11, సెప్టెంబర్ 2021, శనివారం

50. నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా

 

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా 
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ॥ 50 ॥

184. నిస్తులా

తుల లేనిది, తూచలేనిది, ఉపమానము లేనిది, సరిసాటిగా మరియొకటి లేనిది నిస్తుల. 

ఈ లక్షణములన్నీ కల తల్లి నిస్తులా, ఆ లలితా పరమేశ్వరి. 

అమ్మకు సాటి వచ్చే మరొక వస్తువు లేదు. ఆ మాతను దేనితోనూ తుల తూచలేము. 

శ్రీకృష్ణుడు అపారమైన సువర్ణరాశినీ, ధనాన్నీ వేసినా కూడా సరి తూగలేదు. భక్తితో రుక్మిణి వేసిన 

ఒక్క తులసీదళానికి తేలిపోయాడు, లొంగిపోయాడు. శ్రీకృష్ణుడే శ్రీలలిత కదా.  

అమ్మ కూడా అంతే, శ్రద్ధాభక్తులతో తప్ప అమ్మను మరి దేనితోనూ కొలవలేము. 

అమ్మ అనుపమ, నిరుపమ, ఉపమా లేనిది. 

అనన్యమైన భక్తి, అపారమైన శ్రద్ధకి తప్ప, ఇతరములకు తూగని, ఆ నిస్తుల కు వందనం. 

ఓం శ్రీ నిస్తులాయై నమః 


185. నీలచికురా

చికురములు అంటే వెంట్రుకలు. ఆ లలితాపరమేశ్వరి నీలవేణి అని ఈ నామం యొక్క భావం. 

నలుపు అజ్ఞానానికి సంకేతమైతే, నీలము జ్ఞానానికి సంకేతం.  

ధ్యానంలో రంగును దర్శించేవారికి ఈ విషయం తెలుస్తుంది. 

శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ముదురు నీల మేఘ శ్యాములు.   

ఆ వర్ణాన్ని ధ్యానంలో దర్శించగలగటం అద్భుతం. ఆకాశం, సముద్రం నీలంగా ఉంటాయి. 

అపారమైనది, అవధులు లేనిది ఏదైనా నీల వర్ణంలో ఉంటుంది. 

శ్రీ లలిత కురులు, ముంగురులు అటువంటి నీలవర్ణ శోభితములు. 

ఆ కురులు పుష్పాలకే సుగంధాన్ని అద్దే మహత్తైనవి. చంపకాశోక పున్నాగ పుష్పములకు 

ఆ తల్లి వేణీభరములో చేరటం వలన సువాసన అబ్బి, మర్యాద పెరిగిందని చెప్పుకున్నాం కదా. 

కురులు పట్టి లాగిన వారికీ, లాగమని ఆదేశమిచ్చిన వారికీ, చూచి ఆనందించిన వారికీ, 

చూచి మిన్నకున్న వారికీ, ఏమి జరిగిందో తెలిసినదే కదా. పతివ్రత కురుల శక్తి అది. 

అటువంటి నీలవేణికి, సౌగంధికలసత్కచకు, ఆ నీలచికుర కు వందనం. 

ఓం శ్రీ నీలచికురాయై నమః 


186. నిరపాయా 

నిరపాయ అంటే అపాయము లేనిది, నాశము లేనిది, దుఃఖము లేనిది, కష్టము లేనిది. 

ఈ జగత్తులో సర్వమూ ఆ తల్లి ఆదేశానుసారమే నడుస్తుండగా ఆ తల్లికి అపాయములు ఎలా 

కలుగుతాయీ, కనుక ఆ శ్రీ లలిత నిర్ద్వంద్వముగా, నిశ్చయముగా నిరపాయ. 

జీవుని లోపల శత్రువులు ఆరుగురు వున్నారు. ఈ శత్రువుల వల్ల ఎప్పుడూ అపాయములు 

కలుగుతూ ఉంటాయి. ఆ శత్రువులను జయిస్తే, లోపలనుంచి అపాయముల భయముండదు. 

కానీ ఒక్కొక్కసారి త్రిగుణములవలన, ఈ ఆరూ పైకి లేచి సామాన్యుల నుంచి 

దేవతల వరకూ అందరూ కష్టాల పాలైన తార్కాణములున్నాయి. 

ఇక బయట నుంచి గాయపరచే, లేదా, కష్టం కలిగించే శత్రువులు కూడా వుంటారు.  

వీరితో యుద్ధము ఆ శ్రీరామునికే తప్పలేదు, సామాన్యులెంత. 

ధర్మముతో, నిబద్ధతతో, అమ్మ అనుగ్రహముతో నెగ్గవలసినదే. 

శ్రీరాముడు కూడా శివుని, సూర్యుని పూజించే కదా, రణరంగము లోకి దిగాడు. 

ఒక్క స్వర్ణమే వివిధ ఆభరణములుగా భాసిల్లుతున్నట్టు, ఒక్క అమ్మయే ఒక్కోచోట ఒక్కో 

రూపములో అనుగ్రహిస్తూ ఉంటుంది. శివుడైనా, సూర్యుడైనా, రాముడైనా, కృష్ణుడైనా ఆ అమ్మే.  

అజ్ఞానము, అహంకారముల వలన కలిగే అపాయముల నుంచి అందరినీ రక్షించే తల్లి శ్రీలలిత. 

అపాయముల నుంచి తప్పించే ఉపామే కానీ, అపాయములు లేని ఆ నిరపాయ కి వందనం. 

ఓం శ్రీ నిరపాయాయై నమః 

 

187. నిరత్యయా

ఇది మరో అద్భుత నామం. ఆమెను ఎవరూ అతిక్రమించలేరని ఈ నామం చెప్తోంది. 

అతిక్రమణ వలన అపాయములు, దోషములు, కళంకములు కలుగుతాయి. 

అమ్మ దేనినీ అతిక్రమించదు. ఆ అమ్మను ఎవరూ అతిక్రమించలేరు. కాదని అతిక్రమింప 

చూస్తే, శిక్షలు ఉంటాయి. క్రమ శిక్షణ లోపించినపుడు శిక్షణ, శిక్షలు తప్పనిసరి కదా. 

ఎవరి బుద్ధిని బట్టీ, కర్మను బట్టీ వాళ్ళు కార్యములూ చేస్తూ వుంటారు. 

ఆ విధి నిర్వహణ ముగిసిన తరువాత, దానిని గురించి మననం చేసుకుంటే దోషాలేమన్నా 

ఉంటే అవి తగ్గుతాయి. మననములో వుండే వాడే ముని. మౌనంగా ఉండటమే ముని లక్షణం. 

ఉపవాసం అంటే పస్తు అని పొరపాటు పడుతున్నట్లే, మౌనంగా అంటే మాట్లాడకుండా 

ఉండటం అనుకోవడం కూడా పొరపాటే. 

ఉపవాసం అంటే, భగవంతునితో కలిసి పక్కనే ఉంటూ సహవాసం చేస్తూ, ఆనాడంతా 

ఆ భావన తోనే ఉండటం. అదేవిధంగా మౌనంగా ఉండటం అంటే, నిరంతర మననములో 

ఉండటం. మౌనంగా ఉండేవాడు దేనినీ అతిక్రమించడు. 

అతిక్రమణ లేకపోతే దోషము లేదు, శిక్ష రాదు. 

తాను దేనినీ అతిక్రమించక, అతిక్రమించేవారిని దారిలో పెడుతున్న, 

ఆ నిరత్యయ కు వందనం.  

ఓం శ్రీ నిరత్యయాయై నమః 


188. దుర్లభా

అమ్మని చూడటానికి ఈ చర్మచక్షువులు చాలవు అనుకున్నాం. 

విశ్వరూపం శ్రీ కృష్ణుడు చూపించినా, అందరూ చూడలేకపోయారు. 

అమ్మ అందరకూ సులభంగా దొరికే శక్తి కాదు. అందుకే ఈ నామంలో దుర్లభా అంటున్నాం.  

'యోగినామపి దుర్లభం' అని శాస్త్ర వాక్యం. యోగులకు కూడా అంత సులభంగా అమ్మ దొరకదు. 

ఏదైనా సాధించాలంటే, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అన్నీ ఫలించవు కదా. 

ఎక్కడో ఒక్క చినుకు ముత్యమైనట్టు, విత్తిన అన్ని బీజాలూ మొలకెత్తనట్టు, 

కొన్నిసార్లే, ఫలితం దక్కుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన ఫలితం లభిస్తుంది. 

అన్నింటికీ అమ్మ అనుగ్రహమే కీలకం. ఆ శ్రీలలిత అనుగ్రహం ఉంటే, దుర్లభమయిన 

కార్యం కూడా సులభమవుతుంది. గురువు అనుగ్రహం ఉంటే, పద్మపాదుడు నీటిపై నడవలేదూ. 

మరి జగద్గురువైన ఆ శ్రీమాత మన శ్రద్దనీ, భక్తినీ, దీక్షనీ, ఆర్తినీ గమనించి కటాక్షిస్తే ముక్తే కదా. 

యోగులకే దుర్లభమైన ఆ మహాశక్తి, ఆ దుర్లభ కు వందనం. 

ఓం శ్రీ దుర్లభాయై నమః 


189. దుర్గమా

దుర్గము అంటే కోట. అమ్మ దాటటానికి వీలులేని కోటలో వుంది. పద్మారణ్యములో వుంది. 

సుమేరు పర్వత శిఖరాలపై వుంది. ఓంకారమనే పంజరంలో వుంది. ఆగమారణ్యాలలో వుంది. 

సుధాసాగర మధ్యంలో వుంది. మరి ఆమెను చేరటం ఎంత కష్టం. 

దుర్గమము అంటే కఠినము. కష్టాలన్నీ దాటుకుని, ఆ కఠినమైన మార్గాలను తరించి, అమ్మను 

చేరటానికి ఒక్కటే మార్గం. అదే ఉపాసన, సాధన, దుర్గారాధనే ఏకైక మార్గం. 

నిరంతరం ఆ నామాన్నే మననం చేస్తూ, అనవరతం ఆ రూపాన్నే మదిలో నింపుకుని, 

ముందుకు పోవటమే సాధన. గమ్యం కష్టమైనా, ఇష్టంగా అడ్డంకుల్ని అధిగమించి ముందుకు 

సాగాలి. ఆమెను చేరగలితే మాత్రం, ఆ అనుభూతిని చెప్పటానికి మాటలు చాలవు. 

దుర్గమమైనా, దుర్భేద్యమైనా, నిజభక్తులకు కృపాదృష్టితో చేయూతనిచ్చే, ఆ దుర్గమ కి వందనం. 

ఓం శ్రీ దుర్గమాయై నమః 


190. దుర్గా 

దుర్గమాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి దుర్గ అనే నామం ధరించింది. కనుక ఆ తల్లి దుర్గ. 

నవదుర్గల రూపమును ధరించునది, కనుక ఆ తల్లి దుర్గ. 

తొమ్మిది దుర్గమమైన కోటల మధ్యలో వున్నది, కనుక ఆ తల్లి దుర్గ. 

తొమ్మిది ఎత్తైన, కఠినమైన ఆవరణలు దాటి ఆవల వున్నది, కనుక ఆ తల్లి దుర్గ. 

ఇంద్రాదులకు అభయం ఇచ్చి దుర్గగా వెలసిన దేవత. 

దుర్గకు ప్రతీకగా, తొమ్మిదేళ్ల ఆడపిల్లలను కూర్చోబెట్టి, దుర్గారాధన చేసే ఆచారము ఒకటి వుంది. 

ప్రతి ఉపాసకుడూ, ప్రతి జీవుడూ తమ తమ సాధన, యోగ్యతను బట్టీ, ఏదో ఒక కోటలోనో,

ఆవరణలోనో ఉంటాడు. ప్రతివారూ తెలిసో, తెలియకో, అమ్మకు అనుబంధంగానే వుంటారు. 

జ్ఞానులకు తమ స్థితి తెలుస్తుంది, అజ్ఞానులకు తెలియదు. వ్యత్యాసము అంతే. 

కాశీరాజు కోరికపై కాశీలో దుర్గా రూపములో ఉంటూ పూజలందుకుంటోంది. 

వనదుర్గ రూపములో ఉంటూ, వనచరి వలె అడవుల్లో తిరుగుతూ ఆర్తులకు దర్శనమిస్తూ 

ఉంటుంది. వనదుర్గ ప్రసన్న దేవత, ఆ తల్లి చల్లని చూపు పడితే జీవితం ధన్యం. 

సాధన సరియైన మార్గములో వున్నప్పుడు, దుర్గమమైన కార్యములన్నీ కూడా 

కరుణతో సులభము చేయగల తల్లి, ఆ దుర్గ కు వందనం. 

ఓం శ్రీ దుర్గాయై నమః 


191. దుఃఖహంత్రీ

ఆ శ్రీలలితను ఈ నామములో దుఃఖహంత్రీ అని పిలుస్తున్నాం. 

భక్తుల దుఃఖాలను పోగొట్టే చల్లని తల్లి ఈ దుఃఖహంత్రీ. 

దుఃఖము నశిస్తే, మిగిలేది సుఖము, హాయి, ముక్తి, మోక్షము.

అజ్ఞానము వలన, అహంకారము వలన, జీవుడు దుఃఖము పొందుతాడు. 

ఆ దుఃఖము నుంచి దాటించేది కేవలము దుర్గారాధనము మాత్రమే. 

సాధన చేస్తూ ఉంటే, అమ్మ కరుణించి సద్గురువుని పంపిస్తుంది. 

లేక తానే స్వయంగా ఏదో ఒక రూపములో వచ్చి జ్ఞానబోధ చేసి ఉద్ధరిస్తుంది.  

ఆర్తితో ప్రార్ధించే భక్తులకు, దుఃఖాన్ని దూరము చేసి, ముక్తి నిచ్చే, ఆ దుఃఖహంత్రి కి వందనం. 

ఓం శ్రీ దుఃఖహంత్ర్యై నమః  

192. సుఖప్రదా

దుఃఖమును పోగొడితే మిగిలేది సుఖమే అనుకున్నాం. అమ్మవారు సుఖాన్నిచ్చే కరుణామూర్తి.  

అందుకే ఆ తల్లిని ఈ నామంలో సుఖప్రదా అని కీర్తిస్తున్నాం. 

సుఖములు ఐహికములు, ఆముష్మికములు అని రెండు రకములు. 

ఇహలోక దుఃఖాలు, బాధల నుంచి దరి చేర్చేవి ఐహిక సుఖములు. ఇవి తాత్కాలికము. 

ఇవి లభిస్తే, జీవుడు సంసార సాగరాన్ని, అమ్మ కృపతో సుఖముగా దాటేస్తాడు.  

పరలోకములో కూడా సుఖములందించేవి ఆముష్మికములు. పరమాత్మను పొందిన వాడికి 

కలిగే సుఖముకు సాటి మరియొకటి లేనే లేదు. ఈ సుఖము శాశ్వతము. 

అమ్మ భక్తుల స్థాయిని బట్టీ, ఎవరికి ఎట్టి సుఖమును ఇవ్వాలో అట్టి సుఖమును అందచేస్తుంది. 

శుద్ధ మనసుతో తనను అర్చించే భక్తులకు సుఖాన్నిచ్చే, ఆ సుఖప్రద కు వందనం. 

ఓం శ్రీ సుఖప్రదాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి