29, డిసెంబర్ 2021, బుధవారం

159. జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా

 

జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ 
సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా ॥ 159 ॥


851. జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ 

జీవులందరికీ జన్మము, మృత్యువు, జర అనే అవస్థలు ఉంటాయి. 

పుట్టిన వాడికి మరణము తప్పదు. మరణించినవానికి పుట్టుక తప్పదు. మధ్యలో ముసలితనపు 

ఇబ్బందులూ తప్పవు. ఈ మూడింటి తాపము చేతా, జనులంతా సాధారణంగా బాధపడుతూ 

వుంటారు. ఈ జన్మ, మృత్యు, జరా త్రయము అనే బాధల నుండి జనులకు విశ్రాంతిని ఇచ్చేది 

జన్మ మృత్యు  జరా తప్త జన విశ్రాంతి దాయినీ అని కీర్తింపబడే లలితాపరమేశ్వరి. 

విశ్రాంతి అంటే, దుఃఖములన్నీ తొలగిన తరువాత కలిగే సుఖం. 

మర్త్యులైన జీవులకు చావు, పుట్టుక, ముదిమి, అనే దుఃఖాలను నశింపచేసి సుఖాన్నిచ్చే తల్లి అని 

ఈ నామానికి అర్ధం. దుఃఖం నశింపచేయటం అంటే, వారి వారి యోగ్యతానుసారం ఆ దుఃఖాలు 

తట్టుకునే శక్తిని ఇచ్చే కరుణామూర్తి పరమేశ్వరి అని భావం. 

జనన మరణ జరా దుఃఖాల నుంచి విశ్రాంతి నిచ్చే, ఆ జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి 

దాయిని కి వందనం. 

ఓం శ్రీ  జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయిన్యై నమః  


852. సర్వోపనిషదుద్ఘుష్టా

లలితాదేవి కీర్తి అన్ని ఉపనిషత్తులలోనూ ఉద్ఘోషించి చెప్పబడింది అని ఈ నామానికి అర్ధం. 

శ్రీమాత మహత్తత్త్వం సకల ఉపనిషత్తులలోనూ గొప్పగా, దృఢముగా, స్పష్టముగా చెప్పబడింది. 

ఎంత స్పష్టంగా చెప్పబడిందో, అంతే రహస్యంగా, గుప్తంగా, గూఢంగా చెప్పబడింది శ్రీవిద్య. 

ఉపనిషత్తు అంటేనే రహస్యము అని అర్ధం. అజ్ఞానమును పోగొట్టేది ఉపనిషత్తు.  

అన్ని ఉపనిషత్తులలోనూ జీవేశ్వర ఐక్యస్వరూపమైన అద్వైతతత్త్వం గురించి ఘోషణముగా 

చెప్పబడింది. అంటే చాటింపు వేసి మరీ చెప్పబడింది అద్వైత తత్త్వం. 

ఉపనిషత్తులలో ఘోషణముగా చెప్పిన, ఆ సర్వోపనిషదుద్ఘుష్ట కు వందనం.  

ఓం శ్రీ సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః  


853.  శాంత్యతీతకలాత్మికా 

కళలలో ఆకాశము నందు వుండే కళకు శాంత్యతీతకళ అని పేరు. 

ఆ శాంత్యతీతకళనే ఆత్మగా కలిగిన పరమేశ్వరిని ఈ నామంలో శాంత్యతీతకళాత్మికా అంటున్నాం. 

శైవాగమంలో, "ద్వైతభావ నిర్వాణము వలన కలిగే జ్ఞానానందాన్ని కలిగించునది", అని వుంది. 

ఈ శాంత్యతీతకళాత్మికనే తత్ అన్నారు. శాంత్యతీతకళాత్మిక తత్ కన్నా వేరు కాదు అని కూడా 

చెప్పబడింది. 

ద్వైతాన్ని నిర్మూలించి, జ్ఞానాన్నిచ్చే, తత్ రూపమైన, ఆ  శాంత్యతీతకళాత్మిక కు వందనం. 

ఓం శ్రీ  శాంత్యతీతకలాత్మికాయై నమః  






------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి