24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ

సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా 
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥

260. సుప్తా

సుప్తావస్థ అంటే నిద్రావస్థే. జీవుడు నిద్రపోయినప్పుడు, ఆతడి లోపల వుండి నిద్రను 

కలుగచేయు శక్తే సుప్త. జీవుడికి నిద్ర అవసరము. 

నిద్రలో స్థూల దేహము సేద దీరుతుంది, కారణశరీరము మేల్కొంటుంది. 

హాయిగా నిద్ర పోయాను, ఒళ్ళు తెలియలేదు, నాకేమీ తెలియలేదు అంటూ ఉంటాం. 

అంటే నిద్రలో ఏమీ తెలియదనే అజ్ఞానం వస్తోంది. 

ఒళ్ళు తెలియలేదు అంటే, నేను అనే అహం మరుగున పడిపోతోంది. 

'నేను' అనే స్థితి పోయి సుఖంగా నిద్ర పోతున్నాడు జీవుడు. నిద్రలో అహం లయిస్తోంది. 

నిద్రలో ఏమీ తెలియలేదు అంటే, జీవుడిని నిద్రలో అజ్ఞానం అనే మాయ కమ్మేస్తోంది. 

సుప్తావస్థలో కారణశరీరం లేచి స్థూల శరీరం విశ్రమిస్తోంది. దేహానికి సుఖం కలుగుతోంది. 

సుప్తావస్థలో వున్న జీవుడికి ప్రాజ్ఞుడని పేరు. 

సుప్తావస్థ ద్వారా జీవుడిని మాయలో పెడుతున్న, ఆ సుప్త కు  వందనం. 

ఓం శ్రీ సుప్తాయై నమః  


261. ప్రాజ్ఞాత్మికా

జీవుడిలో ప్రజ్ఞారూపముగా వున్నశక్తే ప్రాజ్ఞాత్మిక. 

నిద్ర పోయి లేచిన జీవుడు ప్రజ్ఞలో, ప్రజ్ఞతో మేలుకొంటున్నాడు. 

ఆ మెలకువ, విజ్ఞత రెండూ ఈ ప్రాజ్ఞాత్మిక వల్లనే ఏర్పడుతున్నాయి. 

నిద్రావస్థ లోని అజ్ఞానము నశించి మెలకువ రాగానే ప్రాజ్ఞుడౌతున్నాడు. 

నేను అనే అహం తిరిగి లేస్తుంది. జీవుడి పాండిత్యము, సమర్ధత, జ్ఞానము, 

అన్నీ ప్రజ్ఞ రూపములో బయటకు తెస్తుంది ఈ శక్తి. 

ప్రజ్ఞ రూపములో జీవుడిలో మేల్కొంటున్న, ఆ ప్రాజ్ఞాత్మిక కు వందనం. 

ఓం శ్రీ ప్రాజ్ఞాత్మికాయై నమః  


262. తుర్యా

ఇది తురీయ స్థితిని సూచిస్తుంది. అంటే ఇది నాలుగవ అవస్థ. 

స్వప్న, జాగ్రత్, సుషుప్త అవస్థలు కాక, నాలుగవ అవస్థని తురీయావస్థ అంటాం. 

ఇది శుద్ధ జ్ఞాన స్థితి. దీన్నే బ్రహ్మం అని కూడా అంటాం. 

ఈ అవస్థలో జీవుడు సహస్రారాన్ని చేరి, ఆనంద స్థితిలో ఉంటాడు. 

పై మూడు స్వప్న, జాగ్రత్, సుషుప్త అవస్థలలో జీవుడు కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు.

కానీ తురీయములో అంతఃకరణముల ప్రభావముండదు, కనుక సత్ చిత్ ఆనందములో 

ఉంటాడు. యోగులకి మాత్రమే సాధ్యమయ్యే స్థితి తురీయము. 

ఈ స్థితిని పొందిన యోగికి కర్మఫలములు ఏవీ అంటవు. 

అన్నింటికీ అతీతముగా శుద్ధజ్ఞానమును పొంది ఆత్మలో రమిస్తూ ఉంటాడు. 

సన్యాసాశ్రమములో వున్నవారిని కూడా తురీయాశ్రమంలో వున్నారంటారు. 

యోగులకు తురీయ స్థితిని కలుగచేసే శక్తే తురీయా. తురీయ కు వందనం. 

ఓం శ్రీ తుర్యాయై నమః  


263. సర్వావస్థా వివర్జితా

ఈ చెప్పిన అవస్థలన్నీ, స్వప్న జాగ్రత్, సుషుప్త, తురీయాలు జీవులకే. 

ఈ నాలుగూ కాక అయిదవ అవస్థ కూడా మరియొకటి వున్నది, అది తురీయాతీత అవస్థ. 

ఇటువంటి ఎన్నో అవస్థలనన్నీ కలుపుకుని సర్వావస్థా అని ఈ నామంలో అన్నారు. 

తురీయాతీత స్థితిని పొందిన యోగికి శరీరము ఒక సాధనమే కానీ బంధనము కాదు. 

ఆ తురీయాతీత స్థితిని పొందినవారు, ఏదో ఒక కార్యార్థము కొరకు మాత్రమే తిరిగి శరీరం 

తీసుకుంటారు.  

అట్టి యోగులు శివపూజే వ్రతముగా, శివ ప్రవచనమే జపముగా, ఉపదేశమే దానముగా జీవిస్తారు. 

వారిని గుర్తించడానికి వ్రత, జప, దానమనే ఈ మూడు లక్షణములే ఆధారము. 

సాధకులకు అట్టి తురీయాతీత స్థితిలో ఉన్న యోగుల సేవ శివ సేవతో సమానము. 

ఈ అవస్థలన్నీ కూడా అమ్మ త్యజించింది. ఆ జగదాంబకు ఏ అవస్థలూ లేవు. 

అయినా ఆ అమ్మ అన్ని అవస్థలలో తాను ఉంటూ, జీవుడికి ఆయా అవస్థల 

అనుభూతులు కలుగచేస్తూ ఉంటుంది. 

స్వప్న, జాగ్రత్, సుషుప్త అవస్థలలో జీవుడితో కర్మ ఫలములను అనుభవింపచేస్తూ, 

తురీయములో ఆనందాన్నీ, తురీయాతీతంలో శివస్వరూపాన్నీ ఇస్తుంది ఆ జగదాంబ. 

ఈ అవస్థా పంచకమునే కాక, సమస్త అవస్థలనూ త్యజించిన, ఆ సర్వావస్థా వివర్జిత కు వందనం. 

ఓం శ్రీ సర్వావస్థావివర్జితాయై నమః 

  

264. సృష్టికర్త్రీ

ఈ చరాచర జగత్తును సృష్టి చేసే శక్తి కనుక, ఆ జగన్మాతను ఈ నామంలో సృష్టికర్త్రీ అన్నారు. 

ఈ శక్తికే మరియొక పేరు జగత్సూత, జగత్ప్రసూత. సూతమంటే పురిటి మైల. 

నిత్యమూ సృష్టి కార్యంలో నిమగ్నమయ్యే తల్లి కనుక ఈ పేరు ఏర్పడింది. 

కనకధారా స్తోత్రంలో ఆ శ్రీదేవిని శంకరాచార్యుడు, భువన ప్రసూత్యై అంటాడు. 

అమ్మ ఈ భువనములను నిత్యమూ ప్రసవిస్తూనే వుంది. 

జగన్నిర్మాణ కార్యములో వున్న, ఆ సృష్టికర్త్రి కి వందనం. 

ఓం శ్రీ సృష్ఠికర్త్ర్యై నమః 

265. బ్రహ్మరూపా

సృష్టి చేయగల శక్తి ఉన్నవాడినే బ్రహ్మ అంటారు. 

ఆ జగన్మాత సృష్టికర్త్రి కనుక ఆ తల్లి స్వయముగా బ్రహ్మ స్వరూప. 

అందుకే ఈ నామంలో బ్రహ్మ రూపా అంటున్నాం. సృష్టి శక్తియే బ్రహ్మ. 

సృష్టి చేస్తున్నపుడు బ్రహ్మ రూపంలో ఉంటున్న, ఆ బ్రహ్మరూప కు వందనం. 

ఓం శ్రీ బ్రహ్మరూపాయై నమః 

266. గోప్త్రీ

గోపనము అంటే రక్షణము. గోప్త్రీ అంటే గోపనము చేయు తల్లి అని అర్ధం. 

సృష్టి చేశాక, తాను చేసిన సృష్టికి రక్షణ కార్యంలో ఉంటుంది ఆ జగదంబ. 

జగత్సృష్టి, జగద్రక్షణ రెండూ ఆ జగదీశ్వరి లక్షణములు. 

రక్షించువాడు, స్థితికారకుడు విష్ణువు. నారాయణ, నారాయణి ఇరువురూ ఈ స్థితి కార్యములో 

వున్నవారే. సృష్టిని పోషించే, కాపాడే, రక్షించే తల్లి కనుక గోప్త్రీ అనే నామం అమ్మకు వచ్చింది. 

సమస్త సృష్టినీ గోపనము చేస్తూ, కాస్తున్న, ఆ గోప్త్రి కి వందనం. 

ఓం శ్రీ  గోప్త్ర్యై నమః   

267. గోవిందరూపిణీ

గోవిందుడు అంటే రక్షించేవాడు. 

అందుకే వేంకటేశ్వరుడిని రక్షించు ఈశ్వరా అంటూ, గోవిందా అంటాం. 

గోవిందా నామం రావడం వెనుక ఓ కథ వుంది. 

ఒకసారి ఇంద్రుడికి గోగణాల మీద ఆగ్రహం కలిగి, శిలా వర్షం కురిపించాడు. 

అప్పుడు బాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తి, ఆ గోవులకూ,

గోపాలురకూ ఆ పర్వతం కింద రక్షణ కల్పించాడు.

అప్పటినుంచీ విష్ణువు గోవిందా అనే నామం ధరించాడు. 

కనుక గోవిందుడంటే రక్షించేవాడు అనే అర్ధం వచ్చింది. 

ఆ జగన్మాత రక్షించేటప్పుడు గోవింద రూపంలో ఉంటుంది. 

అందుకే ఈ నామంలో ఆ శ్రీ మాతను గోవింద రూపిణీ అంటున్నాం. 

గోవింద రూపములో భక్తులను రక్షిస్తున్న, ఆ గోవిందరూపిణి కి వందనం. 

ఓం శ్రీ గోవిందరూపిణ్యై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి