4, సెప్టెంబర్ 2021, శనివారం

43. శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా

 

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా 
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ॥ 43 ॥

126. శాంకరీ

లలితాదేవి శంకర పత్ని అగుటచే ఈ శాంకరీ అని నామము ధరించినది. 

శంకరుడు అంటే శుభము, సుఖము కలిగించువాడు. 

కనుక శాంకరి అంటే, శుభము, సుఖము కలిగించునది. 

ఆ సుఖము కూడా సత్వ ప్రధానమయిన సుఖము, శాంతమయిన సుఖము. 

నేను దక్షుని కుమార్తెగా పుట్టి శంకరుని వివాహమాడి శంకర పత్నిగా నేను శంకరుని 

అన్ని సమయాలలోనూ అనుసరిస్తూ శాంకరి అను పేరు స్వీకరిస్తాను అని 

ఈమె ప్రకటించినట్లు కాళికాపురాణములో వున్నది. 

ఆ శంకర పత్ని, శాంకరి కి వందనం. 

ఓం శ్రీ శాంకర్యై నమః 

127. శ్రీకరీ

శ్రీ అంటే సంపద. శ్రీకరీ అంటే సంపదలను కలిగించునది. 

అమ్మ శ్రీకరి రూపములో తన భక్తులకు అష్టైశ్వర్యములు ఇస్తూ ఉంటుంది. 

సంపదలంటే ఏమిటో ముందే చెప్పుకున్నాం. శ్రియము కలుగచేసే తల్లి శ్రీకరి. 

శ్రీ అంటే విద్య, ఐశ్వర్యము కూడా. శ్రీవిద్యను తన ఉపాసకులకు అందచేసేది ఆ లలితాదేవియే. 

శ్రీవిద్య రూపములో మనకు సకల సంపదలను అనుగ్రహిస్తున్న, ఆ శ్రీకరి కి వందనం. 

ఓం శ్రీ శ్రీకర్యై నమః 

 

128. సాధ్వీ  

సాధ్వీ అంటే పతివ్రత. ఎన్ని జన్మలెత్తినా, తనకు పతి శంకరుడే అని 

స్పష్టముగా, దృఢముగా ప్రకటించిన మహా పతివ్రత పరమేశ్వరి. 

పరమేశ్వరునితో అనుష్ఠానము, అధిష్ఠానం, అవస్థ, నామము, రూపము మొదలైన 

పంచ సామ్యములు గల సాధ్వి ఆ పరమేశ్వరి. అందుకే ఈ ఆదిదంపతులు 

ఇద్దరు కాదు ఒక్కరే కనుక అర్ధనారీశ్వరతత్వం గురించిన జ్ఞానమును పొందాలి.   

అన్ని వేళలా, తన పతిని అనుసరించునది సాధ్వి. దక్షుని పుత్రి దాక్షాయణిగా జన్మించినా, 

పర్వతరాజపుత్రి పార్వతిగా పుట్టినా, ఆ మహాశక్తి తన పాతివ్రత్య ధర్మము వలన, 

ప్రతిసారీ కామేశ్వరుడినే భర్తగా పొందుతున్న ఆ కామేశ్వరి మహా సాధ్వి. 

ఈ ప్రత్యేకత కేవలము అమ్మవారు, అయ్యవారికి మాత్రమే దక్కింది.

ప్రతి జన్మలోనూ తన పతినే మరల, మరల పతిగా పొందుతున్న ఆ పరమ పతివ్రత, 

సాధ్వీ నామము సార్ధకముగా వున్న, ఆ సాధ్వి కి వందనం. 

ఓం శ్రీ సాధ్వ్యై నమః 


129. శరచ్చంద్రనిభాననా

శరదృతువులో చంద్రుడు చల్లని వెన్నెలలు వెదచల్లుతూ ఉంటాడు. 

శరత్ పూర్ణిమ నాడు ఈ కాంతి, ఆ జ్యోత్స్న మరింత ప్రకాశంగా, మరింత చల్లగా, మరింత హాయిగా 

ఉంటుంది. ఆ ఋతువులో ఉన్నంత నిండైన చందమామ మరి ఏ సందర్భంలోనూ ఉండదు. 

ఆ ప్రసన్నత, ఆ శాంతము, ఆ ప్రకాశము, ఆ ద్యుతి అనుపమానం. అమ్మవారు అటువంటి 

శరచ్చంద్రుని వంటి ముఖమును పోలి ఉంటుంది. శరత్ చంద్రుని వంటి కాంతి, ప్రసన్నత, 

సుఖము, అన్నింటికీ అమ్మ ముఖము నెలవు. శరదృతువులో చంద్రుని ఒక్కసారి 

పూర్ణిమ నాడు చూడండి. ఆ చంద్రునిలో అమ్మను, శరత్ చంద్రునితో సమానమైన 

ముఖము కల ఆ శరచ్చంద్రనిభాననను దర్శించండి. 

ఆ వెన్నెల జల్లులలో  మనలను ఎంతో చల్లగా చూస్తూ సుఖము, శాంతమును ఇస్తున్న,

ఆ శరచ్చంద్రనిభానన కు వందనం. 

ఓం శ్రీ శరచ్చంద్రనిభాననాయై నమః 


130. శాతోదరీ

శాతము అంటే కృశించిన అనే అర్ధము వున్నది. 

అమ్మవారు సన్నని కృశించిన ఉదరము కలది అని భావము. 

అమ్మవారి మధ్యభాగము సన్నగా వున్నది అని ముందు నామములలో కూడా చెప్పుకున్నాం. 

కృశించిన ఉదరము కల ఆ తల్లి శాతోదరి అని ఈ నామము అర్ధము. 

హైమావతి, హిమవంతుని కుమార్తె. హిమవంతుడికి శతోదరుడు అని పేరున్నది. 

గుహ అంటే పర్వత కుక్షి అని ఒక అర్ధము. హిమాలయ పర్వతములలో వందలాది

గుహలున్నాయి. శతము అంటే ఒక్క వంద మాత్రమే కాదు. వందల కొద్దీ అని కూడా అర్ధం. 

హిమవంతుడు, తన ఉదరంలో వందల కొద్దీ గుహలు కలిగివున్నవాడు కనుక అతడు శతోదరుడు. 

శతోదరుని పుత్రిక కనుక, పార్వతి శాతోదరి. శాతము, సుఖము, శాంతము కలిగించే తల్లి. 

శాతోదరి అనే నామము ధరించి భక్తులకు శాతము, శాంతము ఇస్తున్న, ఆ శాతోదరి కి వందనం. 

ఓం శ్రీ శాతోదర్యై నమః 

131. శాంతిమతీ 

అమ్మవారు శాంతి మూర్తి. శాంతి కలది. తన శాంతమును అందరికీ ప్రసాదము వలె

పంచే శ్రీమాత ఆ శాంతిమతి. శాంతము ఇంద్రియ నిగ్రహం వలన మాత్రమే వస్తుంది. 

ఇంద్రియాలకు లొంగక, ఏ కర్మ చేస్తున్నా చలించకుండా స్థిర బుద్ధితో ఉండటాన్ని 

శాంతము అంటాము. స్థిత ప్రజ్ఞులకు శాంతము ప్రధాన లక్షణము. 

ఆ లలితాపరమేశ్వరిని ఈ నామములో శాంతిమతీ అని కీర్తిస్తున్నాము. 

ఆ లలితారూపములో అమ్మవారు తన భక్తులను శాంతముగా చూస్తోంది. 

అమ్మ ఎటువంటి గర్వము, అహంకారము, తీక్ష్ణత లేక తన భక్తులను చల్లగా చూస్తున్నది. 

తనను నమ్మినవారందరికీ శాంతము నిస్తున్న, ఆ శాంతిమతి కి వందనం. 

ఓం శ్రీ శాంతిమత్యై నమః 


132. నిరాధారా 

లలితాదేవి ఈ సమస్త జగత్తుకంతటికీ ఆధారము. కానీ ఆమె నిరాధార. 

అంటే, అంతయూ ఆ తల్లి మీద ఆధారపడివుంది, కానీ ఆ తల్లి ఎవరిమీదా ఆధారపడి లేదు. 

తనపైనే అందరూ ఆధారపడి ఉంటే, వారిపై అమ్మ మరల ఎలా ఆధారపడగలదు. 

ఆమె వలననే మానవులు, దానవులు, దేవతలు, త్రిమూర్తులు, త్రిమాతలు అందరూ 

ఉత్పన్నమయ్యారు. వీరందరిలో ఆ తల్లి అంశ వున్నది. 

తాను మాత్రమూ నిరాధారగా వుండి, మన భారము నంతనూ వహిస్తున్నది. 

అవసరమైనప్పుడు తానే అన్ని అవతారములనూ ధరించి శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తున్నది. 

భండాసుర సంగ్రామములో కూడా, బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్రాది  దేవాదులెవ్వరిపై 

ఆధారపడకుండా, సమస్త స్త్రీ సైన్యమునూ తన నుంచే సృష్టించింది. 

ఏ ఆధారము లేని మహోన్నత స్థానమందు వున్న, ఆ నిరాధార కి వందనం. 

ఓం శ్రీ నిరాధారాయై నమః 


133. నిరంజనా

ఈ నామములో అమ్మను జ్ఞానమూర్తిగా కీర్తిస్తున్నాము. అంజనము అంటే కాటుక, 

నల్లని పదార్ధము, మాయా వస్తువు. నల్లనిది అజ్ఞానము. 

అంజనము లేనిది అనగా అజ్ఞానము లేని పరమ జ్ఞానస్వరూపము ఆ లలితాదేవి. 

ఏ మాయాసంబంధమూ లేనిది. నిరంజనా అంటే ఎటువంటి దోషములూ లేనిది. 

అవిద్య లేనిది, అజ్ఞానము లేనిది, దోషము లేనిది, మాయ లేనిది. 

తానే ఈ సమస్త సృష్టినీ సృజించినప్పటికీ ఏ మాయా అంటనిది.  

ఏ దోషమూ, అజ్ఞానమూ, ఏ మాయా లేని ఆ నిరంజన కు వందనం. 

ఓం శ్రీ నిరంజనాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650



3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

42. భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ

 

భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా 
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ॥ 42 ॥

118. భక్తిప్రియా

భక్తి అంటే ఇష్టము కలది. భక్తి అంటే ప్రీతి కలది. భక్తుల పట్ల ప్రేమను చూపునది. 

భక్తిగా తనను సేవించేవారికి ఇష్టార్ధములు ఇచ్చునది. 

నిరంతరమూ నామస్మరణ చేసే నారదుడు నవవిధ భక్తి మార్గాలను భక్తిసూత్రాలు అని చెప్పాడు.  

అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం,

ఆత్మనివేదనం. ఈ నారద భక్తి సూత్రాలను తల్లి గర్భములో వున్నప్పుడే, విన్న ప్రహ్లాదుడు 

తాను పాటించి, తన తోటివారందరికీ కూడా బోధించాడు. 

ఆ జగజ్జనని తన భక్తులు ఏ మార్గంలో భక్తిని చూపినా ఇష్టపడుతుంది. 

భక్తితో మన హృదయకుసుమాన్ని అర్పిస్తే అంతకన్నా మించింది ఏమిటి. 

భక్తులు చూపుతున్న భక్తికి సంతృప్తి చెందుతున్న, ఆ భక్తిప్రియ కు వందనం. 

ఓం శ్రీ భక్తిప్రియాయై నమః 


119. భక్తిగమ్యా

భక్తి చేత మాత్రమే చేరగలిగేది అమ్మ అని ఈ నామానికి అర్ధం. 

ఆ లలితా పరమేశ్వరిని చేరుకోవాలంటే, అద్భుతమైన మార్గం భక్తి. 

ప్రతి భక్తుడూ ఆ అమ్మను చేరాలనుకుంటాడు. ఆ అమ్మను చూడాలనుకుంటాడు. 

నిరంతర భక్తి మాత్రమే అమ్మను మనకు చూపిస్తుంది. మనసులో ఆ లలితను ధ్యానించండి. 

మీకు వీలయిన భక్తిసూత్రాన్ని ఎంచుకోండి. 

ఆ మార్గంలో ఆ తల్లిని మీ హృదయపద్మమందు ప్రతిష్టించి భక్తితో ఆరాధించండి. 

భక్తితో సేవిస్తే, తృప్తి చెంది ఉపాసకులను కరుణించే ఆ పరమేశ్వరి, ఆ భక్తిగమ్య కు వందనం. 

ఓం శ్రీ భక్తిగమ్యాయై నమః 


120. భక్తివశ్యా

భక్తికి వశమయ్యేది ఆ పరమేశ్వరి. భక్తితో పత్రం, ఫలం, పుష్పం, తోయం(జలం), 

దేన్ని ఇచ్చినా అంకితభావంతో ఇస్తే, దానిని ప్రేమతో స్వీకరించేది ఆ తల్లి. 

యశోద వాత్సల్య భక్తితో రోటికి కట్టివేసినా బద్ధుడయ్యాడు కృష్ణుడు. 

అచంచలమైన భక్తి ఆ లలితా పరమేశ్వరిని కూడా మనకు స్వాధీనం చేస్తుంది. 

భక్తికి తప్ప మరి దేనికీ లొంగను అని ఆ తల్లే స్వయముగా చెప్తున్నది. 

భక్తి ధర్మ మార్గములో ఉంటే, ఆ జగదాంబ కరుణించి కోరిన వరములు ఇస్తుంది.

అన్నీ ఆ జగదీశ్వరియే అని నమ్మి భక్తితో కొలిచే భక్తులకు వశమయ్యే, ఆ భక్తివశ్య కు వందనం. 

ఓం శ్రీ భక్తివశ్యాయై నమః 

  

121. భయాపహా 

భయములను తొలగించే తల్లి అని ఈ నామానికి అర్ధం. 

జీవన్ముక్తి కావాలంటే, భయము నుంచి కూడా విముక్తులు కావాలి. 

నీరు, నిప్పు, గాలి, పాము, మొసలి, దొంగలు, సంసారము, అరణ్యము, ఒంటరితనము 

వంటి ఎన్నో భయాలు జీవుడిని వెన్నంటుతూ ఉంటాయి. 

ఈ భయాల నుంచి విముక్తులం కావాలంటే, ఆ జగజ్జనని అండ ముఖ్యం. 

ఎందుకంటే ఆమె భయాపహా, అంటే భయములను పోగొట్టే అభయమూర్తి. 

అభయహస్తంతో, మన భయాలను గోటితో త్రుంచివేసే ఆ భయాపహ కు వందనం. 

ఓం శ్రీ భయాపహాయై నమః 


122. శాంభవీ

శంభుని పత్ని శాంభవి. శాంభవీ దీక్షాధారులకు తల్లి. 

స్వయముగా తానే ఆ శాంభవీ దీక్షా స్వరూపిణి. 

అందుకే అమ్మను ఈ నామంలో శాంభవీ అంటున్నాం. 

శాంభవి అంటే శమమును, శాంతిని ఇచ్చే శక్తి. 

నిమిది సంవత్సరముల కన్యను కూడా శాంభవీ అంటాం. 

చిన్న వయసు ఆడపిల్లలను అమ్మవారిగా భావించి పూజ చేసే సంప్రదాయం 

మన సనాతన ధర్మములో వున్నది. ఈ పూజను కుమారీ పూజ అంటారు. 

ఈ నాటికీ ఈ కుమారీ పూజ, నేపాల్ లోని కుమారీ పీఠంలో ఎంతో భక్తితో చేస్తూ వుంటారు. 

మనదేశంలో కూడా ఇప్పటికీ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ ఆచారము వుంది. 

శక్తిపూజలో భాగంగా శాంభవీ పూజను కూడా చేస్తారు. చిన్నవయసు ఆడపిల్లలను దేవతగా 

భావించి పూజించటం, వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదము తీసుకోవటమే శాంభవీ పూజ.  

కన్నులు తెరచి కూడా, అంతర్ముఖులై వుండే ముద్రను శాంభవీ ముద్ర అంటారు. 

శాంభవీ స్వరూపిణి అయిన అమ్మఆ శాంభవి కి వందనం. 

ఓం శ్రీ శాంభవ్యై నమః 


123. శారదారాధ్యా

శారదారాధ్యా అంటే శారద చేత ఆరాధింపబడుతున్న అమ్మ అని అర్ధం.  

శారద అంటే సరస్వతి, శారద అంటే ఋతువు, శారద అంటే సంవత్సర ఆరంభం,

శారద అంటే ప్రతిభ. శారద అంటే పండిత సమూహం. శారద అంటే వాక్కు. 

ఇలా శారద అనే పదానికి అర్ధాలు ఎన్నెన్నో. ఈ శారదల చేత పూజింపబడుతున్నది లలితమ్మ. 

అమ్మని శరదృతువులో, అంటే శరన్నవరాత్రులలో పూజించాలి. 

సంవత్సర ఆరంభంలో వచ్చే వసంత నవరాత్రులలో పూజించాలి. 

అమ్మ సరస్వతీ ప్రసన్నులైన ప్రతిభ గల పండితుల చేత ఆరాధింపబడుతున్నది. 

ప్రతిభకు పట్టము కట్టేది శారదాపీఠము. ఆ శారదా పీఠము నేటి కాశ్మీరములో వున్నది. 

ఆ శారదా పీఠములో పండిత సమూహము చేత పూజలందుకుంటున్న తల్లి లలిత.  

ఇన్నెందుకు, స్వయముగా ఆ సరస్వతీ దేవే ఆ లలితాదేవి భక్తురాలు. 

తన కచ్చపిపై అమ్మను కీర్తిస్తూ, గానము చేస్తూ ఉంటుంది. 

అమ్మను వాక్కుతో కీర్తించండి. గానంతో భజించండి. రచనలతో ఆరాధించండి. 

శారదల చేత ఆరాధింపబడుతున్న ఆ శారదారాధ్య కు వందనం. 

ఓం శ్రీ శారదారాధ్యాయై నమః 


124. శర్వాణీ 

శర్వుడు అంటే శివుడు. శర్వుని రాణి కనుక లలితాదేవి శార్వాణి. 

శంకర పత్ని శర్వాణిది భూతత్వం. శర్వాణి పుత్రుడే కుజుడు. 

శర్వాణి శర్వునితో చేరి, ఈ చరాచర జగత్తునంతా సృష్టించి పాలిస్తూ ఉంటుంది. 

మన పార్థివ శరీరము, అనగా పృధ్వీతత్వమైన ఈ దేహము ఆరోగ్యంతో బాగుండాలంటే 

ఈ శర్వాణిని ప్రార్ధించాలి. శర్వుని పత్ని ఆ శర్వాణి కి వందనం. 

ఓం శ్రీ శర్వాణ్యై నమః 


125. శర్మదాయినీ

శర్మము అంటే,  సుఖము, సంతోషము. శర్మమును ఇచ్చే తల్లి శర్మదాయిని. 

లలితా పరమేశ్వరిని ఆశ్రయించిన భక్తులకు సుఖాన్నీ, ఆనందాన్నీ, సంతోషాన్నీ ఇస్తుంది. 

అన్నీ మనకు కావలసినవి గదా. శాంతముతో కూడిన సుఖమును ఇచ్చేది శర్మదాయిని. 

శాంతముగా ఉంటూ సత్వ ప్రధానమయిన పూజలు చేసేవారిని శర్మలు అంటారు. 

ఈ నాటికీ కొందరు బ్రాహ్మణులకు ఈ శర్మ నామధేయము వుంది. సంకల్పము చెప్పేటప్పుడు, 

పూజ చేస్తున్న వ్యక్తి నామమునకు శర్మ పదమును కూడా కలిపి చెప్పటం ఒక ఆచారము.   
 
తనను సేవిస్తున్న భక్తులకు శాంతాన్నీ, సుఖాన్నీ ఇస్తున్న ఆ శర్మదాయిని కి వందనం. 

ఓం శ్రీ శర్మదాయిన్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


2, సెప్టెంబర్ 2021, గురువారం

41. భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా భద్రప్రియా, భద్రమూర్తిః , భక్తసౌభాగ్య దాయినీ

 

భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా 
భద్రప్రియా, భద్రమూర్తిః, భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥

112. భవానీ 

ఇప్పటివరకు ఆ లలితా పరమేశ్వరి స్థూల రూపము గురించి, ఆ తల్లి జీవుడిని 

ఎలా ఉద్ధరించిందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తల్లికున్న నామాలను గురించి, 

ఆ నామాల అర్ధం, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. 

భవుడు అంటే శివుడు, భవుని పత్ని కనుక ఈమె భవాని. 

మన్మధుని ప్రాణదాత కనుక ఈమె భవాని. 

భవము అంటే సంసారము, ఈ భవబంధాల నుంచి తరింప చేసేది కనుక ఈమె భవాని. 

భవము అంటే నీరు. జీవనాధారమైన నీటిని అందిస్తోంది కనుక ఈమె భవాని. 

ఈ నామంలో ఆ రాజరాజేశ్వరిని భవానీ అని పిలుస్తున్నాము. 

ఆకాశజలము నుండి అనంతమైన నీటి బిందువులచే, ఈ సంసారమును సృష్టించి, 

పోషిస్తున్న శక్తి భవాని. ఈ సంసార సాగరం దాటాలంటే, భవాని కరుణ కావాలి. 

సంసారము అంటే, కేవలమూ భార్య, భర్త, పిల్లలు, బంధువులు అనుకోకండి. 

మన చుట్టూ వున్న సమస్త సృష్టీ సంసారమే. ఆమె ఇచ్ఛ చేతనే ఇవి అన్నీ సృష్టింపబడతాయి. 

ఏది చూసిన అమ్మ సృష్టే కదా, అన్నీ బావుంటాయి, అన్నీ నచ్చుతాయి, అన్నీ కావాలనిపిస్తాయి. 

అవి మన చుట్టూ మనకే తెలియని బంధాలని బలంగా పేనుతాయి. 

ఆ భవబంధాల నుంచి శాంతంగా విడివడటానికి ఈ భవాని కృప కావాలి. 

తనను భక్తితో శరణు వేడిన అందరినీ భవసాగరం దాటిస్తున్న ఆ భవాని కి  వందనం. 

ఓం శ్రీ భవాన్యై నమః  


113. భావనాగమ్యా

భావనా మాత్రము చేతనే చేరగలిగినది అని భావము. 

మనసులో ఆ అమ్మను భావించండి, ఆ క్షణమే దర్శనం ఇస్తుంది. 

మనసులో మనము ఎలా భావిస్తే, అలా దర్శనం ఇస్తుంది. లక్ష్మి గా భావిస్తే, లక్ష్మి. 

ఖడ్గము పుచ్చుకుని దుర్మార్గులను తెగటార్చుతున్నట్టు భావిస్తే మహాకాళి. 

నారాయణునిగా భావిస్తే నారాయణుడు, నారాయణిగా భావిస్తే నారాయణి. 

ఎవరు ఎంతమాత్రముగా తలిస్తే, అంతమాత్రముగా వారికి దర్శనము ఇస్తుంది. 

ఆమె ప్రసన్న వదనాన్ని మనసులో భావించండి. మన భావనల గమ్యము ఆ పరమేశ్వరియే. 
 
భావనల చేత మాత్రమే చేరగలిగినది, దర్శించగలిగినది భావనాగమ్యా. 

భావన లేకపోతే, అగమ్యా, చేరలేనటువంటిది. 

తన భక్తులను కరుణించి, మనసులో తలచినంత మాత్రమునే కనుపించే, 

ఆ భావనాగమ్య కు వందనం. 

ఓం శ్రీ భావనాగమ్యాయై నమః 

  

114. భవారణ్య కుఠారికా 

సంసారబంధాలు ఎంత గట్టిగా పట్టుకుంటాయో తెలుసు గదా, 

ఆ కట్లు తెంపాలంటే పదునైన గండ్రగొడ్డళ్ళు కావాలి. 

మనచుట్టూ, మనకే తెలిసీ తెలియక అల్లుకున్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, 

మత్సరం వంటి దృఢంగా పెనవేసుకుని పోయి వున్న లతలని నరకాలంటే తేలికైన పని కాదు. 

మనం అమ్మకి శరణాగతులమైతే, ఆ భవారణ్యకుఠారిక, మనపై కరుణతో, తానే స్వయముగా 

ఆ గండ్రగొడ్డలియై, ఆ అరణ్యాన్ని ఛేదిస్తుంది. 

భవారణ్యములో, అంటే సంసారపు కారడవిలో, విపరీతంగా, విచ్చలవిడిగా పెరిగిన 

ఆ మహా వృక్షాలను నరకటానికి గండ్ర గొడ్డళ్లు కావాలి. లేకపోతే అవి నరకబడవు. 

నిజానికి ఈ కారడవిని సృష్టించిందీ ఆ తల్లే, దానిని నరికి మనలను రక్షించేదీ ఆ తల్లే. 

అంతా ఆ మహామాయ లీల, ఇచ్ఛ, విలాసము.  

మనలను ఈ సంసారం అనే అరణ్యము నుంచి విముక్తులను చేయటానికి గండ్రగొడ్డలియై, 

ఆ అరణ్యమును నరికి మనలను ఉద్ధరిస్తున్న, ఆ  భవారణ్యకుఠారిక కి వందనం. 

ఓం శ్రీ భవారణ్యకుఠారికాయై నమః 


115. భద్రప్రియా

భద్రము అంటే శుభము, మంగళము అని అర్ధం. అమ్మ భద్రప్రియ, 

అంటే ఎల్లప్పుడూ మంగళకార్యములే ఇష్టపడునది. శుభమే కోరుకునేది. 

అంతే కాదు, ఒకరకం ఏనుగులను భద్రగజము అంటాం. అమ్మకు ఆ భద్రగజములంటే మక్కువ. 

అమ్మకి శుభాల మీద, శుభ సంకేతాల మీద, శుభ కార్యాల మీదా మక్కువ ఎక్కువ. 

మంగళకరమైన అన్ని వస్తువులూ ఆ పరమేశ్వరికి ఇష్టం. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు, 

పళ్ళు, తాంబూలం, అలంకరణ, అన్నీ ఆ ఆదిపరాశక్తికి ఎంతో ఇష్టం. 

ఆ మహాదేవి మన ఇంటికి రావాలంటే, ఈ మంగళప్రదమైన సంబారాలు ఇంట్లో సమకూరిస్తే, 

ఎంతో ఇష్టంగా, సంతోషంగా, శుభకరంగా మన ఇంట అడుగిడుతుంది. 

ఒక్కసారి ఆ రాజరాజేశ్వరిని దర్పముగా భద్రగజము మీద మన ఇంటికి వస్తున్నట్టు మనసులో 

ఊహించండి. ఎంత ఆనందం కలుగుతుందో. 

మంగళము చేకూర్చే, ఆ భద్రప్రియ కు వందనం. 

ఓం శ్రీ భద్రప్రియాయై నమః 


116. భద్రమూర్తిః 

అందరికీ భద్రాన్ని కోరే భద్రమూర్తి ఆ జగజ్జనని. ఆ తల్లే స్వయముగా భద్రమూర్తి. 

అందమైన తల్లి, సుశోభితమైన ముఖము కలది, మంగళరూపిణి. 

సౌందర్యాన్ని ఇనుమడింపచేసే, సమస్త ఆభరణములనూ ధరించి, ప్రసన్నంగా వున్న తల్లి. 

ఆమె రూపము, సౌందర్యము, అలంకరణము, చిరునగవు, అన్నీ మంగళకరముగా ఉంటాయి.  

ఆ అమ్మ మంగళాకారమును మనస్సులో దర్శించండి. ఆ అమ్మ చల్లని చూపుని, ఆ కొనగంటి 

వీక్షణనూ, ఆ అపార కరుణామూర్తినీ మనసారా చూడండి. ఆమే భద్రమూర్తి. 

శరణన్న వారందరకూ మంగళాన్నీ, అభయాన్నీ, భద్రాన్నీ ఇచ్చే, ఆ భద్రమూర్తి కి వందనం. 

ఓం శ్రీ భద్రమూర్త్యై నమః 


117. భక్తసౌభాగ్యదాయినీ

భక్తులకు సౌభాగ్యాన్నిచ్చే చల్లని తల్లి అని ఈ నామార్ధం. 

సౌభాగ్యము అంటే ఇంద్రియ నిగ్రహం, సంపద, కీర్తి, కామము, వీర్యముమొదలైనవి. 

కానీ ఎంత సౌభాగ్యమున్నా, అది ధర్మ మార్గము నుంచి మాత్రమే రావాలి. 

అప్పుడే ఆ సౌభాగ్యము అమ్మ ప్రసాదమవుతుంది. దానికి ఆ తల్లి రక్షణ ఉంటుంది. 

అధర్మంగా సంపాదించినవేవీ స్థిరము కావు. అట్టి భాగ్యము కొద్దిరోజుల ముచ్చట మాత్రమే.

అసలైన సౌభాగ్యము ఆ కరుణామూర్తిని చేరుకోగలగటమే. దానికి ఉపాసనను మించిన మార్గము 

మరొకటి లేదు. అమ్మ మీకు సకల సౌభాగ్యములనూ ఇస్తున్నట్టు మనసులో భావించండి. 

సౌభాగ్యాన్నిచ్చే వస్తువులను మనకు ప్రసాదిస్తున్న జగదంబ, ఆ క్తసౌభాగ్యదాయిని కి వందనం. 

ఓం శ్రీ భక్తసౌభాగ్యదాయిన్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


1, సెప్టెంబర్ 2021, బుధవారం

40. తటిల్లతా సమరుచిః, షట్చక్రోపరి సంస్థితా మహాసక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ

 

తటిల్లతా సమరుచిః, షట్చక్రోపరి సంస్థితా 
మహాసక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ॥ 40 ॥

107. తటిల్లతా సమరుచిః

అమ్మ మెరుపు తీగ వలె ప్రకాశిస్తుందని చెప్పుకున్నాం కదా. 

తటిల్లత అంటే శంపాలత, మెరుపుతీగ. రుచి అంటే కిరణము, కాంతి. 

అమ్మ ఆ సహస్రార స్థానంలో ఒక తటిల్లతా కాంతితో మెరిసిపోతూ దర్శనం ఇస్తూ ఉంటుంది. 

మెరుపు ఒక్క క్షణమాత్రం మెరిసి మాయమైపోతుంది. ఆ మెరుపులంత సౌందర్యం అమ్మది. 

క్షణం పాటు కనిపిస్తుంది కనుకే, అంత మహోత్కృష్టమైన కాంతితో మెరిసిపోతున్నా, 

ఆ మెరుపులని  మనం చూడగలుగుతున్నాముమెరుపు ఎంత అందంగా వున్నా, 

ఎంత ప్రకాశంగా వున్నా, ఎంత మోహింపచేసేలా వున్నా, అది క్షణకాలం ఉంటేనే చూడగలం. 

ఒక్కోసారి మెరుపు దగ్గరగా వచ్చినప్పుడు, మనం వున్న ప్రాంతమంతా కూడా అద్భుతమయిన 

విద్యుత్ కాంతితో వెలిగిపోయి, దానిని చూసాక, కళ్ళు చెదరి, కొంత సేపు మరి ఏమీ కనపడవు. 

అటువంటి మిరుమిట్లు గొలిపే కాంతితో వెలిగిపోయే 

అమ్మను చూడటానికి ఈ చర్మ చక్షువులు చాలవు. 

అది కన్నులు తెరచి చేసే దర్శనం కాదు. కనులు మూసి మనోనేత్రంతో చేయవలసిన దర్శనం. 

చుట్టూ అజ్ఞానమనే నల్లని మేఘాలు, మధ్యలో తళుక్కుమని మెరిసి మాయమైపోయే జ్ఞానరేఖ. 

అదే అమ్మ దర్శనం. జీవితం తరించటానికి ఆ క్షణ మాత్ర దర్శనం చాలు. 

ఉపాసకులు, ఋషులు, ఇలా అమ్మ అనుగ్రహానికి పాత్రులైన ఏ కొద్దిమందో, 

అమ్మ అనుమతితో, తమ అంతః చక్షువులతో ఆ దర్శనం చేయగలరు. 

మెరుపు మెరిసే ముందు గట్టిగా ఉరుమే ఉరుములాగా, అమ్మ వాహనమైన సింహం 

గట్టిగా గర్జించి భక్తులను ఆ దర్శనానికి సమాయత్తం చేస్తుంది. 

ఆ గర్జన వల్ల  కొందరికి కళ్ళు తెరుచుకుంటే, కొందరిని ఆ గర్జనే భయపెట్టి కళ్ళు 

మూసుకునేలా చేస్తుంది. ఆ గర్జన మన జగజ్జనని వాహనం చేసినదే అని తెలుసుకుని,

వెనువెంటనే తళుక్కుమనే వెలుగులతో మెరిసిపోతున్న అమ్మను క్షణకాలమైనా మనసులో

దర్శించగలితే, అంతకన్నా కావలసిందేమిటి. అమ్మ తటిల్లతా కాంతులను చూడలేము కనుక, 

ఆ తల్లి కాలివేలి గోటి కాంతులను మనసులో భావిస్తే, ఆ తల్లి కరుణించి దారి చూపుతుంది.  

సహస్రారం చేరి, తన దర్శనం కోసం ఆరాటపడే భక్తులకు, 

తన అపురూపమైన తటిల్లతా రూపంతో కటాక్షిస్తున్న ఆ తటిల్లతాసమరుచి కి వందనం. 

ఓం శ్రీ తటిల్లతాసమరుచ్యై నమః 


108. షట్చక్రోపరి సంస్థితా 

మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ 

అనే ఈ ఆరు చక్రాలు ఈ దేహంలో వున్నవి అని చెప్పుకున్నాం కదా. 

ఆ ఆరు చక్రాలకూ పైన వున్న సహస్రార పద్మంలో ఆ శ్రీదేవి కొలువై వున్నది. 

అక్కడ వున్న ఆ జగదంబను మనసులో దర్శించండి. 

మూలాధారం వద్ద భూలోక స్థితిలో వున్న జీవుడు, స్వాధిష్ఠానం చేరి భువర్లోక స్థితికీ,

మణిపూరము చేరి సువర్లోక స్థితికీ, అనాహతము చేరి మహర్లోక స్థితికీ, విశుద్ధి చేరి జనలోక స్థితికీ, 

ఆజ్ఞ చేరి తపోలోక స్థితికీ, ఆజ్ఞ దాటి సహస్రారం వద్ద సత్యలోక స్థితికీ చేరుకుంటాడు. 

సహస్రారం వద్ద వున్న పరమేశ్వరుణ్ణి కలిసి, ఆ పరమేశ్వరి ఆనందంగా ఉంటుంది. 

కామేశ్వరి, తన తటిల్లతా కాంతితో తానూ ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది. 

అలా సంతోషంతో వెలిగిపోతూ, ఆ షట్చక్రాలకు పైన వున్న వెయ్యి రేకుల పద్మంపై

ఆనందంగా ఆశీనురాలై వున్న ఆ రాజరాజేశ్వరిని మనసారా దర్శించటం ఒక అలౌకికానుభూతి. 

ఆ అలౌకికానుభూతులను ఉపాసకులకు ప్రసాదిస్తున్నఆ షట్చక్రోపరిసంస్థిత కు వందనం. 

ఓం శ్రీ షట్చక్రోపరిసంస్థితాయై నమః 


109. మహాసక్తిః

మహాసక్తి అంటే అమ్మ ఎంతో ఆసక్తి కలది అని భావం. 

ఆ ఆసక్తి దేనిమీద అనేది తెలిస్తే, మనం అమ్మను తృప్తిపరచగలం. 

ఆ లలితా దేవికి ఉత్సవాలంటే ఆసక్తి. యజ్ఞాలంటే, హోమాలంటే ఆసక్తి. 

కామేశ్వరుణ్ణి కలవాలంటే ఆసక్తి. పండుగ వాతావరణం అంటే ఆసక్తి. 

నిత్యమూ మహోత్సవాలు జరుపుతుంటే, జరుగుతుంటే ఆసక్తి.  

ఈ లోకా లోకాలన్నింటిలో జరిగే సమస్త కార్యములూ, కారణములూ 

అన్నీ కూడా  అమ్మకి ఆసక్తిదాయకమే

అమ్మకి ఎల్లప్పుడూ సంబరాలు జరుగుతూ కోలాహలంగా ఉంటే ముచ్చట. 

అవి అన్నీ జరిపించేదీ, జరిపించుకునేదీ కూడా ఆ అమ్మే. 

సహస్రారకమలంపై, ఆ రాజరాజేశ్వరుని కూడి, ఈ చరాచర జగత్తులో జరిగే 

అన్ని విశేషముల పట్ల ఎంతో సంభ్రమంతో, ఆసక్తితో వుండే, ఆ మహాసక్తి కి వందనం. 

ఓం శ్రీ మహాసక్త్యై నమః 
 

110. కుండలినీ

మూలాధారము నందు శక్తి ఒక సర్పము వలె చుట్టలు చుట్టుకుని వున్నదని చెప్పుకున్నాం కదా. 

ఆ చుట్టల మధ్య భాగములో, కుండలినీ శక్తి తలని కప్పుకుని, నిద్రాణముగా ఉంటుంది. 

ఆ మధ్యభాగాన్ని కుండలము అంటాం. ఆ శక్తే కుండలిని. కుండలములు అంటే చెవి కమ్మలు.  

ఒరిస్సా ప్రాంతంలో కొందరు వృద్ధులు ఒక ప్రత్యేకమైన చెవికమ్మలు ధరించేవారు. 

ఎంత బరువుగా, వెడల్పుగా ఉండేవంటే ఆ బరువుకి ఆ కమ్మలు జారి భుజం దాకా వచ్చేవి. 

అవి సర్పాకారంలో వుండి, మూడున్నర చుట్లు చుట్టుకుని, పడగ భాగం విప్పుకుని ఉండేవి. 

అది తలఎత్తిన కుండలినీ రూపం వలె ఉండేది. 

ఈ మధ్య కాలంలో అటువంటి చెవి కమ్మలు ఎవరూ ధరించగా చూడలేదు. 

మూలాధారం నుంచి ఇడా, పింగళా నాడులు కూడా సర్పముల వలె ఒకదాన్ని ఒకటి

చుట్టుకుని, సుషుమ్నతో పాటు పయనం సాగిస్తాయి. 

ఇడానాడి చంద్రనాడి అయితే, పింగళానాడి సూర్యనాడి. 

ప్రతి గ్రంధి వద్ద అవి ఒకసారి మెలికపడి స్థానాలు మార్చుకుంటాయి. 

ఆజ్ఞ చేరేసరికి అవి సంపూర్ణంగా ప్రచోదితమయి సూర్య చంద్ర వహ్ని నేత్రాలను తెరుస్తాయి. 

కుండలినే జీవుడిని మూలాధారం నుంచి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేర్చే శక్తి. 

మూలాధారం వద్ద శక్తి రూపములో వున్నది ఆ కుండలినీ స్వరూపిణియే. 

కనుకనే అమ్మని కుండలినీ అన్నారు. జీవుడిని ఉద్ధరించే మహాశక్తి, ఆ కుండలిని కి వందనం. 

ఓం శ్రీ కుండలిన్యై నమః 


111. బిసతంతు తనీయసీ

ఆ లలితా పరమేశ్వరి సన్నగా మెరుపుతీగ వలె వున్నది అని చెప్పుకున్నాం. 

అమ్మ తామరతూడు మధ్యలోని సన్నని తంతువు వలె వున్నది అని ఈ నామార్ధం. 

బిసతంతు అంటే, సన్నని అందమైన తామరతూడు లోని సన్నని తంతువు అని అర్ధం. 

అటువంటి సున్నితమైన శరీరం కలది ఆ శ్రీరాజరాజేశ్వరి. 

జీవుని శరీరమంతా పద్మమయమే కదా, ఆ పద్మాలను అంటిపెట్టుకుని వున్న 

ఆ తామరతూడు లోని సన్నని తంతువే అమ్మ శరీరం. ఆ తామరతూడే సుషుమ్నా మార్గం. 

ఆ మార్గం ద్వారానే మూలాధారం నుంచి, సహస్రారం వరకూ జీవుడు ఉద్ధరింపబడతాడు. 

ఇదే బ్రహ్మలోకమైన సత్యలోకమునకు దారి. కుండలినియే జీవుడి చైతన్య శక్తి. 

ఆ చైతన్యాన్ని మూలాధారం, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ ల వద్ద 

వున్న పృధ్వీతత్త్వము, జలతత్త్వము, అగ్నితత్త్వము, వాయుతత్త్వము, ఆకాశతత్త్వము లను 

కూడా దాటించి, సహస్రారము వద్ద, సుధాధారలు వర్షిస్తున్న చంద్రమండలమును చేర్చాలి. 

అక్కడ సహస్రారకమలము వద్ద మహాపతివ్రత అయిన ఆ రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరునితో 

కూడి, ప్రమోదము వ్యక్తం చేస్తూ ఉంటుంది. తామరతూడు తంతువు వంటి సూక్ష్మమైన రూపముతో

ఉపాసకులను ఉద్ధరిస్తున్న, ఆ బిసతంతు తనీయసి కి వందనం. 

ఓం శ్రీ బిసతంతుతనీయస్యై నమః



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650