భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ॥ 42 ॥
118. భక్తిప్రియా
భక్తి అంటే ఇష్టము కలది. భక్తి అంటే ప్రీతి కలది. భక్తుల పట్ల ప్రేమను చూపునది.
భక్తిగా తనను సేవించేవారికి ఇష్టార్ధములు ఇచ్చునది.
నిరంతరమూ నామస్మరణ చేసే నారదుడు నవవిధ భక్తి మార్గాలను భక్తిసూత్రాలు అని చెప్పాడు.
అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం,
ఆత్మనివేదనం. ఈ నారద భక్తి సూత్రాలను తల్లి గర్భములో వున్నప్పుడే, విన్న ప్రహ్లాదుడు
తాను పాటించి, తన తోటివారందరికీ కూడా బోధించాడు.
ఆ జగజ్జనని తన భక్తులు ఏ మార్గంలో భక్తిని చూపినా ఇష్టపడుతుంది.
భక్తితో మన హృదయకుసుమాన్ని అర్పిస్తే అంతకన్నా మించింది ఏమిటి.
భక్తులు చూపుతున్న భక్తికి సంతృప్తి చెందుతున్న, ఆ భక్తిప్రియ కు వందనం.
ఓం శ్రీ భక్తిప్రియాయై నమః
ఓం శ్రీ భక్తిగమ్యాయై నమః
120. భక్తివశ్యా
భక్తికి వశమయ్యేది ఆ పరమేశ్వరి. భక్తితో పత్రం, ఫలం, పుష్పం, తోయం(జలం),
దేన్ని ఇచ్చినా అంకితభావంతో ఇస్తే, దానిని ప్రేమతో స్వీకరించేది ఆ తల్లి.
యశోద వాత్సల్య భక్తితో రోటికి కట్టివేసినా బద్ధుడయ్యాడు కృష్ణుడు.
అచంచలమైన భక్తి ఆ లలితా పరమేశ్వరిని కూడా మనకు స్వాధీనం చేస్తుంది.
భక్తికి తప్ప మరి దేనికీ లొంగను అని ఆ తల్లే స్వయముగా చెప్తున్నది.
భక్తి ధర్మ మార్గములో ఉంటే, ఆ జగదాంబ కరుణించి కోరిన వరములు ఇస్తుంది.
అన్నీ ఆ జగదీశ్వరియే అని నమ్మి భక్తితో కొలిచే భక్తులకు వశమయ్యే, ఆ భక్తివశ్య కు వందనం.
ఓం శ్రీ భక్తివశ్యాయై నమః
121. భయాపహా
భయములను తొలగించే తల్లి అని ఈ నామానికి అర్ధం.
జీవన్ముక్తి కావాలంటే, భయము నుంచి కూడా విముక్తులు కావాలి.
నీరు, నిప్పు, గాలి, పాము, మొసలి, దొంగలు, సంసారము, అరణ్యము, ఒంటరితనము
వంటి ఎన్నో భయాలు జీవుడిని వెన్నంటుతూ ఉంటాయి.
ఈ భయాల నుంచి విముక్తులం కావాలంటే, ఆ జగజ్జనని అండ ముఖ్యం.
ఎందుకంటే ఆమె భయాపహా, అంటే భయములను పోగొట్టే అభయమూర్తి.
అభయహస్తంతో, మన భయాలను గోటితో త్రుంచివేసే ఆ భయాపహ కు వందనం.
ఓం శ్రీ భయాపహాయై నమః
122. శాంభవీ
శంభుని పత్ని శాంభవి. శాంభవీ దీక్షాధారులకు తల్లి.
స్వయముగా తానే ఆ శాంభవీ దీక్షా స్వరూపిణి.
అందుకే అమ్మను ఈ నామంలో శాంభవీ అంటున్నాం.
శాంభవి అంటే శమమును, శాంతిని ఇచ్చే శక్తి.
ఎనిమిది సంవత్సరముల కన్యను కూడా శాంభవీ అంటాం.
చిన్న వయసు ఆడపిల్లలను అమ్మవారిగా భావించి పూజ చేసే సంప్రదాయం
మన సనాతన ధర్మములో వున్నది. ఈ పూజను కుమారీ పూజ అంటారు.
ఈ నాటికీ ఈ కుమారీ పూజ, నేపాల్ లోని కుమారీ పీఠంలో ఎంతో భక్తితో చేస్తూ వుంటారు.
మనదేశంలో కూడా ఇప్పటికీ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ ఆచారము వుంది.
శక్తిపూజలో భాగంగా శాంభవీ పూజను కూడా చేస్తారు. చిన్నవయసు ఆడపిల్లలను దేవతగా
భావించి పూజించటం, వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదము తీసుకోవటమే శాంభవీ పూజ.
కన్నులు తెరచి కూడా, అంతర్ముఖులై వుండే ముద్రను శాంభవీ ముద్ర అంటారు.
శాంభవీ స్వరూపిణి అయిన అమ్మ, ఆ శాంభవి కి వందనం.
ఓం శ్రీ శాంభవ్యై నమః
123. శారదారాధ్యా
శారదారాధ్యా అంటే శారద చేత ఆరాధింపబడుతున్న అమ్మ అని అర్ధం.
శారద అంటే సరస్వతి, శారద అంటే ఋతువు, శారద అంటే సంవత్సర ఆరంభం,
శారద అంటే ప్రతిభ. శారద అంటే పండిత సమూహం. శారద అంటే వాక్కు.
ఇలా శారద అనే పదానికి అర్ధాలు ఎన్నెన్నో. ఈ శారదల చేత పూజింపబడుతున్నది లలితమ్మ.
అమ్మని శరదృతువులో, అంటే శరన్నవరాత్రులలో పూజించాలి.
సంవత్సర ఆరంభంలో వచ్చే వసంత నవరాత్రులలో పూజించాలి.
అమ్మ సరస్వతీ ప్రసన్నులైన ప్రతిభ గల పండితుల చేత ఆరాధింపబడుతున్నది.
ప్రతిభకు పట్టము కట్టేది శారదాపీఠము. ఆ శారదా పీఠము నేటి కాశ్మీరములో వున్నది.
ఆ శారదా పీఠములో పండిత సమూహము చేత పూజలందుకుంటున్న తల్లి లలిత.
ఇన్నెందుకు, స్వయముగా ఆ సరస్వతీ దేవే ఆ లలితాదేవి భక్తురాలు.
తన కచ్చపిపై అమ్మను కీర్తిస్తూ, గానము చేస్తూ ఉంటుంది.
అమ్మను వాక్కుతో కీర్తించండి. గానంతో భజించండి. రచనలతో ఆరాధించండి.
శారదల చేత ఆరాధింపబడుతున్న ఆ శారదారాధ్య కు వందనం.
ఓం శ్రీ శారదారాధ్యాయై నమః
124. శర్వాణీ
ఓం శ్రీ శర్వాణ్యై నమః
125. శర్మదాయినీ
ఓం శ్రీ శర్మదాయిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి