నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ॥ 47 ॥
160. నిశ్చింతా
చింతలు తీర్చే తల్లి, చింతలు లేని తల్లి, ఆ పరమేశ్వరి నిశ్చింత.
చింతనముతో దొరికే దేవత ఆ లలితా పరమేశ్వరి, ఆర్తుల చింతలను తీరుస్తుంది.
చింత అంటే దుఃఖము. దుఃఖము లేని స్థితి నిశ్చింత, అంటే హాయిగా, సుఖముగా వుండే స్థితి.
చితి చనిపోయిన వాళ్ళను దహిస్తే, చింత బ్రతికి వున్న వాళ్ళను సైతం దహిస్తుంది అంటారు.
అటువంటి చింతల నుండి బయట పడాలంటే, ఈ నిశ్చింతా నామంతో శ్రీదేవిని ధ్యానించండి.
ఆ చింతారహిత, నిశ్చింత కు వందనం.
ఓం శ్రీ నిశ్చింతాయై నమః
ఓం శ్రీ నిరహంకారాయై నమః
162. నిర్మోహా
లోకములు, లోకేశులు, లోకస్థులు అంతా ఆ లలితాదేవి సృష్టే.
తానే సృజించి, పోషిస్తున్న వీటన్నింటిపై శ్రీదేవికి ఎటువంటి వ్యామోహమూ లేదు.
ఆ శ్రీదేవి మోహమును పొందని అమ్మ. మమతా మోహములకు చిక్కని నిర్మోహ ఆ శ్రీ లలిత.
శుభము, అశుభము ఏమి జరిగినా, ఎటువంటి మనోవికారమునూ పొందని తల్లి.
మోహము అహంకార జనితమైన స్వార్ధబుద్ధి వలన వస్తుంది. అహంకారము మమకారమునకూ,
మమకారము మోహమునకూ, మోహము శోకమునకూ దారి తీస్తుంది.
తాను, తనవారు, తన వస్తువులు, తన అనే అన్ని విషయములలోనూ చిత్త భ్రాంతిని
కలుగచేస్తుంది. మోహం కలిగినప్పుడు, ఏది భ్రాంతో, ఏది నిజమో తెలియని అజ్ఞానం
కమ్మేస్తుంది. లేని గుణమును వున్నట్టూ, వున్న గుణమును లేనట్టూ భ్రాంతిని కల్పిస్తుంది.
అదే మోహము. అమ్మకు ఈ మమకారములు, మోహములు లేవు.
తానే స్వయముగా సృష్టించిన మాయాజాలంలో అమ్మ ఎన్నడూ చిక్కుకోదు.
మోహమను చిత్త భ్రాంతి లేని, ఆ నిర్మోహ కు వందనం.
ఓం శ్రీ నిర్మోహాయై నమః
163. మోహనాశినీ
మోహమును నాశనము చేసేది మోహనాశిని, ఆ లలితాపరమేశ్వరి.
జీవుడికి తనది అనుకునే ప్రతిదాని పట్లా మోహము ఎక్కువ.
మోహమును వదులుకోవటం, దేవాదులకే సాధ్యము కాలేదు.
మోహమును నాశము చేసేది ఒక్క లలితాదేవియే. ఆ దేవిని ఆర్తితో సేవిస్తే,
ఆ జగజ్జనని భక్తుని ఆర్తిని, శ్రద్ధను, భక్తిని గమనించి మోహనాశనము చేస్తుంది.
అందుకే మోహనాశిని ఆ లలిత ఒక్కరే. మానవులైనా, దేవతలైనా, రాక్షసులైనా,
అందరూ అరి షట్ వర్గాలను దాటాలంటే, ఆ లలితా సేవయే, ఏకైక శరణ్యము.
అది గ్రహించక, జీవుడు జన్మలు మరల మరల పొందుతూనే ఉంటాడు.
జననమరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు.
ప్రేమతో, మోహము అను శత్రువును నాశనము చేసి, జీవుడిని ఉద్ధరించే,
ఆ మోహనాశిని కి వందనం.
ఓం శ్రీ మోహనాశిన్యై నమః
164. నిర్మమా
మమత, మమకారము వంటి గుణములకు అతీతమైనది జగదంబ.
అందరికీ తల్లి కనుక, అందరినీ ఏక భావనతో చూసే తల్లి.
కనుక ఆ తల్లికి ప్రత్యేకముగా మమత ఉండదు. మమ అంటే, నాది అనే భావం.
నా దేహం, నా ఇల్లు, నా కుటుంబం, నా ఆస్తి, అనే భావమే మమత.
అందుకే దానము చేసేటప్పుడు ప్రతిసారీ 'న మమ' అంటాము. అంటే, ఈ వస్తువు దానం
చేసేసాను, కనుక ఈ వస్తువు నాది కాదు అని చెప్పటం.
ఇది నా దేహం, అది నీ దేహం అనే భేదభావము అహంకారాన్ని పెంచి, మమకారపు
బంధనాల్లోకి జీవుడిని నెడుతుంది. ఈ మమ వంటివి అన్నీ జీవుడి మోక్షమార్గానికి అడ్డంకులే.
ఆ శ్రీదేవికి మాత్రమూ ఇటువంటి భేదభావం లేదు. అందరూ, అన్నీ సమానమే కదా.
తన సృష్టిలోని సమస్తమూ అమ్మకు సమానము. మమత అనేది దేనిమీదా లేని తల్లి ఆ శ్రీదేవి.
దేనిపైనా భేదభావము చూపక, ఎవరిపైనా మమకారము చూపక వుండే ఆ నిర్మమ కు వందనం.
ఓం శ్రీ నిర్మమాయై నమః
165. మమతాహంత్రీ
అమ్మ నిర్మమ మాత్రమే కాదు, ఆమె మమతా హంత్రీ కూడా.
అంటే మమకారమును నిర్దయగా ఖండించే జగదంబ. మన అని భావించే ప్రతి వస్తువు మీదా,
ప్రతి వ్యక్తి మీదా పెరిగే మమకారము, మనకు తెలియకుండానే, ఎన్నో చెడ్డ గుణాలకు
దారి తీస్తుంది. ద్వేషము, కామము, క్రోధము, అహంకారము, లోభము, మోహము, మదము వంటి
ఎన్నో అవాంఛిత వస్తువులకు జీవుడు ఆశ్రయమవుతాడు.
మమ అనే దాన్ని త్రుంచివేస్తే, అన్నింటినీ, అందరినీ సమానభావముతో చూడగలిగితే,
ఈ ముప్పు ఉండదు. ఆ తప్పు జరగదు. తనంతట తానుగా జీవుడు ఈ శత్రువుని కూడా దాటలేడు.
కనుక ఆ శ్రీమాత ఒక్కర్తే శరణ్యము. ఆ దేవిని భక్తితో కొలవాలి. ఆర్తితో అర్ధించాలి.
శరణాగతి పొందాలి. అప్పుడు దయతో ఆ తల్లి, మన భక్తిని గమనించి, మన చుట్టూ మనమే
అల్లిబిల్లిగా, అమాయకంగానో, అహంకారంగానో, అల్లుకున్న మమకార బంధాలను
గండ్ర గొడ్డలితో నరికేస్తుంది. కానీ ఈ స్థితి పొందటానికి ఎంతో సాధన కావాలి.
మన చుట్టూ వున్న మమత అనే శత్రువుని నిర్జించే ఆ మమతాహంత్రి కి వందనం.
ఓం శ్రీ మమతాహంత్ర్యై నమః
ఓం శ్రీ నిష్పాపాయై నమః
167. పాపనాశినీ
జపములు, హోమములు, వ్రతములు, తీర్థయాత్రలు చేసేవారికి పాపములు అంటవు
అని వాసిష్ఠ స్మృతి చెప్తోంది. మేరుపర్వతమంతైన పాపరాశి అయినా కాత్యాయనీ పూజతో
నశిస్తుంది అని, దుర్గారాధనాపరుడికి పాతకములు వలన కలుగు దోషములేవీ కలుగవు
అనీ, పద్మపురాణం చెప్తోంది. ఇక్కడ ఒక్క విషయం, జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి.
పాపాలు చేయండి, నన్ను పూజిస్తే అవి అన్నీ పోతాయి, ఆ బాధ్యత నాదీ, అని అమ్మ చెప్పినట్టు
అపార్ధం చేసుకోకూడదు. ఎంతటి పాపరాశిని అయినా, దగ్ధం చేయగలిగేది ఒక్క దుర్గాదేవియే
అని పురాణాలూ, స్మృతులూ చెప్తున్నాయని మాత్రం గ్రహించాలి.
పాపము చేశామని జ్ఞానము కలిగిన వారు అదృష్టవంతులు.
వారికి ఆ పాపమును నాశము చేసే అమ్మ దారి ఋషులు చూపుతున్నారు.
ఎంతటి పాపాత్ముడైనా దుర్గాదేవిని చూచిన మరుక్షణం పవిత్రుడై పరమపదమును
పొందుతాడు అని దేవీభాగవతము చెప్పింది. కానీ ఒక్కసారి ఆలోచించండి.
ఆ అమ్మ తటిల్లతా రూపమును చూడలేకే కదా, కాలి వేలి గోటి కాంతులను చూడమన్నది.
మరి ఆ అమ్మ దర్శనం పొంది పవిత్రుడవటం ఎలా?
కనుక పాపమును పోగొట్టుకునే దారి తెలిసింది, కానీ ఆ దారి దుర్గమము, కఠినము.
ఎందుకంటే, అది దుర్గామార్గము కదా, దుర్గమము గానే ఉంటుంది.
పాపనాశిని ఆ దుర్గామాత మాత్రమే అని తెలిసినా, ఆ అమ్మను పట్టుకోవటానికి మార్గము
మాత్రమూ సులభము కాదు. ఆర్తితో వేడుకోండి, భక్తితో భజించండి, శ్రద్ధగా జపము చేయండి.
ఆ తల్లి కరుణ కోసం నిరంతరమూ తపించండి. తపించడమంటే వేగిపోవడం, కాలిపోవటం,
దహించుకుపోవటం. అప్పుడు మాత్రమే, దుర్గమ్మ ఆ పశ్చాత్తాప దగ్ధులని కరుణించి
వారి పాపములను నాశనము చేస్తుంది.
ఆ మహాదుర్గ, ఆ కాత్యాయని, ఆ పాపనాశిని కి వందనం.
ఓం శ్రీ పాపనాశిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి