17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

56. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా

 

మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా 
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥

226. మహాతంత్రా

తంత్రము అంటే విధానము, తంతు అని ముందే చెప్పుకున్నాం. శాస్త్రములో చెప్పిన విధముగా, 

ఆ శ్రీదేవిని ఆహ్వానించి, షోడశోపచారములతో పూజించుట తంత్రము. 

పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన సంభాషణనే తంత్రసూత్రములు అంటారు.  

అట్టి తంత్రములో కెల్లా మహత్తరమైనది, మహా ప్రభావవంతమైన మహాతంత్రము. 

స్వతంత్రతంత్రం అన్ని తంత్రాలలో కెల్లా సర్వోత్తమమైనది. ఉపాసకులకు స్వతంత్రముగా 

చతుర్విధ పురుషార్ధములను ఇచ్చే శ్రీవిద్యాతంత్రమే స్వతంత్రతంత్రం.   

కులార్ణవంలో, జ్ఞానార్ణవంలో శ్రీవిద్యయే మహాతంత్రమని చెప్పారు. 

అమ్మవారే స్వయముగా శ్రీవిద్య కనుక, ఈ మహాతంత్రా నామము, ఆ లలితాపరమేశ్వరికి 

మాత్రమే తగిన నామము. అమ్మని ఏవిధముగా పూజించాలో ఆ విధానమే ఈ తంత్రము. 

సరియైన తంత్రముతో భక్తి శ్రద్ధలతో, దీక్షతో సేవిస్తే, అమ్మ పూజాతంత్రం బహువిధ ఫలితాలు

ఇస్తుంది. 

తంత్రములలోకెల్లా మహత్వమైనదైన, ఆ మహాతంత్ర కు వందనం. 

ఓం శ్రీ మహాతంత్రాయై నమః  


227. మహామంత్రా
మననము చేస్తూ వుంటే రక్షించేది మంత్రం. బీజాక్షరముల కూర్పే మంత్రమని చెప్పుకున్నాం. 

అట్టి మంత్రములలో కెల్లా మహామంత్రాలు బాలా, బగళా, షోడశీ మొదలైన అమ్మ మంత్రాలు.

ఈ నామములన్నింటితో జీవుడు మననము చేస్తున్నది ఆ శ్రీమాతనే.   

అందువలన, ఆ శ్రీమాతయే నిస్సందేహముగా మహామంత్రా అయినది. 

దశమహావిద్యల మంత్రములు కానీ, ఖడ్గమాలలో చెప్పబడిన దేవతలు కానీ, 

త్రిశతి, సప్తశతి లలో చెప్పిన దేవతలు కానీ అందరూ అమ్మ రూపమే. 

ఏ నామంతో జపించినా ఆ అమ్మ కరుణిస్తుంది. వీటన్నింటిలో ఒక మంత్రము మంచిదని కానీ, 

మరొక మంత్రము మంచిది కాదు అని కానీ ఉండదు. 

మంత్రము సిద్ధిస్తే, ఆ మంత్రాధిదేవత వచ్చి, ఆ కామ్యము తీరుస్తుంది, ఐహికమైనదైనా, 

ఆముష్మికమైనదైనా. శ్రద్ధ, దీక్ష, నిష్ఠ, ఆర్తి ముఖ్యం. 

మంత్రమనేది మాత్రం నిరంతరంగా జరగాలి. అప్పుడే మంత్రం ఫలిస్తుంది. 

మంత్రములోకెల్లా గొప్పదైన మహామంత్రము తానే అయిన, ఆ మహామంత్ర కు వందనం. 

ఓం శ్రీ మహామంత్రాయై నమః 

  

228. మహాయంత్రా 

యంత్రము అనేది దేవత రేఖాచిత్రమే అని చెప్పుకున్నాం. యంత్రములో దేవతను ఆవాహన

చేసి తగిన తంత్రముతో, సరియైన మంత్రముతో పూజిస్తే కలిగే ఫలితము అపారం. 

ఇహము నుంచి పరము దాకా ఏ కామ్యమైనా సిద్ధిస్తుంది. 

ఒకసారి అమ్మవారు అయ్యవారిని అడిగిందట, 

"ఏది ఉత్తమమైన తంత్రము, మంత్రము, యంత్రము" అని. 

"అన్ని తంత్రముల లోకీ స్వతంత్ర తంత్రము ఉత్తమమైనది. ఈ తంత్రమును ఆచరించుటకు 

ఇతర తంత్రముల అవసరము లేదు. అన్ని మంత్రముల లోకీ శ్రీవిద్య సర్వోత్తమమైనది. అన్ని 

యంత్రముల లోకీ  సిద్ధివజ్రమను యంత్రం సర్వోత్తమమైనది. అదియే శ్రీచక్రము. అందుకే 

దానికి చక్రరాజమని కూడా పేరు. తంత్ర, మంత్ర, యంత్రములలో  స్వతంత్రతంత్రము, 

శ్రీవిద్యామంత్రము, సిద్ధివజ్రయంత్రము మహత్తరమైనవి" అని శివుడు పార్వతితో చెప్పాడు. 

సమస్త యంత్రములలో ఉత్తమమైన శ్రీయంత్ర రూప శ్రీమాత, ఆ మహాయంత్ర కు వందనం. 

ఓం శ్రీ మహాయంత్రాయై నమః 


229. మహాసనా

అమ్మ ఆసనము ఈ భువనాలే. అంతకంటే పెద్ద ఆసనమేమున్నది. 

అందరిలోనూ చైతన్య రూపములో వున్నది ఆ శ్రీదేవియే. 

ఈ చరాచర జగత్తునంతా అధిష్టించి వున్న  శ్రీదేవి. 

తిరిగి ఆ శ్రీదేవి లోనే అందరూ అణగివున్నారు. బయటా ఆ తల్లే, లోపలా ఆ తల్లే. 

అన్ని తత్వములు ఆసనములుగా కలది మహాసనా. ఆ తల్లి అధివసించని తత్వము లేదు. 

అన్ని తత్వములపైనా అధికారము పొంది, వాటిపై ఆసీనురాలయి వున్నది.  

కనుక ఆ శ్రీమాతను ఈ నామంలో మహాసనా అని కొలుస్తున్నాం.  

సర్వాసనాసీన, శ్రీమత్సింహాసనాసీన అయిన, ఆ మహాసన కు వందనం. 

ఓం శ్రీ మహాసనాయై నమః 


230. మహాయాగ క్రమారాధ్యా

మహాయాగముతో ఆరాధింపబడు దేవి అని ఈ నామార్ధం. 

బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరీ, ఐంద్రి, కౌమారి, వారాహి, చాముండీ, మహాలక్ష్మి, ఈ ఎనిమిది మంది 

దేవతలని అష్ట మాతృకలు అంటాం. శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రంలో వీరి గురించి చెప్పారు. 

ఈ అష్టమాతృకలు శ్రీ చక్రంలోని ప్రథమావరణంలో ఉంటారు. 

వీరి అంశతో ఒక్కొక్కరికీ ఎనిమిది మంది చొప్పున మొత్తం అరవై నాలుగు మంది యోగినులు 

జన్మించారు. 

ఆ అరవైనాలుగు మంది యోగినుల పూజతో కలిపి చేసే ఆరాధనకు మహాయాగమని పేరు.  

అటువంటి  మహాయాగవిధానము చేత పూజింపబడుచున్న తల్లి కనుక ఈ నామంలో

శ్రీమాతను మహాయాగక్రమారాధ్యా అంటున్నాం. 

అన్ని ఉపాసనల వలెనే మహాయాగము కూడా అంతర్యాగము, బహిర్యాగము అని రెండు విధాలు.

బయటకు అందరికీ కనిపించే విధంగా చేసేది బహిర్యాగము. 

అంతరంగంలో చేసేది అంతర్యాగము. ఈ అంతర్యాగములో ఉపాసకుడు తన సమస్త కర్మలను,

అంతఃకరణములను, మూలాధారము వద్ద, కుండలినీ అగ్నిలో ఆహుతులుగా సమర్పించాలి.

అప్పుడు ఆ అగ్ని జ్వలించి సహస్రారాన్ని చేరుకుంటుంది. 

అక్కడ జరిగే భైరవీ, భైరవుల సంయోగమే మహాయాగం. దీనినే మహాయాగక్రమం అంటారు. 

మహాయాగక్రమ విధానంలో ఆరాధింపబడుతున్న, ఆ మహాయాగ క్రమారాధ్య కు వందనం. 

ఓం శ్రీ మహాయాగక్రమారాధ్యాయై నమః 


231. మహాభైరవ పూజితా

భైరవ నామంలో భ, ర, వ అనే మూడు మాత్రలున్నాయి. 

భ అంటే భరణ అంటే సృష్టి, ర అంటే రమణ అంటే స్థితి, వ అంటే వమన అంటే సంహారము. 

ఈ మూడు కార్యక్రమములు చేసే కర్తను  భైరవుడు అంటారు. 

ఈ మూడు కార్యములూ చేసే శక్తి కనుక ఆ పరమశివుడిని మహా భైరవుడంటారు. 

అటువంటి మహాభైరవుని చేత పూజింపబడుతున్నది కనుక, ఆ శ్రీలలిత మహాభైరవపూజితా 

అనే నామంతో పిలువబడుతోంది. 

మహాశంభుడు అక్షమాలను ధరించి లలితాదేవిని ఆవిర్భవింపమని ఆహ్వానిస్తూ అష్టకారికలు 

పఠించాడు. ఇవి ఎనిమిది శ్లోకాలు. 

అప్పుడు చిదగ్నికుండములో నుంచి లలితాదేవి ఆవిర్భవించింది. 

ఆ విధంగా మహా భైరవునితో పూజలందుకున్న, ఆ మహాభైరవ పూజిత కు వందనం. 

ఓం శ్రీ మహాభైరవపూజితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి