నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ॥ 44 ॥
134. నిర్లేపా
ఎటువంటి పై పూతలూ, లేపనములూ లేనిది, ఏ కర్మ సంబంధములూ అంటనిది అని భావం.ఓం శ్రీ నిర్లేపాయై నమః
ఓం శ్రీ నిర్మలాయై నమః
136. నిత్యా
శాశ్వతమైనది, నిత్యమైనది ఆ జగజ్జనని శ్రీ లలిత.
అందుకే ఈ నిత్యా నామము ఆమె పట్ల సార్ధకం.
ఆ శ్రీమాత చిదగ్నికుండములో ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం.
ఉన్నదే ఆవిష్కృతమవుతుంది కానీ, లేనిది కాదు కదా. అమ్మ ఈ బ్రహ్మాండము కావల వున్నది.
దేవకార్యము కొరకై వచ్చింది. లేని వస్తువు రాలేదు కదా. అమ్మ ఈ చిదగ్నికుండ సంభవానికి
ముందూ వున్నది, దేవతా కార్యమంతటా వున్నది. ఆ తరువాతా ఉన్నది.
కనుక ఆ తల్లి నిత్య, శాశ్వతముగా ఉండునది. ఈ జగత్తంతా నిత్యమైనది, సత్యమైనది.
మనమందరమూ ఈ సృష్టిలోని భాగము, కనుక, మనమూ నిత్యులమే.
పైనున్న దేహమనే కవచము, అనిత్యము కనుక, తాము నిత్యులము కాదనే భ్రాంతిలో
కొందరు వుంటారు. ఆత్మ నిత్య. దానికి నాశనము లేదు. అది నశింపబడదు.
అమ్మ అనే ఆ శుద్ధ సత్వ స్వరూపములో మనము కూడా ఒక అంశమే అని జ్ఞానము
కలిగిన నాడు నిత్యత్వమంటే ఏమిటో బోధ పడుతుంది.
త్రికాలములలోనూ భాసిల్లుతున్న ఆ జగన్మాత, ఆ నిత్య కు వందనం.
ఓం శ్రీ నిత్యాయై నమః
137. నిరాకారా
శ్రీ లలితని ఈ నామంలో నిరాకారా అంటున్నాం. ఏ ఆకారము లేనిది ఆ జగన్మాత.
అమ్మవారి స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ దేహాల గురించి చెప్పుకున్నాం.
ఆమె మంత్ర స్వరూపమని, మంత్ర శరీరము కలదని చెప్పుకున్నాం.
ఇప్పుడు ఆ దేవినే, నిరాకారా అంటున్నాం. పై చెప్పిన రూపాలన్నీ మనకు సగుణోపాసనకు
దారి చూపిస్తాయి. కానీ ఈ నామము మాత్రము మనల్ని నిర్గుణోపాసనకు సిద్ధం చేస్తుంది.
మనం అమ్మను భవానీ, భావనాగమ్యా అన్నాం. మన భావము ఎలా ఉంటే, అలా రూపము
తీసుకునే కరుణామూర్తి ఆ తల్లి. ఎలా ఆమెను భావిస్తే అలా ప్రసన్నమయి మనలను
కృతార్థులను చేస్తుంది. మనము మానవులం కనుక, మనవంటి రూపాన్నే, మరికొంత
అతిశయముతో జోడించి అమ్మ రూపాన్ని కల్పించుకున్నాం. అంతే.
అన్ని రూపాలూ ఆ తల్లివే, అదే విధంగా ఏ రూపమూ ఆ తల్లిది కాదు.
అలాగే అన్ని ఆకారములూ ఆ తల్లివే, కానీ ఆమె ఏ ఆకారములోనూ ఉండదు.
నీరు ఏ పాత్రలో పోస్తే, ఆ ఆకారము తీసుకున్నట్టు, ఆ తల్లి మనము ఎలా భావిస్తే,
ఆ ఆకారములో దర్శనమిస్తుంది. విద్యుల్లత ఏ విధంగా శక్తిపూరితమయి కూడా
ఒక ఆకృతి లోకి ఒదగదో, శ్రీ లలిత కూడా ఏ ఒక్క ఆకారములోకీ ఒదగదు.
అటువంటి శుద్ధ చైతన్య స్వరూపమైన విద్ద్యుల్లత, ఆ నిరాకార కు వందనం.
ఓం శ్రీ నిరాకారాయై నమః
138. నిరాకులా
ఆకులము లేనిది, వ్యాకులత చెందనిది అని ఈ నామార్థము.
ఆ శ్రీ లలిత నిరాకులా, అంటే, ఆ తల్లి దేనికీ కలత చెందదు అని భావం.
అజ్ఞానము, అవిద్య వలన, అలజడి, అశాంతి కలిగి, అందువలన వ్యాకులత కలుగుతుంది.
అమ్మ స్వయముగా జ్ఞానరూపిణి, శ్రీవిద్యా రూపము కనుక ఆ తల్లి నిరాకులా.
ఎంత చదువుకున్నా, ఇంకా అశాంతితో ఉండేవారికి విద్య సంపూర్ణము కానట్లే.
ఆ అశాంతిపరులకు కలతలు సహజము. వారికి అమ్మ అందదు.
అజ్ఞానమును వదిలి, జ్ఞానము చేత అశాంతిని తొలగించుకుని,
శాంతముగా వున్నవారికి ఆ తల్లి ప్రసన్నము అవుతుంది.
శాంతము కలిగి, కలతలు లేని స్థితి ఉండటమే అసలైన విద్యకు నిదర్శనం.
విద్యాస్వరూపిణియై, ఏ వ్యాకులతలూ లేకుండా, శాంతంగా వుండే, ఆ నిరాకుల కు వందనం.
ఓం శ్రీ నిరాకులాయై నమః
139. నిర్గుణా
నిర్గుణా అంటే ఏ గుణములూ లేనిది. ఈ సృష్టిలో అన్నీ త్రిగుణ స్వరూపమే.
ఈ సృష్టిని రచించిన అమ్మ మాత్రమూ ఏ గుణమూ అంటదు.
ఎందుకంటే, ఆమె గుణాతీత. సత్వరజస్తమో గుణాలు ఆ లలితాదేవి సృష్టే.
కానీ ఆమెకు ఆ గుణములేవీ ఉండవు. శివుడి వలే ఆ శ్రీమాత కూడా నిర్గుణ.
అవసరార్ధమై, అన్ని గుణములనూ ధరించే తల్లి ఆ శ్రీలలిత.
శరీరమునకు లక్షణములు, లక్షణములకు గుణములూ ఉంటాయి.
పార్వతీదేవికి ఏ లక్షణములూ, ఏ గుణములూ లేవు,
ఆ తల్లి శివుని వలె నిర్గుణ అని, నారదుడు హిమవంతుడికి చెప్తాడు.
అటువంటి ఆ నిర్గుణ కు వందనం.
ఓం శ్రీ నిర్గుణాయై నమః
140. నిష్కళా
ఓం శ్రీ నిష్కళాయై నమః
141. శాంతా
శాంతా అంటే, శమము, శాంతము కలది. ఈ శుద్ధ చైతన్య మూర్తి పరమ శాంత.
దిగంతముల వరకూ వ్యాపించిన శాంతమూర్తి శ్రీ లలిత.
తాత్కాలికమైన శాంతము నుంచి శాశ్వతమైన శాంతి వరకూ సమస్తమూ ప్రసాదించేది ఈ శాంత.
ధ్యానాంతమందు శాంతిని ఇచ్చే తల్లి కనుక, ఈమె శాంత.
నిశ్చలమూర్తి కనుక, ఈమె శాంత. అమృత స్థితిలో వున్నది కనుక, ఈమె శాంత.
అశాంతి లేని ఆత్మ రూపములో వున్నది కనుక, ఈమె శాంత.
భక్తుల ఆర్తి తీర్చి శాంతమును కలుగచేస్తుంది కనుక, ఈమె శాంత.
అశాంతిని దూరం చేసి శమమునిచ్చే, కరుణామూర్తి, ఆ శాంత కు వందనం.
ఓం శ్రీ శాంతాయై నమః
142. నిష్కామా
నిష్కామా, ఎటువంటి కోరికలూ లేనిది అని ఈ నామార్ధం.
కోరికలు లేని స్థితి అంటే కోరికలు తీరిపోయిన స్థితి. అమ్మ పూర్ణకామ.
ఆ తల్లి అనుకున్నవి అన్నీ జరుపుతోంది కనుక, ఆమె పూర్ణకామ.
అన్ని కోరికలూ తీరిన తరువాత, ఏ కోరికలూ లేని స్థితి ఒకటి వస్తుంది. అదే నిష్కామస్ధితి.
కానీ ఆ స్థితి రావటానికి ఉపాసకుడు ఎంతో కృషి చేయాలి. ఎందుకంటే కోరిక అనేది
ఒకటి తరువాత ఒకటి పుడుతూనే వుంటుంది, అది ధర్మమైనదైనా, అధర్మమైనదైనా.
ధర్మకామము వలన తృప్తి, సంతోషం వస్తే, అధర్మకామము వలన అశాంతి మిగులుతుంది.
ఉపాసకుడు ఈ కోరిక అనే కామాన్ని దగ్ధం చేయాలి. సాధనతోనే ఇది సాధ్యమవుతుంది.
దానికి ఇంధనం కేవలం వివేకము, వైరాగ్యము. ఈ రెండింటితో దాటలేని అడ్డంకి లేదు.
శివుడు కూడా అన్నపూర్ణాదేవిని భిక్షాందేహి అని అడుగుతూ ఆ భిక్ష దేనికోసమో చెపుతూ,
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం అని అంటాడు. మనమూ ఆ అన్నపూర్ణాదేవి కాళ్ళు పట్టుకుని,
అమ్మా, జ్ఞాన వైరాగ్యాల భిక్ష ప్రసాదించు తల్లీ, అని వేడితే ఆ తల్లి కరుణిస్తుంది.
అప్పుడు పొందే సిద్ధే నిష్కామ స్థితి. జ్ఞానవైరాగ్య సిద్ధి ఒక్కటే నిష్కామ స్థితికి దారి తీస్తుంది.
కోరిక తీరనప్పుడు శాంతము రాదు, శాంతము లేనప్పుడు నిష్కామ స్థితి ఎన్నటికీ రాదు.
అధర్మకామానికి అమ్మ అనుజ్ఞ ఉండదు. అటువంటి కోరికలుంటే, వాటితో ఆత్మ వేగిపోతుంది.
నిరంతరమూ జనించే కామాన్ని, కోరికలను, వివేకము, వైరాగ్యములతో
అధిగమించి, శాంతమనస్కులమై నిష్కామ స్థితికి చేరుకోవాలి.
అటువంటి నిష్కామస్థితిలో నిత్యమూ శోభిల్లుతున్న ఆ నిష్కామ కు వందనం.
ఓం శ్రీ నిష్కామాయై నమః
ఉపప్లవము అంటే నాశము. నిరుపప్లవము అంటే నాశము లేనిది అని భావం.
తానే స్వయముగా అమృతతత్వమైన ఆ లలితాదేవికి నాశము ఎలా వుంటుందీ.
ఎప్పటికీ నాశము లేని జనని ఆ శ్రీలలిత. సృష్టి, స్థితి, లయ లందు కూడా ఈ తల్లి ఉంటుంది.
అన్ని బ్రహ్మాండములలోనూ, అన్ని వేళల యందూ వుండే తల్లి, ఆ శ్రీ లలిత.
ఉపాసనతో సహస్రారము చేరి, నాడులన్నీ తడిసే విధంగా, అమృత ధారలలో
స్నానమాడిన ఉపాసకులకు కూడా నాశము లేదు.
శరీరము జర, రుజ లతో బాధింపబడినప్పటికీ, ఆత్మ మాత్రమూ ఎప్పుడూ నిత్య, నిరుపప్లవ.
దేహము, దేహి వేరువేరు అన్న భావన సాధనతో పొందాలి.
ప్రళయ కాలములో కూడా నాశమే లేని ఆ లలితాపరమేశ్వరి, ఆ నిరుపప్లవ కు వందనం.
ఓం శ్రీ నిరుపప్లవాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి