30, సెప్టెంబర్ 2021, గురువారం

69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ అంబికా, అనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా

పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ 
అంబికా, అనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥

291. పురుషార్థప్రదా

పురుషార్థాలు నాలుగు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగింటిలో కామార్థములను

ధర్మమార్గము ద్వారా పొందాలి. మొదటి మూడూ సిద్ధించిన తరువాతే నాలుగవది యైన మోక్షము 

కలుగుతుంది. జీవుడు కామార్థములను ధర్మపరంగా, తృప్తికరంగా పొందినపుడే మోక్షమునకు 

దారి సుగమం అవుతుంది. ఈ నాలుగు పురుషార్థాలనూ ఇచ్చేవాడిని రుద్రుడు అంటారు. 

రుద్రుడికి ఈ పురుషార్థములనిచ్చే శక్తి త్రిపురసుందరి. 

త్రిపురసుందరి అనుగ్రహము లేనిదే ఈ పురుషార్థములు ప్రసాదింపబడవు. 

కనుక త్రిపురసుందరీ ఆరాధన పురుషుడికి(జీవుడికి) తప్పనిసరి. 

ఏదో ఒక రూపములో, ఈ ఆరాధన చేయనివారికి ఈ పురుషార్థములేవీ ప్రాప్తించవు. 

భగవంతుడు భగవద్గీతలో కూడా ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని, 

ఈ నలుగురికి కూడా ఎవరు కోరినది వారికి ఇస్తానని చెప్పాడు. 

ఈ నాలుగు విధముల పురుషార్థములను భక్తులకు ఇచ్చు దేవి కనుక 

ఈ శక్తిని పురుషార్థప్రదా అంటున్నాం. ఆ పురుషార్థప్రద కు  వందనం. 

ఓం శ్రీ పురుషార్థప్రదాయై నమః  


292. పూర్ణా

పూర్ణా అంటే పరిపూర్ణమైన స్వరూపము అని భావం. ఎంతో విస్తృతమైనది అని అర్ధం. 

పూర్ణా అంటే శుక్ల చతుర్దశీ రాత్రి. ఆనాటి రాత్రి చంద్రుని కళ పరిపూర్ణం. 

పూర్ణా అంటే పంచదశీ తిథీ స్వరూపురాలు. అందుకే ఆ దినాన్ని పూర్ణిమ, పౌర్ణమి అంటాం. 

పూర్ణా అంటే కాలడిలో పారే పూర్ణా నది. ఈ నదే శంకరాచార్యుని ప్రార్థన మేరకు 

ఆతని తల్లి ఆర్యాంబ సౌకర్యార్ధం తన నదీ మార్గాన్ని మార్చింది. 

పూర్ణా అంటే పరిపూర్ణురాలు. ఈశ ఉపనిషత్ లో చెపుతారు. భగవంతుడు పరిపూర్ణం. 

సృష్టి పరిపూర్ణం. ఆ పూర్ణుడైన శక్తి నుంచి పూర్ణమైన జగత్తు ప్రభవించింది అని. 

అయినా భగవంతుడి పరిపూర్ణత్వమూ తగ్గలేదు, సృష్టి పరిపూర్ణత్వానికీ లోపము లేదు. 

పూర్ణము నుంచి పూర్ణమే ఉద్భవించినా, ఆ శక్తీ, ఈ సృష్టీ రెండూ వేటికవే పరిపూర్ణమే. 

వెలుగుతున్న దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. 

అయినా అన్ని దీపాలూ కాంతినిస్తూ వెలుగుతూనే ఉంటాయి. 

అదేవిధంగా పూర్ణము అయిన అమ్మ శక్తి నుంచి, పూర్ణము అయిన జగత్తు వచ్చింది. 

పూర్ణులైన పురుషులు వచ్చారు.

ప్రళయకాలంలో అన్నీ అమ్మలో లయించిన తరువాత, తిరిగి పూర్ణులను అమ్మ సృష్టిస్తుంది. 

కనపడేదే పూర్ణము, కనపడనిది శూన్యము కాదు. 

కనపడని శక్తిని కూడా దర్శించినప్పుడే ఆ దర్శనం పూర్ణం. 

పూర్ణ అనే నామానికి ఇన్ని రకాల అర్ధాలున్నాయి. 

ఆ పరిపూర్ణస్వరూప యైన, పూర్ణ కు వందనం. 

ఓం శ్రీ పూర్ణాయై నమః  


293. భోగినీ

భోగినీ అంటే భోగమును, సుఖమును పొందినది, ఇచ్చునది అని అర్ధం. 

సుఖభోగాలని జంట పదాలుగా వాడుతూ ఉంటాం. అమ్మ అనుగ్రహం వున్నవారికి మాత్రమే 

ఇవి దక్కుతాయి. చాలామందికి ఈ విషయం తెలియక, నాకు ఈ సుఖభోగాలు ఎందుకు దొరకటం 

లేదు అని దుఃఖపడుతూ వుంటారు. సమాధానం ఒకటే, ఇంకా సాధన పూర్ణం కాలేదు. 

భోగము యోగముగా పరివర్తనం చెందితే అది అమ్మ అనుగ్రహము. 

అదే భోగము రోగముగా మారితే, అప్పుడు అమ్మ అనుగ్రహము చాలదు అని భావం. 

శ్రద్ధా, దీక్షలతో, ఆర్తితో, ఆ దేవిని తృప్తి పరచిన ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని, 

ఈ నలుగురూ కూడా, ఆ అమ్మ అనుగ్రహం పొందగలుగుతున్నారు. 

తన అనుగ్రహముచే జీవుడికి సుఖభోగాలను అందిస్తున్న, ఆ భోగిని కి వందనం. 

ఓం శ్రీ భోగిన్యై నమః  


294. భువనేశ్వరీ 

పదునాలుగు భువనాలకూ అధినాయకురాలు కనుక ఈ నామం వచ్చింది. 

ఈ భువనముల సృష్టీ, స్థితీ, లయమూ అన్నీ ఈ భువనేశ్వరీ దేవి ఆధీనము లోనే ఉంటాయి. 

ఈ దేవత భువనేశ్వరీ మంత్ర స్వరూపురాలు. దశమహావిద్యలలో ఒకటి ఈ భువనేశ్వరీ తత్వం. 

భువనానందనాథుడు ఆరాధించిన దేవి కనుక భువనేశ్వరీ అంటున్నాం. 

బ్రహ్మాది దేవతలను దివ్యౌఘము, దేవర్షులను సిద్దౌఘము, భూలోక ఋషులను మానవౌఘము 

అంటాం. భువనానందనాథుడు మానవౌఘములో ఒక గురువు. 

ఈ ఓఘత్రయం ఎప్పుడూ ఆ శ్రీమాత సభలో వుంటూ ఆ శ్రీదేవిని సేవిస్తూ ఉంటుంది.  

భువనములన్నియూ తనలోనే గల, ఆ భువనేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ భువనేశ్వర్యై నమః 

  

295. అంబికా

అంబికా అంటే అమ్మ. అందరికీ అమ్మ. అంబ అన్నా, అంబికా అన్నా, అమ్మా అన్నా ఒకే భావం. 

సకల జగాలకూ, జీవులకూ జగన్మాత. ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తి స్వరూపిణి. 

మార్కండేయ పురాణంలో అంబికను గురించి చెప్తూ, విశ్వేశ్వరీ, జగద్ధాత్రీ, స్థితిసంహారకారిణీ, 

నిద్రా, భగవతీ అన్నారు. అంబిక నిద్రా స్వరూపిణి, సామాన్య జీవులలో అంతర్లీనంగా 

యోగమాయగా ఉంటూ, జీవుడు నారాయణునితో కలసినప్పుడు యోగనిద్రగా మారుతుంది. 

ప్రాణులందరి ఆయుర్దాయములో అర్ధభాగము ఈ నిద్రాదేవి స్వరూపమే. 

ఒక్క నారాయణుడికి తప్ప ఈ నిద్రాదేవి ఆవహించినప్పుడు అందరికీ జ్ఞానం లయిస్తుంది. 

అంబిక రాత్రి స్వరూపిణి. రాత్రివేళలో మహాదేవిగా ఉంటూ, పగటిపూట మహేశ్వరుడిగా 

ఉంటుంది. భారతీ, పృథ్వీ, రుద్రాణీ కూడా ఈ జగదంబికయే. 

ప్రతిజీవి లోనూ వున్న మాతృభావన ఈ అంబికా స్వరూపమే. 

సకల సృష్టికీ జగన్మాత అయిన, ఆ అంబిక కు వందనం. 

ఓం శ్రీ అంబికాయై నమః 


296. అనాది నిధనా

ఆ త్రిపురసుందరికి ఆది మరియు అంతము నిధనమైనవి, అంటే నశించినవి అని అర్ధం. 

ఆది, అంతము రెండూ లేని మహా శక్తి ఈ అనాదినిధనా. ఆ తల్లికి జననమరణములు లేవు. 

మొత్తము మరణ సాధనములు ఎనభై.  తాను మాత్రమూ ఈ మరణసాధనములకు వేటికీ 

కట్టుబడదు. తన భక్తులకు ఈ అడ్డంకులు తొలగించే తల్లి అని కూడా భావము. 

జీవుడు సంపూర్ణ ప్రజ్ఞతో ఉండటమే జీవము. ఏ ఒక్క శక్తి సరిగ్గా పని చేయకపోయినా, 

అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనసు వంటి

అన్నీ కూడా మరణసాధనములే. అన్నీ పని చేస్తేనే ఏ మరణమూ లేనట్టు. 

ఏ విభాగము పనిచేయకపోతే, ఆ విభాగము మరణించినట్టు లెక్క. 

ఆ శ్రీమాతకు ఈ మరణసాధనములన్నీ అధీనములు. 

ఆ తల్లికి ఈ ఆది, అంతములు నశించాయి, కనుకే ఆ తల్లిని అనాదినిధనా అంటున్నాం. 

ఎప్పటికీ జననమరణాలు లేని, ఆ అనాది నిధన కు వందనం. 

ఓం శ్రీ అనాదినిధనాయై నమః 


297. హరిబ్రహ్మేంద్ర సేవితా

దేవతల చేత సేవింపబడేది శ్రీలలిత. హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ 

ఆ శ్రీపురం లోనే ఉంటూ ఆ రాజరాజేశ్వరిని ధ్యానిస్తున్నారు, ఉపాసిస్తున్నారు. 

త్రిమూర్తులు, దిక్పాలకులు, ఆదిత్యులు, మొదలైన దేవతాగణాలన్నీ, ఆ శ్రీమాత ఇచ్ఛ వలన 

ప్రకటింపబడినవారే. సామాన్యులైన జీవులు ఏ దేవతలను ఆశ్రయిస్తూ కొలుస్తున్నారో, 

ఆ దేవతలు స్వయంగా ఆ అఖండ దివ్య తేజోమూర్తి అయిన, లలితాదేవిని ధ్యానిస్తున్నారు. 

కనుక ఆ శ్రీమాతను ఆరాధిస్తే దేవతాగణాలను అన్నింటినీ ఆరాధించినట్లే. 

అందరికీ ఆరాధనామూర్తులైన ఆ హరి, బ్రహ్మ, ఇంద్రాదులచే సేవింపబడుతున్న, 

ఆ హరిబ్రహ్మేంద్ర సేవిత కు వందనం. 

ఓం శ్రీ హరిబ్రహ్మేంద్రసేవితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి