7, సెప్టెంబర్ 2021, మంగళవారం

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధిః, నిరీశ్వరా నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ

 

నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధిః, నిరీశ్వరా 
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ॥ 46 ॥

152. నిష్కారణా 

అమ్మ ఏ కారణములూ లేనిది. సత్యమైన నిత్యమైన ఆనందము అనుభవించుటకు 

ఏ కారణమూ అవసరము లేదు. అమ్మ అటువంటి ఆనందస్వరూపము. 

ఆ తల్లిని మనసులో భావించటానికి, భజించటానికీ, ఏ కారణములూ అవసరము లేదు. 

ఆమె చిద్రూప. ఏ కారణములూ లేకయే అలరారు మహాశక్తి. ఈ మాతయే అన్నింటికీ కారణము. 

తాను మాత్రమూ ఏ కారణమూ లేక వుండే తల్లి. ఆది మధ్యాంత రహిత. 

అందుకే ఆ తల్లిని నిష్కారణా అనే నామముతో కీర్తిస్తున్నాము. 

ఆ శ్రీదేవిని తలచుకోగానే భక్తులలో కలిగే స్పందనమే ఆ అమ్మ. 

ఆ ఆనందమునకు కారణము లేదు. అవధులు వుండవు. ఈ చరాచర సృష్టికి ఆమె కారణభూతము. 

ఆ చిత్స్వరూప ఆదేశాలను అనుసరించే సర్వమూ నడుస్తున్నది. 

తాను అన్నింటికీ  కారణమవుతూ, తాను మాత్రమూ ఏ కారణమూ లేకుండా వుండే,

 ఆ నిష్కారణ కు వందనం. 

ఓం శ్రీ నిష్కారణాయై నమః 


153. నిష్కళంకా 

అమ్మవారికి కళంకము లేదు. ఆమె నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, శుద్ధవిద్యా స్వరూపిణి.  

అమ్మకు మలినములు, మచ్చలు లేవు, కళంకములు లేవు. కనుక ఆమె నిష్కళంక. 

కళంకము అంటే, పాపము. ఆ శ్రీ మహారాజ్ఞిని ఏ పాపమూ అంటదు. ఆమె నిష్కళంక. 

అమ్మకు ఏ దోషములూ లేవు, ఆమె దోష రహిత. అందువలన ఆ తల్లి నిష్కళంక. 

ఆ పరమేశ్వరి ఎటువంటి అజ్ఞానమూ లేని శుద్ధవిద్యా స్వరూపము, అందువలన ఆమె నిష్కళంక. 

ఏ భేదభావమూ లేక భక్తులను కాచుకుంటూ, ఏ కళంకమూ లేని, ఆ నిష్కళంక కు వందనం. 

ఓం శ్రీ నిష్కళంకాయై నమః 

 

154. నిరుపాధిః 

ఉపాధి అంటే పోషించునది అని అర్ధము. అందరకూ ఉపాధి ఆ రాజరాజేశ్వరీ దేవి. 

ఆ తల్లి తానే అందరకూ ఉపాధి అవుతోంది కానీ, ఆమె తానుగా నిరుపాధిః, 

అంటే ఆ జగజ్జననికి ఏ ఉపాధీ లేదు అని భావం. 

తానే అందరికి పోషకురాలు కానీ, ఆ తల్లికి ఎవరి పోషణా అవసరం లేదు.  

ఉపాధి అంటే తాను కారణమవుతూ, ఆ కారణ విషయము తనకు అంటనిది. అది ఆ శ్రీదేవియే. 

శుద్ధ స్ఫటికము పక్కన ఎర్రని మందారపువ్వు నుంచితే, ఆ స్ఫటికము ఎర్రగా ప్రకాశిస్తుంది. 

మరల ఆ పువ్వును తొలగిస్తే, ఆ అరుణవర్ణం మాయమవుతుంది. అక్కడ ఆ అరుణిమను

కలిగించినది, కల్పించింది కుసుమము కానీ స్ఫటికము కాదు. కనుక కుసుమము ఇక్కడ ఉపాధి. 

ఉపాధి ప్రతిఫలించుట వలన, శుద్ధ స్ఫటికము కూడా ఎర్రగా కనిపించింది. 

అదేవిధంగా అవిద్య వలన, అజ్ఞానము వలన, మన లోపల వున్న, శుద్ధ చైతన్యము కూడా 

అవిద్యా రూపముగా, అజ్ఞానరూపముగా ప్రతిఫలిస్తుంది. 

ఆ పరమేశ్వరి మాత్రము ఎల్లప్పుడూ శుద్ధ చైతన్య మూర్తి కనుక ఆ తల్లిని, 

ఏ ఉపాధీ ప్రభావితము చేయలేదు. ఆమెకు ఉపాధి లేదు. 

ఏ ఉపాధీ లేని, నిరుపాధి కి వందనం. 

ఓం శ్రీ నిరుపాధయే నమః 

155. నిరీశ్వరా 

సేశ్వర వాదము, నిరీశ్వర వాదము అని రెండు వాదాలున్నాయి. 

సేశ్వరవాదము ఈశ్వరుడున్నాడని చెప్తుంది. అమ్మ ఈశ్వరుడు కాదు కనుక, ఆ తల్లి నిరీశ్వర.  

నిరీశ్వర వాదము ఈశ్వరుడు లేడు అంటుంది. ఈశ్వరి, ఈశ్వరుడు ఇద్దరికీ అభేదము. 

కనుక ఆ తల్లి నిరీశ్వర. ఈ ఈశ్వర, ఈశ్వరీ తత్వములు రెండూ కలిసి వున్న స్వరూపమే

అర్ధనారీశ్వర స్వరూపము. ఈశ్వరి, ఈశ్వరుడు ఇద్దరూ, ప్రకృతి, పురుషుడు. 

ప్రకృతి లేనిదే పురుషుడు లేడు, పురుషుడు లేనిదే ప్రకృతి లేదు.   

ఈ ఇద్దరూ ఒక్కటే అయినప్పుడు ఎవరికీ ఎవరూ అధిపతి కాదు. ఆ తత్వమే నిరీశ్వర తత్వము.   

తానే ఈశ్వరుడు, ఈశ్వరి కనుక, ఇతరమైన దేనినీ, ఎవరినీ ఈశ్వరుడిగా గుర్తించక పోవడమే 

నిరీశ్వరతత్వము. కనుక ఆ రాజరాజేశ్వరి నిరీశ్వర. 

ఈశ్వరి, ఈశ్వరుడు ఇద్దరూ ఒకటే కనుక, ఆ ఏకత్వ తత్వమే, నిరీశ్వరతత్వము.  

అన్నింటికీ తానే ఈశ్వరి కనుక ఆ తల్లికి మరొక ఈశ్వరుడు లేడు, కనుక ఆమె నిరీశ్వర. 

స్త్రీ, పురుషులు, ఎక్కువ తక్కువలు, ఏవీ ఆ గుణాతీతమయిన నిరీశ్వరకు చెందవు. 

గుణాతీతమైన తత్వానికి ఈశ్వరి, ఈశ్వరుడు అన్న భేదముండదు, కనుక ఆమె నిరీశ్వర. 

తనకు తానే ఈశ్వరి అయిన, ఆ నిరీశ్వర కి వందనం. 

ఓం శ్రీ  నిరీశ్వరాయై నమః 

 

156. నీరాగా 

రాగము లేనిది నీరాగ. అమ్మకు రాగద్వేషములు లేవు. అట్టివాటికి అమ్మ అతీతము. 

రాగమంటే ఇచ్ఛ, కోరిక, ఆ శ్రీదేవి పూర్ణకామ, నిష్కామ, కనుక ఆమెకు ఏ రాగములూ లేవు. 

రాగమనే విషయం సామాన్యులకు సరిపోతుంది కానీ, అన్నీ తన ఇచ్ఛాపూర్వకంగానే 

జరుపుతున్న ఆ పరమేశ్వరికి సరిపోదు. ఆమె రాగమునకు అతీతురాలు కనుక నీరాగా అనే 

నామము సార్ధకమైనది. కోరికలు లేని దివ్య యోగస్థితి ఎవరికి సాధ్యమో, వారే నీరాగా అని 

పిలువబడతారు. ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉండే అమ్మ కనుక ఆమె నీరాగా. 

రాగమనగా భక్తి, తానే భక్తుల పూజలందుకుంటున్న తల్లి కనుక ఆమెకు రాగము లేదు. 

రాగ ద్వేషాలకు అతీతమైన, ఆ రాగ రహిత, విరాగికి, ఆ నీరాగ కు వందనం. 

ఓం శ్రీ నీరాగాయై నమః 


157. రాగమథనీ 

రాగమును మధించి భక్తులకు వైరాగ్యమును ఇచ్చునది కనుక, ఈ తల్లిని రాగమథనీ 

అంటున్నాం. వైరాగ్యమంటే, రాగము, అనురాగము లేకుండా ఉండటమే. 

రాగద్వేషాలు నిజముగా బంధనములు, క్లేశములు. ఈ రాగము, అనురాగములను, మధించి, 

అట్టి బంధములు, కష్టముల నుంచి భక్తులను ఉద్ధరించునది ఈ రాగమథని. 

కోరిక వలన రాగము, రాగము వలన బంధము, బంధము వలన బాధ కలుగుతాయి. 

ఆ బాధను మధించి వేస్తే, మిగిలేది రాగరహితమైన వైరాగ్యమే. 

రాగమును మధనము చేసి తొలగించి వైరాగ్యమును ప్రబోధించే, ఆ రాగమథని కి వందనం. 

ఓం శ్రీ రాగమథన్యై నమః 

 

158. నిర్మదా 

మదము లేనిది నిర్మద. అమ్మవారికి అరిషడ్వర్గములేవీ అంటవు. వాటిని సృష్టించినదే ఆ తల్లి. 

ఆమెకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములేవీ  లేవు కనుక, ఆ తల్లి నిర్మద. 

మదములు ఎనిమిది రకములు. అవి అన్నమదము, అర్థమదము, స్త్రీమదము, 

విద్యామదము,  కులమదము, రూపమదము, ఉద్యోగమదము, యౌవనమదము.  

జీవుడిలో మదమును పోగొట్టే శక్తి ఈ నిర్మద. మదము అనేది రాక్షసగుణము. 

ఈ తల్లిని భక్తితో ఆరాధించి మదమును పోగొట్టుకోవాలి. 

ఒక్కోసారి దేవతలు కూడా గర్వము హెచ్చి మదముకు లొంగిపోతారు. 

మదము అనే అవిద్యా రూపాన్ని తొలగించి, జ్ఞానమును కలిగించే, ఆ నిర్మద కు వందనం. 

ఓం శ్రీ నిర్మదాయై నమః 

 

159. మదనాశినీ  

మదమును నాశము చేసే శక్తి కనుక ఈ అమ్మ మదనాశిని. 

మదించిన అసురులను నిర్జించిన ఈ తల్లి మదనాశిని. 

అహంకారము, దురభిమానము పెచ్చుమీరినపుడు, తానే ఉన్నతుడని భావము పెరిగినప్పుడు, 

మదము తలకి ఎక్కుతుంది. అటువంటి సమయములో అమ్మను భక్తితో సేవిస్తే,

ఆ మహేశ్వరి కృపతో మదమును త్రుంచి, జీవుడిని శుద్ధి చేస్తుంది.

మదనము అంటే దత్తూరము, ఉమ్మెత్త చెట్టు. అశనము అంటే భోజనము.

ఈమె మదనమును అశనముగా తీసుకుంటుంది కనుక,  ఈ తల్లి మదన అశిని, మదనాశిని.  

మదనమును భుజిస్తున్న తల్లి, అంటే, మన మదమును కూడా భుజిస్తున్న తల్లి, ఈ మదనాశిని. 

మదమును, మదనమును  భుజించడమంటే, మ్రింగటం, నాశనము చేయటం. 

మదము అనే శత్రువును నాశనము చేస్తున్న, ఆ మదనాశిని కి వందనం. 

ఓం శ్రీ మదనాశిన్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి