19, సెప్టెంబర్ 2021, ఆదివారం

58. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా

చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ 
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥

235. చతుఃషష్ట్యుపచారాఢ్యా 

అరవై నాలుగు యోగినులూ అమ్మవారికి పూజ చేసేటప్పుడు చేసే ఉపచారాలే చతుష్షష్టి

ఉపచారాలు. పరశురామ కల్పసూత్రాల్లో ఈ అరవై నాలుగు ఉపచారాలూ చెప్పబడ్డాయి. 

ఆ తరువాత కాలంలో ఆ సేవలనే కొద్దిగా కుదించి షోడశోపచారాలు చెప్పారు. 

ఆ తరువాత కాలంలో ఆ సేవలను మరింత కుదించి పంచోపచారాలు చెప్పారు.

కుదించటమంటే సేవలను కుదించారని కాదు, ఆ సేవల వర్ణనను కుదించారని అర్ధం. 

ఉదాహరణకు, 'ఆభరణం సమర్పయామి' అనే సేవలో దేవతకు ఆభరణాలు సమర్పిస్తాం. 

అదే సేవ చతుష్షష్టి ఉపచారాలలో చాలా విపులంగా చెప్పబడింది. 

అమ్మవారికి ధరింపచేసే ఒక్కో ఆభరణం ఒక్కో సేవలో చెప్పారు.   

దేవతకు ధరింపచేసే అన్ని నగల విశేషాలూ, వివరాలూ ఆ చతుష్షష్టి ఉపచారాలలో ఉంటాయి.  

ఒకసారి శంకరాచార్యునికి, ఆ అరవై నాలుగు మంది యోగినులూ చతుష్షష్టి  

ఉపచారాలతో పూజ చేస్తుండగా, ఆ పూజని స్వీకరిస్తున్నట్టుగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. 

అప్పుడు ఆ అనుభూతికి అపరిమితానందం పొందిన శంకరాచార్యుడు ఆశువుగా, 

శ్రీదేవీ చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రం చెప్పాడు. 

ఆ స్తోత్రంలో ఈ అరవైనాలుగు ఉపచారాల గురించీ వివరంగా తెలుస్తుంది. 

తాను చూసినది చూసినట్టుగా స్తుతించాడు శంకరాచార్యుడు. 

పధ్ధతి ఏమిటో చెప్పాడు పరశురాముడు. 

కనుక ఈ రెండింటిలో కొద్దిగా భేదం కనబడుతుంది. మనసే అన్నింటికీ ప్రధానం. 

అన్ని తంత్రాలలోకీ స్వతంత్ర తంత్రమే గొప్పది అని శివుడు కూడా చెప్పాడు కదా. 

అరవై నాలుగు మంది యోగినులతో, అరవై నాలుగు రకాల ఉపచారములతో

పూజింపబడుతున్న, ఆ చతుఃషష్ట్యుపచారాఢ్య కు వందనం. 

ఓం శ్రీ చతుఃషష్ట్యుపచారాఢ్యాయై నమః  


236. చతుష్షష్టి కళామయీ

చతుష్షష్టి కళామయీ అంటే అరవై నాలుగు కళలతో శోభాయమానంగా ప్రకాశిస్తున్న తల్లి.   

చతుష్షష్టి కళామయీ అంటే అరవై నాలుగు కళలూ తన స్వరూపముగా కల తల్లి.  

చతుష్షష్టి కళామయీ అంటే అరవై నాలుగు కళలూ తంత్రములుగా కల తల్లి. 

చతుష్షష్టి కళామయీ అంటే అరవై నాలుగు కళలనూ విద్యలుగా ప్రసాదించిన తల్లి. 

కళలు మొత్తం అరవై నాలుగు. ఈ కళలు కొన్ని గ్రంధాల్లో, కొన్ని భేదాలతో, 

కొన్ని పాఠాంతరములతో చెప్పారు. కానీ కళలు అరవై నాలుగు. 

అన్ని కళలనూ తన ఆకారములో పొందుపరచుకుని, ఆ లలితాదేవి ఎంతో గొప్ప ప్రకాశంతో 

తేజరిల్లుతోంది. ఆ తేజస్సులో సమస్తలోకాలూ దీప్తివంతముగా వెలిగిపోతూ ఉంటాయి.  

అందుకే ఆ లలితాపరమేశ్వరిని చతుష్షష్టి కళామయీ అని పూజిస్తున్నాం. 

అరవై నాలుగు కళలనూ తంత్రములుగా యోగులకు ఉపదేశించిన తల్లి ఆ శ్రీలలిత. 

అరవై నాలుగు కళలనూ ఉపాసకులకు విద్యలుగా ప్రసాదించింది ఆ తల్లి. 

ఇన్ని కారణములు చేత ఆ శ్రీ లలితకు చతుష్షష్టి కళామయీ అన్న పేరు సార్ధకమైంది. 

చతుష్షష్టి కళలతో అలరారుతున్న, ఆ చతుష్షష్టి కళామయి కి వందనం. 

ఓం శ్రీ చతుఃషష్టికళామయ్యై నమః 


ఒక విన్నపం:

భరతఖండములో ప్రాచీన విద్యాప్రణాళికలో చెప్పిన అపురూపమైన ఈ అరవైనాలుగు విద్యలనూ 

నిర్లక్ష్యం చేసి, అప్రాచ్యం, అంటే, పాశ్చాత్యప్రాంతం నుంచి, మన దేశానికి ఉపయోగపడని 

విద్యాప్రణాళికను అరువు తెచ్చుకున్నాం. ఫలితంగా ఆ పశ్చిమ విద్యలు ఇక్కడ స్థానికంగా 

ఎక్కువ ఉపయోగపడక, మన మేధావి వర్గం దేశాన్ని వదిలి, విదేశీ బాట పట్టింది. మేధావులు లేని 

దేశం క్రమేణా నాణ్యత తగ్గి క్షీణిస్తుంది. భగవద్గీతలో స్వధర్మమే శ్రేయోదాయకమని, పరధర్మం 

భయావహమని చెప్పారు. రధర్మాన్ని కూడా స్వధర్మమంత శుద్ధంగా, వివరంగా నేర్చుకుంటే, 

అప్పుడు అది కూడా శ్రేయోదాయకమే అవుతుంది. ఎందుకంటే అదీ ధర్మమే కదా. 

వివేకానందుడు కూడా ప్రాక్, పశ్చిమ మేలు కలయికను ఆకాక్షించాడు. ఆ మేలుకలయికతో 

సమస్త విశ్వమూ అభివృద్ధి వైపుకు పురోగమించాలని ఆశించాడు. కనుక అవీ ఇవీ అన్నీ 

నేర్చుకుంటే హితమేమో ఆలోచించండి. స్వధర్మాన్ని తూష్ణీంభావముతో చిన్నచూపు చూడకండి. 

కేవలము పరధర్మమే ప్రశస్తమని భావించకండి. కుడి, ఎడమ చేతులు రెండూ ఉంటేనే, 

అన్ని పనులూ అవలీలగా చేయగలం. ఆలోచించండి.  


237. మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా 

అష్టమాతృకలు ఎనిమిది మంది. ఆ మాతృకల సంతానంగా అరవై నాలుగు మంది యోగినులు 

వున్నారు. ఈ అరవై నాలుగు మంది యోగినులకూ ఒక్కొక్కరికీ కోటిమంది యోగినులు కలిగారు. 

ఫలితంగా అరవై నాలుగు కోట్లమంది యోగినులు అవతరించారు. 

ఈ విధంగా శ్రీచక్రము నవావరణములలోనూ ఒక్కో ఆవరణలో అరవై నాలుగు కోట్లమంది 

యోగినులు అవతరించారు. మొత్తంగా 5,76,00,00,000 మంది యోగినులైనారు. 

ఈ సంఖ్యను సంస్కృతంలో ఐదు పద్మముల, ఏడు అర్బుదముల, ఆరు కోట్లు అని చెప్పారు. 

ఈ సంఖ్య చాలా పెద్దది కనుక ఆ సంఖ్యా విశేషణముగా మహత్ అనే శబ్దమును చెప్పారు. 

కనుక ఈ మొత్తం 5,76,00,00,000 మంది యోగినులూ మహా చతుష్షష్టి కోటి యోగినీ మూర్తులు. 

ఆ విధంగా ఆ మహా చతుష్షష్టి కోటి యోగినీగణములతో సేవింపబడుతున్న శ్రీ రాజరాజేశ్వరి, 

ఆ మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవిత కు వందనం. 

ఓం శ్రీ మహాచతుఃషష్టికోటి యోగినీగణసేవితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి