భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా
భద్రప్రియా, భద్రమూర్తిః, భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥
112. భవానీ
ఇప్పటివరకు ఆ లలితా పరమేశ్వరి స్థూల రూపము గురించి, ఆ తల్లి జీవుడిని
ఎలా ఉద్ధరించిందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తల్లికున్న నామాలను గురించి,
ఆ నామాల అర్ధం, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
భవుడు అంటే శివుడు, భవుని పత్ని కనుక ఈమె భవాని.
మన్మధుని ప్రాణదాత కనుక ఈమె భవాని.
భవము అంటే సంసారము, ఈ భవబంధాల నుంచి తరింప చేసేది కనుక ఈమె భవాని.
భవము అంటే నీరు. జీవనాధారమైన నీటిని అందిస్తోంది కనుక ఈమె భవాని.
ఈ నామంలో ఆ రాజరాజేశ్వరిని భవానీ అని పిలుస్తున్నాము.
ఆకాశజలము నుండి అనంతమైన నీటి బిందువులచే, ఈ సంసారమును సృష్టించి,
పోషిస్తున్న శక్తి భవాని. ఈ సంసార సాగరం దాటాలంటే, భవాని కరుణ కావాలి.
సంసారము అంటే, కేవలమూ భార్య, భర్త, పిల్లలు, బంధువులు అనుకోకండి.
మన చుట్టూ వున్న సమస్త సృష్టీ సంసారమే. ఆమె ఇచ్ఛ చేతనే ఇవి అన్నీ సృష్టింపబడతాయి.
ఏది చూసిన అమ్మ సృష్టే కదా, అన్నీ బావుంటాయి, అన్నీ నచ్చుతాయి, అన్నీ కావాలనిపిస్తాయి.
అవి మన చుట్టూ మనకే తెలియని బంధాలని బలంగా పేనుతాయి.
ఆ భవబంధాల నుంచి శాంతంగా విడివడటానికి ఈ భవాని కృప కావాలి.
తనను భక్తితో శరణు వేడిన అందరినీ భవసాగరం దాటిస్తున్న ఆ భవాని కి వందనం.
ఓం శ్రీ భవాన్యై నమః
ఓం శ్రీ భావనాగమ్యాయై నమః
114. భవారణ్య కుఠారికా
సంసారబంధాలు ఎంత గట్టిగా పట్టుకుంటాయో తెలుసు గదా,
ఆ కట్లు తెంపాలంటే పదునైన గండ్రగొడ్డళ్ళు కావాలి.
మనచుట్టూ, మనకే తెలిసీ తెలియక అల్లుకున్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం,
మత్సరం వంటి దృఢంగా పెనవేసుకుని పోయి వున్న లతలని నరకాలంటే తేలికైన పని కాదు.
మనం అమ్మకి శరణాగతులమైతే, ఆ భవారణ్యకుఠారిక, మనపై కరుణతో, తానే స్వయముగా
ఆ గండ్రగొడ్డలియై, ఆ అరణ్యాన్ని ఛేదిస్తుంది.
భవారణ్యములో, అంటే సంసారపు కారడవిలో, విపరీతంగా, విచ్చలవిడిగా పెరిగిన
ఆ మహా వృక్షాలను నరకటానికి గండ్ర గొడ్డళ్లు కావాలి. లేకపోతే అవి నరకబడవు.
నిజానికి ఈ కారడవిని సృష్టించిందీ ఆ తల్లే, దానిని నరికి మనలను రక్షించేదీ ఆ తల్లే.
అంతా ఆ మహామాయ లీల, ఇచ్ఛ, విలాసము.
మనలను ఈ సంసారం అనే అరణ్యము నుంచి విముక్తులను చేయటానికి గండ్రగొడ్డలియై,
ఆ అరణ్యమును నరికి మనలను ఉద్ధరిస్తున్న, ఆ భవారణ్యకుఠారిక కి వందనం.
ఓం శ్రీ భవారణ్యకుఠారికాయై నమః
115. భద్రప్రియా
భద్రము అంటే శుభము, మంగళము అని అర్ధం. అమ్మ భద్రప్రియ,
అంటే ఎల్లప్పుడూ మంగళకార్యములే ఇష్టపడునది. శుభమే కోరుకునేది.
అంతే కాదు, ఒకరకం ఏనుగులను భద్రగజము అంటాం. అమ్మకు ఆ భద్రగజములంటే మక్కువ.
అమ్మకి శుభాల మీద, శుభ సంకేతాల మీద, శుభ కార్యాల మీదా మక్కువ ఎక్కువ.
మంగళకరమైన అన్ని వస్తువులూ ఆ పరమేశ్వరికి ఇష్టం. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు,
పళ్ళు, తాంబూలం, అలంకరణ, అన్నీ ఆ ఆదిపరాశక్తికి ఎంతో ఇష్టం.
ఆ మహాదేవి మన ఇంటికి రావాలంటే, ఈ మంగళప్రదమైన సంబారాలు ఇంట్లో సమకూరిస్తే,
ఎంతో ఇష్టంగా, సంతోషంగా, శుభకరంగా మన ఇంట అడుగిడుతుంది.
ఒక్కసారి ఆ రాజరాజేశ్వరిని దర్పముగా భద్రగజము మీద మన ఇంటికి వస్తున్నట్టు మనసులో
ఊహించండి. ఎంత ఆనందం కలుగుతుందో.
మంగళము చేకూర్చే, ఆ భద్రప్రియ కు వందనం.
ఓం శ్రీ భద్రప్రియాయై నమః
116. భద్రమూర్తిః
అందరికీ భద్రాన్ని కోరే భద్రమూర్తి ఆ జగజ్జనని. ఆ తల్లే స్వయముగా భద్రమూర్తి.
అందమైన తల్లి, సుశోభితమైన ముఖము కలది, మంగళరూపిణి.
సౌందర్యాన్ని ఇనుమడింపచేసే, సమస్త ఆభరణములనూ ధరించి, ప్రసన్నంగా వున్న తల్లి.
ఆమె రూపము, సౌందర్యము, అలంకరణము, చిరునగవు, అన్నీ మంగళకరముగా ఉంటాయి.
ఆ అమ్మ మంగళాకారమును మనస్సులో దర్శించండి. ఆ అమ్మ చల్లని చూపుని, ఆ కొనగంటి
వీక్షణనూ, ఆ అపార కరుణామూర్తినీ మనసారా చూడండి. ఆమే భద్రమూర్తి.
శరణన్న వారందరకూ మంగళాన్నీ, అభయాన్నీ, భద్రాన్నీ ఇచ్చే, ఆ భద్రమూర్తి కి వందనం.
ఓం శ్రీ భద్రమూర్త్యై నమః
117. భక్తసౌభాగ్యదాయినీ
భక్తులకు సౌభాగ్యాన్నిచ్చే చల్లని తల్లి అని ఈ నామార్ధం.
సౌభాగ్యము అంటే ఇంద్రియ నిగ్రహం, సంపద, కీర్తి, కామము, వీర్యము, మొదలైనవి.
కానీ ఎంత సౌభాగ్యమున్నా, అది ధర్మ మార్గము నుంచి మాత్రమే రావాలి.
అప్పుడే ఆ సౌభాగ్యము అమ్మ ప్రసాదమవుతుంది. దానికి ఆ తల్లి రక్షణ ఉంటుంది.
అధర్మంగా సంపాదించినవేవీ స్థిరము కావు. అట్టి భాగ్యము కొద్దిరోజుల ముచ్చట మాత్రమే.
అసలైన సౌభాగ్యము ఆ కరుణామూర్తిని చేరుకోగలగటమే. దానికి ఉపాసనను మించిన మార్గము
మరొకటి లేదు. అమ్మ మీకు సకల సౌభాగ్యములనూ ఇస్తున్నట్టు మనసులో భావించండి.
సౌభాగ్యాన్నిచ్చే వస్తువులను మనకు ప్రసాదిస్తున్న జగదంబ, ఆ భక్తసౌభాగ్యదాయిని కి వందనం.
ఓం శ్రీ భక్తసౌభాగ్యదాయిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి