9, సెప్టెంబర్ 2021, గురువారం

48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ నిస్సంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ

నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ 
నిస్సంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ ॥ 48 ॥

168. నిష్క్రోధా 

నిష్క్రోధా అంటే, క్రోధము, కోపము లేనిది. అమ్మవారికి అందరూ సమానమే, 

ఎవరిమీద కోపము చూపిస్తుంది, కనుక, ఆ తల్లి నిష్క్రోధ, క్రోధమే లేనిది. 

తాను సృజించిన ఏ గుణమునకూ, ఏ లక్షణమునకూ ఆ దేవి లోబడదు. 

మానవులను, దానవులను, దేవతలను కూడా ఈ అరిషడ్వర్గములు బాధిస్తూనే ఉంటాయి. 

అంతఃశత్రువులైన ఈ ఆరూ లోపల చేరి, ఎప్పుడు అవకాశము వున్నా, తమ శక్తిని చూపించి 

జీవుడిని ప్రభావితుడిని చేస్తూ ఉంటాయి. కానీ కాత్యాయని మాత్రం వీటికి లొంగదు. 

సంతానము తప్పు దారి పట్టినప్పుడు, తల్లి కోపము చూపించి వారిని దారికి తెస్తుంది. 

అది పిల్లల బాగు కోరి చూపించే కోపమే కానీ, నిజముగా తల్లికి పిల్లలపై వున్న క్రోధము కాదు. 

ఎందుకంటే, తల్లి ఎప్పుడూ పిల్లల బాగు కోరేదే కానీ, క్రోధముతోనో, ద్వేషముతోనో 

వారిని శిక్షించాలనుకునేది కాదు. శ్రీమాత మన అందరికీ మాత. 

ఇక ఆ అమ్మలగన్నయమ్మకు క్రోధము లేనే లేదు.  

కనుక ఆ తల్లిని నిష్క్రోధా అంటున్నాము. క్రోధము లేని ఆ నిష్క్రోధ కు వందనం. 

ఓం శ్రీ నిష్క్రోధాయై నమః 


169. క్రోధశమనీ 

ఆ శ్రీదేవికి క్రోధము లేకపోవటమే కాదు, ఆ క్రోధానికి ఔషధం కూడా తిరిగి ఆ శ్రీదేవియే. 

అందుకే ఆ కారుణ్యమూర్తి క్రోధశమని. క్రోధాన్ని శమింపచేసేది కనుక ఆ తల్లి క్రోధశమని. 

క్రోధముతో ఉన్నవాడు ఏ పుణ్యకార్యము, ఏ దేవకార్యము చేసినా ఈ క్రోధము, ఆ ఫలమును 

అందుకోకుండా అడ్డు పడుతుంది. కనుక చేసిన పుణ్యకార్యాల వలన పుణ్యబలం పెరగాలంటే,

ముందుగా క్రోధాన్ని వీడాలి. దానికి దేవీ పూజ ఒక్కటే సాధనము. 

అప్పుడు ఆ దుర్గాదేవి కోపమును శమింపచేసి, జీవుడిని శాంతుడిని చేస్తుంది. 

భక్తుల క్రోధమును శమింపచేసి, శమమును, శాంతమును ఇచ్చే, ఆ క్రోధశమని కి వందనం. 

ఓం శ్రీ క్రోధశమన్యై నమః 

 

170. నిర్లోభా 

అరిషడ్వర్గాలలో మొదటిది కామము, రెండవది క్రోధము. మూడవది లోభము. 

అన్నీ నాకే కావాలనే పేరాశే ఈ లోభము. పిసినారితనం, కక్కుర్తి కూడా ఈ లోభము రూపాలే. 

విలువైన అన్నీ తమకే కావాలనుకునే స్వభావం లోభము. 

జీవుడు లోభానికి లొంగితే, ఆ అంతఃశత్రువు చేతిలో ఓడిపోయినట్లే. 

అమ్మవారికి లోభము లేదు. ముందే చెప్పుకున్నాం కదా, తాను సృషించిన దేనికీ ఆ అమ్మ 

లోబడదు అని. కామము, క్రోధము, మోహము, మదము లేని ఆ లలిత లోభానికి కూడా లొంగదు. 

ఆ తల్లిది గొప్ప ఔదార్యబుద్ధి. లోభానికి మందు ఔదార్యమే. 

దానగుణం పెరిగితే, లోభం మాయమవుతుంది. ఆశకు అంతు అంటూ ఉండదు. 

ఆ జగజ్జననికి ఆశ లేదు, లోభం లేదు. భక్తులపై కరుణ వున్నది. 

భక్తులకు కావలసినది ఎటువంటి లోభమూ లేకుండా ఇచ్చే అమ్మ కనుక ఈ తల్లి నిర్లోభా. 

భక్తుల పట్ల ఔదార్యమే కానీ, లోభము లేని, ఆ నిర్లోభ కు వందనం. 

ఓం శ్రీ నిర్లోభాయై నమః 

 

171. లోభనాశినీ 

లోభము వుంది. దానిని నాశము చేసే ఔషధమూ వుంది. భయమెందుకు, ఆ అమ్మ కాళ్ళు 

పట్టుకోవడమే. జీవుడి లోభాన్ని తీసివేసే ఆ తల్లిని లోభనాశినీ అని పిలుస్తున్నాం. 

ఎవరికి ఏ విషయమందు లోభమో, ఆ విషయమును తొలగించుట ఆ తల్లి పని. 

కొందరికి సంపదలపై లోభము, కొందరికి పదవులపై లోభము, మరి కొందరికి కీర్తి అంటే లోభము. 

కొందరికి కుటుంబమంటే లోభము. ఇలా ఎంతమందినో చూస్తూనే ఉంటాం.   

ఈ వస్తువులన్నీ సృష్టించినది ఆ దుర్గాదేవే, వీటిని సృష్టించి తన పిల్లలకు ఇస్తోంది. 

పిల్లలు అమ్మ ప్రసాదమయిన వీటిని, నలుగురితో పంచుకోకుండా, లోభంతో దాచేసుకుంటే, 

అమ్మ తిరిగి రంగప్రవేశం చేసి, ఎవరికి ఏది ఇష్టమో, దాన్ని తీసేసుకుంటుంది. 

ఆశించినది, దాచుకున్నది చేజారినపుడు, వైరాగ్యము వస్తుంది. 

అందువలన జీవుడు ఉద్ధరింపబడతాడు. దేవేంద్రాదులు సైతము లోభమునకు లోబడినట్లు 

పురాణాలు చెప్తున్నాయి. ఇక మానవుడనగా ఎంత. కానీ మనకు ఏమి దక్కినా, 

దానిని ఆ దుర్గమ్మ ఇచ్చిన ప్రసాదంగా భావిస్తే, ఆ వస్తువు మీద లోభము పెరగదు. 

ఆ శ్రీదేవి ఆరాధన చేసిన భక్తులను, ఆ జగదంబ తల్లి కనుక, వారి లోభ కారణమయిన 

వాటిని తొలగించి ఆ లోభనాశము చేస్తుంది. అట్టి దయా స్వరూప, ఆ లోభనాశిని కి వందనం. 

ఓం శ్రీ లోభనాశిన్యై నమః 

 

172. నిస్సంశయా 

సంశయములే లేనిది నిస్సంశయా. ఆ పరమేశ్వరిని ఈ నామములో నిస్సంశయా అని 

పిలుస్తున్నాము. ఆ తల్లికి ఏమి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే 

ఏ విషయం లోనూ ఎటువంటి సంశయము లేదు. అందుకే ఆ తల్లి నిస్సంశయా. 

తంత్రరాజము అనే గ్రంథములో గురువు అంటే, సంశయములు లేనివాడు, 

సంశయములు తీర్చేవాడు అని చెప్పారు. 

అసలైన గురువు ముఖ్యలక్షణం సంశయాలు లేకుండా ఉండటం, సంశయాలను తీర్చటం. 

శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో, 'సంశయాత్మా వినశ్యతి'  అని చెప్పాడు. 

అంటే సంశయాత్ములు నశింతురు అని. మన సంశయమే మనల్ని పతనం చేస్తుంది. 

అంతేకాక, ఆ గీత లోనే, 'న సుఖం సంశయాత్మనః' అని కూడా చెప్పాడు. 

అంటే, సంశయాత్మునికి సుఖము లేదు అని. నిజమే కదా, లోపల నుంచి సందేహాలు 

పీడిస్తూ ఉంటే, సుఖమెక్కడ. శ్రీకృష్ణుడే శ్రీమాత. పరిపూర్ణ జ్ఞాని. 

విశ్వాసము వున్న చోట సంశయం ఉండదు. కనుక సంశయం పోవాలంటే, 

అమ్మను ధ్యానించండి. ఎందుకంటే, అమ్మ నిస్సంశయ. 

సృష్టి, స్థితి, లయ కార్యములలో ఎటువంటి సంశయమూ లేని, ఆ నిస్సంశయ కు వందనం. 

ఓం శ్రీ నిస్సంశయాయై నమః 

 

173. సంశయఘ్నీ 

సంశయములను తీర్చే శక్తి సంశయఘ్నీ. అమ్మను ధ్యానిస్తే ఎట్టి సంశయములైనా నశిస్తాయి. 

ఆ లలితాపరమేశ్వరి శుద్ధజ్ఞాని. ఎవరైతే ఆ శ్రీదేవిని శ్రద్ధతో ధ్యానిస్తారో, 

వారి సంశయములు చేధింపబడతాయి అనిశ్రుతులు, స్మృతులు  చెప్పాయి. 

శ్రీదేవిని ధ్యానిస్తే సంశయములు తీరతాయి. జీవుడు సుఖముగా జీవనం కొనసాగించవచ్చు. 

సంశయములు తీర్చగలిగేది ఇద్దరు, శుద్ధజ్ఞాన సంపన్నుడైన గురువు, 

తానే శుద్ధజ్ఞాన స్వరూపమయిన ఆ లలితా పరమేశ్వరి. 

భక్తుల సంశయాలను తీర్చి వారికి జ్ఞానము, సుఖము ప్రసాదించే, ఆ సంశయఘ్ని కి వందనం. 

ఓం శ్రీ సంశయఘ్న్యై నమః 


174. నిర్భవా 

భవము అంటే, పుట్టుక. భవము అంటే సంసారం. భవము అంటే ప్రపంచం. 

అమ్మ ఆదిమధ్యాంతరహిత. ఆ తల్లికి ఆది, మధ్యము, అంతము లేవు. 

జనన మరణ చక్రమును నడిపించేది ఆ లలితయే కనుక, ఆ తల్లి ఈ చక్రములో చిక్కుకోదు. 

పుట్టుక, మరణము అనేవి దేహానికే కానీ, దేహికి లేవని జ్ఞానులకు తెలుసు. 

అజ్ఞానులకూ అంతే, కానీ వారికి దేహము, దేహి వేరు అనే జ్ఞానము ఉండదు. 

స్థూల దేహము పడిపోతే సూక్ష్మ దేహముంటుంది, అదీ పడిపోతే, కారణ దేహముంటుంది. 

అదీ పడిపోతే శుద్ధ చైతన్యము ఉంటుంది. శుద్ధచైతన్యము శాశ్వతము. 

జ్ఞానులూ, అజ్ఞానులూ అందరూ శాశ్వతులే. 

లలితాదేవి పరమాత్మ స్వరూపురాలు, ఆమెకు పుట్టుక లేదు. ఆ తల్లి నిర్భవ. 

చిదగ్నికుండంలో నుంచి కూడా ఆవిర్భవించింది అన్నాం కానీ, పుట్టింది అనలేదు. 

ఆ శక్తి ఎక్కడ అవసరమైతే అక్కడ ఆవిర్భవించి, చేయవలసిన కార్యములు చేస్తుంది. 

ఆ శక్తి ఎక్కడెక్కడ ప్రకటితమయిందో, ఆయా ప్రదేశాలలో ఆ శక్తికి గుర్తుగా ఆలయాలను 

నిర్మించి ఆ తల్లిని పూజించుకుంటున్నాం. శక్తికి జననమరణాలు లేవు. 

ప్రళయకాలమందు కూడా స్థిరముగా వుండే శక్తి ఈ లలితాపరమేశ్వరి, ఈ రాజరాజేశ్వరి. 

ఆమెను నిత్యముక్త అని చెప్పుకున్నాం కదా. అటువంటి పుట్టుకే లేని, ఆ నిర్భవ కు వందనం. 

ఓం శ్రీ నిర్భవాయై నమః 


175. భవనాశినీ 

సంసార బంధములను త్రుంచి జ్ఞానమును కలుగచేయునది భవనాశిని. 

ప్రపంచపు బాధలను పోగొట్టి, సుఖమునూ, శాంతినీ ఇచ్చేది భవనాశిని. 

జననమరణ బాధలు తెలియకుండా జ్ఞానమును ఇచ్చేది భవనాశిని. 

జ్ఞానులను ఈ చావు పుట్టుకలు బాధించకుండా చూసేది భవనాశిని. 

దేహానికి ఆయుర్దాయమున్నది కానీ దేహికి కాదు. కనుక దేహమెన్నిసార్లు నశించినా 

దేహికి మరల మరియొక దేహము వస్తుంది. శరీరము లేకపోతే ధర్మకార్యములు ఎలా చేస్తామూ. 

శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అని కదా అన్నారు. 

ధర్మసాధనకు ఈ శరీరమే మొదటి ఉపకరణము. శరీరము లేకపోతే ధర్మకార్యములు చేయలేము. 
 
ధర్మసాధన అనే యజ్ఞానికి నిశ్చయముగా, శరీరమే ఆజ్యము (నెయ్యి) అని కూడా భావము. 

దేహికి పై తొడుగు వలె, ధరించిన దుస్తుల వలె శరీరము పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది.  

ధర్మసాధన జరుగవలసిందే కదా. ఈ సత్యము తెలిస్తే, భవబంధాలు, భవబాధలు వుండవు. 

విశ్వాసముతో ఆ దుర్గాదేవిని సేవించిన వారికి, అటూ ఇటూ పది తరముల వరకూ 

సంసారబాధలు వుండవు అని శక్తిరహస్యమనే గ్రంథము చెపుతోంది. 

తనను నమ్మి కొలిచేవారి భవబాధలను నాశము చేసే, ఆ భవనాశిని కి వందనం. 

ఓం శ్రీ భవనాశిన్యై నమః  



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి