
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా
మహాబుద్ధిః, మహాసిద్ధిః, మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
219. మహాభోగా
ఓం శ్రీ మహాభోగాయై నమః
220. మహైశ్వర్యా
ఐశ్వర్యము నిచ్చేది ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుని ఇల్లాలు లలితాదేవి.
ఐశ్వర్యము నిచ్చే ఈశ్వరుని పత్నిగా ఆ ఈశ్వరి మహైశ్వర్యా కదా.
అందరికన్నా ఐశ్వర్యవంతురాలు కనుక ఆ తల్లిని మహైశ్వర్యా అంటున్నాం.
అందరికీ అన్నీ ఇచ్చినా తరగని గని వలె, ఐశ్వర్యము కల దేవి కనుక అమ్మ మహైశ్వర్యా.
విభూతి అంటే సంపద, ఐశ్వర్యము. విభూతి నిచ్చే ఆదిదంపతులు వీరిద్దరూ.
కనుక అమ్మ మహైశ్వర్యా. అష్టైశ్వర్యాలకు అధిదేవత కనుక మహైశ్వర్యా.
భక్తులకు కరుణతో విభూతినీ, ఐశ్వర్యాన్నీ ఇచ్చే, ఆ మహైశ్వర్య కు వందనం.
ఓం శ్రీ మహైశ్వర్యాయై నమః
221. మహావీర్యా
మహావీర్యా అంటే అమ్మ గొప్ప సామర్ధ్యము, వీర్యము కలది అని భావం.
వీర్యము అంటే బలము, తేజస్సు, శుక్రము, సామర్ధ్యము అనే అర్ధాలున్నాయి.
అమ్మ సామర్ధ్యము గొప్పది కనుక జగత్తు నంతా అద్భుతంగా పరిపాలించ గలుగుతోంది.
అమ్మ తేజస్సు ఎక్కువ కనుకే, ఆ తల్లి జ్యోతిశ్చక్రము పరిధి విశ్వమంతా వ్యాపించి ఉన్నది.
ఎక్కడ ఈ లక్షణములు కనిపించినా ఆ శక్తి అంతా ఆ శ్రీదేవిదే అని గ్రహించాలి.
గొప్ప సామర్ధ్యముతో, వీర్యముతో ఈ సమస్త లోకాలనూ సృష్టించి
పాలిస్తున్న, ఆ మహావీర్య కు వందనం.
ఓం శ్రీ మహావీర్యాయై నమః
ఓం శ్రీ మహాబలాయై నమః
223. మహాబుద్ధిః
గొప్పదైన బుద్ధిని, మహత్వమున్న బుద్ధిని మహాబుద్ధి అంటారు.
అట్టి బుద్ధిని కలిగిన అమ్మ కనుక ఈ తల్లి మహాబుద్ధీ అనే నామం ధరించింది.
జ్ఞానాన్ని కలిగించేది బుద్ధి. శుద్ధజ్ఞానాన్ని కలిగించేది మహాబుద్ధి. కనుక అమ్మ మహాబుద్ధీ.
తన ఉపాసకులకు బుద్ధీ, జ్ఞానాలను ఇచ్చేది కనుక ఈ మాత మహాబుద్ధీ.
అమ్మ ఉపాసన వలన, నామజపం వలన కలిగేది మహాబుద్ధి కనుక ఈ తల్లి మహాబుద్ధీ.
తనను ఉపాసించిన వారికి మహాబుద్ధినీ, చైతన్యాన్నీ ఇస్తున్న, ఆ మహాబుద్ధి కి వందనం.
ఓం శ్రీ మహాబుద్ధ్యై నమః
224. మహాసిద్ధిః
ఆ శ్రీలలిత అష్ట సిద్ధులపై అధికారము కల మహాసిద్ధి. కనుకనే ఆ అంబ మహాసిద్ధీ.
శ్రీ లలిత అణిమ, మహిమ, గరిమ, లఘిమ ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశత్వము అనే
అష్టసిద్ధులకు అధిదేవత. హనుమంతుడు అష్టసిద్ధులనూ పొందిన గొప్ప శక్తి.
అణిమాసిద్ధి వలన అణువు అంత చిన్నగా మారే శక్తి,
మహిమాసిద్ధి వలన విరాట్ రూపము ధరించే శక్తి, గరిమాసిద్ధి వలన బ్రహ్మాండము కన్నా
బరువుగా మారే శక్తి, లఘిమాసిద్ధి వలన దూదిపింజ కన్నా తేలికగా అయ్యే శక్తి,
ప్రాప్తిసిద్ధి వలన కావల్సిన వస్తువును శూన్యము నుండి కూడా పొందే శక్తి,
ప్రాకామ్యసిద్ధి వలన దూరదృష్టి, దూరశ్రవణం, ఆకాశసంచారము పొందే శక్తి,
ఈశత్వసిద్ధి వలన సమస్త అధికారమును పొందే శక్తి, వశత్వసిద్ధి వలన అందరినీ వశము
చేసుకునే శక్తి వస్తాయి. ఈ శక్తులన్నీ శ్రీచక్ర ప్రథమావరణంలో ఉంటాయి.
అమ్మ ఈ సిద్ధులన్నింటికీ అధిదేవత కనుక ఆ తల్లి మహాసిద్ధీ.
స్కంద పురాణము ప్రకారము రసోల్లాసాది సిద్ధులకు కూడా ఈ శక్తే అధిదేవత.
ఆ సిద్ధులలో మొదటిది రసోల్లాసము, రెండవది శీతోష్ణములచే బాధ పొందకుండా ఉండటం,
మూడవది ఉత్తముడు, అధముడు అనే భేదభావం లేకుండా ఉండటం,
నాలుగవది ఆయుష్షు, సుఖము, దుఃఖము పట్ల సమాన బుద్ధి కలిగి ఉండటం,
అయిదవది శరీరమునందు బలము, తేజస్సు ఉండటం,
ఆరవది పరమాత్మపై నిష్ఠతో తపము చేయటం,
ఏడవది ఎక్కడకు వెళ్లాలంటే అక్కడకు తక్షణం వెళ్లగలగడం,
ఎనిమిదవది ఎక్కడైనా శయనించగలగటం.
అన్ని సిద్ధులకు అధిదేవత అయిన, ఆ మహాసిద్ధి కి వందనం.
ఓం శ్రీ మహాసిద్ధ్యై నమః
225. మహాయోగేశ్వరేశ్వరీ
ఎంతో ఉత్తమమైన, అచంచలమైన దీక్షతో తపస్సు చేస్తే, వారు యోగులనబడతారు.
అట్టి యోగులకన్నా గొప్పవాడు, ఆ యోగులు అందరూ ఎవరి గురించైతే ధ్యానము చేస్తారో
అట్టి ఈశ్వరుడు యోగీశ్వరుడు. శివుడు, శ్రీకృష్ణుడు యోగీశ్వరులు.
వారు కూడా ఈ లలితా కటాక్షము కోసం నిష్టగా ధ్యానం చేస్తారు.
అట్టి యోగీశ్వరులకే ఈశ్వరి యోగేశ్వరేశ్వరి, లలితాపరమేశ్వరి.
యోగీశ్వరులచే ధ్యానింపబడుతున్న శక్తి ఈ మహాయోగీశ్వరేశ్వరి.
యోగీశ్వరుల ధ్యానమునకే కేంద్ర బిందువు అయిన, ఆ మహాయోగేశ్వరేశ్వరి కి వందనం.
ఓం శ్రీ మహాయోగేశ్వరేశ్వర్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి