ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥
285. ఆబ్రహ్మ కీటజననీ
ఈ నామంలో బ్రహ్మ నుంచి చీమ దాకా అందరికీ తానే జనని అని చెప్తోంది.
త్రిమూర్తులనూ, త్రిమాతలనూ, ఈ సమస్త భువన భాండాలనూ సృజించింది ఆ జగన్మాతే.
ఆవిధంగా బ్రహ్మకు తాను తల్లి. చీమనూ, దోమనూ, చెట్టునూ, పుట్టనూ సృష్టించింది కూడా
ఈ జగదంబే. అమ్మలకన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ముగురయ్యల మూలపుటమ్మ
కూడా ఈ జగన్మాతే. ఈ మాత చాల పెద్దమ్మ. సురారులమ్మ.
వివరంగా చెప్పుకోవాలంటే, జీవులన్నిటిలో పెద్దవాడు హిరణ్యగర్భుడైన బ్రహ్మ.
అందరికంటే చిన్నవాడు స్తంబుడు. సాలెపురుగు నేసిన దారాలని తిని బతికే, కంటికి కనిపించని
అతి సూక్ష్మజీవి. అమ్మ ఈ స్తంబుడినీ, ఆ హిరణ్యగర్భుడినీ కూడా పుట్టించింది.
అందుకే ఆ అమ్మను ఈ నామంలో ఆబ్రహ్మకీటజననీ అంటున్నాం.
పిపీలికాది జీవులనుంచీ, హిరణ్యగర్భుడైన బ్రహ్మ వరకూ అందరికీ ప్రాణం పోసి,
జన్మ ఇచ్చిన, ఆ ఆబ్రహ్మ కీటజనని కి వందనం.
ఓం శ్రీ ఆబ్రహ్మకీటజనన్యై నమః
286. వర్ణాశ్రమ విధాయినీ
నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమములు అని వేదం ఆధారముగా విభజన చేసిన తల్లి
అని ఈ నామానికి అర్ధం. తాను నిర్ణయించిన విధి విధానములను వివరించుటకై
వేదములను రచించింది. వేదాలు అపౌరుషేయాలు అంటే అర్ధం ఇదే.
ఆ వేదంలో కర్మల గురించి తెలిపే భాగాన్ని కర్మకాండ లోనూ, బ్రహ్మమును గురించి తెలిపేది
బ్రహ్మకాండ లోనూ వున్నది. వేదంలో చెప్పిన కర్మలు చేసే అధికారం దేవతలకు కానీ
పశువులకు కానీ లేదు. ఒక్క మనుష్యుడికే ఆ కర్మలు విధింపబడ్డాయి.
ఆ కర్మలు చేసే, చేయగలిగే, స్వభావమును బట్టీ మనుష్యులను నాలుగు వర్ణములుగా
విభజించింది ఆ జగజ్జనని, వేదమాత.
ఆ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములుగా విభజించింది.
మనిషి జీవితదశలను బట్టీ ఆశ్రమములను కూడా నాలుగుగా ఏర్పరచింది.
అవే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసము అనే నాలుగు ఆశ్రమాలు.
బాల్య, కౌమార, యవ్వన దశల్లో బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్ధావస్థలో గృహస్థ ఆశ్రమం,
వృద్ధాప్యంలో వానప్రస్థ ఆశ్రమం, తుదకు నాలుగవదైన సన్న్యాస ఆశ్రమం ఉంటాయి.
ఇది మనుషులందరూ పాటింపవలసిన వేదవిధి.
ఆ లలితాపరమేశ్వరి ఈ విధంగా వర్ణములనూ, ఆశ్రమములనూ నిర్మించింది.
శంకరాచార్యుడంటాడు, "బాల్యావస్థే క్రీడాసక్తః, తరుణావస్థే తరుణీసక్తః, వృద్ధావస్థే చింతాసక్తః,
పరమే బ్రహ్మణి కోపి న సక్తః." ఇక బ్రహ్మమును గురించి ఎప్పుడు ఆసక్తి చూపిస్తావూ అని.
మనుష్యులకు వేదధర్మమైన కర్మకాండనూ, బ్రహ్మకాండనూ ఆచరించడానికి గాను
వర్ణములనూ, ఆశ్రమములనూ విధించిన, ఆ వర్ణాశ్రమ విధాయిని కి వందనం.
ఓం శ్రీ వర్ణాశ్రమవిధాయిన్యై నమః
287. నిజాజ్ఞారూపనిగమా
అమ్మవారు స్వయముగా ఇచ్చిన ఆజ్ఞలే వేదములైనవి అన్న విశేషానికి తార్కాణంగా,
తన ఆజ్ఞలే వేదరూపాలుగా వున్నది మాహేశ్వరి అని ఈ నామం చెప్తోంది.
అమ్మ నిజాజ్ఞలే వేదములుగా మారాయి. వేదములలో వున్న అన్ని అంశములు అమ్మ ఆజ్ఞలే.
కనుక వేదము అంటే, అమ్మ చెప్పిన ఆజ్ఞలు, విధానములు, విహితములు, నిబంధనలు.
ఆ ఆజ్ఞలే శైవ తంత్రము, కామికాతంత్రము మొదలైనవి. అదే విధముగా వేదములు తంత్రములు
అన్నీ ఆ పరమేశ్వరి ముఖము నుంచి వచ్చినవే అని శ్రీ దేవీభాగవతం చెప్తోంది.
తన ఆజ్ఞలే వేదరూపములయిన, ఆ నిజాజ్ఞారూపనిగమ కు వందనం.
ఓం శ్రీ నిజాజ్ఞారూపనిగమాయై నమః
288. పుణ్యాపుణ్య ఫలప్రదా
ఆ జగత్సాక్షి అయిన అమ్మ, తన సహహస్రాక్షులతో అందరినీ గమనిస్తూ ఉంటుంది.
పుణ్య కర్మ చేసిన వానికి ఆ పుణ్య ఫలం, పాపకర్మ చేసిన వానికి ఆ పాప ఫలం ఇస్తూ ఉంటుంది.
అమ్మ కంటి నుంచి ఏ కర్మా తప్పించుకోలేదు. అమ్మ చేయి నుంచి ఏ ఫలితమూ తప్పుకోలేదు.
"నా భుక్తం క్షీయతే కర్మ, కల్పకోటి శతైరపి, అవశ్యమనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం"
అన్నారు. అంటే, చేసిన కర్మ మంచిదైనా, చెడ్డదైనా ఆ ఫలితాన్ని అనుభవిస్తేనే తీరుతుంది.
లేకపోతే, వందకోట్ల కల్పాలు గడచినా ఆ కర్మ క్షీణించదు, అని అర్ధం.
మనిషి చేసిన కర్మను బట్టీ, అది మంచిదైతే పుణ్యఫలం, చెడ్డదైతే పాపఫలము
కచ్చితంగా లెక్క కట్టి మరీ ఇస్తుంది ఆ రాజరాజేశ్వరి.
గుళ్ళు కట్టేవాళ్లకు పుణ్యఫలం వస్తే, గుళ్ళు కూల్చేవాడికి పాపఫలం వస్తుంది.
సాయం చేసేవాడికి పుణ్యఫలం వస్తే, గాయం చేసేవాడికి పాపఫలం వస్తుంది. దేని లెక్క దానిదే.
ఏ ఒక్క కర్మా పొల్లు పోదు. ప్రతి కర్మ ఫలితమూ తీసుకోవలసినదే.
జీవుడు చేసిన పాప పుణ్యాలకి తగిన ఫలితమును ఇచ్చే, ఆ పుణ్యాపుణ్య ఫలప్రద కు వందనం.
ఓం శ్రీ పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి