21, సెప్టెంబర్ 2021, మంగళవారం

60. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా

 

చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా 
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥

244. చరాచర జగన్నాథా

ఈ జగత్తు అంతా చరము, అచరము లతో నిండి వున్నది. 

చరము అంటే కదిలేది, దీన్నే జంగమము అంటాం. ఉదాహరణకు పశువులు. 

మానవులు కూడా పశువులే. ఈ పశువులను పాలించేవాడు కనుకే, పరమశివుడిని పశుపతి అన్నాం.  

అచరములంటే కదలలేనివి, స్థిరముగా ఉండేవి. కనుక వాటిని స్థావరములంటారు. 

ఉదాహరణకు చెట్లు, ధాతువులు. ఈ జగత్తంతా స్థావరజంగమములతో నిండి ఉన్నది. 

ఈ స్థావరజంగమములలో ప్రాణము ఈశ్వరుడైతే, ప్రజ్ఞ శక్తి. 

కనుక ఈ జగత్తు నంతా ఆ పార్వతీ పరమేశ్వరులే ప్రాణము, ప్రజ్ఞయై వుండి పాలిస్తున్నారు. 

ఈ చరాచర జగత్తు కంతా  నాథత్వము వహించినది  కనుక  ఆ తల్లిని ఈ నామంతో కీర్తిస్తున్నాం. 

స్థావరజంగమములకు స్వామిని యైన,  ఆ చరాచర జగన్నాథ కు వందనం. 

ఓం శ్రీ చరాచరజగన్నాథాయై నమః  


245. చక్రరాజ నికేతనా

నికేతనమంటే నివాసము, గృహము. ఆ రాజరాజేశ్వరి శ్రీచక్రమనే చక్రరాజ నివాసిని కనుక,

ఆ తల్లిని ఈ నామంలో చక్రరాజ నికేతనా అని అంటున్నాం. 

చక్రరాజమనేది తొమ్మిది ఆవరణలు  గల శ్రీయంత్రం. అవే 

త్రైలోక్యమోహన చక్రం, సర్వాశాపరిపూరకచక్రం, సర్వసంక్షోభణచక్రం, 

సర్వసౌభాగ్యదాయకచక్రం, సర్వార్ధసాధకచక్రం, సర్వరక్షాకరచక్రం, 

సర్వరోగహరచక్రం, సర్వసిద్ధిప్రదచక్రం, సర్వానందమయచక్రం. 

తొమ్మిదవదైన సర్వానందమయచక్రమే బిందువు. 

అమ్మ ఆ బిందువులోనే మహా తేజస్సుతో అలరారుతున్నది. 

తొమ్మిది అనేది అమ్మవారి సంఖ్య. అయ్యవారితో కలిసి పదిగా పూర్ణసంఖ్య అయింది. 

చక్రరాజంలో శివునితో కలిసి నివాసముంటున్న, ఆ చక్రరాజ నికేతన కు వందనం. 

ఓం శ్రీ చక్రరాజనికేతనాయై నమః 

  

246. పార్వతీ

 పర్వతరాజ పుత్రి కనుక పార్వతీ నామం ధరించింది. 

దక్షప్రజాపతి పుత్రికగా దాక్షాయణి అనే నామంతో వున్నది. 

ఆ దేహం అగ్నిలో దహింపబడ్డాక, అమ్మ శంకరునికై తపస్సులో ఉండిపోయింది. 

హిమవంతుడు ఆసమయంలో తపసు చేసి, అమ్మను మెప్పించి, 

తన ఇంట కూతురుగా పుట్టమని వేడుకున్నాడు. అమ్మ కరుణించింది. 

తగిన సమయంలో హిమవంతుడు, మేనకలకు పుత్రికగా పుట్టగలనని వరం ఇచ్చింది. 

కానీ తనను శివుడికి ఇచ్చి వివాహం చేయాలని నిబంధన పెట్టింది. 

హిమవంతుడు ఆ నిబంధనకు ఒప్పుకున్నాడు. 

అదే సమయంలో తారకాసురుని బాధ పడలేని దేవతా గణమంతా ఆ అమ్మను ప్రార్ధించి, 

శివుడిని పెళ్ళాడి, తారకాసురుని సంహరింపగల కుమారుడిని కనమని కోరారు. 

అప్పుడు ఆ లలితపరమేశ్వరి పర్వతరాజైన హిమవంతుడు ఇంట్లో పార్వతిగా పుట్టింది. 

పార్వతిగా పుట్టి, దేవతలు, హిమవంతుడు కోరిన కోరికలు తీర్చిన, ఆ పార్వతి కి వందనం. 

ఓం శ్రీ పార్వత్యై నమః 


247. పద్మనయనా

ఆ శ్రీలలిత పద్మముల వంటి కన్నులు కలది అని ఈ నామానికి అర్ధం. 

శ్రీలలిత కన్నులు కమలాల వలె స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉన్నాయి. 

ఆ కన్నులలో భక్తుల పట్ల ప్రేమ, వాత్సల్యాలు తొణికిసలాడుతూ ఉంటాయి. 

ఆ కన్నులే భక్తులకు ఆనంద కారకాలు, సమ్మోహన కరాలు, మాయ మోహితాలు. 

ఆ కన్నుల మాయలో పడని జీవుడు లేడు. సురాసురులందరూ కూడా ఆ మాయలో మునిగినవారే.

జగన్మోహిని యైన ఈ కమలాక్షి సర్వజగత్తున్నీ తన కనుసన్నలలో వుంచుతున్నది. 

ఆ పద్మనేత్రములే ఉపాసకులని కటాక్షించి ఉద్ధరిస్తూ ఉంటాయి. 

సకలజీవులనూ తన కమలముల వంటి కన్నులతో పర్యవేక్షిస్తున్న, ఆ పద్మనయన కు వందనం. 

ఓం శ్రీ పద్మనయనాయై నమః 


248. పద్మరాగ సమప్రభా

పద్మరాగాలంటే, ఎర్రని మాణిక్యాలు. అవి ఎంతో కాంతితో మెరిసిపోతూ ఉంటాయి. 

అటువంటి మాణిక్య కాంతితో సమానమైన ప్రభలతో వెలుగొందుతున్న తల్లి అని ఈ నామానికి 

భావం. ఎర్రని కుంకుమ పూవు వర్ణముతో మెరిసిపోయే లావణ్యము ఆ రాజరాజేశ్వరిది. 

చెంగలువలనే ఎర్రని తామరపుష్పాల రంగుతో వైభవోపేతముగా తేజరిల్లే శక్తి పరమేశ్వరి. 

అమ్మకు అరుణిమ అంటే ఇష్టం, ఆమె అరుణారుణ అని చెప్పుకున్నాం. 

ఎర్రని రంగుతో, ఎంతో దర్పంతో, కాంతితో వెలిగిపోతున్న, ఆ పద్మరాగ సమప్రభ కు వందనం. 

ఓం శ్రీ పద్మరాగసమప్రభాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి