాలను భేదిస్తున్న, ఆ మృత్యుదారుకుఠారిక కు వందనం.
ఓం శ్రీ మృత్యుదారుకుఠారికాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి