సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీ, ఈశ్వరీ
సదాశివా, అనుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥
268. సంహారిణీ
ఓం శ్రీ సంహారిణ్యై నమః
269. రుద్రరూపా
సంహారం చేయాలంటే తమోగుణం కావాలనుకున్నాం కదా, ఆ తమోగుణ ప్రధానుడే రుద్రుడు.
తమోగుణ ప్రధానుడైన రుద్రుని పత్నిగా రుద్రాణి ఈ సంహార కార్యం చేపట్టింది.
జాతస్య మరణం ధృవం అని భగవద్గీత చెప్పింది. పుట్టిన ప్రతిజీవికీ మరణము తప్పదు.
ప్రతి సృష్టికీ విలయమూ తప్పదు. ఈ సంహార కార్యం చేస్తున్నప్పుడు రుద్రాణి రుద్రరూపంలో
ఉంటుంది. అందుకే ఆ అంబను ఈ నామంలో రుద్రరూపా అంటున్నాం.
తాను చేసిన సమస్త సృష్టినీ తానే లయము చేస్తున్న, ఆ రుద్రరూప కు వందనం.
ఓం శ్రీ రుద్రరూపాయై నమః
270. తిరోధానకరీ
తిరోధానము అంటే అంతర్ధానము చేయటం, మటుమాయం చేయటం, పటాపంచలు చేయటం
అని అర్ధం. సమస్త ప్రాణికోటినీ లయము చేస్తూ, మటుమాయం చేసే శక్తే ఈ తిరోధానకరీ.
ఈ శక్తినే తిరస్కరిణీ శక్తి అంటాం. సృష్టి నంతా మహాప్రళయంలో తిరోధానం చేస్తుంది.
సృష్టి అంతా చిన్న చిన్న అణువులుగా మారిపోతుంది. ప్రళయంలో సృష్టి సమస్తమూ హననమై,
అమ్మలో లయించిపోతుంది. ఈ సమస్త సృష్టీ తిరిగి ఆ జగన్మాత గర్భంలో మణిగి పోతుంది.
ఎప్పటికప్పుడు ప్రాణికోటి పుడుతూ ఉంటుంది, మనుగడ సాగిస్తూ ఉంటుంది,
చస్తూ ఉంటుంది, మరునిముషంలో మటుమాయమవుతూ ఉంటుంది.
అలా మాయం చేస్తోంది కనుకే, ఆ జగదీశ్వరికి ఈ నామం వచ్చింది.
సంహారం తరువాత సృష్టినంతా అంతర్ధానం చేస్తున్న, ఆ తిరోధానకరి కి వందనం.
ఓం శ్రీ తిరోధానకర్యై నమః
ఓం శ్రీ ఈశ్వర్యై నమః
272. సదాశివా
సదాశివుడు, ఎల్లప్పుడూ సత్వగుణ ప్రధానుడు. సదాశివుని పత్నిగా ఆ పార్వతీదేవి కూడా
సదాశివునితో అభేదము పొంది, శుద్ధ సత్వ స్వరూపముతో ఎల్లప్పుడూ ప్రకటితమవుతూ
ఉంటుంది. ఉపాసకులు ఈ సదాశివాను ఉపాసిస్తే, సత్వగుణం కలుగుతుంది.
రజస్తమోగుణాల ఉధృతం తగ్గుతుంది. సత్వగుణోపేతుడుగా యోగి, శివుడికి దగ్గరవుతాడు.
భక్తులకు కృపతో సత్వజ్ఞానాన్ని అందిస్తున్న, ఆ సదాశివా కు వందనం.
ఓం శ్రీ సదాశివాయై నమః
273. అనుగ్రహదా
అమ్మ అనుగ్రహదాయిని కనుక ఈ నామం వచ్చింది.
తాను చేసిన సృష్టినంతా లయము చేసిన తరువాత, ఆ జగన్మాతకు అనుగ్రహం కలుగుతుంది.
దానివలన, తిరిగి సృష్టి ఆరంభిస్తుంది.
భగవద్గీతలో జాతస్యహి ధ్రువోర్ముత్యుః, ధ్రువమ్ జన్మ మృతస్యచ అని చెప్పారు.
కనుక పుట్టినవన్నీ గిట్టవలసినదే, గిట్టినవన్నీ పుట్టవలసిందే.
సమస్త సృష్టీ తిరిగి అమ్మ అనుగ్రహం వలన, అమ్మ చేతిలో ప్రాణం పోసుకుంటుంది.
తిరిగి అన్ని గ్రహములు, భువనములు, లోకములు, లోకస్థులూ, లోకేశులూ, స్థావరములూ,
జంగమములూ అన్నీ ప్రాణం పోసుకుంటాయి. అమ్మ మళ్ళీ భువనప్రసూత అయిపోతుంది.
మళ్ళీ సృష్టి చక్రం ప్రారంభం అవుతుంది. సృష్టి, ఆ తరువాత స్థితీ, ఆ పై సంహారం, తిరోధానం,
తుదకు అనుగ్రహంతో పునఃసృష్టి. ఇదే అమ్మ అనుగ్రహ చక్రం.
ఈ జననమరణ చక్రం నిరంతరాయంగా సాగిపోతూనే ఉంటుంది.
జగత్తుపై అనుగ్రహంతో సృష్టిని తిరిగి ఆరంభించిన, ఆ అనుగ్రహద కు వందనం.
ఓం శ్రీ అనుగ్రహదాయై నమః
274. పంచకృత్య పరాయణా
ఈ సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే అయిదు కార్యములనూ
పంచకృత్యములు అంటాము. జగన్మాత ఈ పంచకృత్యాలనూ చేయాలనే అభీష్టంతో ఉంటుంది.
పరాయణ అంటే అభీష్టము, కోరిక.
నిరంతర పరాయణగా అమ్మ ఈ పంచకృత్యాలనూ, ఒకదాని తరువాత మరియొకటి చేస్తూనే
ఉంటుంది. ఈ అయిదు కృత్యాలనీ చేసే శక్తి వున్న ఆ జగన్మాతనే పంచకృత్యపరాయణా
అనే నామంతో కీర్తిస్తున్నాం.
సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యాలనూ నిర్వహించాలనే
అభీష్టముతో వున్న, ఆ పంచకృత్య పరాయణ కు వందనం.
ఓం శ్రీ పంచకృత్యపరాయణాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి