10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

49. నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా

 

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ 
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ॥ 49 ॥

176. నిర్వికల్పా 

వికల్పము అంటే భ్రాంతి. ఏమీ లేని శూన్యాన్ని వున్నట్టుగా భావించుట.

శూన్యమయిన  పదార్ధాన్ని ఎవరు ఎలా అర్ధం చేసుకుంటే అలా అనిపిస్తుంది. 

గుప్పిడి మూసి లోపల ఏమి వుంది అని అడిగితే, కొందరు శూన్యము అంటే, 

కొందరు గాలి అనచ్చు. రెండు విషయాలూ సత్యమే అనిపిస్తాయి. 

రెండూ కూడా సత్యము ఎలా అవుతాయి అనే సందేహం కూడా వస్తుంది. 

అదే విధంగా జీవుడు తన అంతః శత్రువుల ప్రభావానికి లొంగిపోయినపుడు, 

రంగుటద్దాలలో చూసి, లేనిది వున్నట్టూ, వున్నది లేనట్టూ భ్రమ పడుతూ ఉంటాడు. 

దీనినే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. తాడుని చూసి పాము అనుకోవటం. 

మమకార, మోహముల వల్ల వున్న విషయమును సరిగా చూడలేక పోతాడు. 

ఈ వికల్పములన్నీ జీవుడికే కానీ అమ్మకు లేవు. ఆ పరమేశ్వరికి ఏ వికల్పములూ లేవు. 

ఈ సృష్టిలో ప్రతిదీ ఆ అమ్మ ఆజ్ఞ మేరకే నడుస్తుంది. ఆ తల్లి సర్వ సాక్షి అని తెలుసు గదా. 

గుప్పిడి లోని విషయము, గుప్పిడి బయట విషయము రెండూ ఆ అమ్మ సృష్టే.  

వున్నది, లేదు అనే రెండు విరుద్ధ భావాలూ ఒక్కటే అయినప్పుడు, రెండు విషయాలూ లేవు, 

రెండు పక్షాలూ లేవు. ఆ తల్లికి సంకల్పమూ లేదు, వికల్పమూ లేదు. 

ఎటువంటి సంకల్ప వికల్పములూ లేని, ఆ నిర్వికల్ప కు వందనం. 

ఓం శ్రీ నిర్వికల్పాయై నమః 



177. నిరాబాధా 

 బాధ లేనిది అని ఈ నామానికి భావం. ఆ తల్లి నిష్కామా, నిష్క్రోధా, నిర్లోభా, నిర్మోహా, నిర్మదా 

ఇక బాధకు తావేదీ. ఆ శ్రీమాత ఎప్పుడూ నిరాబాధా.  బాధ పొందనిది, బాధ లేనిది. 

ముత్యపుచిప్ప ధగధగలు చూసి దానిని వెండి అని భ్రమ పడినంత మాత్రాన అది వెండి 

అయిపోదు కదా. ముత్యపు చిప్ప ముత్యపు చిప్పే, వెండి వెండే. 

ఒకసారి అది వెండి కాదు, అని తెలియగానే అది తిరిగి ముత్యపు చిప్ప అయిపోతుంది.    

ఈ భ్రాంతుల వలన ముత్యపు చిప్పకి ఏ బాధలేదు. దానికి ఏ మార్పూ రాదు. 

త్రిమూర్తులకు కూడా భ్రాంతి ఉంటుంది. ఆ భ్రాంతి  వలన కలిగే బాధా ఉంటుంది. 

శ్రీలలిత శుద్ధజ్ఞానమూర్తి, సచ్చిదానందమూర్తి కనుక, ఆ మాతకు ఏ భ్రాంతులూ, ఏ బాధలూ లేవు. 

భ్రాంతి  వలననే కదా బాధ కలిగేది. భ్రాంతి లేకపోతే బాధ లేదు.  

బాధలు, వేధలు ఏమీ లేని, ఆ నిరాబాధ కు వందనం. 

ఓం శ్రీ నిరాబాధాయై నమః 

  

178. నిర్భేదా 

శ్రీలలితని ఈ నామంలో నిర్భేదా అని పిలుస్తున్నాం. 

నిర్భేదా అంటే, భేదము లేనిది, భేదము చూపనిది అని భావం. 

జ్ఞానులనైనా, అజ్ఞానులనైనా ఆ తల్లి ఒకే విధంగా, ఏ భేదమూ లేకుండా చూస్తుంది. 

తిర్యక్కులనైనా(జంతువులు), మానవులనైనా కూడా ఒక్కలాగే చూస్తుంది. 

తల్లి కదా భేదం చూపించదు. ఆ మహత్వశక్తిని అర్ధం చేసుకునే తీరులో,

మనలో మనకు భేదం ఉందేమో కానీ, ఆ శ్రీమాతకి ఎటువంటి భేదమూ లేదు. 

తన సంతానమంతా ఆమెకు సమానమే. అంతేకాదు. ఏరూపంలో వున్నా ఆ అమ్మకు అన్నీ ఒకటే. 

మంచు, నీరు, ఆవిరి ఈ మూడింటిలో వున్న పదార్ధమొక్కటే అయినా, సామాన్యులకు వేరువేరుగా

కనిపిస్తుంది. జ్ఞానులకు ఆ భేదము ఉండదు. శుద్ధజ్ఞాని కనుక అమ్మకు ఆ భేదము లేనేలేదు. 

జ్ఞానినీ, అజ్ఞానినీ, చెట్టునూ, పుట్టనూ భేదభావము లేకుండా చూస్తున్న, ఆ నిర్భేద కు వందనం. 

ఓం శ్రీ నిర్భేదాయై నమః 


179. భేదనాశినీ 

లలితాపరమేశ్వరి భేదనాశినీ కూడా కనుక, తన భక్తుల మనసులలో వున్న 

భేదభావాన్ని తొలగించి, అద్వైత జ్ఞానాన్ని అందిస్తున్నది. 

బంగారం ఒక్కటే అయినా, ఆభరణములు వేరు వేరుగా కనపడుతున్నట్టు, 

బ్రహ్మం ఒక్కటే అయినా,  పైకి వేరువేరుగా కనపడుతున్నది.  

లోపల వున్న జీవాత్మ అందరిలోనూ ఒక్కటే అని ఆ తల్లి బోధిస్తున్నది. 

జీవాత్మ, పరమాత్మా రెండూ ఒక్కటే, అందరిలోనూ వెలుగుతున్న జ్యోతీ ఒక్కటే. 

ప్రతి చోటా ఆ అభేదాన్ని చూడగలవాడే జ్ఞాని. ఈశ్వర, ఈశ్వరీ తత్వములోని అద్వైతతత్వాన్ని, 

తన ఉపాసకులందరికీ ప్రేమతో అందిస్తున్న తల్లి లలితాపరమేశ్వరి. 

ద్వైత భావనను, భేదభావమును నాశము చేస్తున్న, ఆ భేదనాశిని కి వందనం. 

ఓం శ్రీ భేదనాశిన్యై నమః 


180. నిర్నాశా 

నాశమే లేనిది నిర్నాశా. ఈ నామానికి అమ్మ కన్నా సార్ధక నామధేయులెవరు. 

సర్వకాల, సర్వావస్థల యందు ఒకేలా వెలుగొందుతున్న తల్లి, ఆమెకు నాశనమేదీ. 

ప్రళయకాలంలో కూడా ఆ తల్లి నిత్యముక్త కనుక, ఎప్పుడూ అస్తిత్వాన్ని కోల్పోదు. 

అందరూ, అన్నీ, నశిస్తాయి. గుణముతో వున్న వారందరూ, త్రిమూర్తులతో సహా 

ప్రళయకాలంలో అమ్మలో లయిస్తారు. అమ్మనుంచి వచ్చినవన్నీ తిరిగి అమ్మలో చేరిపోతాయి. 

కనుక అమ్మ సృష్టి నుంచి వచ్చిన అన్నీ, అందరూ కూడా అమ్మలోనే ఎల్లప్పుడూ వుంటారు. 

ఆ రాజరాజేశ్వరి, నిత్య, నిత్యముక్త, ఆమెకు నాశము లేదు. 

ఆదిమధ్యాంతరహిత. ఆ తల్లికి అంతము అనేది లేనే లేదు. 

ఆ శ్రీలలిత గురించి సత్యంజ్ఞానమనంతంబ్రహ్మ అని శ్రుతులు చెప్తున్నాయి. 

ఆ శ్రీలలిత సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మము. కనుక ఆ శ్రీమాతకు నాశములేదు. 

నిత్య సత్య స్వరూపిణి, ఆ నిర్నాశ కు వందనం. 

ఓం శ్రీ నిర్నాశాయై నమః  


181. మృత్యుమథనీ 

మర్త్యులకు కూడా మృత్యువుని దూరం చేసి, అమృతతుల్యులని చేసే శక్తి 

ఆ అమ్మకృపకి వున్నది అని ఈ నామం చెప్తోంది. అమ్మ మృత్యువును దూరం చేసే శక్తి.  

త్య్రంబక మంత్రము, రుద్ర మంత్రము, మృతసంజీవనీ మంత్రము అని పిలువబడే,

మృత్యుంజయ మంత్రము జీవుడికి అమృతత్వాన్ని అందిస్తోంది. 

మర్త్యుడైన (మృతుడయ్యే) మానవుడిని అమృతత్వం వైపుకు తీసుకుపోయేది ఈ మంత్రం. 

మృత్యోర్ముక్షీయమామృతాత్, అంటే, 'మృత్యువు నుంచి నన్ను కష్టము తెలియకుండా వేరు 

చేసి, అమృతసమానమైన మోక్షమును నాకివ్వు', అని ప్రార్థించటం.  

మరణము దేహానికి కానీ, దేహికి కాదు. దేహి ఎప్పుడూ నిత్యుడు, అమరుడు. 

మరణమనగా జీర్ణమై చిరిగిపోయిన పోయిన దుస్తులు మార్చుకొనుట మాత్రమే అని భగవద్గీతలో 

స్పష్టంగా చెప్పబడింది. మరణమనగా మార్పు మాత్రమే. 

జీవుడికి జర, రుజ లతో నలిగిన దేహం పోయి, సరికొత్త దేహం వస్తుంది. 

కానీ లోపల వున్న ఆత్మది ఎప్పటికీ అమృతతత్వమే. దానికి మృతి లేదు. 

అజ్ఞాని ఈ భావమును గ్రహించలేక, దేహము కోసమే బాధపడుతూ ఉంటాడు. 

మృత్యుభయంతో బాధపడేవారు ఈ నామం చెప్పుకోండి, ఆ భయాన్ని అమ్మ తీసేస్తుంది. 

ఈ నామము జపిస్తే అమ్మ జీవుడికి మృత్యుభయం పోగొడుతోంది. 

మర్త్యునికి మృత్యుబాధను, భయాన్ని నశింపచేసే, ఆ మృత్యుమథని కి వందనం. 

ఓం శ్రీ మృత్యుమథన్యై నమః 


182. నిష్క్రియా 

ఏ క్రియలూ చేయనిది, ఏ క్రియలూ లేనిది అని ఈ నామానికి అర్ధం. 

మరి అమ్మ ఏమీ చెయ్యకపోతే, ఈ సృష్టి ఎలా నడుస్తోందీ, అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. 

విహితములు, నిషిద్ధములు అని కర్మలు రెండు రకములు. విహితములంటే, శాస్త్రము 

ప్రకారము చేయవలసిన కర్మలు. నిషిద్ధములంటే, శాస్త్రము ప్రకారము చేయకూడని కర్మలు.

సృష్టి, స్థితి, లయ అన్ని కార్యములూ చేస్తున్న ఆ మహేశ్వరికి విహితములు, నిషిద్ధములు 

అనే భేదము లేదు. అన్ని కార్యములూ ఆమెవే, కారణమూ, కార్యమూ అన్నీ ఆ మహేశ్వరి 

సంకల్పములే. ఏవిధంగా, పుష్పాన్ని ధరించక పోయినా దాని పక్కన ఉంటేనే, ఆ పుష్పపరిమళం 

ఎలా మనసుని చలింపచేస్తోందో, అదే విధంగా అమ్మ అనుకుంటే చాలు, అన్ని కార్యాలూ 

వాటంతట అవే జరిగిపోతాయి. ఆ శ్రీమాతకి ఎటువంటి కర్తృత్వమూ ఉండదు, అంటదు.

అంతా మన భావనే. అమ్మ ఏమీ చేయక్కరలేదు. ఆమె నిష్క్రియ. 

అమ్మకు గుడిని కట్టేవాడూ, గుడిని కూల్చేవాడూ ఇద్దరూ ఒకటే, ఎవరినీ ఆపదు. 

కానీ వారి వారి కర్మల బట్టీ ఫలితము అమ్మ ఇస్తుంది. 

అమ్మ ఆవిషయంలో నిరంకుశ. ఆమెకు అడ్డు లేదు. 

అన్ని కార్యములూ నిర్వహిస్తూనే, ఎటువంటి కర్తృత్వమూ వహించని, ఆ నిష్క్రియ కు వందనం. 

ఓం శ్రీ నిష్క్రియాయై నమః 


ఒక చిన్న సంఘటన: వివేకానందుడు కాశ్మీర యాత్రలో క్షీరభవానీ ఆలయాన్ని సందర్శించాడు. 

అప్పటికే, ఆ ఆలయం దుండగుల చేతిలో ధ్వంసం అయిపోయి వుంది. అమ్మని ఆస్థితిలో చూసి  

వివేకానందుడు ఏడ్చాడు. అమ్మను దర్శించగలవాడు కనుక, అమ్మను అడిగాడు, "అమ్మా, 

నీ ఆలయాన్ని నాశనము చేసేవాడిని ఎందుకు ఆపలేదూ, నీ గుడిని ఎందుకు రక్షించుకోలేదూ", 

అని. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, "నాయనా, గుడి కట్టమని నేనడిగానా, మీ ఆరాధనకు వీలు 

అని మీరు కట్టుకున్నారు, మరొకడు వాడి ఆరాధనకు అడ్డమని కూల్చుకున్నాడు. నేను దేనికీ, 

ఎటువంటి కర్తృత్వమూ వహించను. కానీ జీవులు చేసే పాప, పుణ్యాలకు సరిపడా వారి వారి 

పద్దులో మాత్రం ఖచ్చితంగా లెక్క కట్టి మరీ వేస్తాను. ఆ పుణ్యఫలితమూ, ఈ పాపఫలితమూ 

రెండింటినీ తప్పనిసరిగా జీవుడు అనుభవించవలసినదే." తనకు కలిగిన ఈ అనుభవాన్ని 

వివేకానందుడు స్వయంగా చెప్పాడు. నిజమే కదా, మన సగుణోపాసన కోసం, విగ్రహారాధన కోసం, 

మంత్రపూతంగా శక్తిని ఒక ప్రదేశంలో నిక్షిప్తం చేసి, దాన్ని గుడి అంటున్నాం. అదే గుడి మన 

హృదయంలో కడితే, అమ్మ మన గుండెలో నిండిపోదూ, ఉండిపోదూ. ఆ గుడిని ఎవరూ ధ్వంసం 

చేయలేరు. మన పంచాయతనం మనతోనే అని చెప్పుకున్నాం కదా. 

మన ఆలయం మన లోనే, మన దేవత మన తోనే. 


183. నిష్పరిగ్రహా  

ఆ రాజరాజేశ్వరికి ఏ కోరికా లేదు కదా, కనుక ఆ తల్లికి ఏమీ స్వీకరించవలసిన అవసరం లేదు. 

నిష్పరిగ్రహా అంటే ఏమీ స్వీకరించనిది, ఏ పరిజనమూ లేనిది, ఏ పరివారమూ, ఏ కుటుంబమూ 

లేనిది అని అర్ధం. నిజమే కదా, సమస్తమూ ఆ తల్లే అయితే, ఆమె కానిదెవరు.  

ఇక ఆమెకు పరిజనమూ, పరివారమూ ఎక్కడివి. ఆ తల్లి ఏమైనా ఎవరి నుంచి స్వీకరిస్తుంది. 

గుణాతీత కదా, ఇక పరిగ్రహము అనే గుణం ఎలా వుంటుందీ. 

ఆ తల్లి పరిపూర్ణ, నిండు కుండ, ఆమెకు లేనిదేమిటీ. 

అన్నీ తానే అందరికీ ఇచ్చే అమ్మ పరిగ్రహము చేయదు కదా.  

ఇవ్వటం అనేది అమ్మ నిరంతరమూ చేస్తుంది. అమ్మ వలె, ఇవ్వటం నేర్చుకుంటే 

పరిపూర్ణత్వం లభిస్తుంది. ఉపాసకులకు ఈ పరిపూర్ణత్వమే గమ్యం కావాలి. 

ఎప్పుడూ ప్రదానమే కానీ, పరిగ్రహము చేయని, ఆ నిష్పరిగ్రహ కు వందనం. 

ఓం శ్రీ నిష్పరిగ్రహాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


1 కామెంట్‌: