
తటిల్లతా సమరుచిః, షట్చక్రోపరి సంస్థితా
మహాసక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ॥ 40 ॥
107. తటిల్లతా సమరుచిః
అమ్మ మెరుపు తీగ వలె ప్రకాశిస్తుందని చెప్పుకున్నాం కదా.
తటిల్లత అంటే శంపాలత, మెరుపుతీగ. రుచి అంటే కిరణము, కాంతి.
అమ్మ ఆ సహస్రార స్థానంలో ఒక తటిల్లతా కాంతితో మెరిసిపోతూ దర్శనం ఇస్తూ ఉంటుంది.
మెరుపు ఒక్క క్షణమాత్రం మెరిసి మాయమైపోతుంది. ఆ మెరుపులంత సౌందర్యం అమ్మది.
క్షణం పాటు కనిపిస్తుంది కనుకే, అంత మహోత్కృష్టమైన కాంతితో మెరిసిపోతున్నా,
ఆ మెరుపులని మనం చూడగలుగుతున్నాము. మెరుపు ఎంత అందంగా వున్నా,
ఎంత ప్రకాశంగా వున్నా, ఎంత మోహింపచేసేలా వున్నా, అది క్షణకాలం ఉంటేనే చూడగలం.
ఒక్కోసారి మెరుపు దగ్గరగా వచ్చినప్పుడు, మనం వున్న ప్రాంతమంతా కూడా అద్భుతమయిన
విద్యుత్ కాంతితో వెలిగిపోయి, దానిని చూసాక, కళ్ళు చెదరి, కొంత సేపు మరి ఏమీ కనపడవు.
అటువంటి మిరుమిట్లు గొలిపే కాంతితో వెలిగిపోయే
అమ్మను చూడటానికి ఈ చర్మ చక్షువులు చాలవు.
అది కన్నులు తెరచి చేసే దర్శనం కాదు. కనులు మూసి మనోనేత్రంతో చేయవలసిన దర్శనం.
చుట్టూ అజ్ఞానమనే నల్లని మేఘాలు, మధ్యలో తళుక్కుమని మెరిసి మాయమైపోయే జ్ఞానరేఖ.
అదే అమ్మ దర్శనం. జీవితం తరించటానికి ఆ క్షణ మాత్ర దర్శనం చాలు.
ఉపాసకులు, ఋషులు, ఇలా అమ్మ అనుగ్రహానికి పాత్రులైన ఏ కొద్దిమందో,
అమ్మ అనుమతితో, తమ అంతః చక్షువులతో ఆ దర్శనం చేయగలరు.
మెరుపు మెరిసే ముందు గట్టిగా ఉరుమే ఉరుములాగా, అమ్మ వాహనమైన సింహం
గట్టిగా గర్జించి భక్తులను ఆ దర్శనానికి సమాయత్తం చేస్తుంది.
ఆ గర్జన వల్ల కొందరికి కళ్ళు తెరుచుకుంటే, కొందరిని ఆ గర్జనే భయపెట్టి కళ్ళు
మూసుకునేలా చేస్తుంది. ఆ గర్జన మన జగజ్జనని వాహనం చేసినదే అని తెలుసుకుని,
వెనువెంటనే తళుక్కుమనే వెలుగులతో మెరిసిపోతున్న అమ్మను క్షణకాలమైనా మనసులో
దర్శించగలితే, అంతకన్నా కావలసిందేమిటి. అమ్మ తటిల్లతా కాంతులను చూడలేము కనుక,
ఆ తల్లి కాలివేలి గోటి కాంతులను మనసులో భావిస్తే, ఆ తల్లి కరుణించి దారి చూపుతుంది.
సహస్రారం చేరి, తన దర్శనం కోసం ఆరాటపడే భక్తులకు,
తన అపురూపమైన తటిల్లతా రూపంతో కటాక్షిస్తున్న ఆ తటిల్లతాసమరుచి కి వందనం.
ఓం శ్రీ తటిల్లతాసమరుచ్యై నమః
108. షట్చక్రోపరి సంస్థితా
మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ
అనే ఈ ఆరు చక్రాలు ఈ దేహంలో వున్నవి అని చెప్పుకున్నాం కదా.
ఆ ఆరు చక్రాలకూ పైన వున్న సహస్రార పద్మంలో ఆ శ్రీదేవి కొలువై వున్నది.
అక్కడ వున్న ఆ జగదంబను మనసులో దర్శించండి.
మూలాధారం వద్ద భూలోక స్థితిలో వున్న జీవుడు, స్వాధిష్ఠానం చేరి భువర్లోక స్థితికీ,
మణిపూరము చేరి సువర్లోక స్థితికీ, అనాహతము చేరి మహర్లోక స్థితికీ, విశుద్ధి చేరి జనలోక స్థితికీ,
ఆజ్ఞ చేరి తపోలోక స్థితికీ, ఆజ్ఞ దాటి సహస్రారం వద్ద సత్యలోక స్థితికీ చేరుకుంటాడు.
సహస్రారం వద్ద వున్న పరమేశ్వరుణ్ణి కలిసి, ఆ పరమేశ్వరి ఆనందంగా ఉంటుంది.
కామేశ్వరి, తన తటిల్లతా కాంతితో తానూ ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది.
అలా సంతోషంతో వెలిగిపోతూ, ఆ షట్చక్రాలకు పైన వున్న వెయ్యి రేకుల పద్మంపై
ఆనందంగా ఆశీనురాలై వున్న ఆ రాజరాజేశ్వరిని మనసారా దర్శించటం ఒక అలౌకికానుభూతి.
ఆ అలౌకికానుభూతులను ఉపాసకులకు ప్రసాదిస్తున్న, ఆ షట్చక్రోపరిసంస్థిత కు వందనం.
ఓం శ్రీ షట్చక్రోపరిసంస్థితాయై నమః
109. మహాసక్తిః
మహాసక్తి అంటే అమ్మ ఎంతో ఆసక్తి కలది అని భావం.
ఆ ఆసక్తి దేనిమీద అనేది తెలిస్తే, మనం అమ్మను తృప్తిపరచగలం.
ఆ లలితా దేవికి ఉత్సవాలంటే ఆసక్తి. యజ్ఞాలంటే, హోమాలంటే ఆసక్తి.
కామేశ్వరుణ్ణి కలవాలంటే ఆసక్తి. పండుగ వాతావరణం అంటే ఆసక్తి.
నిత్యమూ మహోత్సవాలు జరుపుతుంటే, జరుగుతుంటే ఆసక్తి.
ఈ లోకా లోకాలన్నింటిలో జరిగే సమస్త కార్యములూ, కారణములూ
అన్నీ కూడా అమ్మకి ఆసక్తిదాయకమే.
అమ్మకి ఎల్లప్పుడూ సంబరాలు జరుగుతూ కోలాహలంగా ఉంటే ముచ్చట.
అవి అన్నీ జరిపించేదీ, జరిపించుకునేదీ కూడా ఆ అమ్మే.
సహస్రారకమలంపై, ఆ రాజరాజేశ్వరుని కూడి, ఈ చరాచర జగత్తులో జరిగే
అన్ని విశేషముల పట్ల ఎంతో సంభ్రమంతో, ఆసక్తితో వుండే, ఆ మహాసక్తి కి వందనం.
ఓం శ్రీ మహాసక్త్యై నమః
110. కుండలినీ
మూలాధారము నందు శక్తి ఒక సర్పము వలె చుట్టలు చుట్టుకుని వున్నదని చెప్పుకున్నాం కదా.
ఆ చుట్టల మధ్య భాగములో, కుండలినీ శక్తి తలని కప్పుకుని, నిద్రాణముగా ఉంటుంది.
ఆ మధ్యభాగాన్ని కుండలము అంటాం. ఆ శక్తే కుండలిని. కుండలములు అంటే చెవి కమ్మలు.
ఒరిస్సా ప్రాంతంలో కొందరు వృద్ధులు ఒక ప్రత్యేకమైన చెవికమ్మలు ధరించేవారు.
ఎంత బరువుగా, వెడల్పుగా ఉండేవంటే ఆ బరువుకి ఆ కమ్మలు జారి భుజం దాకా వచ్చేవి.
అవి సర్పాకారంలో వుండి, మూడున్నర చుట్లు చుట్టుకుని, పడగ భాగం విప్పుకుని ఉండేవి.
అది తలఎత్తిన కుండలినీ రూపం వలె ఉండేది.
ఈ మధ్య కాలంలో అటువంటి చెవి కమ్మలు ఎవరూ ధరించగా చూడలేదు.
మూలాధారం నుంచి ఇడా, పింగళా నాడులు కూడా సర్పముల వలె ఒకదాన్ని ఒకటి
చుట్టుకుని, సుషుమ్నతో పాటు పయనం సాగిస్తాయి.
ఇడానాడి చంద్రనాడి అయితే, పింగళానాడి సూర్యనాడి.
ప్రతి గ్రంధి వద్ద అవి ఒకసారి మెలికపడి స్థానాలు మార్చుకుంటాయి.
ఆజ్ఞ చేరేసరికి అవి సంపూర్ణంగా ప్రచోదితమయి సూర్య చంద్ర వహ్ని నేత్రాలను తెరుస్తాయి.
కుండలినే జీవుడిని మూలాధారం నుంచి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేర్చే శక్తి.
మూలాధారం వద్ద శక్తి రూపములో వున్నది ఆ కుండలినీ స్వరూపిణియే.
కనుకనే అమ్మని కుండలినీ అన్నారు. జీవుడిని ఉద్ధరించే మహాశక్తి, ఆ కుండలిని కి వందనం.
ఓం శ్రీ కుండలిన్యై నమః
111. బిసతంతు తనీయసీ
ఆ లలితా పరమేశ్వరి సన్నగా మెరుపుతీగ వలె వున్నది అని చెప్పుకున్నాం.
అమ్మ తామరతూడు మధ్యలోని సన్నని తంతువు వలె వున్నది అని ఈ నామార్ధం.
బిసతంతు అంటే, సన్నని అందమైన తామరతూడు లోని సన్నని తంతువు అని అర్ధం.
అటువంటి సున్నితమైన శరీరం కలది ఆ శ్రీరాజరాజేశ్వరి.
జీవుని శరీరమంతా పద్మమయమే కదా, ఆ పద్మాలను అంటిపెట్టుకుని వున్న
ఆ తామరతూడు లోని సన్నని తంతువే అమ్మ శరీరం. ఆ తామరతూడే సుషుమ్నా మార్గం.
ఆ మార్గం ద్వారానే మూలాధారం నుంచి, సహస్రారం వరకూ జీవుడు ఉద్ధరింపబడతాడు.
ఇదే బ్రహ్మలోకమైన సత్యలోకమునకు దారి. కుండలినియే జీవుడి చైతన్య శక్తి.
ఆ చైతన్యాన్ని మూలాధారం, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ ల వద్ద
వున్న పృధ్వీతత్త్వము, జలతత్త్వము, అగ్నితత్త్వము, వాయుతత్త్వము, ఆకాశతత్త్వము లను
కూడా దాటించి, సహస్రారము వద్ద, సుధాధారలు వర్షిస్తున్న చంద్రమండలమును చేర్చాలి.
అక్కడ సహస్రారకమలము వద్ద మహాపతివ్రత అయిన ఆ రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరునితో
కూడి, ప్రమోదము వ్యక్తం చేస్తూ ఉంటుంది. తామరతూడు తంతువు వంటి సూక్ష్మమైన రూపముతో
ఉపాసకులను ఉద్ధరిస్తున్న, ఆ బిసతంతు తనీయసి కి వందనం.
ఓం శ్రీ బిసతంతుతనీయస్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి